వర్తమానం
Published Monday, 11 April 2016
చాలా మంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది గతంలో చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. వర్తమానంలో బతకడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
వర్తమానంలో బతకడం గొప్ప అనుభవమని అనుకోరు. ఈ అనుభవాన్ని పొందడం అంత సులువు కాదు. దీన్ని కొంత సాధన చేసి అలవర్చుకోవాల్సి ఉంటుంది. గతం గురించి ఆలోచించడం అవసరమే. భవిష్యత్తు గురించి ఆలోచించడం అవసరమే. ఇలా ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోకపోతే జీవితం వృధా అయిపోతుంది. వర్తమానంలో బతకడం చాలా ముఖ్యమైంది. ఈ విషయాన్ని గమనించి గతాన్ని భవిష్యత్తునీ పరిశీలించాలి. అంతేకానీ మరో విధంగా కాదు.
రోడ్డు మీద ఓ తండ్రీ కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. తండ్రీ కొడుకులని అకస్మాత్తుగా ఓ వాహనం వచ్చి కొడుక్కి తాకి ఆగకుండా వెళ్లిపోయింది. కొడుక్కి బలమైన గాయాలయ్యాయి.
ఆ తండ్రి వెంటనే ఆటోని ఆపి కొడుకుని దవాఖానాకి తీసుకొని వెళ్లాడు. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. కాబట్టి కొడుకుని రక్షించుకోగలిగాడు. ఏ మాత్రం ఆలస్యం అయినా కొడుకు బతకకపోయేవాడు.
ఈ సంఘటనని గమనిస్తే మనకి ఏం అర్థమవుతుంది? అప్పుడు అతను గతం గురించి ఆలోచించాడా?
భవిష్యత్తు గురించి ఆలోచించాడా?
లేదు.
అతను వర్తమానంలో ఉన్నాడు. వర్తమానంలో జీవించాడు. వర్తమానంలో బతికాడు అందుకే కొడుకుని రక్షించుకో గలిగాడు.
తాను ఒక్కడే ఎందుకు రాలేదు? అనవసరంగా కొడుకుని తీసుకొని ఎందుకు వచ్చాడు? ఈ దెబ్బలతో కొడుకు భవిష్యత్తు ఏమవుతుంది? భవిష్యత్తు ఉంటుందా? అతను బతుకుతాడా? బతికినా సరిగ్గా నడుస్తాడా? ఈ ఆలోచనలతో అప్పుడు అతను లేడు.
ఈ రెండు అంశాల గురించి భయపడే పరిస్థితి అతనికి లేదు. అంత సమయం కూడా అతనికి లేదు. అందుకే అతను తన పనిలో నిమగ్నమైనాడు. అతను పూర్తిగా వర్తమానంలో జీవించాడు. అందుకనే తన కొడుకుని కాపాడుకోగలిగాడు.
వర్తమానంలో జీవించడమే అవసరం అంటే వర్తమానంలో మాత్రమే జీవించమని కాదు.
అట్లా అని గతాన్ని, వర్తమానాన్ని విస్మరించమని కాదు. గతంలో మాత్రమే జీవించకూడదు. భవిష్యత్తులో మాత్రమే జీవించకూడదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించాలి. వర్తమానంలో జీవించాలి.
*
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.