S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఊరకేగల్గునా రాముని భక్తి?’

ఏదైనా ఒక ఉన్నతమైన ఉదాత్తమైన నిగూఢమైన విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏవేవో ఉపమానాలు తీసుకొచ్చి, ఉదాహరణలతో చెప్పినా సరిపోనప్పుడు తెలివైన ప్రబుద్ధులు ప్రదర్శించేది వౌనమే. మానవ జీవితానికి అర్థం చెప్పుకోవాలన్నా, ప్రశాంతంగా, ఏకాంతంలో స్థిరచిత్తంతో కూర్చుని ఆలోచించినా విన్నా వౌనంలోంచే సమాధానం లభిస్తుంది. వౌనాన్ని అర్థం చేసుకోగలిగేది ఒక్క మనిషే. పశు పక్ష్యాదులకు ఈ అవసరం లేదు.
తరించాలనే జ్ఞానం దేవుడు వాటికివ్వలేదు. మనల్ని సృష్టించిన వాడు, మనం చేరుకోవలసిన గమ్యాన్నీ, బ్రతికే విధానాన్నీ చెప్పాడు. సంసారంలోనే వుంటూ తరించే మార్గాన్ని చూపించాడు. ‘నేను మీలోనే ఉన్నాను. మీతోనే వున్నాను. ఇది మాయా ప్రపంచం సుమా! ఏమరపాటుగా ఉన్నారంటే ఇంతే సంగతులు. మీలోపలే వుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూనే వుంటా. మాయలో పడితే నా మాటలు మీకు వినబడవు. బుద్ధి వివేకం నీకే ఇచ్చాను. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా గోతుల్లో పడిపోతారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా మీరు వింటారనే నమ్మకం లేకనే, నేను చెప్పినట్లు వినేవాళ్లనూ, ఆచరించే వాళ్లనూ మీ కోసం పంపిస్తున్నా. పక్క తోవలో పడకుండా, పడిపోకుండా వాళ్లు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. వాళ్ల మాటలపై విశ్వాసం వుంచి వినండి. విన్నది ఆచరించండి’ అన్నాడు. దక్షిణామూర్తి స్వరూపం అదే. ఆయన అపరావతారులే ఆదిశంకరులు. ‘నేను మీలో ఉంటే ఆయన బయట వుంటారు. నన్ను బాగా అర్థం చేసుకున్నవాడు ఆయనే. ఆయన చాలా చిన్నవాడు. ఏం చెబుతాడనుకోకండి. ఆయన కంటే ఆయన శిష్యులు వయోవృద్ధులు. చెప్పింది అర్థం చేసుకోగలిగిన వాళ్లు. మామూలు వాళ్లు అనుకోకండి. జ్ఞాన వృద్ధులు వాళ్లు. మీలాగే అనేక జన్మలెత్తి విసిగి వేసారిపోయి గట్టుకు చేరుకున్నారు. మాట వింటే సంసార సముద్రం నుండి మీరూ బయటపడతారు.
వౌన వ్యాఖ్య అంతరార్థం ఇదే. అస్తమానం ఈ సంసారమనే సముద్రంలో మునిగి తేలుతూ అదే శ్రేష్టమనీ, స్వర్గమనీ భావించే వారికి భక్తి ఒరికే ఉత్తి పుణ్యాన పుట్తుందా? ఛస్తే పుట్టదు.
పెళ్లాం, పిల్లలు, చుట్టాలు, చిన్న ఇళ్లు, పెద్ద ఇళ్లు, శరీర మలం, ధనమదం, తన చుట్టూ వున్న వైభవాలన్నీ అశాశ్వతం అనుకోగలిగిన వాళ్లకు తప్పించి మిగతా వాళ్లకు భక్తి ఎలా వస్తుంది?
సత్సంగత్వే నిస్సంగత్వం .. సత్పురుషులను సేవించి, వారి ఉపదేశాలు శ్రద్ధగా వినకుండా గాలికి తిరిగే వాళ్లకు పుట్తుందా భక్తి? అంటాడు త్యాగరాజు.
మనని ఆశ్రయించుకున్న పెళ్లాం, పిల్లలకు తమ పనులు నెరవేరే వరకే మన అవసరం. సంసారంలో దిగిన తర్వాత ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటానంటే ఒప్పుకోరు. మళ్లీ అదో తలనెప్పి. అందుకే- ‘సంసారులైతే నేమయ్యా! శిఖి పింఛ వతంసుదెదుట నుండగ - అంటాడు త్యాగయ్య.
సంగీతంతో ముడిపడ్డ మాటలు చెవికి సోకినప్పుడు చెప్పవలసిన సందేశం తిన్నగా మనసుకు తొందరగా చేరుతుంది. అదే సంగీతంలోవున్న మజా. గంటల కొద్దీ ఉపన్యాసాలు దంచే వారితో కూర్చుని ఒక పద్యమో, పాటో పాడితే చాలు. అంతవరకూ సాగిన ఉపన్యాసంలోని సారాంశం కాస్తా మాయమవచ్చు. ఆ పాటే మనసులో దూరి కూర్చోవచ్చు. ఇది నా స్వానుభవం.
త్యాగరాజు పాడుకున్న ఈ కీర్తన ‘శహన’ రాగంలోది.
కరుణరస ప్రధానమైన రాగాల్లో శ్రేష్టమైనది శహన. శరణాగతిని ప్రతిబింబించే రాగం ‘నా మాట వినవయ్యా.. నన్ను రక్షించడానికి ఎందుకయ్యా నీకింత కినుక? నువ్వు కాకపోతే ననె్నవరు కాపాడతారయ్యా’ అనే అర్థం వచ్చేలా వుండే మాటలు ‘శహన’ రాగంలోని స్వరాలతో మలిచి ఆర్తిగా పాడితే, మనసు కరిగిపోతుంది. చెప్పగా చెప్పగా ఒకరోజైనా వినాలనిపించక మానదు. దానికీ సంస్కార బలం వుండాలి. ఒక్కసారి చెప్పగానే ఆచరణలో పెట్టగలిగే మహానుభావులకు పాదాభివందనం చేసి నమస్కరించాలి.
కథలు, కబుర్లు చెప్తూ పసిపిల్లలకు గోరుముద్దలు తినిపించినట్లు ఎంత చెప్పినా తలకెక్కకపోతే రేడియోలో వరద సమయాల్లో చేసినట్లుగా మొదటి హెచ్చరిక చేస్తారు పెద్ద వాళ్లు.
రోగం కుదరాలంటే రాగం మార్చాలి. సౌమ్యంగా చెప్పాలంటే శహన రాగం ఎలాగో జాగ్రత్త సుమా అని హెచ్చరించాలంటే అఠాణ రాగాన్ని ఎంచుకున్నారు త్యాగయ్య. చెడే బుద్ధి మానురా! ఇడే పాత్ర మెవరో చూడరా!’ ముందు చెడే బుద్ధి మానాలి. సరే. పాత్రమెరిగి దానం చేయమన్నాడు.
భూవాసికి తగు ఫలము కల్గునని
బుధులు పల్క వినలేదా మనసా!
శ్రీవాసుదేవ స్సర్వ మనుచును
చింతించర త్యాగరాజ వినుతిని!
అని చెప్పి ముగించాడు.
మనది కర్మభూమి. తక్కిన లోకాలన్నీ భోగభూములు.
‘రక్షంతి పుణ్యాని పురాకృతాని’ మనం చేసిన మంచి పనులకు ఫలితం వుంటుంది. అవే రక్షిస్తాయి. చెడు పనులకు కూడా దానికి తగ్గ ఫలితం పక్కనే వుంటుంది. లేదనుకోవడానికి వీలు లేదు. అందుకే ‘శ్రీకృష్ణార్పణం, శ్రీవాసుదేవార్పణం’ అంటూ ఏం చేసినా ఆ పరమాత్ముడికే నివేదిస్తున్నాననే సమర్పణ భావంతో చేయాలంటారు. ఏ ఫలితమివ్వాలో తేల్చేది పైవాడు. దీన్ని పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మిన రామభక్తుడు రామదాసు. ‘తారకమంత్రము కోరిన దొరికెను. ధన్యుడనైతిని ఓరన్నా’ అంటూ, చిమ్మచీకటిలో నాలుగు గోడల మధ్య రామార్పణంగా జైలు జీవితాన్ని పరమ సంతోషంగా అనుభవించిన రామదాసు నోట్లో నుంచి
‘ఎన్ని జన్మముల చేసిన పాపము
ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మమిది!
సత్యంబిక పుట్టుట సున్నా!
అనటానికి చావుదెబ్బలు తింటూ మానసిక ధైర్యం ఎంత సంపాదించి వుంటాడో చూడండి. దైవం మనకు శరీరాన్నిచ్చాడు. కర్మాచరణకు కావలసిన కర్మేంద్రియాలు, జ్ఞానార్జనకు జ్ఞానేంద్రియాలిచ్చాడు.
ఈ రెండు గుంపుల చేత పని చేయించగలిగిన మనస్సునిచ్చాడు. పని చేయిస్తున్న మనసుకు కావలసిన సూచనలివ్వటానికి ‘బుద్ధి’నిచ్చాడు.
ఇన్ని ఇచ్చి మనలోనే సాక్షిగా వుండి పర్యవేక్షిస్తున్నాడు. మన ప్రవర్తనను నిరంతరం గమనించగలిగిన కళ్లున్న ఆ పెద్ద మనిషి మనలోనే, ఈ లోపలే వున్నాడన్న సూక్ష్మం తెలియక ఏమిటో? లేడనుకుని తిరుగుతాం. అంతే. కాస్త అవగాహన ఏర్పడిందా! అంతా రామమయం. ఈ జగమంతా రామమయం.
* * *
కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలన్నింటికీ చిన్న చిన్న జన్యరాగాలు చాలా వున్నాయి. సంగీతానికి అంతిమ లక్ష్యం ఒక్కటే. ఏం పాడినా ఎలా పాడినా చెవికి ఆ పాట శ్రవణపేయంగా చేరాలి. తన్మయత్వంతో పాడేవారు అదే స్థాయిలో కూర్చుని ఆనందిస్తూ వినేవారుంటే బాగుంటుందని భావించటం సహజం. సాధారణంగా దీని భిన్నంగా ఉంటుంది. అసలు ఎదురుగా వినే శ్రోతలకు ఏ సంగీతం ఇష్టమో తెలియదు. ఎలా పాడితే నచ్చుతుందో తెలియదు. కూర్చున్న వారికి అసలు సంగీతం వినాలని ఉంటుందో లేదో? పాడినది మనసులోకి వెళ్తోందో లేదో అసలు తెలియదు. గాయకులెదురుగా ఈ బాపతు జనమే నూటికి 70 శాతం ఉంటారు. భావశుద్ధిగా గమక సౌందర్యంతో శహన, ముఖారి లాంటి రాగాలు ఎంతో పరిణతి కల్గిన గాయకులే పాడగలరు.
దీనికి తాదాత్మ్య స్థితిలో వినగలిగే సంస్కారం కూడా అవసరమే. అలాంటి వారు ఎదురుగా కనిపించినప్పుడే పెద్ద పెద్ద గాయకులు ఇటువంటి కీర్తనలు వినిపిస్తారు. మనకంటే ఈ విషయంలో దక్షిణాది శ్రోతలూ, పాడే విద్వాంసులూ అదృష్టవంతులే.
*

- మల్లాది సూరిబాబు 90527 65490