అడవి అక్షరాలు నేర్చింది
Published Saturday, 30 March 2019ఆ దృశ్యాలు చూసినప్పటి నుండి తన చిన్ననాటి సంఘటనలు ఒంటి రెక్క సీతాకోక చిలుకలై కౌశల్ కనురెప్పలపై వాలుతూనే ఉన్నాయ్.
ఎన్నిసార్లు? చెరిపే ప్రయత్నం చేసినా! ఆ దృశ్యాలు నేరుగా కళ్లల్లోకి ఇంకిపోయి గుండెను గుచ్చేస్తున్నాయి.
విశాలమైన ఏసీ గది చల్లటి గాలిని తింటోంది.
మరో పక్క సమయం పడమర గోడపై నుండి రాలుతోంది.
మరోసారి కంప్యూటర్ ఓపెన్ చేసి అదే వీడియో ప్లే చేశాడు. ప్లే అవుతున్న దృశ్యాన్ని చూడగానే కన్నుల గగనం నుండి నిశ్శబ్దంగా కన్నీటి బొట్లు రాలిపడ్డాయి.
మసక మసక కన్నులతోనే వీడియో కిందున్న కామెంట్స్ నుండి రెండు ఫోన్ నెంబర్స్ నోట్స్ చేసుకున్నాడు.
రాత్రి పక్షి నెమ్మదిగా గగనాన్ని ఎక్కడం గమనించిన కౌశల్- వెంటనే ఫైల్స్ సర్దుకుని ఇంటికి బయలుదేరాడు.
ఇంటికి చేరుకోగానే భార్య తన మూడు సంవత్సరాల పాపకి బుజ్జగిస్తూ అన్నం పెడుతోంది.
పాప మారాం చేస్తూ నాకు వద్దమ్మా.. నేను తిననంటూ గుమ్మంలోకి వచ్చిన కౌశల్ కాళ్లకు పెనవేసుకొని, ‘చూడండి నాన్నా! వద్దంటే అమ్మ ఇంకా తినిపిస్తూనే ఉంది’ అని ముద్దు ముద్దుగా చెప్పడంతో వెంటనే పాపను ఎత్తుకొని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు కౌశల్.
చేతిలోని లాప్‌టాప్ బ్యాగ్ అందుకొని వెళ్లి ‘స్నానం చేసి రండి. వంట సిద్ధం చేస్తాన’న్నది కౌశల్‌తో భార్య బుజ్జమ్మ.
కౌశల్ గదిలోకి వెళ్లగానే...
భర్త బాధను ముఖ మేఘంలో గమనించిన బుజ్జమ్మ భోజనం చేసిన తర్వాత విషయం చెప్తారులే అనుకుంటూ భోజనం సిద్ధం చేసింది.
కౌశల్ నైట్‌డ్రెస్ వేసుకొని డైనింగ్ టేబుల్ ముందు డీలా పడిన ముఖంతో బుజ్జమ్మను గమనించకుండానే భోజనం చేసి నిద్ర వస్తోంది పడుకుంటానని చెప్పి పడక గదిలోకి వెళ్లిపోయాడు.
కౌశల్ ప్రవర్తనతో విస్తుపోయిన బుజ్జమ్మ విషయం ఏంటో? వెంటనే అడిగి తెలుసుకోవాలి లేదంటే తనలో తనే మదనపడిపోతారు అనుకుంది.
ఈయనతో వచ్చిన చిక్కే ఇది. ‘విషయాన్నీ చెప్పి బాధను దించుకోర’ని మనసులో అనుకుంటూ పడక గదిలోకి వెళ్లి భర్త పక్కన పాపను పడుకోబెట్టి కౌశల్ వైపు జరిగి తన చేతులు కౌశల్ భుజాలపై అలంకరించింది బుజ్జమ్మ.
ఏంటి? అన్నట్లుగా కౌశల్ తన వైపు తిరిగాడు.
వెంటన కౌశల్ ఎద పైకి చేరి తన గుండె చప్పుడు వింటూ ‘ఏంటే? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? బుజ్జిదానా! నాతో కూడా చెప్పవా?’ అన్నది.
భార్య నుదుటిపై తన వెచ్చని పెదవుల గుర్తులు అద్ది ‘అందుకే నువ్వంటే నాకు అమితమైన ఇష్టం. ఏదీ తొందరపడవు. ఎలా వ్యవహరించాలో? నీ దగ్గర ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.’
‘నీతో కాకుండా ఇంకెవరితో చెప్తాను బుజ్జమ్మా’ జరిగిన విషయం బుజ్జమ్మకు చెప్పడం మొదలుపెట్టాడు కౌశల్.
* * *
బాలూ నాయక్, గురవమ్మ ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఉన్న గొల్లపల్లి తండాలో నివాసముండేవారు. వారికి ఎనిమిది మంది సంతానం. అందులో ఐదవ సంతానం కౌశల్.
బాలూ నాయక్ తనకున్న పొలంలో కూరగాయలు, పూలు పండించి వారం వారం భార్యాభర్తలిద్దరూ కలిసి.. పండిన కూరగాయలు, పూలు సంతలో అమ్మి జీవనం కొనసాగించేవారు.
వచ్చిన కాస్త డబ్బు పిల్లల కడుపు నింపేది కాదు. కౌశల్‌కి చదువుకోవడమంటే ఇష్టం కానీ.. అక్కడ ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చెప్పే తెలుగు అర్థమయ్యేది కాదు.
ఇంట్లో లిపి లేని భాష మాట్లాడటం, అంగన్‌వాడీ కేంద్రంలో తెలుగు భాష చెప్పడం వల్ల చదువుపై ఎంత ఆసక్తి ఉన్నా సరిగా చదవలేక పోయేవాడు.
కానీ.. ఇంట్లో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఎలాగైనా చదువుకోవాలనే తపనతో బి.టెక్ దాకా చదివి ఇప్పుడు అమెరికాలోని గూగుల్ కంపెనీలో సీనియర్ ఫ్రంట్ అండ్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
కౌశల్ ఇంటర్మీడియెట్ చదివే రోజులలో తల్లి గురవమ్మ గర్భవతి అయ్యింది.
భర్త బాలూ నాయక్‌తో ‘నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు పిల్లలు వద్దని. ఇప్పటికి ఏడుమంది పిల్లలు ఉన్నారు. వారికే మనం కడుపు నిండా అన్నం పెట్టడం లేదు.
‘ఇప్పుడు మళ్లీ నన్ను గర్భవతిని చేశావు. పుట్టబోయే బిడ్డను ఈ లోకంలోకి తెచ్చి పస్తుపెట్టి చంపమంటావా?’ అంటూ ఏడ్చింది.
ఏ తల్లి అయినా బిడ్డకు జన్మనివ్వడం వద్దు అనుకోదు కానీ.. గురవమ్మ బాధ ఏంటంటీ? బిడ్డకు జన్మనిచ్చి పస్తు పెట్టడం ఇష్టం లేదు.
బాలూ నాయక్ మాత్రం బిడ్డలు దేవుడిచ్చిన వరం. ఎంతమంది ఉంటే అంత గౌరవంగా భావిస్తాడు. పైగా పిల్లలను అడవి తల్లే చూసుకుంటుంది అంటాడు.
ఆ తండాలో చాలామంది పిల్లలకి.. వేసుకోడానికి బట్టలు ఉండవు. కడుపు నిండా అన్నం ఉండదు.
ఆ పరిస్థితులను అనుభవించిన కౌశల్ పట్టుదలతో చదివి తల్లిదండ్రులను, తోబుట్టువులను తండా నుండి పట్నంలో నివాసం పెట్టి అందరినీ స్థిరపరిచాడు.
* * *
‘బుజ్జమ్మా.. నేను ప్రొద్దున్న ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండగా ‘ఫేస్‌బుక్’ నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూశాను. అదొక వీడియో! అందులో ఒక తల్లి పడుకొని ఉంటే నలుగురు చిన్నపిల్లలు తల్లి పాలిండ్ల కోసం తారాడుతున్నారు.
‘నిజానికి ఆ తల్లికి పాలు కూడా రావడంలేదు. పిల్లలు కేకలు వేస్తున్నారు. నిర్జీవంగా బక్కచిక్కి పడిపోయిన ఆ తల్లిని చూసి మా అమ్మ గుర్తొచ్చింది.
‘చిన్నప్పుడు తను పస్తులుండి, ఉన్న కాస్త అన్నంతో మా కడుపులు నింపేది. నేడు నా కుటుంబాన్ని పట్నంలో పెట్టాను. వారికీ మంచి జీవితాన్ని ఇచ్చాను.
ఆ వీడియో చూసిన తర్వాత అక్కడ కామెంట్స్‌లో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేశాను. ఆ వీడియోలోని దృశ్యాలు ఎక్కడివో కాదు మా ఊరిలోనివే! దాదాపు దశాబ్దం దాటినా అవే పరిస్థితులు మా ఊరులో ఉండటం నేను తట్టుకోలేక పోతున్నాను.
ఏమి చేయాలో అర్థమవ్వడం లేదు! కళ్లు మూసినా.. తెరిచినా అదే వీడియో ప్లే అవుతోంద’ని చెప్పి భార్యను గట్టిగా కౌగిలించుకొని బాధపడ్డాడు కౌశల్.
‘ఏంటండి? చిన్నపిల్లాడిలా. బాధపడకండి. నాతో విషయం చెప్పారు కదా! నేను ఆలోచించి మీకు ఒక మంచి సలహా ఇస్తాను. ఈ విషయం మర్చిపొండి. నాకు ఒక వారం రోజులు గడువు ఇవ్వండ’ని కౌశల్‌ని గట్టిగా హత్తుకుంది.
* * *
బుజ్జమ్మ అసలు పేరు కోకిల. చదివింది ఎం.ఎస్.వి.వి. (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) పెళ్లి కాక ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్‌గా పని చేసింది.
పెళ్లయి అమెరికాకు వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటోంది. ఇప్పుడు పాపకి మూడు సంవత్సరాలు. ఇంకా పేరు పెట్టలేదు. వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆరు సంవత్సరాలలో పేరు పెడతారు.
భర్త చెప్పిన విషయాలన్నీ ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాడు కౌశల్ అని అర్థం చేసుకుంది.
కానీ... అమెరికాలో నెలకు పాతిక లక్షలు సంపాదిస్తున్న కౌశల్, ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి వరకు వచ్చాడు. తన ఊరిలోని దృశ్యాలను చూసి తట్టుకోలేక మదనపడుతున్నాడు.
నేను తనకు సహకరించాలి. దీని కోసం నేను కూడా కొన్ని త్యాగాలు చేయాలనుకుంది. సుదీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.
ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పింది. బుజ్జమ్మ ఆలోచనలతో తల్లిదండ్రులు ఏకీభవించి మేము కూడా మీకు తోడుగా ఉంటాము తల్లీ, అల్లుడుగారిని బాధపడవద్ద’ని చెప్పమన్నారు.
వారం రోజుల తర్వాత కౌశల్‌కి తన నిర్ణయాన్ని చెప్పింది.
కౌశల్‌కు బుజ్జమ్మ చెప్పిన సలహా అస్సలు రుచించలేదు. వద్దే వద్దు. నువ్వూ పాపా లేకుండా ఎలా ఉండాలి? అని బాధపడ్డాడు.
‘మిమ్మల్నే కాదు మీ ఆలోచనలు, అభిప్రాయాలను మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తిని నేను. మీరు అధైర్యపడొద్దు. నేను మీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తాను. మనం సేవ చేయాలనుకున్నప్పుడు చిన్నిచిన్ని త్యాగాలు చేయాల’ని కౌశల్‌కి నచ్చజెప్పి ఒప్పించింది. మరుసటి రోజే బుజ్జమ్మ ఇండియాకి ప్రయాణమైంది.
* * *
మామయ్యతో కలిసి గొల్లపల్లి తండా చేరుకొని ముందుగా ఎన్ని గుడిసెలు, ఎన్ని కుటుంబాలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో? వారం రోజుల్లో ఒక ఫైల్ రెడీ చేసి కౌశల్‌కి మెయిల్ చేసింది.
మొత్తం వంద కుటుంబాలు ఉన్నాయి. అందులో ముప్పై మంది పిల్లలు ఐదు సంవత్సరాల లోపు ఉన్నారు. ఇరవై మంది పది సంవత్సరాలలోపు ఉన్నారు. మిగతా ముప్పై మంది పదవ తరగతి చదివి ఆపేశారు.
అందరికీ జీవనోపాధి వారికున్న పొలాలలో పంటలు పండించుకొని ఉన్నది తినడమే. ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు అందడం లేదని కూడా తెలుసుకుంది బుజ్జమ్మ. మొదట అందరికీ ఏదైనా జీవనోపాధి కల్పించాలి. పిల్లలకు మంచి విద్య అందించే స్కూల్ నిర్మించాలి అనుకుంది.
ఉపాధి కోసం పాడి పరిశ్రమ నెలకొల్పాలని భావించి ప్రభుత్వానికి అర్జీ పెట్టింది. ప్రభుత్వం కూడా వెంటనే అనుమతి ఇవ్వడంతో పరిశ్రమ పనులు మొదలయ్యాయి. నెమ్మదిగా బుజ్జమ్మ తమ కోసం వచ్చిన దేవతని తండా ప్రజలందరూ అనుకున్నారు.
చిన్నపిల్లలకు పాటలు, ఆటలు రూపంలో చదువు చెప్పడానికి ఒక కేంద్రాన్ని నిర్మించి చదువు చెప్పిస్తూ, మంచి పౌష్టిక ఆహారం కూడా పిల్లలకు అందించారు.
అలా ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యం, రోడ్లు, పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ, వయో విద్య లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది బుజ్జమ్మ.
ఆ తండాను చూసి చుట్టుపక్కల తండాల వారు కూడా బుజ్జమ్మకు మా జీవితాలు కూడా మార్చండని ప్రాధేయపడ్డారు. వారి దీనగాథలు విని తట్టుకోలేక పోయింది. కానీ.. భర్త సంపాదనతో సేవా కార్యక్రమాలు మరింత విస్తరింప చేయడం కష్టమని భావించింది. విషయం మొత్తం కౌశల్‌కి ఫోన్ చేసి చెప్పింది.
కౌశల్ ఫండ్ రైజ్ చేసి మరింత డబ్బు సమకూర్చడంతో మరి కొంతమంది లబ్ధి పొందారు.
అప్పటి వరకు చేసిన వివిధ కార్యక్రమాలు ఫేస్‌బుక్ మరియు వివిధ సామాజిక వెబ్‌సైట్లలో పోస్ట్ చేయడం ద్వారా ఎంతోమంది దాతలు ముందుకు రావడంతో సేవా కార్యక్రమాలు విస్తరింపజేసి రాష్ట్రం మొత్తం ‘గురవమ్మ సేవా సంస్థ’ పేరుతో వేల మందికి సహాయం చేశారు.
కోట్లు సంపాదించినా సంతృప్తి కలగని కౌశల్‌కి భార్య చేసే సేవా కార్యక్రమాలతో ఆనందపడ్డాడు. ఇదంతా గమనించి ‘గూగుల్ కంపెనీ’ కౌశల్‌ని ఇండియాకి ట్రాన్స్‌ఫర్ చేయడమే కాక వంద కోట్ల రూపాయలు విరాళంగా గురవమ్మ సేవా సంస్థకి ప్రకటించింది.
కౌశల్, బుజ్జమ్మ ఇద్దరూ కలిసి అడివికి అక్షరాన్ని నేర్పించడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి
కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు
మెయల్‌లో పంపాలి.