S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీసాఖ్యానం

మా బాలమ్మ తెలియక ఆకేశవేణి అన్నది. రేడియోలో ఏకాంబరుం అనే సత్యనారాయణగారు ఒకానొక రాత్రి ఐకాశవాణి, ఆద్రాబాద్ కేంద్రం అన్నారు. ఆ అర్ధరాత్రి ఎవరూ రేడియో వినలేదా? లేక విన్నా పట్టించుకోలేదా? అది వేరే సంగతి. కేశ అంటే వెంట్రుకలకు సంబంధించిన మాట. వేణి అంటే జడ. కానీ వెంట్రుకల వరకు జడ అని అర్థం వచ్చే బాలమ్మ మాటకు అర్థం లేదు. అది తెలియని మనిషి అన్న తెలియని మాట.
నా పేరు బుచ్చిగోపాలం. యూనివర్సిటీలో మిత్రులంతా బూచి గోపాలం అనేవారు. ఎందుకో తెలుసా? నా జుట్టు ఎప్పుడూ అస్తవ్యస్తంగా, అదుపు లేకుండా పెరిగి ఉండేది. పైగా నాకు గడ్డాన్ని నరకకుండా వదిలిపెట్టడం మొదటి నుంచీ అలవాటు. అప్పుడో, ఇప్పుడో తప్ప నేను గడ్డం, కొంతయినా పెరగకుండా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. మూన్‌ఫేస్, చాకొలేట్ ఫేస్ అని మాటలున్నాయి. వాటికి, ఆడంగిగా కనిపించే అందమయిన మగ ముఖం అని అర్థం చెప్పుకోవాలి. అంటే ఆ ముఖంలో మగ సహజమయిన మొరటుతనం కనిపించదన్న మాట. జరిగిన సంగతిని దాచుకుంటే ఏం ఒరుగుతుంది గానీ, నా అమ్మాయి మిత్రులు ఒకనాడు, నాకు నడిమి పాపిడి తీసి దువ్వి, తిలకం పెట్టి, తలకొక స్కార్ఫ్ చుట్టి అద్దం తెచ్చి ముందు పెట్టారు. నిజంగా నాకే నవ్వు వచ్చింది. అప్పుడు మరొక సన్నిహిత మిత్రురాలు, ‘అరే, మీసం పెంచుకో! బాగుంటుంది’ అని సలహా ఇచ్చింది. అసలు సిసలయిన ఛాదస్తం బాపన జన్మ మనది. గుండె గుభేలుమన్నది. కానీ ఆ అమ్మాయి ‘ఇంటి పంట, ఎప్పుడు కావాలన్నా కోసేయవచ్చు’ అని అర్థం వచ్చే హిందీ మాట చెప్పింది. ఇంటి నుంచి దూరంగా వరంగల్‌లో ఉన్నాను. కనుక మీసాలు వదిలేశాను. వాటిని షేవ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. గడ్డం మీసాలు కొంతమందికి అరకొరగా వస్తాయి. నాకు ఆ సమస్య లేదు. చూస్తుండగా నా మీసాలు ‘గల్లు మీసాలు’ అయినయి. ఈ మాట విని చాలాకాలమయింది నాకే! అంతలో సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్లాలి. ఆలోగా మీసాలు తొలగించాలా? ధస! అంటే ధర్మ సందేహం. ధైర్యే సాహసే మీసం! అనుకున్నాను. అట్లనే ఇంటికి వెళ్లాను. నాన్న పేరే నరసింహావతారము. ఆయన వరండాలో తన మామూలు చోటు అయిన పలంగ్ పీట, అనే పలక పీట మీద విరాజిల్లుతున్నాడు. ఆయన మాకు తండ్రికన్నా, స్నేహితుడన్న భావము మాలో నిండి ఉండేది. అదే ధైర్యము. తలవంచుకుని ప్రవేశించినవాణ్ని, పలకరింపుగా తల ఎత్తవలసి వచ్చింది. మనసులో అనుమానం తొంగి చూస్తున్నది. కానీ సింహస్వరం అంతలోనే ‘శభాష్’ అనడం వినిపించింది. ‘బాగుందిరా! నీకు బాగ నప్పింది’ అన్నరు మా నాయన! ఏమానందము? ఎంత రిలీఫ్! అట్లా మొదలయింది నా మీసముల చరిత్ర! ఆ తరువాత గడ్డము తోడయింది! అది మరొక చరిత్ర!
మీసాలు, నా ముఖాన్ని మార్చి ఉండవచ్చు. కానీ గడ్డము పెంచడము వెనకు ఏమయిన కారణం ఉండెనా? ఏమో! నాకే గుర్తు లేదు. కేవలం నా బద్ధకం అందుకు కారణం అని అనుమానం లేకపోలేదు. మీసాలున్నాయన్న ధ్యాసలేక ఒకసారి పెద్ద సంకటంలో పడ్డాను. చెప్పుకుంటే, తప్పు బయటపడుతుంది. అందులో గొప్ప అపాయం ఏమీ లేదు. తిరుమల క్షేత్రంలో వారం, అంతకు పైగా, అందునా ప్రత్యేక సందర్భాలలో ఉండడం రెండు మూడు పర్యాయాలు తటస్థించింది. అది వైష్ణవ క్షేత్రం. అక్కడ స్వామికి ప్రతి ఉదయం జరిగే ఒక ప్రత్యేక పూజా కార్యక్రమ భాగంలో, పద్ధతిగా ఉన్న వైష్ణవులకు ప్రత్యేకంగా ప్రవేశం ఉంటుంది. పరమ భక్తాగ్రేసరుడు ఉండే రోజుల్లో కొండ ఎక్కితే చాలు గుండు కొట్టించుకోవడం అలవాటు. ఆ తరువాత తిరుమణ్, శ్రీచూర్ణ ధారణం, తప్పని అలవాటు. ఆ వేషంలో శాత్తుమరైకు పోవడం, ఆనందోబ్రహ్మ! అదే తీరు గదా అనుకుని ఒకానొక తెల్లవారుఝామున వేడి స్నానాదికాలు ముగించుకుని, దాష్టీకంగా పోయి, వరుసలో, శాత్తుమర కొరకు నిలుచున్నాను. అక్కడ ఒక స్వామి అందరినీ పరీక్షించి లోపలికి వదులుతారు. ‘పక్కకు రండి’ అని తమిళంలో గౌరవంగానే చెప్పారు. నాకు అనుమానం మొదలయింది. గడ్డం లేదు, మీసాలు మాత్రమే ఉన్నాయని ఎవరికి మాత్రం గుర్తుంటుంది. కాసేపటికి ఆయన ‘మీసాలు! తరువాత రండి’ అని మెల్లగా అన్నారు. శాత్తమలై తరువాత నిత్యకట్ల వారి దర్శనాలు, హారతులు ఉంటాయి. నాకు ప్రత్యేక ప్రవేశ సౌకర్యం ఉంది గనుక తరువాత వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత నేను తిరుమలకు పోలేదు అనను. కానీ ఎన్నడూ గుండు చేయించుకోలేదు. శాత్తుమర దర్శనం గురించి ఆలోచించను కూడా లేదు!
గడ్డం గురించి రాయాలనుకుని మీసాలలోనే మిగిలిపోయాను. తన గురించి తాను రాసుకోవడంలో ఈ ప్రమాదం ఉంది. ఎనె్నన్నో సంగతులుతలలో తేనేటీగల లాగ రొద మొదలుపెడతాయి. కొన్ని తప్పించుకుని కాగితం మీద అక్షరాలయి పాకుతాయి. నాకున్న ఒక అనుమానం మీ ముందుంచుతాను. చేతనయితే ఆలోచించండి. కోతులు మన తాతలు అంటారు గదా! మరి కోతులకు గడ్డం, మీసాలు ఎందుకు ఉండవు? ఆదిమానవుడు అని బొమ్మలు గీస్తారు. అందులో కొందరికి మాత్రమే కొంచెం గడ్డం ఉన్నట్లు చూపిస్తారు. ఆదిమానవులకి మీసాలు, గడ్డాలు లేవా? అసలు మనిషికి గడ్డం పెరగడం సహజంగదా! ముఖం మీది వెంట్రుకలను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడు మొదలయింది? అయినా సరే ఈనాటికి ఎవరూ కనుబొమలను మాత్రం అట్లాగే వదిలేస్తారు ఎందుకు?
వెంట్రుకలు, వాటి చరిత్ర గురించి ఒక చక్కని పుస్తకం వచ్చింది. అది నా చేతికి కూడా వచ్చింది. కానీ ఇంకా చదవడం కుదరలేదు. నా ప్రశ్నలకు కొంతవరకయినా అందులో సమాధానాలు దొరుకుతాయా? చూద్దాం! దొరికినా, దొరకకున్నా, అక్కడి సంగతులను అలవాటుగా ఎక్కడో ఒకచోట అందరితో పంచుకుంటాను!
దేవుళ్లకు గడ్డం, మీసాలు ఎందుకు ఉండవు? అన్నది నన్ను పీడించే మరో ప్రశ్న. గుర్రాలను, కుక్కలను అందరమూ అదే పనిగా చూస్తుంటాము. వాటి బొమ్మ గీయ పూనుకుంటే, ఏ కొంచెం తేడా వచ్చినా అందరూ గోల చేస్తారు. దయ్యాలను ఎవరూ చూడలేదు. కనకు వాటి బొమ్మ ఎట్లా గీచినా సమస్య లేదు అంటాడు ఒక సైంటిస్టు. పడమటి వాళ్లకు అంత మంది దేవుళ్లు లేరు గనుక ఆయన దయ్యాల సంగతితో సరిపెట్టుకున్నాడు. మన దేవుళ్లు, వారి తీరు గురించి, కనీసం, సినిమాలో వారిని చూపించే తీరు గురించి కూడా ఆయనకు తెలిసి ఉండదు. భీమునికి, మరో రావణాసురునికి మీసాలు పెడతారు. దుర్యోధనునికీ మీసాలుంటాయి. గడ్డం మాత్రం ఉండదు. అందరూ ఒకేసారి పుట్టినవారు, అంటుంది పుస్తకం. సినిమాలో మాత్రం ధర్మజునికి గడ్డం పెడతారు.
అవునుగానీ, తల వెంట్రుకల దాకా వెళ్లకుండానే, కథ చివరికి చేరుకున్నది చూచారా? ‘గుండు తప్పదట. పరీక్ష పాసయితే, తిరుపతి, లేకుంటే ఇక్కడేనట!’ అన్నాడు ఒక పరీక్షార్థి అయిన విద్యార్థి. ‘గజగమన కేశపాశంబు సహజగందంబు’ అనిపించాడు ఒక కవి. అమ్మాయి ఎంత అందంగా ఉంటే మాత్రం, ఆమె తలవెంట్రుకలు సువాసన ఉండడం కుదురుతుందా? ‘వెంట్రుకలు నిండా ఉన్న అమ్మ ఎలా కొప్పు కట్టుకున్నా కుదురుతుంది! అదీ సంగతి!

కె.బి. గోపాలం