S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ మనిషి ...

ఆయన ఇంకొంచెం తక్కువ చదువుకుని ఉంటే, అంతులేనంత బాగా చెప్పగలిగేవాడు - ఛార్ల్స్ డికెన్స్
నిజమే, అవసరమయిన మేరకు మాత్రమే మాట్లాడడానికి మరీ ఎక్కువ తెలివి అడ్డు తగులుతుంది.
* * *
మనిషి ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తరిగేట్లు లేదు. తప్పేముంది గనుక ముందుకు వెళదాము. ఎక్కిళ్లు ఎందుకు? అని ఎప్పుడయినా అనుమానం వచ్చిందా?
నోరు బార్లా తెరిచి పెద్ద ఎత్తున గాలిని లోపలికి పీల్చుకుంటారు. పొట్టలో ఉండే డయాఫ్రమ్ అనే తెర ముడుచుకుని బాగా కిందకు పోతుంది. పక్కటెముకల మధ్యన ఉన్న కండరాలు బిగుసుకుంటాయి. వెంటనే ఒక్కసారిగా ‘ఎక్’ అని చప్పుడు చేస్తూ గాలి తోసుకుని గొంతులో నుండి బయటకు వస్తుంది. అందుకే వాటికి ఎక్కిళ్లు అని పేరు. ఇంగ్లీషులో హిక్ అప్స్ అన్నారు. అక్కడా ఇదే పద్ధతి.
ఎక్కిళ్ల వలన శరీరానికి జరిగే మేలు గురించి మాత్రం తెలియదు. అయినా మనిషి జీవితంలో ఈ సమస్య కలకాలంగా కొనసాగింది. పాప కడుపులో ఉండగా, ఎనిమిది వారాల వయసులోనే ఎక్కిళ్లు వచ్చే అవకాశం మొదలవుతుంది. 10-13 వారాల బిడ్డకు ఎక్కిళ్ల సమస్య ఎక్కువ. ఇక ఆ తరువాత, పుట్టిన తరువాత ఎక్కిళ్ల సమస్య అంత ఎక్కువగా రాదు. నిజానికి తగ్గుతూ పోతుంది. అక్కడో ఇక్కడో ఒకరిద్దరికి మాత్రం ఎక్కిళ్ల వల్ల లెక్కలేని కష్టం వస్తుంది. ఒక్కొక్కసారి ఒకరికి రెండు రోజులపాటు వదలకుండా ఎక్కిళ్లు వస్తాయి. ఆడంగుల కన్నా మగవారికి ఎక్కిళ్లు వచ్చే అవకాశం పది రెట్లు ఎక్కువ. అయోవాలోని ఒక రైతు పాపం, 67 సంవత్సరాలపాటు ఎక్కిళ్లతో బాధపడ్డాడు. అంతకాలం అవి ఆగనే లేదు. అయితే రాత్రి పడుకుంటే మాత్రం ఎక్కిళ్లు ఆగిపోయేవి.
ఎక్కిళ్లకు కారణం మెదడు నుండి వెన్నుపాముగా వస్తున్న కొమ్మ భాగంలో ఉంటుంది. ఏవో కొన్ని సూచనలు రాగానే అక్కడి నుండి కండరాలకు ఆజ్ఞలు అందుతాయి. కడుపు విస్తరించినా, గొంతులో చికాకు కలిగినా, మరికొన్ని రకాల నాడీ మండల సమస్యలు వచ్చినా ఎక్కిళ్లు మొదలవుతాయి అంటున్నారు. కారణాలలాగే ఎక్కిళ్లకు చికిత్సలు కూడా బోలెడు ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కిళ్లు వచ్చిన వారికి షాక్ కలిగించే ఒక సంగతి చెప్పాలని ప్రయత్నించేవారు. మానసిక కారణంగా వచ్చిన ఎక్కిళ్లు బహుశా తగ్గేవి. మహారచయిత ప్లేటో ఎక్కిళ్లను గురించి, తుమ్ములను గురించి రాశాడు. తుమ్మగలిగితే లేదా ఊపిరి బిగబట్టగలిగితే ఎక్కిళ్లు తగ్గిపోతాయని ప్లేటో సూచించాడు. ప్రపంచం మీద ఎక్కిళ్లకు అమలులో ఉన్న చికిత్సలలో చక్కెర తినడం, నీళ్లు తాగడం, తలకిందకు వంచడం, భయానికి గురి కావడం, చెవులలో వేళ్లు పెట్టుకోవడం లాంటివి ఎన్నో ఉన్నాయి.
ఒక పరిశోధకుడు ఎక్కిళ్లను అర్థం చేసుకోవాలని బయలుదేరాడు. ఆ చప్పుడును రికార్డు చేయాలని అతని ప్రయత్నం. టేప్‌రికార్డర్ చూపించిన మరుక్షణం ఎక్కిళ్లు ఆగిపోయేవి. మొత్తానికి మానసికంగా ఒక రకమయిన మార్పు కలిగితే ఎక్కిళ్లు ఆగుతాయని అతను ప్రతిపాదించాడు.
చిన్నపిల్లల ఎక్కిళ్లు అనుకోకుండా వస్తాయి. అలాగే ఆగిపోతాయి. ఏడ్చేవాళ్లు ఎక్కిళ్లలోకి మారతారని అనుభవం మీద తెలుసు. మరి వాళ్లను ఏం చేస్తే మామూలు అవుతారన్నది మాత్రం అనుమానంగానే మిగిలి ఉంది.
ఇటువంటిదే ఇంకొక సమస్య ఉంది. అదే వాంతి. ఈ శరీరం కొన్ని పదార్థాలను అంగీకరించదు. కొన్ని పదార్థాలు శరీరానికి విషంగా పని చేస్తాయి. తెలియకుండానే చీమ, దోమ ఏదో గొంతులోకి పోతుంది. ఇక భయంకరంగా వాంతులు మొదలవుతాయి. లోనికి వెళ్లిన విష రసాయనాలను, విదేహ పదార్థాలను బయటకు పంపించే తీవ్రమయిన ప్రయత్నమే వాంతులు. ఇక కొన్ని సందర్భాలలో నచ్చని దృశ్యం, నచ్చని వాసన, భయంకరమయిన ధ్వని కారణంగా కూడా కడుపులో తిప్పి వాంతులు పుడతాయి. వీటికిగల కారణం కొంతవరకు శారీరకం. మరి కొంత మానసికం కావొచ్చు.
వాహనాలలో మరీ కుదుపులతో ప్రయాణించే వారికి వాంతులు రావడం మామూలే. వాహనాలలో పెట్రోలియం ఉత్పత్తుల వాసన కూడా బలంగా ఉంటుంది. తిరుపతి కొండ ఎక్కడానికి పాత కాలంలో రోడ్డులో వంపులు మరీ ఎక్కువగా ఉండేవి. ఆ దారిలోని బస్సులలో వాంతులు చాలా మామూలుగా జరిగేవి. ఇవాళటికీ విమానంలో సీటు వెనుక ఉన్న సంచీలో కాగితం బ్యాగులు ఉంటాయి. కడుపులో తిప్పి వాంతి వచ్చిన వారు వాడుకోవడానికి వాటిని ఏర్పాటు చేస్తారు. పక్కవారు వాంతి చేస్తుంటే కుదుపునకు తట్టుకున్న వారు కూడా ఆ బాధకు గురి అవుతారు. వాళ్లకూ వాంతులు మొదలవుతాయి.
మురుగు కాలువ వాసన, కుళ్లిన తిండి వాసన, కారు పొగల వాసన తప్పకుండా వాంతికి దారితీస్తాయి. వాంతి జరిగితే నిజానికి శరీరం సర్దుకుంటుంది. పడని రుచి మింగిన వారికి వాంతి బాధ తప్పదు. అప్పుడు కూడా శరీరం సులభంగానే మామూలు పరిస్థితికి చేరుతుంది.
రకరకాల పరిస్థితుల నుండి తేరుకోవడానికి పరిణామ క్రమంలో వాంతులు మొదలయినట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఒకరి నుండి ఒకరికి వాంతులు సంక్రమించడంలో ఆవులింతలు, ఎక్కిళ్లలాగే కారణం కూడా సంక్రమించే వీలు ఉండడం అసలు కిటుకు.
తెలిసీ తెలియక కొంతమంది బలవంతంగా వాంతి చేసుకునే ప్రయత్నం చేస్తారు. తిండి ఇష్టం లేని అమ్మాయిలు ఏదో చేసి తిన్న తిండిని వదిలించుకుంటారు. పల్లెటూరి వారు నోట్లో వేళ్లు వేసుకుని పైత్య రసాన్ని బయటకు తెచ్చి డోక్కొని ఏదో బాగుపడ్డట్టు అనుకుంటారు. ఇవన్నీ తప్పు పద్ధతులు. అనుకూలం కాని పరిస్థితుల నుంచి తేరుకోవడానికి శరీరం ఎన్నో పద్ధతులను తయారు చేసుకున్నది. అంతేగానీ, వాటిని వాడుకుని మరేదో చేయాలంటే అది తప్పు.
కేవలం శరీర పరంగానే కాక ఆలోచనా పరంగా, నాడుల పరంగా, మానసికంగా చివరకు ప్రయోగంగా కితకితలు ఎన్నో రకాల మనకు సరదా పరిస్థితిని అనుభవంలోకి తెస్తాయి. అయితే ఈ విషయాన్ని గురించి అంతగా పరిశోధనలు మాత్రం జరిగినట్టు కనిపించదు. చక్కిలిగింతల గురించి మాట మొదలయిందంటే చాలు, అందరూ ఎవరికి వారే చక్కిలిగింతలు పెట్టుకోవడం వీలు కాదు అని గట్టిగా చెప్పేస్తారు. నిజానికి ఇది చాలా గొప్ప విషయం. లేకుంటే చేయి, కాలు మనది మనకే తగిలి కితకితలు పుట్టి బతుకు దుర్భరం అయ్యేది. బట్టలు వేసుకోవడం, విప్పడం అనవసరమయిన నవ్వులతో అర్థంలేనిదిగా మారేది. మరెవరో ముట్టుకుంటే కితకితలు పుట్టడం కొత్తకాదు. తాకిడిలో తేడా తెలియడానికే శరీరంలో ఈ పద్ధతి ఉందని సులభంగానే అర్థం అవుతుంది. వ్యక్తిత్వం గురించి లోతుగా తెలుసుకునే చోట చక్కిలిగింతలకు గట్టి ప్రాధాన్యం దొరుకుతుంది.
మనల్ని మనం తాకడం లేదా ఇతరులు తాకడం విడివిడిగా ఉంటాయి. ఆ తాకడంలో కావలసినన్ని రకాలు ఉంటాయి. వాటన్నిటినీ గురించి తేడాలు తెలుసుకోగలిగితే బహుశా త్వరలోనే మర మనుషులకు స్పర్శ కలిగించే పద్ధతి ప్రారంభం కావచ్చు. ఎవరికి వారే చక్కిలిగింతలు పెట్టడం వీలు కాదంటే అందులో సాంఘికమయిన కారణాలే ఎక్కువ. ఇద్దరు వ్యక్తుల మధ్యన తాకిడి ద్వారా సంబంధం తెలుస్తుంది. చిన్నపాపను తల్లి ఎత్తుకున్నా, మరొకరు ఎత్తుకున్నా తేడా తెలుస్తుంది. కొత్తవాళ్లు ఎత్తుకుంటే పాప ఒళ్లు ఝల్లుమంటుంది. అంతటితో ఆగక పాప స్పర్శతో ఎత్తుకున్న వాళ్ల ఒళ్లు కూడా పులకిస్తుంది. అది స్పర్శలోని గొప్పతనం.
చాలామందికి కితకితలు నచ్చవు. కొందరికి కితకితలు మరీ ఎక్కువ. దూరం నుంచి కూడా ఎవరో చేతులు ఆడించినా వాళ్లు ఆగకుండా నాట్యం చేసేస్తారు. స్ర్తి పురుషుల లైంగిక సంబంధంలో స్పర్శకు, తద్వారా కలిగే ప్రేరణలకు గొప్ప పాత్ర ఉంది. ఎవరో తగిలితే భారంగా శ్వాస వస్తుంది. ఆ తరువాత నవ్వు వస్తుంది. ఆగకపోతే అది రొప్పు క్రిందకు మారుతుంది. చింపాంజీలలో కూడా ఈ పద్ధతిని గమనించారు. మొత్తానికి కితకితలలో అసౌకర్యం మాత్రం లేదు. అది ఆనందానికి ఆధారం కావాలి. కొంతమంది మాత్రమే దీన్ని అంగీకరించరు.

-కె.బి.గోపాలం