వృథా
Published Saturday, 23 March 2019
చాలా సంవత్సరాల క్రితం మాట. నడవడానికి సమయం దొరకడం లేదని ఓ స్టేషనరీ సైకిల్‌ని కొన్నాను. అప్పటికింకా ట్రెడ్‌మిల్స్ అంత ప్రాచుర్యం పొందలేదు. అది పెట్టుకోవడానికి అవసరమైన స్థలం కూడా ఇంట్లో వుండేది కాదు.
చాలామంది సైకిళ్లని ట్రెడ్‌మిల్స్‌ని కొంటారు. కొత్తలో బాగా ఉపయోగిస్తారు. కొంతకాలం తరువాత వాటిని వాడటం మానేస్తారు. తువ్వాళ్లని ఆరేసుకోవడానికి ఆ సైకిల్స్ ట్రెడ్‌మిల్స్‌ని ఉపయోగిస్తారు. మా ఇంట్లో కూడా అదే జరిగింది. సైకిల్ మీద టవల్స్‌ని ఆరేసేవాళ్లం.
వాటిని సరిగ్గా ఉపయోగిస్తే అవి ఉపయోగించిన ఆరోగ్యాలని బాగుపరుస్తాయి. ఉపయోగించకపోతే వృథాగా ఉండటమే కాదు. ఇంట్లో స్థలాన్ని కూడా ఆక్రమిస్తాయి.
సైకిళ్లు, ట్రెడ్‌మిల్సే కాదు.
చాలా వస్తువులని కొంత హుషారుగా కొంటారు. అవి కెమెరాలు కావొచ్చు. సంగీత పరికరాలు కావొచ్చు. పుస్తకాలు కావొచ్చు.
తరువాత అవి ఇంట్లో వున్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటారు.
ఎంత వృథా.
వాటిని ఉపయోగించుకునే వ్యక్తుల దగ్గర ఉంటే ఎంత ఉపయోగం ఉంటుంది.
ఇవి ఒక్క వస్తువుల విషయంలోనే కాదు.
మనుషుల విషయంలోనూ వర్తిస్తుంది.
ఎంతోమంది తమ శక్తియుక్తులని, తెలివితేటలని సరిగ్గా వాడుకోకపోవడం ఎంత శోచనీయం.
వాళ్లు ఉపయోగిస్తే వాళ్లకే కాదు, సమాజానికీ ఎంతో ఉపయోగం.
సైకిల్‌కి మనిషికీ మధ్య భేదం ఉంది. సైకిల్‌ని ఎవరైనా ఉపయోగించాలి. తనకు తానుగా ఉపయోగించుకోలేదు.
కానీ
మనిషి-
తనని తానే ఉపయోగించుకోగలడు. ఇతరులపై నెపం ఉంచడానికి అవకాశం లేదు.