S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తనను నిష్ఠూరాలు ఆడిన సీతకు సమాధానం చెప్పిన లక్ష్మణుడు( అరణ్యకాండ)

సీతాదేవి తనను నిష్ఠూరాలు ఆడుతూ అంటున్న మాటలకు లక్ష్మణుడు జవాబు చెప్పాడు ఇలా. ‘వదినా! ఎందుకమ్మా ఇంతగా భయపడి దుఃఖపడతావు? నీ భర్తను యుద్ధంలో దేవతలు, మనుష్యులు, యక్షులు, సర్పాల రాక్షసులు, పిశాచాల నాయకులు, లేదా ఇంకెవరైనా నిలిచి పోరాడగలరా? వాళ్లకూ బతకాలని ఆశ వుండదా? ఎవరికైనా ప్రాణాలు చేదా? ఏది తీపి అంటే, ప్రాణాలే తీపి అనే సామెత లేదా? నీ నోట వచ్చిన మాటలు నువ్వు అనతగ్గవి కాదు. రామచంద్రమూర్తి ఎవరి చేతిలోనూ చావడు. ఒంటరిగా నిన్ను విడిచిపోవడానికి నేను ఒక్క అడుగైనా వేయడం ఎలా సాధ్యం? ముల్లోకాలు ఒక్కటై వచ్చి దండెత్తినా, ఇంద్రుడు దేవతలు కలిసి వచ్చినా, ధీరుడై చలించక యుద్ధంలో నిలిచి రామచంద్రుడు తన బాణాలతో అందర్నీ చంపుతాడు. అందర్నీ నాశనం చేస్తాడు. అమ్మా! నా మాట నమ్ము. మనస్సు నిబ్బరించుకో. నీ భర్త శీఘ్రంగా మృగాన్ని చపం సుఖంగా ఏ కీడూ లేకుండా, ఇక్కడికి వస్తాడు. ఎందుకు కలత చెందుతావు?’
‘మనం విన్నది రామచంద్రమూర్తి గొంతు కాదు. ఏ మాయలమారో అలా గొంతు మార్చి అరిచాడు. ఆ మారీచ రాక్షసుడే అలా స్వరం ఇంద్రజాలంలా అనుకరించాడు. నన్ను పో-పొమ్మంటున్నావు.. నేనెలా పోతానమ్మా? నిన్ను నా రక్షణలో వుంచి కదా రామచంద్రమూర్తి పోయాడు? ఆయన వచ్చి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? రామచంద్రమూర్తి వచ్చి ఇదేనా నిన్ను చేయమంది అని అడిగితే ఏమనాలి? ఆయన ఆజ్ఞ ఉల్లంఘించి, ఆయన మాట వ్యర్థం చేసి, నేనెలా పోతాను? నేను పోతే నీ గతి ఏంటి? నీకేం అపాయం వస్తుందంటావా? ఖరుడు చనిపోయినప్పటి నుండి రాక్షసులందరూ మన మీద పగపట్టి ఉన్నారు. ఏ విధంగానైనా మనల్ని చంపాలని కుట్రలు పన్నుతున్నారు. వాళ్లే మనల్ని వేరుచేయడానికి ఇలాంటి మోసపూరిత ధ్వనులు చేస్తున్నారు. ఇది ఆలోచించకుండా నువ్వెందుకు దుఃఖపడతావు?’
లక్ష్మణుడు ఇలా అనగానే సీత కోపంతో, కళ్లెర్రజేసి, నిజం చెప్తున్న ఆయన్ను చాలా కఠినంగా నిందించింది. ‘ఓరీ! మనుష్యుడైన వాడికి పరాయి వారి పట్ల వుండాల్సిన దయ కూడా నీ అన్న మీద లేదు నీకు. వినరా! దయ లేకపోతే పోనీ.. చస్తే చస్తాడులే.. అనే క్రూరత్వం కూడా వుంది. దీనర్థం.. నువ్వు ఆర్యజాతిలో పుట్టాల్సిన వాడివి కాదు. ఎందుకంటే.. ఆర్యులకు వుండాల్సిన దయాగుణాలు నీలో లేకపోవడమే కాకవుండా క్రూరత్వం, మోసం కూడా నీలో వున్నాయి. నువ్వేం వంచన చేశావంటావా? అన్నకు సేవ చేస్తానని చెప్పి, నమ్మించి అడవుల్లోకి వచ్చి, ఆపద వేళ ఆదుకోకపోవడం వంచన కాదా? ఇలాంటి గొప్ప వంశానికి అపకీర్తి తెచ్చి దాని గౌరవం నాశనం చేయడానికి ఎలా పుట్టావురా? దుర్మార్గుడు చస్తే చస్తాడు అనడానికి, రామచంద్రమూర్తి అలాంటివాడు కాదు కదా? సద్గుణాలలో గొప్పవాడు కదా? అలాంటి వాడికి కీడు చేయడం నీకిష్టమైనప్పుడు నువ్వు ఎలాంటి వాడివనాలి? నువ్వు నిజంగా రామచంద్రమూర్తి కీడు కోరేవాడివే. లేకపోతే, కీడు కలగడం చూసి, ఆర్తనాదం వినీ, దుష్టుడా! ధీరుడవైనా కూడా, కొంచెమైనా సంకోచించక, పాపం అని అనుకోక, నేను పోను అని అనవచ్చా?’ అని అంటుంది సీత.
సీత ఇంకా ఇలా అంటుంది లక్ష్మణుడితో, ‘నీ నడవడిలో వింత లేదు. లోకంలో జ్ఞాతులు మారువేషాలు వేసుకుని దయ లేకుండా ఎప్పుడూ నీలాగే కీడు చేయడానికి భయపడరు. లక్ష్మణా! నువ్వు నిజంగా అన్నకు సహాయం చేయాలనే మంచి అభిప్రాయంతో అడవికి వచ్చావా? లేదు.. చెడ్డ అభిప్రాయంతో వచ్చావు. ఏమిటి నీ చెడ్డ తలంపు అంటావా? చెప్తా విను. భరతుడు, నువ్వు రామచంద్రమూర్తికి సవతి తల్లి కొడుకులు. ఒక సవతి తల్లి కొడుకు రాజ్యం అపహరిస్తే, నువ్వు నన్ను అపహరించాలని అనుకుని ఇక్కడికి వచ్చి వుంటావు. లేదా, రాజ్యం అపహరించినట్లే భార్యను కూడా అపహరిస్తాను. నువ్వు సహాయం చేయమని భరతుడు పంపితే వచ్చి వుంటావు. రాముడికి సహాయం చేయడానికి అడవికి వచ్చావా? లేక, ఆయన్ను చంపే శక్తిలేనందు వల్ల ఎప్పుడు చస్తాడా అని కాచుకుని వున్నావా?’
‘ఇది నీ ఆలోచన అయినా, భరతుడి ఆలోచన అయినా, ఇది జరిగేది కాదు. ఎందుకంటావా? ఆ పుండరీకాక్షుడి భార్యనైన నేను మరొకరిని కలలోనైనా స్వీకరిస్తానా? రామచంద్రుడే లేకుంటే ఈ దేహంలో ప్రాణాలుంటాయా? వుండనిస్తానా? నువ్వు చూస్తూండగానే నీ కళ్ల ఎదుటే ఈ నిమిషంలోనే ప్రాణాలు విడుస్తాను. చూస్తుండు.’
(సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆమెలాంటి ఉత్తమురాలు ఏ లోకంలోనూ లేదు. అలాంటిది లక్ష్మణుడి తత్వం తెల్సి కూడా ఇలా మాట్లాడవచ్చా? స్ర్తి ఎప్పుడైనా స్ర్తినే. స్ర్తి స్వభావం బొత్తిగా లేని స్ర్తి వుండదు. వారికి కోపం వస్తే, అనరాని మాటలు, చేయరాని పనులు వుండవు. ఇక లక్ష్మణుడు నిష్కారణంగా భరతుడిని అనరాని మాటలన్నందుకు ఇది పర్యవసానం. నిష్కారణంగా సీతతో పడరాని మాటలు పడ్డాడు. అన్నదమ్ములను ఇద్దరినీ సీత తిట్టడం వల్ల ఆమె కూడా ఇలాంటి నిందలతో యావజ్జీవితం గడపాల్సి వచ్చింది.
ఇక అవతారం విషయం ఆలోచిస్తే వాస్తవం తెలుసుకోవచ్చు. సీత పుట్టింది లంకను చెరచడానికే. సమూలంగా రావణుడిని చంపడానికే ఆమె పుట్టింది. వేదవతి లాగే అన్నది కదా? ఆ కార్యాన్ని సీత చేయాల్సి ఉంది. దానికొరకై లంకకు వెళ్లాలి. రామలక్ష్మణులు తన దగ్గర వుంటే, రావణుడు రాలేడు. కాబట్టి మాయా మృగం నెపంతో రాముడిని మంచిమాటలు చెప్పి దూరంగా పంపింది. లక్ష్మణుడు అలా పోయేవాడు కాదు. రామాజ్ఞను కూడా ఉల్లంఘించి పోయేంత పని చేస్తేనే కాని ఆయన పోడు. ఇట్లా నిందలు వేస్తేనే ఆయన పోతాడు. ఇలా కార్యసాధన మార్గం ఆలోచించి, పంపడానికి సిద్ధమైంది కాని జ్ఞానహీనగా, దుష్టురాలిగా మాట్లాడలేదు.)
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12