S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక సరిహద్దు ప్రేమకథ

ఎప్పుడో ఏమో గానీ ఇప్పుడైతే దిస్ సెపరేషన్ ఫెన్సింగ్ ఎల్వో సీ నాట్ బిట్వీన్ టూ కంట్రీస్.. ఇట్ బిట్వీన్ జస్ట్ టూ లవబుల్ హార్ట్స్...
* * *
పూంచ్, బారాముల్లా తదితర డిఫెన్స్ సెక్టార్లలో పాక్ సైన్యపు అక్రమ చొరబాటు యత్నాలు తలెత్తకుండా మన రక్షణ కంచె బందోబస్తు పటిష్టంగా ఉంది. కంచెకు విద్యుత్ ప్రవహిస్తోందా అన్నంతగా షాక్ కొడుతోంది. కానీ మెల్లమెల్లగా కంచెకు ఒకచోట ఒక కుంకుమ పూల తీగె అల్లుకుంది. అది ఎప్పుడు ఎట్లా మొలిచిందో ఆ రెండు కళ్లకు తప్ప ఎవ్వరికీ తెలియదు.
* * *
కశ్మీరీ భాషలో ఆ అమ్మాయి ఇలా కవిత్వం రాసుకుంటోంది. అందరినీ నిద్రపుచ్చే నిద్రా నువ్వెప్పుడు నిద్రపోతావు. బహుశా అందరూ నిద్రపోయాకా. ఈ రోజు నేను ఎలాగైనా నిన్ను జోకొడతాను. నువ్వు నిద్రపోతుంటే చూస్తాను..’ అని అనుకుంటూ ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి నిద్రపోవట్లేదు, ఉహూ.. తనకు నిద్ర రావట్లేదు.
ఇండో పాక్ సరిహద్దు కంచె వద్ద ఆ సాయంత్రం దృశ్యం పదేపదే కళ్లల్లో మెదలుతోంది. ఆ దృశ్యంలో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. నిద్రపోతే మనకు నచ్చిన వాళ్లు కల్లోకొస్తారని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పింది అది గుర్తుంది.
కానీ ఇదేమిటీ కొత్తగా తను మేల్కొని ఉండగానే అతని కలలొస్తున్నాయి. నిజం చెప్పాలంటే కళ్లు మూసుకుంటే అతని నవ్వు ముఖం అదృశ్యం అవుతోంది. అతని చేప కళ్లు మాయం అవుతయ్. సింహపు నడక చెరిగిపోతుంది. అందుకే తను కళ్లు తెరిచి ఉంచింది. మెలకువలో అతన్ని కలగనటమే బావుందామెకు.
తలుపు తీసుకొని బయటకొచ్చి చూసింది సాయంత్రం కంచెలో చిక్కుకొని గాయపడిన గుర్రం పిల్ల తన గాయం వంక చూసుకుంటోంది. బహుశా అదీ అతని సాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండొచ్చు. దాని కాలికి గాయం చోట అతను కట్టిన చేతిరుమాలు వంక చూసింది. రేపు దానిని విప్పి ఉతికి దాచుకోవాలి. ఉహూ అట్లాగే ఆ గాయపు నెత్తుటి మరకలతోనే దాచుకోవాలి అలా అయితేనే ఆ జ్ఞాపకం ఎప్పటికీ పచ్చిగా తాజాగా ఉంటుంది అనుకుంది. రెండు శతృదేశాల మధ్య ఒక మానవత్వ సహాయ సంతకం కదా అది.
నిజానికి బోర్డర్ ఫెన్సింగ్‌కు చిక్కుకున్న రెక్కల పావురం ఆమె. తను థాంక్స్ చెఫితే వెళుతూ వెళుతూ వెనుతిరిగి అతనేమన్నాడు రక్షించటమే.. సైనికుడి విధి అని కదూ.. మరి తననెందుకు విడిపించకుండానే పోయాడు.
ఎక్ ప్యార్ కా నగ్మా హై -పాటను సెల్‌ఫోన్ సౌండ్‌లో పెట్టుకొని అక్కడే మెట్టుపై కూర్చొని అరచేతిని చెంపకు ఆనించి తలను ఒకవైపు వంచి గుర్రపు గాయం వంకే చూస్తూ అలాగే తనకు తెలియకుండానే ఎప్పటికో నిద్రపోయింది. నిద్ర ఎప్పుడు నిద్రపోతుందో చూడాలి అనుకున్న పిల్ల ఆ విషయం మరిచిపోయింది.
జిందగీ ఔర్ కుచ్ నహీ.. తెరె మేరే కహానీ హై.. ఈ పాట పూర్తికావొచ్చింది. ఆమె కలలో మరో పాట మొదలయ్యింది. మెలకువ పాటేదో తనని తలకి మోసుకుపోయింది. ఆ పిల్ల పాటల పిచ్చిది. ఆమెది పాకిస్తాన్‌లోని కర్తాపూర్ గ్రామం. ఇతనేమో భారత సరిహద్దు జవాను.. అతను బైనాక్యులర్‌తో గస్తీ కాస్తుండగా ఈ పిల్ల చేపకు అతని గుండె గాలం గుచ్చుకుంది. కథ పూర్తి కాలేదు. నిజానికి ఈ కథ ఇప్పుడే మొదలయ్యింది. ఇక యుద్ధం రగులుతుంది. వీళ్లు గెలవాల్సింది దేశపు కంచెను కాదు కులం కంచెను.
* * *
రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలోని ఊరికి రాకపోకల కోసం వెహికిల్ మీదో లేదంటే ఏ ఆటో, బస్సు మీదో ప్రయాణిస్తాం. ఆటో అయితే ఫేర్ చెల్లిస్తాం. బస్సైతే టిక్కెట్ తీసుకుంటాం. కానీ వీళ్లు మాత్రం ఒకరి ఊరి నుండి మరొకరి ఊరికి వెళ్లాలంటే వీసా తీసుకోవాలి. అంతకు ముందే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఆ అమ్మాయిది పాకిస్తాన్‌లోని కర్తాపూర్ గ్రామం. ఈ అబ్బాయిది మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్. రెండు ప్రదేశాలు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ వాళ్లు ఎప్పుడో రెండు వైరి దేశాలుగా విభజింపబడ్డారు. కర్తాపూర్ గ్రామం ఒకప్పుడు భారతదేశంలోనిదే కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు కేటాయించబడింది. స్థానికుల మనోభావాలకు విలువివ్వకుండా నాటి పాలకుల ఏకపక్ష నిర్ణయం అది.
* * *
ఆ యువకుడు బీఎస్‌ఎఫ్ జవానుగా ఇటీవలే నియమించబడ్డాడు. రెండు రోజుల క్రితం అతను నిఘాలో నిమగ్నమై ఉండగా ఆ చిన్నది ఇతని చూపుల్లో చిక్కింది. ఎలా అంటే ఒక వాన రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసినట్టు. అతని చేతుల్లోని శక్తివంతమైన లెన్స్ బైనాక్యులర్ అయిదు కిలోమీటర్ల పరిధిలోని దృశ్యాలను స్పష్టంగా చూడగలదు. అలా చూస్తూ శతృ సంచారం లేదని రూఢీ అవుతూ ప్యాన్ అవుతుండగా బైనాక్యులర్ ఒక అద్భుత దృశ్యాన్ని దాటుకుని వెళ్లిపోయింది. ఒక్క నిమిషంపాటు అలాగే ఆగిపోయి మళ్లీ అతి నెమ్మదిగా వెనక్కు వచ్చింది వేగంగా తిప్పితే ఎక్కడ ఆ దృశ్యం మళ్లీ చూపులకు చిక్కకుండా పోతుందో అని.
ఆమె ముఖంపైకి పడిన తల వెంట్రుకలను సుతారగా వెనక్కి నెడుతోంది. రెండు చేతులతో తల రెండు వైపులా చెవుల మీదుగా వెనక్కు పోనిస్తూ తన జుట్టునంతటినీ జడ పాయలో కలిపేస్తోదం సముద్రంలో నదులు కలుస్తున్న జలదృశ్యంలా ఉందది. కాళ్లకు ఉన్న చెప్పులు పక్కకు విడిచింది. నల్లటి తన చున్నీని తెల్లావు వీపుపై ఆరేసింది. ఇప్పుడామె తారకలా వెలిగిపోతోంది. సెల్‌ఫోన్‌లో పాటకు అనుకుంటా.. ఆమె తన్మయంగా డాన్స్ చేస్తోంది.. పాటేదో వినిపించటం లేదు కానీ ఆమె చేసే డాన్స్ స్పష్టంగా తెలుస్తోంది.
ఎవ్వరూ లేని ఏకాంతంలో అమ్మాయి మరింత అందంగా ఉంటుంది. ఎక్కడో చదివిన కవితా పంక్తులు గుర్తొచ్చాయి. ఏ ఆంక్షలు కట్టుబాట్లు లేనిచోటు కనుక ఆమె సీతాకోక చిలుకలా విహరిస్తోంది. ఒక్కసారిగా బంధాలు తెగిపోయాక స్వేచ్ఛ వంద రెట్ల స్వాతంత్య్రంగా అనిపిస్తుంది. సినిమాల్లో చూసి జనం నేర్చుకుంటారా జనం పోకడను బట్టి సినిమా కథలు పుడతాయో తెలీదు ఈ సీన్ మాత్రం సినిమాటిక్‌గానే ఉంది. ఆడిటోరియంలో ప్రేక్షకుల్లా ఆమె చుట్టూ మేత మేస్తున్న ఆవులు, గుర్రాలు. అతని చేతిలోని బైనాక్యులర్ ఆమె మీదే నిలిచిపోయింది.
నిజమే చూపు తిప్పుకోనివ్వని అందం అమ్మాయిలకే ఉంటుంది. ఎక్కడైనా దేశమేదైనా కొంచెం రంగు తేడా అంతే.. ప్రతి పువ్వూ సౌరభానికన్న ముందే సౌందర్యం అద్దుకుంటుంది.
* * *
పెద్దగా మొరుగుతూ ఒక కుక్క వారివైపు ఉరికొస్తోంది. అది చూసి కోపంతో రగిలిపోయాడు పండిట్ రవిశంకర్ తన చేతిలోని వేట కత్తితో ఒక్క వేటు వేశాడు. మెడ తెగి రక్తం జివ్వున ఎగజిమ్మింది. గిలగిల తన్నుకుంటూ అది ప్రాణం విడిచింది. మిగతా కుక్కలు కూడా పరుగెత్తుకొస్తుండగా ఇందాక తెగిపడిన తలను వాటివైపు విసిరేశాడు. ఆ రక్తం వాసనకు కుక్కలు తోక ఊపుతూ వాసన చూస్తూ అటువైపు వెళ్లిపోయాయి. కుక్కలు ఒకసారి చెవులు దులుపుకుంటే అప్పటివరకూ ఆలోచించుకున్నదంతా మరిచిపోతాయట.
అది పాకిస్తాన్ దేశం. లాహోర్ సమీపంలోని ఫైస్లాబాద్. రాత్రి పనె్నండు గంటల సమయం. డిసెంబర్ నెల చలి వాతావరణం కావటంతో ఆ పట్టణం అప్పటికే దీర్ఘనిద్రలో ఉంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆ ఊర్లోని సెయింట్ ఆండ్రూస్ ప్రెస్బిటేరియన్ చర్చ్‌లో ఆల్‌నైట్ ప్రేయర్ జరుగుతోంది. భక్తులు సామూహికంగా క్రీస్తు స్తుతి గీతాలు పాడుతున్నారు వాళ్లలో ఎక్కువమంది యువతీ యువకులే...
అక్కడ నిలిపి ఉన్న మారుతీ వ్యాన్ పక్కనుంచి పెట్రోలింగ్ వెహికిల్ ఒకటి చర్చ్ చుట్టూ హారన్ మోగిస్తూ రౌండ్ వేస్తోంది. సరిగ్గా అప్పుడే ఆ వెహికిల్‌లోని వైర్‌లెస్ మోగింది. సెట్‌లో ఎవరో పై అధికారి ఏదో కమాండ్ చేయటంతో వెహికిల్ ఓవైపు కదిలిపోయింది.
వాహనం అలా వెళ్లగానే అప్పటివరకూ సమీపంలోని పాడుబడిన భవంతిలో నక్కిన కొందరు చర్చి సమీపంలోకి వచ్చి చీకట్లో పొంచి ఉన్నారు. వాళ్లందరూ శాంతాక్రాజ్ వేషంలో ఉన్నారు. చర్చ్ బయట ఎందుకో కుక్కలు మొరుగుతున్నాయి. చర్చిలోని వారికివేవీ వినిపించటంలేదు.
వాళఉల పాడుతున్న పాటల కోసం కేషియో ప్లే చేస్తున్నాడు దళిత యువకుడు రాబర్ట్... తబలా ఫ్లూట్ కాంగో ట్రిపుల్ డ్రం సంగీతమంతా ఒక్క కేషియా నుండే సృష్టిస్తున్నాడు. సాహిత్యానికి అనుగుణంగా. అతను మ్యూజిక్‌లో మైమరచి ఉన్నాడు కానీ అప్పటి నుండి అతనే్న గమనిస్తూ ఏవేవో కలలు కంటోంది ఒక అమ్మాయి. అతనిలోని ఆ కళే ఆమెను అతని వైపు ఆకర్షించింది. నుదుటన ఎర్రని కాశ్మీరీ సింధూరంతో తెల్లగా నిగనిగలాడుతోంది. అక్కడున్న అంతమందిలో ఏ ఒక్కరూ ఆమె రంగులో లేరు. అందుకేనేమో తన వొంటిరంగు మరింత ఎస్టాబ్లిష్ అవుతోంది.
నిజానికి ఆ పాటలకు అర్థం ఏంటో కూడా ఆమెకు తెలియదు. చర్చ్‌తో కానీ ఆ సంస్కృతితో కానీ తనకు సంబంధం లేదు. రాబర్ట్ కోసం అతని ఆహ్వానం మేరకు వచ్చింది. ఆమె పేరు మధులిక.
చర్చ్‌లో ప్రార్థన ముగిసినట్టుంది. గుంపులు గుంపులుగా భక్తులు బయటకొస్తున్నారు. ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఇళ్లకు వెళుతున్నారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఉన్నారు. చివరిగా బయటకు వచ్చారు రాబర్ట్ మధులిక. అలా వస్తున్నప్పుడు అతని చేయి ఆమె భుజంపై ఉంది.. ఆ దృశ్యం చూడగానే మళ్లీ ఇందాకటిలానే రగిలిపోయాడు పండిట్ రవిశంకర్ శాంతాక్రాజ్ ముసుగు తీస్తూ కత్తితో ఒక్కవేటు వేశాడు.
పెద్దగా అరుస్తూ.. మొదలు నరికిన అరటి చెట్టులా కుప్పకూలిపోయాడు రాబర్ట్. ఒక్కసారిగా అతను వేసుకొన్న తెల్లచొక్కా క్షణాల్లో ఎరుపెక్కింది. ఫౌంటెన్‌లా ఎగజిమ్మిన రక్తం చూసి కళ్లు తిరిగి పడిపోయింది మధులిక.. ఆ అలికిడికి పోగవుతున్న జనం అతని పక్కన ఉన్న వాళ్ల చేతుల్లో తుపాకులను చూసి వెనక్కు తగ్గారు. తుపాకులున్నా రవిశంకర్ రాబర్ట్‌ను కత్తితోనే ఎందుకు నరికాడంటే.. శతృవును దగ్గర నుండి కత్తితో నరికితేనే కసి చల్లారుతుంది.. రక్తమంటిన ఆ కత్తిని ఒంటికి రుద్దుకుంటే మరింత గర్వంగా ఉంటుంది.
దట్టంగా నల్లపొగ విదుల్చుతూ తెల్ల వ్యాన్ ముందుకు దూకింది. మధులిక వెనుక సీట్లో ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమెకు ఇద్దామని తెచ్చిన డైమండ్ రింగ్ గిఫ్ట్ ఆ శవం ప్యాంట్ జేబులోనే ఉంది.
* * *
ఆ అమ్మాయి ఆవులిస్తూ బద్దకంగా నిద్రలేచింది. అప్పటికే వాళ్లమ్మ స్నానం చేసి పూజ కోసం మడికట్టుకొని ఉంది. ఆ రోజు వాళ్లింట్లో ఏదో హోమం జరగబోతోంది.. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు కాసేపట్లో పండితులొచ్చేస్తారు అని తల్లి కేకవేయటంతో తన నిద్రమత్తు పూర్తిగా వదిలింది...
* * *
చతురస్రాకారంలో అమర్చిన ఇటుకల చుట్టూ కూర్చున్నారు ఈ అమ్మాయి, ఆమె అక్క, తల్లి, తండ్రి. క్రతువు మొదలయింది. మంత్రోచ్ఛారణలతో హోమంలో నెయ్యిలో తడిపిన సమిధలు వేస్తున్నారు.
వేద పండితులు మంత్రాలు చదువుతుంటే అందరూ రెండు చేతులు జోడించి కళ్లు మూసుకొని భక్తితో వింటున్నారు. ఈ అమ్మాయి కళ్లు మూసుకోగానే.. అతను కనిపించాడు నిన్న జరిగిన సన్నివేశమూ కనిపిస్తోంది.
* * *
బైనాక్యులర్‌లో ఆమెను చూస్తూనే గుర్రం కంచెలో చిక్కిన సంగతి గమనించిన ఆ యువకుడు పరుగున వచ్చి దానిని విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ సవ్వడికి ఆమె ఈ లోకంలోకి వచ్చింది.
* * *
చూపులే కదూ ప్రేమికుల మొదటి భాష.. చూపులతోనే కదూ హృదయ లేఖల బట్వాడా.. చూపులే కదూ రెండు హృదయాల అనుసంధాన వంతెన.. కళ్లు కళ్లు కలిపి ఏడేడు జన్మల క్రితపు ఏదో మంత్ర లిపిని డీకోడ్ చేసుకోవడంతోనే కదూ. తొలి పాఠం కోసం వాళ్లిద్దరూ ప్రేమ పుస్తకం తెరిచేది.. ఎస్ దిస్ ఈజ్ టు కాల్డ్ యాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బట్...
కానీ ఈ ప్రేమికులేంటి రెండు వేర్వేరు దేశాల నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అదీ రెండు శతృదేశాల మధ్య నిలిచి.. ఎలా ఉందంటే ఆ దృశ్యం రెండు తూటాలు అటు నుంచి ఇటుంచి దూసుకు వస్తున్నట్టు.. ఎదురెదురు శిబిరాలు పరస్పరం హ్యాండ్ గ్రెనైడ్‌లు విసురుకుంటున్నట్లు రాకెట్ లాంచర్లు ప్రయోగించుకుంటున్నట్టు.. పేట్రియాట్లు పేల్చుకుంటున్నట్టు.. యుద్ధ ట్యాంకర్లు పరస్పరం ఢీకొట్టుకుంటున్నట్టు.. ఎందుకంటే ఆమె ఒక పటాలం.. అతనొక పటాలం...
అయినా ప్రేమంటే అదే కదా. యుద్ధానె్నదిరించటం.. ఆంక్షలు ధిక్కరించటం.. విద్వేషం పొదల్లో వెనె్నల పూలు
పూయించటం. ఈ రెండు దేశాల మధ్య ఆ ప్రేమలేకే కదూ ప్రతి రాత్రీ ప్రజల కళ్లల్లో యుద్ధ స్వప్నం.
* * *
ఆ రోజు అతని సెలవు కానీ గుడారంలో అతనికి కాలాగటం లేదు. బోర్డర్ ఫెన్సింగ్‌కు అవతల అమ్మాయే పదేపదే గుర్తొస్తోంది. దేశ రక్షణ కోసం సైనికుడై ఉండి ఇలా శతృదేశపు అమ్మాయిని ఇష్టపడొచ్చా అనుకున్నాడు. దేశాల శతృత్వం ప్రేమకు ఆపాదించటం ఆపాదించనవసరం లేదనుకున్నాడు.
డ్యూటీ పోస్ట్ వైపు వెళ్లే వీలు లేదు కనుక బైనాక్యులర్ తీసుకొని కర్తార్ కారిడార్ వైపు వెళ్లాడు.
బైనాక్యులర్‌ను జూమ్ చేస్తూ ఆమె నిన్న కనిపించిన వైపు జూమ్ చేశాడు. కానీ ఆమె అడుగుల జాడలు లేవు. ఆమె నడిచే, డాన్స్ చేసే ఆ నేలను చూస్తూ కొంత తన్మయానికి గురయ్యాడు ఆ విధంగా కొంత స్థిమితపడ్డాడు. బైనాక్యులర్‌ను అలాగే లెన్స్ అడ్జస్ట్ చేస్తూ గురుద్వారా వైపు తిప్పాడు.
కర్తాపూర్ సాహిబ్‌కు ఎంతో చరిత్ర ఉంది. గురు గోబింద్ సింగ్ నడయాడిన చోటు అది. మొదట్లో మన దేశంలో అంతర్భాగమైన ఆ ప్రాంతం పాకిస్తాన్ పరం కావటంతో మన దేశానికి చెందిన భక్తులు సరిహద్దు ప్రాంతానికి వచ్చి బైనాక్యులర్ల ద్వారా గురుద్వారాను దర్శిస్తుంటారు.
ఆ రోజు కూడా చాలామంది భక్తులు బైనాక్యులర్లలో గురుద్వారాను వీక్షిస్తున్నారు. వాళ్లతోపాటు ఆ యువకుడూ బైనాక్యులర్‌లో ప్రయత్నిస్తున్నాడు. అలా మిగతా వాళ్లందరూ దేవుడ్ని వెతుకుతుంటే ఇతను మాత్రం తన దేవతను వెతుకుతున్నాడు...
గాలానికి చేప చిక్కినట్టు బైనాక్యులర్‌కి ఆమె చిక్కింది అక్కడ ఆమె.. నమ్మలేకపోయాడు. లెన్స్ మరింత జూమ్ చేసి నిర్ధారించుకున్నాడు.. ‘య్యా’ అంటూ ఆనందంతో పెద్దగా అరిచాడు. కానీ 2.95 మైళ్ల దూరంలోని ఆమెకు వినపడే అవకాశం లేదు. అప్పుడే లోనికెళ్తుందేమో లెహంగా కొద్దిగా పైకెత్తి నీళ్ల పంపు తిప్పగానే నురగ సమూహంతో నీరు ఆనందంగా ఆమె లేత పాదాన్ని ముద్దాడుతోంది. కళ్లకు అడ్డం పడుతోన్న వెంట్రుకల్ని చెవి మీదుగా సుతారంగా పైకి నెడుతోంది. ఆడపిల్లంటే వాటికీ ఆకర్షణే ఎంత నెట్టినా మళ్లీ అలా అల్లరి చేస్తూనే ఉన్నాయి. వయస్సులో ఉన్న ఆడపిల్ల ఉన్నచోట ఇదొక రొమాంటిక్ సీన్.
గురుద్వారా లోపలికి నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను పండిట్ రవిశంకర్. లోపల బల్ల మీద అతని భార్య విమలాదేవి, పెద్దకూతురు మధులికతోపాటు మరొక యువకుడు ఇంకొందరు బంధువులు వున్నారు.
ఆ రోజు మధులిక నిశ్చితార్థం. ఈ దృశ్యమంతా బైనాక్యులర్ ద్వారా ఈ యువకుడికి స్పష్టంగా కనిపిస్తోంది.
చేతుల నొప్పితో బైనాక్యులర్ కిందికి దించగానే ఒక దేశంలోని దృశ్యం అదృశ్యమయ్యింది. నిట్టూరుస్తూ అతనిట్లా అనుకున్నాడు. ఈ రాత్రి నేనైనా కంచె దాటాలి.. లేదంటే తనైనా అతి త్వరలో కంచె దాటించాలి...
కానీ అతనికి తెలియనిది ఏంటంటే.. దేశ సరిహద్దు ఆంక్షలను మించిన విద్వేషం ఆమె తండ్రి పండిట్ రవిశంకర్‌లో ఉందని, పూర్వీకుల నుంచి వాళ్ల కులం కంచెలో ఆధిపత్యం ప్రవహిస్తోందని.. ఇతను సరిహద్దు కంచె కన్నా అత్యంత ప్రమాదకరమైన కులం కంచెను జయించాలి.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి
కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు
మెయల్‌లో పంపాలి.

శ్రీనివాస్ సూఫీ 93466 11455