S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలోచన.. ఆర్థిక స్థితి

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్ర్తి ఉంటుంది అంటారు. విజయం సాధించిన స్ర్తి వెనుక ఐనా, పురుషుడి వెనక అయినా కచ్చితంగా లాంగ్ విజన్ ఉంటుంది. ఈ రోజు సంపాదించాం, ఈ రోజు అనుభవించాం, ఈ రోజు సుఖంగా గడిచింది అది చాలు ఆనే ఆలోచన ఉన్నవారి జీవితం గొర్రె తోక బెత్తెడు అన్నట్టుగానే ఉంటుంది. అలా కాకుండా దూరదృష్టితో భవిష్యత్తు గురించి ఆలోచించిన వారి జీవితం కచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. సంపన్నుల్లోని ప్రధానమైన లక్షణం దూరదృష్టి.
ఆర్థికంగా విజయం సాధించాలి అంటే దూరదృష్టి అనివార్యం.
మనిషి కంటికి కనిపిస్తారు. ఆలోచన కనిపించదు. కానీ మీరేంటి అనేది కనిపించే మీ కన్నా కంటికి కనిపించని మీ ఆలోచనే మీరు. మీ జీవితం ఎలా ఉండాలి? మీ ఆర్థిక స్థితి ఎలా ఉండాలి అని నిర్ణయించేది మీ ఆలోచనే. పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు మనిషి ఆలోచనలపై పలు పరిశోధనలు చేశారు. సంపన్నులు, పేదల ఆలోచనలకు మధ్య ఉండే అంతరాలపై పరిశోధించిన ఎంతో మంది వారి ఆలోచనలే వారిని తయారు చేస్తాయని తేల్చి చెప్పారు.
పలువురు ఆర్థిక నిపుణులు సంపన్నులు, పేదవారి ఆలోచనల్లో ఉండే తేడాపై దృష్టిసారించి ఆసక్తికరమైన అంశాలను వివరించారు. సంపద పెంచుకోవాలి అనుకునే వారు, సంపన్నులు మెదడుకు ఎక్కువ శ్రమ కల్పిస్తారని తేలింది. వీరిద్దరి మధ్య ఉండే ప్రధానమైన తేడా గురించి వివరిస్తూ ఓ ఆర్థిక నిపుణుడు పలు ఆసక్తికరమైన అంశాలను వివరించారు.
చాలా ఏళ్ల క్రితం నాటి విషయం హైదరాబాద్ నగరంలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఏర్పాటు సభ్యత్వ రుసుం కింద స్వల్పమొత్తం చెల్లించాలి. ఇప్పుడు నేను సభ్యత్వం కింద డబ్బు చెల్లిస్తే నాకు ప్లాట్ అలాట్ అయ్యేది ఎప్పుడో? దాన్ని నేను అనుభవించేది ఎప్పుడో దాని కన్నా ఇప్పటికిప్పుడు నేను ఆ డబ్బుతో మంచి పార్టీ చేసుకుని సంతోషించవచ్చు అని వాదించాడు. అతని వాదన నిజమే.
అంత కన్నా కొనే్నళ్ల ముందు మరో వ్యక్తి జూబ్లీహిల్స్ ప్రాంతంలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలం చూసి ఈ గుట్టలు కొండలు చదును అయ్యేది ఎప్పుడు ఆ ప్లాట్‌లో నేను ఇల్లు కట్టుకునేది ఎప్పుడు అంటూ తన సభ్యత్వ రుసుం వెనక్కి తీసుకుని మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ రోజు మిత్రులతో సంతోషించింది నిజమే.
ఐతే జూబ్లీ హిల్స్‌లో ఈ రోజు గజం ధర లక్షకు పైగానే ఉంది. ఒక్క రోజు మిత్రులతో పాటు మందును త్యాగం చేసి ఉంటే దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ఆ వ్యక్తి చేతిలో ఉండేది.
ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి అప్పటికప్పుడు అతను సంతోషంగా గడిపిన విషయం వాస్తవం.. మిగిలిన సభ్యులకు అతనికీ తేడా ఒకటే అతను నిరీక్షించలేక పోయాడు. మిగిలిన వారు ఫలితం కోసం నిరీక్షించారు.
అలా నిరీక్షించిన వ్యక్తులు ఈ రోజు కోటీశ్వరులుగా మిగిలితే, అప్పటికప్పుడు ప్రయోజనం చూసుకున్న వారు పేదవారిగానే మిగిలిపోయారు. ఇక్కడ పేదలను అవమానించడం, మద్యం అలవాటు గురించి విమర్శించడం కాదు. సంపద సమకూరాలి అంటే నిరీక్షించాలి అనే ఆలోచన ఉండాలి అని చెప్పడమే ఉద్దేశం.
తక్షణ ప్రయోజనం చూసుకునే వారు పేదవారిగా మిగిలిపోతున్నారని, తాము ఒక పని చేపట్టి దాని ప్రయోజనం పొందేందుకు కొంత కాలం వేచి చూడడం సంపన్నులు అయ్యే వారికి ఉండే లక్షణం అని నిపుణులు పలువురు వ్యక్తుల జీవితాలను స్టడీ చేసి తేల్చారు. సాధారణంగా సంపన్నులు ఒక పని చేసి దాని ఫలితం కోసం నాలుగైదేళ్ల నుంచి పదేళ్ల సమయంలో లాభాల కోసం ఎదురు చూస్తారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు. అంబానీల జియో కావచ్చు. తక్షణం లాభం కనిపించక పోవచ్చు కానీ వారు సుదీర్ఘ కాలంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బును, సమయాన్ని పెట్టుబడి పెడతారు. ఏ అంశంలోనైనా తక్షణం నాకేంటి అనే ఆలోచన కాకుండా సుదీర్ఘ కాలంలో కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుబడి పెట్టేవారికి ఓపిక, ఆశావాద దృక్పథం,
శరీరంతో ఎక్కువగా శ్రమించడం కాదు ఆలోచనలను మధించాలి. అప్పుడే సంపద చేరుతుంది. పేదరికంలో మగ్గేవారిలో దూరదృష్టి కనిపించదు. సంపన్నుల్లో సరిగ్గా దీనికి భిన్నమైన ఆలోచనా ధోరణి కనిపిస్తుంది.
మీ ఆలోచనే మిమ్మల్ని సంపన్నులుగా మారుస్తుంది. పేదరికంలో పుట్టడం తప్పేమీ కాదు. కానీ జీవితం అంతా అలానే ఉండిపోవడమే తప్పు. తనకు లభించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నించాలి. ముందు పేద ఆలోచనలను దూరం చేసుకోవాలి. పూర్వజన్మ ఫలం, ఏ జన్మలో ఏం చేశానో, గత జన్మలో చేసిన దానికి ఇప్పుడు పేదరికం అనే చచ్చు ఆలోచనలను చంపేయాలి. సంపన్నులకు ఉన్నట్టుగానే నాకూ రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి, వారికున్నట్టే నాకూ 24 గంటల సమయం ఉంది. తలుచుకుంటే నేనూ జీవితంలో సాధించగలను అనే ఆలోచనలు మొదలైనప్పుడు అవకాశాలు కనిపిస్తాయి.
ధీరూబాయి అంబానీ సంపన్నుల కుటుంబంలో పుట్టలేదు. సామాన్య కుటుంబంలోనే పుట్టినా సంపన్నమైన ఆలోచనతో జీవించారు. అవకాశాల కోసం వెతికారు. చూస్తూ ఉండగానే సంపన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు.
మనం ఎలా ఉండాలో నిరంతరం మన మైండ్‌ను కండీషనింగ్ చేసుకోవచ్చు. ఈ జీవితం ఇంతే పేదరికంలోనే మగ్గిపోవాలి... అంటూ నిరంతరం అలానే అనుకుంటే మన మైండ్ కూడా దానికి తగ్గట్టుగానే తయారవుతుంది. మైండ్‌కు తగ్గట్టే మనం ఉంటాం. అలా కాకుండా మిగిలిన వారిలా నాకూ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
ఏనాటికైనా విజయం సాధిస్తాను. ఇప్పుడున్న స్థితి శాశ్వతం కాదు. ఎదుగుతాను. ఆర్థికంగా మానసికంగా నా ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదిగి చూపిస్తాను అని అనుకుంటూ మైండ్‌ను ఆవిధంగా కండీషనింగ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగానే ఫలితాలు ఉంటాయి.

-బి.మురళి