S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెలుగు నీడల విశ్రాంత జీవితం

సంపాదించడం, పొదుపు, పెట్టుబడి వీటికి సంబంధించిన జ్ఞానమే సరిపోదు. మనుషులు మనస్తత్వాలు కూడా తెలియాలి. డబ్బులకు సంబంధించి దగ్గరి వారిని కూడా ఎంత వరకు విశ్వసించవచ్చు. వారసులకు ఏ విధంగా సంపద ఇవ్వాలి అనే జ్ఞానం కూడా అవసరం. నలుగురితో మాట్లాడినప్పుడు వారి జీవిత అనుభవాలు మనకూ ఉపయోగపడవచ్చు.
***
హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక ఉద్యోగికి సంబంధించిన రెండు అనుభవాలను మిత్రుడు పంచుకున్నాడు. ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉండవచ్చు. ఉన్నా లేకున్నా ఇవి జీవితానికి చాలా ఉపయోగపడే అనుభవాలు
***
చల్లని వెనె్నలలో చక్కని కనె్న సమీపంలో రేడియోలో వినిపించే మధురమైన ఇలాంటి గీతాలు వింటూ. వేడి వేడి టీ తాగుతూ, ఊయలలో ఊగుతూ మిత్రులతో ముచ్చట్లు రిటైర్ మెంట్ అనంతరం జీవితంలో ఇంతకు మించి కోరుకునేది ఏముంటుంది. అదృష్టం అంటే అతనిది కదా? అనిపిస్తుంది కదా? రిటైర్డ్ ఉద్యోగి కూకట్‌పల్లి ప్రాంతంలో దాదాపు మూడు వందల గజాల స్థలంలో ఇళ్లు. చుట్టూ ఖాళీ స్థలం మధ్యలో ఇళ్లు. ఆ ఉద్యోగి రిటైర్ అయిన తరువాత ఇంటి చుట్టూ ఉన్న ఖాళీస్థలంలో తిరిగేవారు. ఇంటి బయట ఉయ్యాల ఏర్పాటు చేసుకుని ఊగుతూ ఉన్న అతన్ని చూసి అదృష్టం అంటే అతనిదే అనిపించేది. ఊయల ఊగుతూ భార్యతో, మిత్రులతో ముచ్చట్టు, పత్రిక చదవడమో, రేడియో వినడమో చేసేవారు. ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి , రిటైర్ ఐన తరువాత ఎవరైనా ఇంతకు మించిన జీవితాన్ని ఏం కోరుకుంటారు. కథ కాదు ఇది నిజమైన పాత్ర జీవిత అనుభవం. అతని వైభవాన్ని మిత్రుడు అనేక సార్లు పంచుకున్నాడు. రిటైర్ మెంట్ జీవితం అలా గడిచిపోయేందుకు మనం ఆలోచించాలి. దానికి తగిన ప్రణాళిక ఇప్పటి నుంచే రూపొందించుకోవాలని అనేక సార్లు చెప్పేవారు.
***
కొంత కాలానికి అతన్ని మరిచిపోయాం. మూడునాలుగేళ్ల తరువాత మిత్రుడు మరోసారి అతని గురించి ప్రస్తావించాడు. రిటైర్ అయిన ఆ వ్యక్తిని కలవడానికి వెళితే అక్కడ అప్పటి ఇల్లు లేదు. ఆ ఉద్యోగి వైభవం లేదు. అక్కడో అపార్ట్‌మెంట్ ప్రత్యక్షమైంది. అపార్ట్‌మెంట్‌లో పైన చిన్న పెంట్ హౌజ్‌లోకి ఆ దంపతుల మకాం మారింది. ముఖంలో అప్పటి కళ లేదు. సంతోషం స్థానంలో ఆ వ్యక్తి ముఖంలో బాధ, ఆక్రోశం కనిపించాయి.
విషయం ఏమంటే అతనికి ఒకే ఒక ఆడపిల్ల. అల్లుడు ఉద్యోగే. మంచి సంబంధం అని పెళ్లి చేశారు. మామ రిటైర్ అయిన తరువాత అల్లుడు కనుల ముందు స్వర్గాన్ని చూపించే ప్లాన్ మామకు వివరించారు. ఇంత ఖరీదైన ప్రాంతంలో ఇంత విలువైన స్థలంలో చిన్న ఇల్లు మాత్రమే ఏం బాగుంటుంది. దీన్ని తీసేసి చక్కని అపార్ట్‌మెంట్ కడదాం. బోలెడు అద్దెలు వస్తాయి. మీ జీవితం మరింత రంగుల మయం అవుతుంది అని కాగితంలోనే ప్లాన్ చూపించారు. అపార్ట్‌మెంట్ కట్టేందుకు మీ వద్ద మిగిలిన డబ్బుతో పాటు నా పేరు మీద ఇంటికి రుణం తీసుకుందామని ప్రతిపాదనలు చేశారు. అంతా బాగానే ఉందనుకున్నారు. పాత ఇంటిని కూల్చేశారు. బ్యాంక్ లోన్ మంజూరైంది. అపార్ట్‌మెంట్ చక చకా పైకి లేచింది.
అప్పుడే అసలు కథ మొదలైంది. బ్యాంకు రుణం మంజూరు కావాలంటే స్థలం అల్లుడి పేరుమీదనే ఉండాలి. కాబట్టి పేరు మారింది. ఇంటి స్థానంలో బిల్డింగ్ లేచింది. బిరబిర మంటూ అద్దెలకు దిగిపోయారు.
మామ గారు బ్యాంకు లోన్ భారంగా మారింది. మీరు కింద ఫ్లాట్‌లో ఉండడం కన్నా పైన పెంట్ హౌజ్‌లో ఉండడం వల్ల అద్దె కలిసి వస్తుంది. బ్యాంకు రుణభారం కొంత తగ్గుతుంది అని అల్లుడు చెప్పిన మాటలకు మామ తలూపక తప్పలేదు. అపార్ట్‌మెంట్ పై భాగంలో పెంట్ హౌజ్‌లోకి ఆ రిటైర్డ్ ఉద్యోగి మకాం మారింది.
ఆనాటి ఉయ్యాల లేదు. ఉయ్యాలలో ఆయన ఊగడం లేదు. బిక్కుబిక్కు మంటూ ఆ దంపతులు పెంట్ హౌజ్‌లో కాలం వెళ్లదీస్తున్నారు.
ఇందులో తప్పేవరిది? తప్పుందా? అంటే ఎవరి వాదన వారికి ఉంటుంది. మామ ఆస్థి చివరకు అమ్మాయి కుటుంబానికే చెందుతుంది కదా? అంత ఖరీదైన స్థలం వృధాగా ఉండడం ఎందుకు బిల్డింగ్ కట్టి అద్దెలకు ఇస్తే తప్పేముంది అనే వాదన కొందరిది. తన కష్టార్జితంతో అతను కొనుక్కున్న ఆ ఇంటిలో విశ్రాంతి జీవితాన్ని అతను ప్రశాంతంగా గడిపే అవకాశం లేకుండా పోయింది అనే వాదన కొందరిది.
తన ఇష్టపూర్వకంగా పిల్లలకు ఆస్తి ఇస్తే అది వేరు. కానీ అద్దెల కోసం ఆ దంపతులను ఓ మూలన పడేయడం బాధాకరం.
అల్లుడు చూపించిన అద్దెల లెక్కలు చూసి అతను కూడా ప్రలోభపడ్డాడు. తన వద్ద ఉన్న డబ్బుతో బిల్డింగ్ నిర్మించే అవకాశం అతనికి ఉంటే వేరు. కానీ అల్లుడి డబ్బుతో నిర్మాణం చేసినప్పుడు ఫలితం ఇలానే ఉంటుందనే అవగాహన అతనికి లేకుండా పోయింది. తన రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలో తానే నిర్ణయించుకోవాలి. దానికి తగిన ప్రణాళిక చేసుకోవాలి. శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించాలి కానీ ఆ దశలోనూ ఇలాంటి ప్రలోభాలు అవసరం లేదు. తాను బతికి ఉన్నంత వరకు తనకు నచ్చినట్టుగా జీవించి, తన తదనంతరం ఆ స్థలం తన వారసులకు చెందేట్టు చేస్తే అతని జీవితం కోరుకున్న విధంగా గడిచేది.కానీ అంతిమ కాలంలో నిరాశలో బతకాల్సి వచ్చింది. రిటైర్‌మెంట్ తరువాత తమ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి ముందు నుంచే సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇతరుల అత్యవసర ఖర్చులు, ప్రలోభాలకు లొంగితే శేష జీవితం దుర్భరంగా మారుతుంది. వయసులో ఉన్నప్పుడు, బాగా సంపాదన ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు, ప్రలోభాలకు గురైనా, సంపాదించుకోవడానికి ఇంకా వయసు ఉందిలే అనే ధీమా ఉంటుంది. కానీ సంపాదన ఆగిపోయి, సంపాదించే వయసు దాటి పోయిన తరువాత ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తట్టుకోలేరు. మీ వయసు ఎంతైనా కావచ్చు. మీకు ఇంకా సంపాదించే వయసు ఎంతైనా ఉండొచ్చు. రిటైర్ అయిన వారితో వారి జీవిత అనుభవాల గురించి మాట్లాడాలి. విజేతల అనుభవాలే కాదు పరాజితుల అనుభవాలు సైతం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి ఆర్థిక సంబంధ వ్యవహారాలపై ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఒకసారి పలకరిస్తే వారికి సంతోషం మనకూ నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు.

-బి.మురళి