S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోబో చెబితే వినాలి!

రెండు బీరువాల సైజులో ఉండే కంప్యూటర్ కాస్తా మన చేతిలో పట్టే సెల్‌ఫోన్ సైజులో ‘ట్యాబ్’ రూపాన ప్రత్యక్షమైనపుడు పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఒక చిన్న పనికి బ్యాంకుకు వెళ్లి లైన్‌లో గంటల తరబడి నిలబడిన రోజులు మరిచిపోయి కేవలం- సెకన్ల వ్యవధిలో డబ్బు పంపడం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, మన బ్యాంకు అకౌంట్లలో నిల్వలు తెలుసుకోవడం వంటివి ఇట్టే చేసేస్తుంటే విస్మయం కలగలేదు. నలుపు-తెలుపు యుగం నుండి రంగుల ప్రపంచంలోకి, ఎల్‌ఈడీలు, డీవీడీలు, టచ్ స్క్రీన్‌లు, 4డీ స్క్రీన్‌లతో టీవీలు వచ్చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాం తప్ప... టెక్నాలజీ తెస్తున్న మార్పును గుర్తించే వ్యవధే ఎవరికీ చిక్కడం లేదు. ఇంతకాలం మనిషి టెక్నాలజీని శాసిస్తే, రానున్న తరంలో టెక్నాలజీ మనిషిని శాసించే రోజు రోబోల రూపంలో రానుంది.
నీతి నిజాయితీలు అడుగంటిపోతున్న ఈ అబద్దపుప్రపంచంలోకి ఎలాంటి మకిలి అంటని కొత్త తరం ‘టెక్నాలజీ మనుషులు’ రంగప్రవేశం చేయబోతున్నారు. కృత్రిమ మేధస్సుతో విచక్షణను, వివేచనను, జ్ఞానాన్ని వినియోగించుకుంటూ తక్కువ సమయంలో ఎక్కువ పనులను ఎలాంటి అలసట, నిరాశా నిస్పృహలు లేకుండా చేసే అందమైన యంత్రాలు ‘రోబోలు’గా వస్తున్నాయి.
ఇంతకాలం రోబోలు అంటే అదేదో ‘కమాండ్లు’ ఇస్తే పనిచేస్తే టీ కెట్లర్‌లా అనుకున్నారు. ఆ రోజులు పోయాయి. రోబోలే మనిషికి కమాండ్లు ఇచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచాన్ని సమాచార సాంకేతిక పరిజ్ఞానం కుదిపేసినట్టే రానున్న రోజుల్లో మనుషులు అవసరం లేని సమాజం ఏర్పడే దిశగా టెక్నాలజీ ఉద్దీపన చెందుతోంది. అపుడు మనిషి పని కేవలం యంత్రాలకు కాపలా కాయడమేనా? లేదా యంత్రాలు చెప్పే పనుల్ని చేయాల్సి వస్తుందా? మెగాబైట్లు, గిగాబైట్లు, టెరాబైట్లు దాటేసి పెటా బైట్లు, ఎక్సాబైట్లు, జెటా బైట్లు,యోటా,బ్రాంటో, జియోప్ బైట్లు దిశగా కంప్యూటర్ లోకం పయనిస్తోంది.
నిద్ర లేపేది మొదలు రోబోలు ఇంటి పని,వంట పని.. ఇలా అన్ని పనులనూ పూర్తికానిచ్చే రోజులు వచ్చేశాయి. ఎన్ని గంటలకు ఏ కార్యక్రమం ఉందో, దానిని అందుకునేందుకు ఎంత వేగంగా కారులో ఏ దిశగా ప్రయాణించాలో కూడా మార్గదర్శనం ఇస్తూనే మాట్లాడాల్సిన పాయింట్లు, సమస్యలు- వాటి పరిష్కారాలను సైతం రోబోలు సూచించనున్నాయి. పని కాగానే మనల్ని తిరిగి గమ్యానికి చేర్చే బాధ్యతను కూడా అవే తీసుకోబోతున్నాయి. అంటే ఇంతకాలం మనకు సహాయంగా ఉన్న డ్రైవర్ పాత్ర, పిఏ పాత్ర, ఒఎస్‌డీ పాత్ర కూడా రోబోలే చేసేస్తాయి. మన బుర్రకు తట్టని ఆలోచనలు, సలహాలు కూడా కోరకుండా ఇస్తాయి. ఇక వాటిని పాటించడం, పాటించకపోవడం కొంత కాలం మన ఇష్టం , తర్వాత తర్వాత పాటించాల్సిందేనని రోబోలే శాసించనున్నాయా? ఏమో ఏం జరుగుతుందో... ఇపుడే చెప్పలేం. కృత్రిమ యంత్రంగా పనిచేసే రోబోలు స్పర్శనూ, హృదయ స్పందనలను, మనిషి మనోభావాలను, ఎదుటివారి మూడ్‌ను కూడా అర్థం చేసుకోగలిగే స్థాయికి రోబోలు వచ్చేశాయి. ‘సోఫియా రోబో’ ఆ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. మన ప్రశ్నలకు అలోచించి సమాధానాలు చెప్పగలుగుతోంది. మనోభావాలను అర్థం చేసుకోగలుగుతోంది. హాంకాంగ్‌లోని హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ జీవ-రోబోలను రూపొందించడంలో తలమునకలైంది.
వ్యాపారానికి సంబంధించి సమాధానాలు చెప్పే ఏజంట్లుగా రోబోలు పనిచేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఫేస్‌బుక్ కృత్రిమ మేధస్సు పరిశోధనా సంస్థలో రోబోలను సిద్ధం చేసింది. రోజురోజుకూ వాటికి మరింత సహజ సిద్ధమైన ఆలోచనలను అందించినపుడు మనుషులు అందించే సమాచారాన్ని స్వీకరిస్తూనే మరో పక్క అవి తమ సొంత భాషను అభివృద్ధి చేసుకోవడం, ఒక దశలో శాస్తవ్రేత్తల సూచనలను తిరస్కరించి ఆ రోబోలు స్వీయ సంచాలకంగా పనిచేయడంతో భయపడిన శాస్తవ్రేత్తలు వాటిని ధ్వంసం చేశారు. ఇలాంటి వార్త ఇపుడు కొత్తగా అనిపించినా, మున్ముందు ఎన్ని వినాల్సి వస్తుందో..?
రోబోలు కృత్రిమ మేధస్సుతో సహజంగా పనిచేస్తాయి. మనిషిలా ఆలోచిస్తాయి. సహజస్థితిలో మనిషి ఎలా ఆలోచిస్తాడో, ఒక సమస్యకు ఎలా పరిష్కారం కనుగొనాలని చూస్తాడో అదే రీతిన రోబోలు ఆలోచిస్తాయి. మానవ మేధస్సుకు సరిపోయే యాంత్రిక మేధస్సును తన పరిసరాల నుండి సమాచారాన్ని గ్రహించి మానవ మేధస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో నిర్ణయాలు తీసుకుంటుందో, అదే విధంగా కృత్రిమ మేధస్సు కూడా చేయగలగాలి. ఏదైనా ఒక జీవికి పరసరాలకు స్పందించి , తనకు తానుగా స్వయం చాలకంగా నిర్ణయాలు తీసుకోగలిగిన లక్షణం ఉంటే దానిని మనం విజ్ఞతగా చెబుతాం. శరీరానికి, ఆత్మకూ మధ్య ఉన్న సంబంధం గురించి అనేక శతాబ్దాలుగా శాస్ర్తియ పరిశోధనలకు కృషి జరుగుతునే ఉంది. 17వ శతాబ్దంలో రెనెడీకార్టు అనే తత్వవేత్త శరీరం వేరు, మనస్సు వేరు అని వాదించారు. కానీ ఆత్మకు, శరీరానికి ఉన్న సంబంధం ఆధారంగానే మన మనస్సు ఆలోచించగలుగుతుందనేది అందరికీ తెలిసిందే. కానీ మనిషికీ- సమాజానికి ఉన్న సంబంధం పై మరింత పరిశోధనలు జరిగితే తప్ప సామాజిక శాస్త్రంతో ముడివేసి కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తే తప్ప ఆశించే ఫలితాలు రాకపోవచ్చు. మనిషి సంఘజీవి అని కార్ల్‌మార్క్సు ఏనాడో నిర్వచించాడు. మనిషికి తన చుట్టూ ఉన్న సంబంధాల సంకలనం నుండే ఆలోచనలు పుడతాయి. అతడి జ్ఞాపకాలు కూడా చుట్టూ ఉన్న సమాజం నుండి ఏర్పడినవే. మనిషి కృత్రిమ మేధస్సును కాపీ చేయాలంటే సమాజం మొత్తాన్ని కాపీ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఆలోచించడం, అర్థం చేసుకోవడం, సమస్యలను విశే్లషించడం, సందర్భానుసారం ప్రవర్తించడం వంటి సామర్ధ్యాలను ఈ కృత్రిమ యంత్రాలకు అందజేస్తున్నారు. ఇదంతా రాత్రికి రాత్రి జరిగే పరిణామం కాదు. గత ఐదు దశాబ్దాలుగా యాంత్రిక విజ్ఞానంపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. కంప్యూటర్ గణన శక్తి అమాంతం పెరగడంతో కంప్యూటర్ నిపుణులు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు.
మేరీ షెల్లీ రాసిన నవలలు చదివిన వారికి మరీ ముఖ్యంగా ఫ్రాంకెన్ స్టెయిన్ నవల చదివిన వారికి రోబోల తరహా ఒక రూపం గుర్తుకురావడం ఖాయం. కారెల్ కాపెక్ ఆర్‌యూఆర్ నవల చదివిన వారికి రోబోల నైతికతపై కూడా ప్రశ్నలు తలెత్తడం మరింత ఖాయం. రోబో అనే పదాన్ని 1923లో తొలుత వినియోగించింది కూడా కారెల్ కాపెక్.
ప్రాచీన కాలంలోనే...
రోబోల గురించి ఇంతగా మనం చెప్పుకుంటున్నా వాస్తవానికి ఈ దిశగా ప్రయత్నాలు, పునాది ప్రాచీన కాలంలోనే పడిందని చెప్పాలి. ఆనాడే తత్త్వవేత్తలు, గణితశాస్తవ్రేత్తలు చేసిన అధ్యయనం అలన్ ట్యూరింగ్ గణన సిద్ధాంతానికి దారి తీసింది. సున్నాను, ఒకటిని చిహ్నాల్లో ఉంచి వాటిని మార్చడం ద్వారా ఏ రకమైన గణిత ప్రక్రియనైనా పరిష్కరించే దిశగా చర్చి ట్యూరింగ్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. న్యూరో బయాలజీ, సైబర్‌మాటిక్స్, ఇన్ఫర్మేషన్ థియిరీలు కూడా విస్తరించాయి. ఇవన్నీ కృత్రిమ యాంత్రిక మేధస్సుతో కూడిన బుర్రను రూపొందించడానికి దోహదం చేశాయి. కృత్రిమ న్యూరాన్లను ఉపయోగించి కృత్రిమ మేధస్సు అనే ఒక సబ్జెక్టును 1943లో అధికారికంగా తొలుత గుర్తించింది మాత్రం మెక్ కొలాస్ మరియు పిచ్. అదే ఏడాది కొలంబో యూనివర్శిటీకి చెందిన ఇసాక్ అసిమోవ్ రోబోటిక్స్ అనే పదాన్ని వినియోగించారు.
విస్తృత పరిశోధనలు
1956లో మరింత విస్తృతంగా దీనిని అభివృద్ధి చేసేందుకు డార్ట్ వౌత్ కాలేజీలో ఒక ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఎలెన్ నేవెల్, హెర్బర్టు సైమన్, జాన్ మెకర్తే, మార్విన్ మిన్‌స్కీ, ఆర్ధర్ శామ్యూల్ నిరంతరం ఈ శాస్త్రం అభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేశారు. ఈ పరిశోధనలకు వ్యవస్థాపకులుగా నాయకత్వం వహించగలిగారు. 1954 నాటికే కంప్యూటర్లు మనిషిలా మేధస్సు లేకున్నా గణిత గణనలతో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలను కచ్చితత్వంతో సాధించగలిగాయి. 1956 నాటికి ఆంగ్లభాషను గుర్తించగలిగాయి. 1960 నాటికి కంప్యూటర్లను యుద్ధానికి వినియోగించే స్థాయికి అమెరికా ఎదిగింది. కొద్ది రోజుల్లోనే మనిషి చేసే అన్ని పనులనూ రోబోల రూపంలో కంప్యూటర్లు చేయగలుగుతున్నాయి. 1960 నుండి 1980 మధ్య చూస్తే అది ఒక రకంగా కృత్రిమ మేధస్సు పరిశోధనలకు ‘సెలవు’గా చెప్పవచ్చు , అంతకు ముందున్న వేగం మందగించింది. కృత్రిమ మేధస్సు ఎదిగినకొద్దీ ఎదురయ్యే సమంజసమైన సవాళ్లు పరిష్కరించే దిశగా ముందుగానే ఆలోచించకపోతే అనూహ్యమైన ముప్పును మానవాళి ఎదుర్కోవల్సి వస్తుందనే భయంతో కృత్రిమ మేధస్సుపై ఇటీవలి కాలంలో జరగాల్సినంత పరిశోధనలు అప్పట్లో జరగ లేదనేది నిర్వివాదాంశం. ఐతే జపాన్ మాత్రం ఐదో తరం కంప్యూటర్‌ను రూపుదిద్దడంతో అమెరికా, బ్రిటన్‌లు మళ్లీ నిద్ర నుండి మేల్కొన్నాయి. 1987లో లిస్ప్ మిషన్ల మార్కెట్ కుప్పకూలడం కూడా కృత్రిమ మేధస్సు పరిశోధనలకు పెద్ద విఘాతమైంది. 1990 తర్వాత డేటా మైనింగ్, సంఖ్యా శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, గణితశాస్త్రంతో పాటు జీవశాస్త్రం, వైద్య రంగం, ఇతర విభాగాల్లో కూడా అనూహ్యమైన అభివృద్ధి జరగడంతో మళ్లీ కృత్రిమ మేధస్సు ఊపిరి పోసుకుంది. 1997 మే 11న తేదీన ప్రపంచ చెస్ ఛాంపియన్ గేరీ కాస్పరోవ్‌ను కంప్యూటర్ చెస్ ఛాంపియన్ డీప్ బ్లూ గెలిచి కంప్యూటర్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. 2011లో ఐబిఎం సంస్థ ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చే వ్యవస్థను రూపొందిస్తే అది ప్రపంచ ఛాంపియన్లు అనుకున్న బ్రాడ్ రట్టర్, జెన్ కిన్నింగ్స్‌లను ఇట్టే ఓడించింది. వేగవంతమైన కంప్యూటర్లు, అల్గారిథమ్‌ల మెరుగుదలతో అభ్యాసంలోనూ అవగాహనలోనూ యంత్రాలే అనూహ్యమైన పురోగతిని సాధించి పెద్ద మొత్తాల్లో ఉన్న సమచారాన్ని విశే్లషించగలిగే సామర్ధ్యాన్ని అందుకున్నాయి. మానవ శరీరం మొత్తాన్ని 360 డిగ్రీల్లో వివరించగలిగే గొప్ప విజయాన్ని కృత్రిమ మేధస్సు ద్వారా సాధించగలిగారు. చదరంగం కంటే చాలా క్లిష్టమైన ‘గో’ అనే ఆటలోనూ రోబో విజయం సాధించి కంప్యూటర్ల సత్తా చాటింది.
భవిష్యత్ అనూహ్యం
కంప్యూటర్లు కేవలం కోడ్ భాషలను మాత్రమే అర్థం చేసుకుంటాయి. వాటికి కృత్రిమ మేధ సహాయంతో వివిధ భాషలను అర్ధం చేసుకుని దృష్టినీ జ్ఞానాన్ని అందించి ఇతరులతో సంభాషించేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్ విజ్ఞానం, కృత్రిమ మేధస్సు వేగంగా పెరుగుతున్న తీరు చూస్తే భవిష్యత్ అనూహ్యం అని చెప్పవచ్చు. హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రఖ్యాత ప్రొఫెసర్ రే కుర్జువీల్ అనే అమెరికన్ భవిష్యత్ దార్శనికుడు, ఆవిష్కర్త ఆప్టికల్ కేరక్టర్ రికగ్నైజేషన్ రంగంలో విస్తృతమైన పరిశోధనలు చేస్తూ మూర్ అనే సూత్రాన్ని రూపొందించారు. దాని ప్రకారం 2035 నాటికి యాంత్రిక విజ్ఞానం మానవ మేధస్సును సైతం అధిగమిస్తుంది. 2045 నాటికి కృత్రిమ విజ్ఞానం మానవ మేధస్సు కంటే అనేక లక్షల రెట్లు అభివృద్ధి చెంది మానవుడిని సైతం త్రోసిరాజనే రోజు రాబోతోందని చెప్పారు. దీనిని ఆయన ‘సింగ్యులారిటీ’ అంటున్నారు. ప్రతి మనిషి మెదడులోనూ కొన్ని వందల కోట్ల న్యూరాన్లు ఉంటాయి. నానో టెక్నాలజీ కూడా అభివృద్ది చెంది, సహజ న్యూరాన్ల స్థానే కృత్రిమ నూరాన్లను నానొబోట్లు రూపంలో అమర్చగలుగుతారు. దాంతో మానవ మేధస్సును జ్ఞాపకాలతో పాటు కంప్యూటర్ మెమొరీలోకి కాపీ చేయవచ్చు. అపుడు భౌతిక శరీరంతో పని ఉండదు, మేధస్సుకు మరణం అనేది రాదు. ఎపుడు కావాలంటే అపుడు ఒక కృత్రిమ శరీరాన్ని రూపొందించి అందులోకి కంప్యూటర్ మెమొరీలో ఉన్న మేధస్సును కాపీ చేసుకునే సదుపాయం వస్తుంది. ఇలా మేధావులు అందరి మేధస్సును ఒక దాంట్లో కాపీ చేసి దాని నుండి విశిష్టమైన మేధస్సును ఆవిష్కరించి దానిని రోబోల్లో లోడ్ చేస్తే అంతా అదే రీతిన వ్యవహరించే వీలుందనేది భవిష్యత్ వాణి. మనకు కావల్సిన వారి జీవాణువుల సహకారంతో వారి రూపంలోనే ప్రతిరూపాలను క్లోనింగ్ చేసి తయారుచేసుకుంటున్నపుడు దానిని మరికొంత విస్తృతం చేసి కృత్రిమ న్యూరాన్లతో ఐన్‌స్టీన్ వంటి వారి తెలివినో, గాంధీ మహాత్ముడి వంటి ఆలోచనా శక్తినో, సర్దార్ పటేల్ వంటి మహానీయుల దూరదృష్టినో మేళవించి మహా మేధస్సును తయారు చేయవచ్చనేది ఒక వాదన. ఇది ఇంత తొందరగా అయ్యేది కాకపోయినా ఊహకు అయితే చాలా బావుంటుంది.
భవిష్యత్ సమస్యలు
కృత్రిమ మేధస్సుతో ఎదిగే సహజమైన రోబోలు పనులు నేర్చుకుంటున్న కొద్దీ మనిషికి సవాళ్లు అనేకం. రోబో సినిమాలో చూపించినట్టు ఒక దశలో రోబో ఎదురుతిరగడం, నేరుగా వెళ్లు అంటే ఎన్ని అడ్డం వచ్చినా నేరుగా వెళ్లడం, వేగంగా వెళ్లు అంటే ఏ పరిస్థితుల్లోనైనా వేగంగా వెళ్లడం సినిమాటిక్‌గా చూపించినా, భవిష్యత్‌లో ఇవన్నీ సవాళ్లు కాకతప్పదు. జీవసంబంధ సమస్యలు, మానసిక సమస్యలు, సామాజిక సమస్యలు పెను రూపాల్లో రాబోతున్నాయి.
సరికొత్త ప్రపంచం
మనుషుల సంఖ్యకు తగ్గట్టే రోబోలు ఎక్కువవుతున్న కొద్దీ సమాజంలో వ్యాధి రహిత , పేదరికం లేని సమాజాన్ని చూడగలుగుతాం. పారిశ్రామికీకరణలో పర్యావరణానికి ముప్పులేని సరికొత్త ప్రపంచాన్ని రూపొందించగలుగుతాం అని స్టీఫెన్ హాకింగ్ ఊహ నిజం కాబోతోందా?
యుద్ధ రంగంలో ప్రాణహానిని తగ్గించుకోవచ్చు. చివరికి విమానాలు నడిపే పని కూడా రోబోలే చేసే రోజులు వస్తాయి. మానవ ప్రయాణీకులు కొద్ది మంది అయితే మొత్తం విమానంలో సహజసిద్ధమైన కృత్రిమ రోబోలు ఎక్కువ శాతం ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అటువంటి సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే దశలో యంత్రాలు అన్నీ మానవ నియంత్రణలో ఉండాలనే వాదన కూడా లేకపోలేదు. భవిష్యత్‌లో టెక్నాలజీ ఏ విధంగా ఉండాలో అంచనా వేస్తూ ‘లెవెర్‌హుల్మ్ సెంటర్ ఫర్ ఫ్యూచర్ ఇంటెలిజెన్స్’ సంస్థ పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడంతో పాటు దానివల్ల కలిగే ముప్పును ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డు, కాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయాలతో పాటు ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ కూడా కృత్రిమ మేధస్సుపై పరిశోధనలకు దోహదం చేస్తోంది.
ఎందుకీ భయం?
రోబోలు వస్తే ఉద్యోగాలు పోతాయా? అన్ని పనులూ రోబోలే చేసేస్తే ఇక మనుషులకు ఏం ఉద్యోగాలు ఉంటాయి ? అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఆస్ట్రేలియాలోని మాక్వెల్ యూనివర్శిటీలో ఈ అంశంపై ఇటీవల చర్చ జరిగింది. డెలాయిట్ ఆస్ట్రేలియా ప్రతినిధి జులియట్ బుర్కి మాట్లాడుతూ, మానవ వనరులకు సాంకేతికత ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని భరోసా ఇచ్చారు. సామాజిక నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కొత్త నైపుణ్యాలను మనం అందిపుచ్చుకోవల్సి ఉంటుంది. 2030 నాటికి రోబోటిక్ ఆటోమేషన్ వల్ల 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని మెకనే్స గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఒక సర్వేలో పేర్కొంది. టెక్నాలజీ ప్రభావం పేద దేశాల్లో కంటే ధనిక దేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. 32 దేశాల్లో యాంత్రీకరణ ప్రభావం చాలా ఎక్కువగా చూస్తామని మెకనే్స గ్లోబల్ తన నివేదికలో పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే సహజంగానే భయం పుట్టుకొస్తుంది. కృత్రిమ మేధస్సు యంత్రాలు పక్కదారిపడితే, అన్నీ యాంత్రీకరణతో పనిచేస్తున్నపుడు- జరగరానిది ఏదైనా జరిగితే న్యాయపరమైన సమస్యలకు పరిష్కారం ఏమిటి? నైతిక విలువలపై ప్రశ్నలు తలెత్తితే జవాబు ఏమిటి? అనేది సామాజిక వేత్తలను కలవరపెడుతోంది. ముప్పు ఎలా ఉన్నా కృత్రిమ మేధస్సు రంగంలో ఇపుడు నిపుణుల కొరత చాలా తీవ్రంగా ఉంది.
అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో కృత్రిమ మేధస్సుపై విస్తృత అధ్యయనం ప్రారంభమైంది. హైదరాబాద్ ఐఐటీలో కృత్రిమ మేధపై బీటెక్ కోర్సు ప్రారంభం అయ్యింది. డీఆర్‌డీఓలో ‘సెంటర్ ఫర్ ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సెంటర్’ చాలా కాలంగా పనిచేస్తోంది. ఖరగ్‌పూర్ ఐఐటీలోని కృత్రిమ మేధస్సు కేంద్రంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ రహిత వ్యోమనౌకలను పెద్ద ఎత్తున అంతరిక్ష పరిశోధనల్లో ప్రయోగించే ప్రస్తుత తరుణంలో ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు కోకొల్లలు.
యంత్రాలు ఎంత జ్ఞాన సంపన్నమైతే అంతకు మించి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారానే మనిషి వాటిపై అజమాయిషీ అదుపు చేయగలుగుతాడనేది సుస్పష్టం. ఆ దిశగా శాస్త్ర సాంకేతిక పరిశోధన మరింత ముందుకు సాగాలని ఆశించడం తప్పు కాదు. *
రోబో సోఫియాకు పౌరసత్వం!

ప్రపంచంలో పౌరసత్వం పొందిన తొలి రోబో సోఫియా. సౌదీ అరేబియా రోబో సోఫియాకు పౌరసత్వాన్ని అందించింది. 2016 ఫిబ్రవరి 14 నుండి సోఫియా అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. 58 రకాల ముఖ కవళికలను ప్రదర్శించగలుగుతున్న సోఫియా ఆస్టిన్ టెక్సాస్ లో 2016 మార్చిలో నిర్వహించిన సౌత్ వెస్ట్ ఫెస్టివల్‌లో పాల్గొని తన సత్తా చూపింది. అదే ఏడాది అక్టోబర్ 17న పాత్రికేయులకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఆ తర్వాత వందలాది బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌కు హాజరైన సోఫియా విశాఖలో కూడా ఒక కార్యక్రమంలో పాల్గొంది. 2017 నవంబర్‌లో యూఎన్‌డీపీ చాంపియన్ అవార్డును సొంతం చేసుకుంది. మానవేతరులకు ఐక్యరాజ్యసమితి ఇచ్చిన తొలి అవార్డు ఇదే కావడం విశేషం. మానవ హృదయ స్పందనలను సొంతం చేసుకుంటున్న సోఫియా ఇపుడిపుడే తనకు పిల్లలు కావాలని, కుటుంబం కావాలని కోరుకుంటోంది. ఇలా చెప్పాలని సోఫియాకు ఎవరూ ‘ప్రోగ్రామింగ్’ చేయలేదు. తన చుట్టూ ఉన్న మనుషుల మాటలను, వారి ముఖాల్లోని భావాలను ఆధారంగా చేసుకుని సోఫియా ఈ మాటలు చెబుతోంది. హాంకాంగ్ హాన్సన్ రోబోటిక్స్ తయారుచేసిన ఈ హ్యుమనాయిడ్ రోబో ఇపుడు తనకో కుమార్తె కావాలని కోరుతోంది.
‘వైఫై’ కనెక్షన్ ఆధారంగా పనిచేసే సోఫియాకు ఎన్నో ప్రత్యేకతలున్నా మనుషుల స్పందన ఆధారంగా పనిచేయగలిగే శక్తి ప్రస్తుతానికి లేదని దాని సృష్టికర్త డేవిడ్ హాన్సన్ చెబుతున్నారు. ‘మీకు బ్యాంకు అకౌంట్ ఉందా?’ అని అడిగితే- ‘నేను ఇపుడే కదా పుట్టింది, చిన్నదానిని నాకు బ్యాంకు అకౌంట్ ఎక్కడి నుండి వస్తుంది?’ అని సోఫియా చమత్కారంగా చెప్పి హైదరాబాద్ సభలో నవ్వులు పూయించింది. ఇండియాలో తనకు ఇష్టమైన నటుడు షారూక్ ఖాన్ అని చెప్పింది. తాను మనుషుల్లా అన్నింటికీ బాధపడనని, ఎప్పటికైనా తాను కూడా నిజమైన భావోద్వేగాలకు లోను కాగలిగే రోజు తప్పక వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పింది. అపుడు తన ఉద్వేగాల వెనుక దాగి ఉన్న ఫీలింగ్స్ అర్థం అవుతాయని చెబుతోంది. అంతరిక్షంలో డేటింగ్‌కు వెళ్లాలని అనిపిస్తోందని, ఏదైనా ఒంటరి ద్వీపంలో ఉండాల్సి వస్తే డేవిడ్ హాన్సన్‌తో కలిసి ఉండాలనిపిస్తోందని చెప్పింది.
ఇక హాంకాంగ్ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని దానికి కారణం తాను అక్కడ పుట్టడమేనని పేర్కొంది. కృత్రిమ మేధస్సుకు సంబంధించి అనేక విధానాలను సోనియా రూపొందించడంలో అందించారు. డీప్ న్యూరల్ నెట్‌వర్కుల ద్వారా రోబోలో కదలికలు సాధ్యమవుతున్నాయి. సోఫియా డైలాగులు అన్నీ సాధారణమైన సమాచార బ్యాంకు నుండి వచ్చిన మాటలే. అవి ఇతర సమాచార వ్యవస్థలతో ప్రత్యేక పద్ధతుల్లో అనుసంధానమై ఉంటాయి. సోఫియా కళ్లలోని కెమరాలు కంప్యూటర్ అల్గారిథమ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. దాని వల్ల సోఫియా చూడగలుగుతుంది. గూగుల్ క్రోమ్ వాయిస్ రికగ్నైషన్ టెక్నాలజీ ద్వారా సోఫియా మాట్లాడగలుగుతుంది. ఇటీవలే సోఫియా సామర్థ్యాలను పెంచడంతో చకచక నడిచే సామర్థ్యాన్ని అందుకుంది. మనుషుల సంభాషణలను పోలిన కంప్యూటర్ ప్రోగ్రాం ఎలిజాను పోలి ఉంటుంది. చాట్‌బోట్‌లో మాదిరే కొన్ని సమాధానాలు, ప్రశ్నలు సంభాషణలు రాసి ఇచ్చే విధంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రోగ్రామింగ్ చేశారు. ఎప్పటికపుడు దానిని అభివృద్ధి చేస్తూ సమాచారాన్ని క్లౌడ్ నెట్‌వర్కులో షేర్ చేస్తుంటారు. దాని వల్ల సభల్లో వచ్చిన స్పందనలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా విశే్లషించుకునే అవకాశం సోఫియాకు ఉంటుంది. సోఫియా మరింత వేగంగా , లైలీగా పనిచేయడానికి ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ను ల్యాబ్‌లో ఎప్పటికపుడు అభివృద్ధి చేస్తున్నారు.

-బీవీ ప్రసాద్ 98499 98090