S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆంధ్రపత్రిక మీదకు మళ్లుతున్న మక్కువ!

ఆనంధవాణి రెండు సంచికలు రెడీగా వున్నాయి. ‘నేను బెజవాడ పోతున్నాను’ అంటే కాళిదాసు సారేమీ అనుకోకపోవచ్చును. ‘పైగా ఇదేమీ ఉద్యోగం కాదుగా’ అన్నది నా మనసు, నాకు ధైర్యం పోస్తూ - ‘తప్పదుగా’ వెళ్లి చెప్పాను.
కాళిదాసుగారు ‘మనకీ ఇక్కడ కొంత ‘గ్యాప్’ వస్తుంది లెండి’ అంటూ, ‘అర్జెంటు అయితే నేను కబురెడతాను లెండి... నో ప్రోబ్లెమ్’ అన్నాడు, అటు, గోడ వైపు తిరుగుతూ.. నాకు అర్థమైంది కొంతవరకూ.. పత్రికని తీసుకురావడం ఎంత కష్టం? ఆనందవాణి లాంటి ‘గ్రేట్ టైటిల్’ (ఇప్పటికీ నా ఉద్దేశం అదే) చాలా చక్కని మంచి పేరు - ఐనా గతి యింతేనా?.. నోరుజారి అన్నాను - నిజానికి నా ఉద్దేశం కూడా మంచిదే... ‘గోయెంకా’ లాంటి పెద్ద శాల్తీ ఆనందవాణిని టేకప్ చేస్తే, బాగుణ్ను - అప్పుడు శ్రీశ్రీ నుంచీ వీరాజీ దాకా ఇక్కడికి వచ్చి పోజులు పెట్టి శ్రమదానం చెయ్యనక్కరలేదు. శ్రీశ్రీలనీ వీరాజీలనీ కూడా పత్రికే ప్రొడ్యూస్ చేసి వుండేది...’ అన్నాను.
నేనింకా, ‘టైటిల్‌ని ఎవరికైనా ఆఫర్ చెయ్యరాదా?’ అని. అన్నానో లేదో - ఆయన కన్నులు ఎఱ్ఱగా చింతనిప్పులులాగు అయిపోయినాయి. అసలే ఎర్రని వెడల్పయిన మొహం ఇంకా కందిపోయింది - నరాలుబ్బాయి కోపంతో.
‘కాళిదాసు కంఠంలో ఊపిరి వుండగా అది జరగదు. ‘ఆనందవాణి’ని కాళిదాసు మాత్రమే పబ్లిష్ చేస్తాడు. మరొకడికి చస్తే ఇవ్వడు. ఈ మాట మరెప్పుడూ అనొద్దు వీరాజీ.. నెవర్ సే దట్ అగైన్’
‘సారీ సార్!’
నా మనసు ఎన్నోసార్లు.. ఆ రాత్రి రైలు బండిలో, మెయిల్ అప్పర్ బెర్త్ మీద ఎక్కి పడుకుని నిద్ర రాక కళ్లు విప్పి చూస్తూ రకరకాల ఆలోచనల ఒత్తిడికి గురి అయ్యాను. అనవసరంగా ఆయనని ‘హర్ట్’ చేశాను. సారీ! కాళిదాసుగారూ! పత్రిక మీద ఇటువంటి ప్రేమ వుండాల్సిందే. సార్! మీ వలే నాకు కూడా ఇలాంటి ఆదర్శం అబ్బాలి! అని పదేపదే అనుకున్నాను.
అంతలో, అయ్యో! ఆంధ్రపత్రిక రాధాకృష్ణ గార్కి చెప్పనే లేదు. ఆయన ఏమనుకుంటాడో? ఇది మరో వ్యధ. అమృతాంజన్ కార్యాలయంలో రాధాకృష్ణగారి గది బాగుండేది. ఆయన యిచ్చే పర్కొలేటర్ కాఫీ లేదా బ్లాక్ టీ వగైరా జ్ఞాపకానికొచ్చాయి.
అట్టి తరి నారాయణ బాబుగారు తాపీగా లెక్చర్ ఇచ్చేవారు. చిక్కని కాఫీ అంటే... గుండు కాఫీ గింజల సెలక్షన్ దగ్గర నుంచీ వాటిని సమంగా, దోరగా వేయించడం ఇంకా అదొక కళ. ఆనక, ఒక ‘కాఫీ మెషీన్’లో (చేత్తో తిప్పే గ్రైండర్) వేసి ‘గుండ’ (పొడి) చేసి, లెక్క ప్రకారం ‘చికరీ’ తెచ్చి కలపాలి. స్ట్రాంగ్ కాఫీ - అంటే, అందులో చింతపిక్క వేస్తే మునగకూడదు. చిక్కని, నీళ్లు కలపని పాలు కలపాలి’
అలా, ఆయన కాఫీ కావ్యం అల్లేస్తూంటే - రాధాకృష్ణ గారనేవాడు - ‘అసలు, కాఫీ కలుపుతూ వుంటే, దూరానికే కమ్మని వాసన వస్తుంది. దానే్న ‘అరోమా’ అంటారు’ అని. ఇలా కాఫీ కబుర్లు తల్చుకుంటూంటే, లుక్కూ మనసు మా అమ్మ మీదికి పరుగులు తీసింది. మా ‘మామ్మ’గారు రెండు రకాల కాఫీ కలిపేది. ఒకటి పెద్దలకి రెండోది పిల్లలకి - ఇది పల్చని ‘టుర్రు’. ఐతే, అమ్మ మాత్రం, అందరికీ ఒకే రకం కాఫీ కలిపి ఇచ్చేది.
మద్రాసులో ‘కాపీ’ హైదరాబాద్‌లో చాయ్ - బెజవాడలో రెండూ పాపులరే’ అనుకుంటూ బెజవాడ ప్లాట్‌ఫామ్ మీదికి దిగేసరికి, ఫెళ్లున ఎండ మొహానికి తగిలింది. తమ్ముడి కోసం కనులు కలయజూశాయి. నవ్వొచ్చింది. వాడు స్టేషన్‌కే రాగలిగితే, నేను తంబుచెట్టి స్ట్రీట్‌లోనే వుండేవాణ్నిగా! అంతా అమెరికన్ ఆసుపత్రి అనడమే గానీ, దాని అసలు పేరు సెయింట్ ఏన్స్ ఆసుపత్రి అని చాలామందికి తెలియదు. అది ప్రసూతి ఆసుపత్రిగా కూడా ప్రసిద్ధి. మా వాడు స్పెషల్ వార్డులో కోలుకుంటున్నాడు. ‘సిస్టర్స్’ అంతా వాడి అభిమానులై (్ఫన్స్) పోయారు. మా రెండో తమ్ముడు బాబ్జీ మా ఇంటి దగ్గర్నుంచి క్యారియర్, ఫ్లాస్కులో కాఫీ తెచ్చి అక్కడ పెట్టి, చిన్నన్నయ్యకి సేవలందించేవాడు. నాకిప్పటికీ ఆ సంగతులే అతి ముచ్చటగా జ్ఞాపకం.
మా వూరు బెజవాడని రైలు పట్టాలు అడ్డంగా చీల్చి పడేశాయి. కృష్ణ కాలువలు నిలువునా చీల్చి పారేశాయ్. అదే మా వూరి ఘనత. ఇంచిపేట నుంచి బందరు కాలువ వొడ్డున వున్న సదరు ఆసుపత్రికి తిన్నగా పోగలిగితే ‘దూరం’ ‘సమయం’ రెండూ ఆదా - కానీ రైలు వంతెన అడ్డు పడిపోయిందిగా... చుట్టూ తిరిగి, ‘లోబ్రిడ్జి’లో నుంచి - ‘నీ ముక్కేదిరా?’ అన్నట్లు తిరిగిపోవాలి. మా రైల్వేస్టేషన్ దేశంలోని అన్ని ‘మూలల’నీ యించక్కా కలుపుతుంది.
దీని ప్లాట్‌ఫామ్స్ వంతెన మాత్రం వూళ్లో జనాల్ని - తూర్పు, పడమరగా ఒన్ టవున్, టూ టవున్‌లుగా విడగొట్టేసింది. ‘్ఫ్లయ్‌ఓవర్లు’ కట్టలేని పాతకాలంలో ఏం చేయగలరు? ఒక లో బ్రిడ్జి (దిగువ రోడ్డు) వేయగలిగారు. అది దాటుతూ వాళ్లు చిన్నన్నయ్యకి నిత్యం క్యారియర్ - అందులోని పదార్థాలు తొణకకుండా, ఒక్క చేత్తో సైకిల్ తోలుతూ వెళ్లేవాడు బాబ్జీ.
మేం పంచ పాండవుల్లా అయిదుగురం; గానీ, రెండో వాడు అర్జునుడు, మూడోవాడు - నాగేశ్వరరావు బాబ్జీ - భీముడు అని చెప్పాలి.
నాన్నగారు మద్రాస్‌కి బదిలీ - నేనటు ఆనర్స్ కోర్సు కోసం వాల్తేరుకి ‘బదిలీ’ అవటంతో మా పెద్దచెల్లి అనసూయకి ముఖ్యంగా చదువు దెబ్బతిన్నది. నకుల, సహదేవులు అనగా నెంబర్ ఫోర్ శ్రీనివాస్, నెంబర్ ఫైవ్ దుర్గాప్రసాద్ (అప్పాజీ)లు. మా గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లోనే ‘స్కూల్ ఫైనల్’ దాటి, మరో క్లాసు ఎక్కువ చదివారు. అంటే అప్పుడు స్కూలు 12వ తరగతి వచ్చింది. దానే్న సెవెన్త్ ఫామ్ అన్నారు. కానీ మా బాబ్జీ - సత్యన్నారాయణ పురం, అంటే టూ టౌన్‌వేపు - ఏ.కే.టి.పి. హైస్కూల్‌లో చేరేడు. రోజూ లోకోషెడ్ మీదుగా షంటింగ్ యార్డ్ దాటడం, వెళ్లడం ‘దినదినగండం’ అన్నట్లుండేది. నేను యింటి పట్టున ఉండటం అవసరం అనిపించింది.
‘యధా మాదిరీగా జీవితం, అదే మాదిరిగా మూషికం’ అని ఆరుద్ర రాసినట్లు తిరిగి బెజవాడలో.. అరవైల్లో మళ్లీ సినీమాల జోరు ఎక్కువైంది. అటు ఆంధ్రజ్యోతి ఏర్పాట్లు, ఇటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జోరు - పత్రిక మాత్రం మద్రాసులోనే వుండిపోయింది. కానీ, గాంధీ నగరం ఏలూరు కాల్వ ఒడ్డున ఐదు రోడ్ల కూడలిలో దుర్గ్భావన్ (అదే ఆంధ్రపత్రిక కార్యాలయం అయింది) కొట్టవచ్చినట్లు హుందాగా కనబడేది. దాని మూల మీద ఓ గదిలో ‘ఆంధ్ర గ్రంథమాల’ షాపు వుండేది. కాకపోతే బ్రహ్మాండమయిన ఆ బిల్డింగు - రాబోయే ఆంధ్రపత్రిక కార్యాలయం అని, అందరికీ తెల్సు. అఫ్‌కోర్స్, ఆ కల నెరవేరడానికి ఐదేళ్లు పట్టింది. సరే, ఆ అయిదేళ్లు నాకు ముఖ్యం అయినాయి. నా జీవితం ముడిపడి వుండటం చేత, ప్లస్ నా జీవితాన్ని ‘మలిమలుపు’ తిప్పిన కాలం అయిన కారణంగా నాకు మరీ ముఖ్యం.
రాధాకృష్ణ గారొస్తే అక్కడే బస కదా. ‘దుర్గాకళా మందిరం వాళ్లదే కదా’ అనుకునేవాళ్లం గొప్పగా.
‘గాంధీనగరంలో దుర్గాకళా మందిరంలో ‘అసెంబ్లీ సమావేశాలు’ పెట్టుకోవచ్చును, ఆంధ్ర రాష్ట్రం గనుక వస్తే’ అనుకునేవాళ్లం పిల్లలం. (ఎంత అమాయకత్వం) బెజవాడ అంటే సినిమా హాల్సూ, హోటల్సూ - అనేవాళ్లంతా. అఫ్‌కోర్స్. దుర్గమ్మ గుడీ, కృష్ణానదీ దీన్నో తీర్థయాత్రా కేంద్రం చేశాయి. చరిత్ర చాలా వుంది మా బెజవాడకి. కానీ లేనిదల్లా జాగ్రఫీయే (ఎండ మాట చెప్పకండి.)
కాకపోతే గాంధీనగర్, గవర్నర్ పేటల్లో - గల్లీ గల్లీకీ - ‘మడత మంచములు అద్దెకివ్వబడును’ అన్న లాడ్జీలుండేవి. ‘మిలిటరీ భోజనం తయార్’ అన్న హోటల్స్, ఆపైన సినిమా హాల్సు - అలంకార్ థియేటర్, ఊర్వశీ కాంప్లెక్స్ - స్పెషల్ అట్రాక్షన్స్. కానీ బెజవాడ అంటే ఏమిటో గర్వంగా వుండేది. అన్ని ప్రాంతాల నుంచీ రైళ్లు వస్తాయి. జనాలు వస్తారు కదా.. భండారు పర్వతాలరావుగారు అంటూండేవాడు - అతను నాకు కాలేజీలో డబుల్ సీనియర్. లిటరరీ ఫ్రెండ్ కూడాను. ‘బెజవాడ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య నగరాల్ని కలిపే ఒకేఒక్క రైల్వే ప్లాట్‌ఫామ్’ అని. కానీ, దిక్కుమాలిన రైళ్లన్నీ అర్ధరాత్రి వస్తాయి. అదే కావచ్చు ఈ వూరు ఒక ‘నైట్‌హాల్ట్ అండ్ టాయిలెట్ సెంటర్’ అవడానికి కారణం - అని తిట్టుకునేవాళ్లం.
అది ‘ఇంటర్‌నెట్’ ఊహాల్లోకి కూడా రాని కాలం. ‘కార్డు ముక్క రాయి... లేదా, కాకిచేత కబురంపు’ రోజులవి. రాధాకృష్ణగారు వస్తున్నారు అన్న వార్తని - ఆంధ్రపత్రిక ఏజెంట్ నిమ్మగడ్డ వేంకట కృష్ణారావు గారి జ్యేష్ట పుత్రుడు బాబూ రాజేంద్రప్రసాద్ ఎలాగో మా ఇల్లు కనుక్కొని కబురు అందజేసేవాడు. ‘బాబుగారు.. బాబుగారు..’ అంటూ శివలెంక రాధాకృష్ణగారి వెంటనే వుండేవాడు అతను ఎప్పుడూ.
రాధాకృష్ణగారు పత్రిక విషయాలు - మానేజ్‌మెంటు వగైరా వ్యవహారాలు సహా క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుంటున్న వేళ అది. వీక్లీకి పూర్తి స్థాయి సంపాదకుడు అయిన సమయమది. ‘అక్కడ మద్రాసు ఆఫీసులో చాలా గందరగోళంగా వుంది. ముందే ముళ్లపూడి, ఆనక నండూరి రామమోహనరావులు వదిలేశారు.’ తూలికా భూషణ్ అనగా బుద్ధవరపు చినకామరాజు (పెదకామరాజు ఎవరో మనకి తెల్దు) జనరల్ మేనేజర్ కుంచితపాదమ్‌తో ‘లీగల్ కుస్తీ పట్టుతున్న వేళ’. వేటూరి సుందరరామ్మూర్తి గారు కేవలం సినిమా పేజీలకే పరిమితం. అలా ఎన్నో సంగతులు దొర్లేవి- మా మాటల మధ్యలో. మద్రాసులోనే, చాలాసార్లు రాధాకృష్ణ గారు - ‘మీరు కెరీర్ జెర్నలిస్ట్ కావాలనుకుంటే వెల్‌కమ్’ అనడం జరిగింది.
‘మా నాన్నగారు బెజవాడకి బదిలీ అయితే ‘బాగుణ్ను’ అని ప్రయత్నాలు చేస్తున్నారు.
రచయితగా బెజవాడలో నాకు చేతినిండా పని దొరికి నేనూ, నాన్నగారూ, అంతా అక్కడే (మద్రాస్‌లో) వుంటే, మా కుటుంబం కోలుకుంటుంది అన్న ఆశ. మద్రాసు మకాం మార్చాలి నేను ఒక్కణ్నే అంటే అది నన్ను స్వార్థపరుణ్ని చేస్తుందన్న భయం.
కథల మీద మొదలుకొని కమ్యూనిస్టుల దాకా అన్నీ రా.కృ.గారూ, నేనూ చర్చించుకునేవాళ్లం. అంతవరకూ ఆయన టెలిఫోన్ నెంబర్ నేనెరుగను. కాని - ఇది నా నంబర్.. మీ తమ్ముడి స్థితీ అదీ సెటిల్ అయ్యాకా, ఈసారి మీరక్కడికి అంటే మద్రాసు వస్తే - గివ్‌మి ఏ రింగ్’ అన్నారాయన.
‘చేత పుస్తకం’ ఒకటి ఎల్లవేళలా ధరించి, కారెక్కంగానే పఠనం మొదలెట్టే రాధాకృష్ణ గారికి - ‘వోడ్‌వుస్’ నవలలు అంటే ఇష్టం అని తెలిసింది గానీ, నాకు మాత్రం.. అది అట్లుండనిండు...
బెజవాడ ‘పాత పుస్తకాల షాపులకి ప్రసిద్ధి. నిజానికి అవి పాత పుస్తకాలు కావు. సెకెండ్ హ్యాండ్ బుక్ షాపులనడమే బెటర్. దుర్గా కళామందిరం నుంచి అటు ఆ దుకాణాల వేపు పోవాలని ఆయన కోరిక. అక్కడ దొరకని ‘రేర్’ బుక్స్ అంటూ వుండవు. కానీ, తనకి కాస్త నామోషీ.
ఇద్దరం కలిసి రెండు మూడు సార్లు వెళ్లాం. ‘నా కాశీ యాత్ర - ఏనుగుల వీరాసామిగారి అతిపాత పుస్తకం ఒకటి దొరికింది. ఏమి హుషారొచ్చిందో మాకు. ఆ సంతోషంలో ‘పద, అమరావతికి’ అన్నాడు డ్రయివర్ రాజుతో.
ఆయన ఈ ‘రాజు’ దుర్గాకళామందిరం డ్రయివరు. ఎన్నో సంవత్సరాలు - డెబ్బైల దాకా - అతనే డ్రయివర్. నాకూ సన్నిహితుడయినాడు. రాధాకృష్ణ గారితో ఎన్నికల టైమ్‌లో మేము టూరు వెళితే - రాజు వస్తేనే వచ్చేవాడు ఎస్.ఆర్.గారు...
అన్నట్లు ఈలోగా డిసెంబర్ - అరవై, పంధొమ్మిదిన మహీధర వారు ఉత్తరం (ఒక చీటీ) పంపారు. ‘బొమ్మన విశ్వనాథంగారు రేపు (20.12.60) రాత్రి 7.30కి మెయిల్‌లో కేరళ వెళ్తున్నారు. స్టేషన్‌కి రమ్మన్నాను. నేను వెడుతున్నా. వేళకు తప్పకుండా స్టేషన్‌కు రా - కలుసుకుందువుగాని, ఆయన్ని’ రామ్మోహన్-
ఈ బొమ్మన విశ్వనాథంగారు 24 పరగణాలలోని బెల్‌ఘోరీలో నివాసం వుంటారు. నా, తొలి మలుపుని, ఆ తర్వాత తమ్ముడు శాస్ర్తీ రాసిన ‘పారిపోయిన బఠాణీ’ని బెంగాలీ భాషలోకి అనువాదం చేసి ప్రకాశకులకు ఇచ్చిన దొడ్డ మనిషి. నిజానికి నేనూహించని మరో ‘షాక్’ ఇది. విశ్వనాథంగారు సాధారణంగా బెంగాలీ కథలు మరాఠీలోకీ - మరాఠీ కథలు బెంగాలీలోకీ అనువాదం చేస్తారుట. ఆయన ‘ఉగ్రవాది’ అంటే నమ్మలేకపోయాను. ఎంత సాత్వికుడో!
రామ్మోహన్ నవ్వేశారు - ‘ఏమిటాయ్? తీవ్రవాది అంటే పౌరాణికాల్లో రాక్షసుల్లాగా కొమ్ములు, కోరలతో వుంటారుటోయ్?’ అన్నారు. ‘నక్షల్‌బరీని - నక్సల్‌బరీ అని ఎందుకు రాయాలి సార్?’ అంటూ మాట మార్చేశాను. అదీ మన పత్రికల వారి మాయ!
నా తొలి మలుపు నవల - అరవై ఒకటిలోనే అక్కడ అచ్చం బెంగాలీ అనువాదంలో పదమూడు వేల కాపీలు అమ్మిందిట. అంత అడ్వాన్సుడా, అక్కడి పాఠకులు? చిత్రమేమిటీ అంటే బొమ్మనగారు అక్కడికి తిరిగి వెళ్లి రిమైండర్ రాసేదాకా, నేను నా అనుమతి పత్రం రాసి పంపలేకపోవడం. అలా వుండేది అప్పటి నా స్పీడు. కానీ, తమ్ముడి రచన ‘పారిపోయిన బఠాణీ’, నా ‘తొలిమలుపూ’ రెండూ ‘నావే’ నన్నట్లు ఆయన పరిచయంలో రాశారు. ఏమైతేనేం? అద్భుతంగా బెంగాలీలోకి అనువాదం చేశారు.
సరే, ఈలోగా మరో చిత్రం జరిగింది. ‘ప్రభ’ని వదిలి ‘జ్యోతి’ని వెలిగించాలి అన్న దీక్షతో, బెజవాడలో బిజీగా కార్యకలాపాలు సాగిస్తున్న నార్ల వేంకటేశ్వర రావుగారిని ఓసారి కలుసుకున్నాను - వారి ఇంట, ఓ గంటన్నర.. నా కూడా మా నాన్నగారు కూడా వచ్చిరు. అది మరీ చిత్రం! అది ఎట్లనినన్..?
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com