S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కనిపించే అక్షరాలు.. వినబడే స్వరాలు

‘మమతన్ మోములు మీదికెత్తుకొని
రోమంథంబు చాలించి హృ
త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి
మురళీ గానామృత శ్రేణి క
ర్ణములంఁ గ్రోలుచు మేతఁ మాని
గళితానందాశ్రులై చిత్రి తో
పతులై గోవులు చూచుచున్నవవిగో
పద్మాక్షీ! వీక్షించితే?
బాగా గమనిస్తే అర్థం కాని మాటలేమీ ఇందులో లేవు.
‘ఓ! కలువ కన్నుల సుందరీ? అవిగో చూడు. ఆవులు మమకారంతో మోరలు పైకెత్తుతున్నాయి. నెమరువేయటం ఆపేశాయి. హృదయకోశంలో కృష్ణుడిని నిలుపుకున్నాయి.
వేణు నాదామృత ధారలను చెవులతో త్రాగుతూ మేతలు మేయడం మానేశాయి. ఆనంద బాష్పాలు విడుస్తున్నాయి. బొమ్మలలాగ కదలక మెదలక నిలబడి శ్రీకృష్ణుడి వైపే చూస్తున్నాయి. పరికించావా? పాలు తాగే దూడలు పాలు త్రాగకుండా, పొదుగు కుమ్మకుండా ఊరికే చన్నులు చప్పరిస్తూ, నిలబడిపోయాయి. శ్రీమత్ భాగవతంలో శ్రీకృష్ణుడి వేణుగానామృతాన్ని ఆలకిస్తూ పులకించిన ప్రకృతిని వర్ణించే సందర్భంలో పోతన లేఖిని నుండి వెలువడిన పద్యరాజమిది.
‘పక్షులు చెట్లకొమ్మలపై చేరి వేణుగానమనే సుధారస ధారలను మనసారా గ్రోలి, మత్తెక్కి అరమోడ్పు కల్లతో చూస్తున్నాయి. కంటికి కనిపించే రూపాన్ని వెలికి వెళ్లనీయకుండా ఆపుకోవడం కోసమా అన్నట్లు, అవి కళ్లు మూసుకునే ఉన్నాయి.
మునీశ్వరులు తపోనిష్టతో ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నాయంటాడు పోతన.
‘నాద సుధారస పానానికి నిజమైన అర్థం’ ఇది.
సంగీతమంటే ప్రాణమనీ, చెవులు కోసుకుంటానంటూ చెప్పే కబుర్లు కాదు. ఒక్కసారి ఆలోచించి చూడండి.
ఆ వేణుగాన లోలుడు అందర్నీ పరవశింపచేస్తూ వేణువుపై పలికించినదంతా ఏమై ఉంటుంది? కచ్చితంగా నాదమయమైన రాగమే అయ్యుండాలి. మత్తులో ముంచేది అదే.
నోరులేని వాద్యానికే అంత శక్తి వుంటే, ఆర్తితో, ఆవేదనతో పాడే గాయకుడి గానానికెంత శక్తి ఉండాలి. రాళ్లు కరిగిపోవా? కానీ, వినగలిగే మనసంటూ వుండాలి. కనగలిగే కళ్లుండాలి. ఈ రెండూ లేని వాళ్ల ముందు పాడే పాట.. అరణ్య రోదనమే. నాదసుఖం లేని గానం పాట వల్ల, అటు పాడేవారికి గానీ ఎదురుగా అచేతనంగా కూర్చుని వినే వారికి గానీ ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
అచేతనా స్థితిలో వుండే వారికి చైతన్యాన్ని కలిగించేది ఈ నాదమే.. అని వైద్యులు నిరూపించిన సంఘటనలు కూడా వున్నాయి.
ప్రతి రాగానికీ రోగాన్ని నయం చేయగలిగే శక్త వుందనే ప్రయోగాలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జనుల మధ్యనే తిరిగి, ఆధ్యాత్మిక క్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది లోకానికి వెలుగు మార్గం చూపించి భగవాన్‌గా పిలువబడే సత్యసాయికి ఇష్టమైనది భజన గానం. అందులోనే ఆయన రమించే వారన్న సంగతి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తకోటికి బాగా తెలుసు.
ఏయే రాగాలు, ఏయే రోగాలు నయం చేస్తాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన సమక్షంలో బాధలన్నీ మరచిపోయేవారు. ప్రేమామృత ధారల్లో తడిసిపోయేవారు -ఇది నా ప్రత్యక్ష అనుభవం.
క్షణికానందం శాశ్వతానందాన్ని ఎప్పుడూ దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. ధ్యానాన్ని పాడుజేస్తుంది. మైకులేమీ లేని రోజుల్లో గొంతెత్తి మైమరచి పాడిన గానగంధర్వులున్నారు. నేటికీ వాళ్లను తలుచుకునే సంగీత రసికులూ వున్నారు.
1935 సంవత్సరం నాటి మాట. మద్రాసు మంచి సంగీతానికి పుటిల్లు. అక్కడ మైలాపూర్‌లో కపాలేశ్వర స్వామి గుడి వుంది. ఆ దేవాలయానికి ఎదురుగా అందమైన కొలను ఒకటి ఉంది. ఆ కొలనుకు నాలుగు ప్రక్కలా తీర్చిదిద్దిన రోడ్లుంటాయి. ఇప్పుడూ వీధులన్నీ కూరగాయల దుకాణాలతో నిండిపోయాయనుకోండి. కానీ ఆ రోజుల్లో ఆ నాలుగు రోడ్ల మీదా నాలుగు విశాలమైన వేదికలు ఏర్పాటు చేసేవారు. కళ్లు జిగేల్‌మని పెట్రోమాక్సు వెలుతురులో ఆ వేదిక మీద నాదస్వర విద్వాంసుడొకాయన ఆశీనుడై, చేతిలో నాదస్వరాన్ని ఎత్తి, రాగాలాపన అందుకునేవాడు. రాత్రి సమయం 9 గంటలు. మొత్తం సునాదంతో వాతావరణం నిండిపోయేది. రాగాలాపన ముగిసి, కీర్తన పూర్తవ్వగానే, మరో వేదికకు చేరేవాడు చుట్టూ వున్న జనం వెర్రిగా, ఆయన వెంటబడి, అక్కడే నిల్చుని వినేవారు.
కాస్సేపటికి మరో వేదికకు చేరేవాడు. ఎంత టైమయిందో, గడియారాల వంక జనం చూసేవారు కాదు. ఒక రాగం పూర్తి కాగానే మరో రాగం విజృంభించి, విశృంఖలంగా వాయించేసి నాలుగో వేదికకు రాగానే మళ్లీ మరో రాగం అందుకుని పూర్తి చేసేసరికి తెల్లవారిపోయేది. చుట్టూ చేరిన సంగీత రసికులు అప్పుడే అయిపోయిందే? అని నిట్టూరుస్తూ వుండగా, ఆ నాద ప్రవాహంలో కలిసిపోయి ఆ కపాలేశ్వరుని సన్నిధికి చేరి, నమస్కరించి వెళ్లిపోయిన ఆ నాదస్వర చక్రవర్తి మరెవ్వరో కాదు.. సంగీత లోకంలో ఒక ధృవతార - తిరువడుదురై రాజరత్నం పిళ్లై.
ఆయన నాదస్వరం ఒక సమ్మోహనాస్త్రం. ఎటువంటి హృదయాన్నైనా వశం చేసుకున్న ‘నాదం’.. ఆయనది. ఆ వేళ విన్నవారి అదృష్టమే అదృష్టం. ఇప్పటికీ ఆనాటి సంఘటనను కథలుగా చెప్ముపకునే సంగీత రసికులను నేనెరుగుదును. ఆ రోజుల్లోనే నాదస్వర వాద్యం గ్రామఫోను రికార్డులుగా విడుదలై సంచలనం సృష్టించిన విద్వాంసుడు. తోడిరాగ విశ్వరూప దర్శనం చేయించిన రాజరత్నం అపారమైన మనోధర్మానికి సాటి మరెవ్వరూ వుండబోరేమో? ఆయన వాయించిన, సింహేంద్ర మధ్యమం, షణ్ముఖప్రియ, రామప్రియ, వాచస్పతి, పంతువరాళి, కల్యాణి వంటి రాగాలెవరు మర్చిపోగలరు? హెచ్‌ఎంవి కంపెనీ వాటిని శాశ్వతం చేసిన పుణ్యం వల్ల ఆయన సంగీత రసికుల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోయాడు.
ఆయన సృష్టించిన రాగ సముద్రంలో ఓలలాడుతూ మునకలు వేసిన సంగీత రసికుల సంఖ్య అనంతం. సుస్వరంతో నిండిన ఆ సునాదం కోసం సునామీలా గుమిగూడి బాగా విన్న ఆ అలవాటే దక్షిణాదిలో బాగా స్థిరమై నిలిచి సంప్రదాయ సంగీతాసక్తిని పెంచేసింది. మన దేశంలో ఇదే పెద్ద లోపం. కేవలం వివాహాది శుభకార్యాలకు మాత్రమే మంగళవాద్యంగా తెలిసిన ఈ నాదస్వరాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకుపోయిన ఘనత రాజరత్నందే.
వినీ విననట్లుగా వుంటూ, చూసీ చూడనట్లుగా వుండే పెళ్లి తంతులో ఆ కాసేపు అరుదుగా వినిపించే నాదస్వరానికి సంగీత కచేరీ స్థాయిని కల్పించినవాడు కూడా ఆయనే. అందుకే నాదస్వరమూ రాజరత్నమూ వేరు కాదు.. రెండూ ఒకటే.
నాదస్వర వాద్యం తెలిసిన విద్వాంసులెందరున్నా ‘నాదస్వర చక్రవర్తి’ మాత్రం రాజరత్నమే.
*

- మల్లాది సూరిబాబు 90527 65490