S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వానపాము

ఉలిక్కిపడ్డారంతా!
‘నేనన్నది, మీరు విన్నది.. అక్షరాలా నిజం..’ ముసిముసిగా నవ్వుతూ అయ్యగారు చెప్పిన మాటలకు.
అయ్యగారంటే జిల్లా స్థాయిలో కీలకమైన శాఖకు అధికారి. అయ్యగారు ఈ జిల్లాకు వచ్చిన ఉద్యోగ కాలం పూర్తి కావచ్చింది. నేడో రేపో బదిలీపై తప్పనిసరిగా వెళ్లాలి.
‘వెళ్లే ముందు ఘన సన్మానం చేసి నా కోరిక తీర్చండి’ అక్కడి వారి ఉలికిపాటుకి కారణమైన మాటల్ని మరోసారి వాళ్లకు వీనులవిందు చేశాడు.
‘నాకు సన్మానం చేయండి మొర్రో!’ అని సిగ్గు విడిచి నోరు తెరిచి అడిగిన ఉద్యోగి వాళ్లకి తెలిసి చరిత్ర పుటల్లో ఎక్కడా దాగిలేరు.
ఆయన గదిలో చాలా వినయంగా చేతులు కట్టుకొని మరీ వీలైనంత వొదిగిపోతూ నిలబడి ఉన్నారతడి సహచర గణం.
‘ఏం జరిగినా బదిలీ ఉత్తర్వులు చేతిలో పడక ముందే.. వీడ్కోలు సన్మానం బహు పసందుగా జరిగిపోవాలి..’ హిహి అంటూ థర్టీటు స్టార్స్ బయటపెట్టాడు.
బాస్ ఆజ్ఞకి భక్తిపూర్వకంగా తలలూపుతూ ‘తమకి ఆమ్యామ్యాలలో వాటా కల్పించిన సదరు అయ్యగారికి ఇలా కృతజ్ఞత చూపకపోతే ఎట్లా? సంసిద్ధమయ్యిందా విధేయ గణం.
‘వీలైనంత ఘనంగా జరపాలి’ బట్టగుండుని ఆప్యాయంగా నిమురుకుంటూ ఘనం పదాన్ని ఒత్తి పలికాడు.
ఏకకంఠంతో, ‘అలాగలాగే’ అంటూ భజన చేశారు.
బదిలీ అవుతూ కూడా వీలైనంత వెనకేసుకోవాలన్న మురికి ఆలోచన ఆ అధికారి శంకరయ్యది. గిట్టని వాళ్లు ‘వంకరయ్య’ అంటారు. నేమ్‌ప్లేట్‌లో అధికారి బదులు ‘అవినీతి’ ఉంటే బాగుండునని వ్యవహారం నచ్చని వాళ్ల అభియోగం.
‘సార్! చిన్న విషయం...’ గొణిగాడు అరుణ్.
‘పర్లేదు చెప్పు’
‘మీరు గమనించినట్టు లేదు. ‘మూడు కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్ లాగ మా ముగ్గురితోపాటు ఈ గోపాలం కూడా ప్లస్సయ్యాడు’ కట్టుకున్న చేతుల్ని విడవకుండా మోచేత్తోనే గోపాలాన్ని బాస్‌కి చూపాడు అరుణ్.
గినె్నలు తోనే ప్లాస్టిక్ పీచులాగ ఫేసు పెట్టి బాస్ వంక చూశాడు గోపాలం.
‘దివ్యాంగుల స్థారుూ నిర్ధారణ శిబిరాల్లో అక్రమాలు జరిగాయని.. గతంలో నాపై అధికారులకు కంప్లయింటిచ్చావు. ఏం జరిగిందయ్యా గోపాలం? నన్ను ఉతికేసారా? నీకు శాలువా కప్పేశారా?’ అయ్యగారు ఆ ప్రస్తావన తెస్తాడని ఊహించని గోపాలం డిపాజిట్టు గల్లంతయిన నాయకుడిలా విలవిల్లాడాడు.
‘పైగా ద్విచక్ర వాహన మొకటి నాకు బహుమతిగా ముట్టిందని తెగ టాంటాం చేశావు? ఏవీ అవలేదు కదా!’ అడుగుతూంటే పిల్లి కంటపడిన ఎలుకలా బిర్రబిగుసుకు పోయాడు.
‘అధికారులకు ‘అడ్డం’ పడతారుటయ్యా ఎవరైనా? ‘అండ’గా వుండాలి గానీ! ఆ రోజు అలా ఎదురు తిరగకపోతే.. నీ వాటాగా మీ చంటాడికో సైకిల్ దక్కేది కదా!..’ అంటూ ఆయన మీసాలు తిప్పుకుంటూంటే.. పిల్లి తమాషాగా మీసాలు తిప్పుకున్నట్లనిపించింది సదరు గోపాలానికి.
కిసుక్కున నవ్వాడు.
‘మన పక్షాన నిలిచాడు కదా! గతం గతః వదిలేయండి సార్!’ ఈసారి సంపత్ సపోర్ట్ చేశాడు గోపాలానికి.
అయ్యగారు వదిలిపెట్టలేదు.
‘ఎవరికైనా అవసరాలుంటాయ్! జీతం రాళ్లతో పొయ్యి వెలిగించుకోవాలంటే ఉద్యోగులకు కుదిరే పనేనా? అయినా పిల్లి ఎలుకల్ని వేటాడ్డం సహజమే! కానీ, ఎలుకే పిల్లిని భయపెట్టాలనుకుంటే ఎలాగోయ్!’ అంటూ వెట‘కారం’ జల్లాడు.
‘ఏటికి ఎదురీదకూడదని ఇప్పటికైనా తెలిసినట్టుంది. నొక్కిన అతడి ప్రమోషన్ కాగితానికి మీరు వెళ్లేలోగానైనా రెక్కలు కట్టండి సార్!’ గోపాలం ఈ శిబిరంలో చేరడానికి వెనకున్న అసలు కారణం బయటపెట్టాడు మహేష్.
అరుణ్, సంపత్, మహేష్‌లు మురికి శంకరయ్యతో కూడి ‘అవినీతి చతుష్టయం’గా పేరొందారు.
గోపాలం ‘ఆంటీ వైరస్’గా మారడంతో అందరిలో సీనియర్ అయిన గోపాలం ప్రమోషన్ ఫైల్ నొక్కేశాడు శంకరయ్య.
‘గోపాలం ‘పంచ’ముడి’గా వచ్చాడుగా! చూద్దాంలే..’ నాయకులు అయిదేళ్లకొకసారి ఇచ్చే వాగ్దానంలా భరోసా ఇచ్చాడు వంకరగా నవ్వుతూ శంకరయ్య.
‘చిత్తం చిత్తం!’ వంత పాడుతూ రంగం సిద్ధం చేసుకోవడానికి గది నుండి గభాల్న బయటపడ్డారు.
* * *
అయ్యగారికి నజరానా సమర్పించుకోవడానికి అనుచర గణం తక్షణం వసూళ్ల పర్వానికి తెరలేపారు.
శంకరయ్య ఆఫీసులో పలు అవకతవకలు జరుగుతున్నట్లు సిబ్బందిపై పలు ఆరోపణలున్నాయి. (ఇవి శంకరయ్య ముందస్తు జాగ్రత్తగా సృష్టించినవే.)
ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని.. వేటు నుండి తప్పించేస్తానని శంకరయ్య గారి నుండి అనుచర గణం ద్వారా సంకేతాలందాయి. దాంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనుచర గణమేమో వాళ్ల నుండి వీడ్కోలు కానుకల పేరిట డబ్బు గుంజేశారు. అయ్యగారి పేర బ్యాంకులో చేరవేశారు.
అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగితే.. అందులో మజా ఏముంటుంది?
సొమ్మంతా భారీ ఎత్తున బ్యాంకులో జమ అయ్యాక, అయ్యగారు ఓ ఆటంబాంబు పేల్చాడు! ఆయన పెట్టిన ఫిట్టింగ్‌కి అనుచర గణం అదిరిపడ్డారు!
ఆ వైనమేమంటే...
* * *
శంకరయ్యకి ఈ త్రయం ఎనలేని సహకార మందించింది. అక్షయ పాత్రకే బాపు లాంటి ఈ జిల్లాను వదిలి వెళ్లాలనిపించడం లేదా ఆఫీసర్‌కు. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాడు.
శంకరయ్య వెలిబుచ్చిన గొంతెమ్మ కోరికకు అవినీతి త్రయంతో పాటుగా గోపాలానికి కళ్లు బైర్లు కమ్మినయ్.
అదేమిటంటే-
* * *
‘మిమ్మల్ని వదిలి బదిలీ కావాలన్పించడం లేదు’ అంటూ పాలుతాగే పిల్లోడిలా బుంగమూతి పెట్టాడు.
మొదట వెర్రిపప్పల బుర్రలకు ఎక్కలేదా మేటర్.
‘నన్ను ట్రాన్స్‌ఫర్ చేయకుండా ఆపేయమని కలెక్టర్‌గారికి విన్నపం చేసుకోవాలి..’ అంటూ ఆ గరంగరం గుండెలపై ఓ ఎగ్ ఆమ్లెట్ వేశాడు.
బిక్కచచ్చిపోయారు పాపం పసివాళ్లు!
‘నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోవాలి’
కలుగులోకి వచ్చిన ఎలుక కదలక మానదు.. అన్నట్టు, అందరూ సరేనన్నట్టు తలలూపారు.
* * *
అనుచర గణం సుదీర్ఘంగా.. పంచవర్ష ప్రణాళికలంత సుదీర్ఘంగా.. త్రివర్ష ప్రణాళికలు తయారుచేశారు.
ఆపరేషన్ నెంబర్‌వన్...
తమ నలుగురి సంతకాలతో జిల్లా కలెక్టర్ గారికి అభ్యర్థన పూర్వకంగా ఒక వినతిపత్రం సమర్పించడం.
మరి ఇది వికటిస్తే?
ప్లాన్ టూ-
తమ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అందరు ఉద్యోగస్థులతో సామూహికంగా సంతకాలు చేయించి.. విన్నవించడం.
మరి ఈ మందు పనే్జయకపోతే?
ప్లాన్ త్రీ-
ప్రస్తుతానికి ఏమీ అనుకోకుండానే.. వాయిదా వేశారు.
ఎటొచ్చి అయ్యగారి అనుజ్ఞానుసారం.. బదిలీ ప్రక్రియ ఆపాలన్నదే ఆ నమ్మకబంటుల సంకల్పం.
* * *
అనుకున్నట్టుగానే శంకరయ్యగారి బదిలీని ఆపాలన్న వినతిపత్రాన్ని.. నలుగురూ తమతమ సంతకాలతో.. జిల్లా కలెక్టర్‌కి సమర్పించారు.
అచ్చూసిన శంకరయ్యగారు ‘మీ వేడుకోలు తప్పక నా వీడుకోలుని ఆపే ఆయుధమవుతుందని’ తెగ మురిసిపోయాడు.
కథ అన్నాక మలుపులుండాలి.
అప్పుడే యమ పసందుగా ఉంటుంది!!
అందుకే...
ఇక్కడో ఊహించని చిన్న కుదుపు-
* * *
నెంబర్ వన్-
వారి వింత అభ్యర్థనను మన్నిస్తూ.. అయ్యగారు మరి కొంతకాలం విధుల్లో కొనసాగాలనే తీపి కబురు అందాలి.
లేదా..
నెంబర్ టూ-
ఏకంగా బదిలీ చేస్తున్నట్టేనా ఆర్డర్స్ వెలువడాలి.
ఈ రెండింటిలో ఏదైనా ఒకటి జరగాలన్నది అనుచర గణం ఊహ.
అనూహ్యంగా.. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు.. గేరు తారుమారయ్యింది.
ఫలితం పల్టీ కొట్టింది. పథకం పక్కా బొక్కబోర్లా పడింది.
శంకరయ్య షాకయ్యాడు!
‘విషయం’ కాస్తా ‘విషం’ అయ్యింది శంకరయ్యకు. కక్కలేక మింగలేక నోట్లో గుడ్డ కుక్కుకొని కూలబడ్డాడు ఛెయిర్‌లో.
అసలు విషయమేమిటంటే...
అయ్యగారికి ఏకంగా ఉద్యోగం నుండి ఊడే ఆర్డర్స్ వచ్చాయి! సస్పెండ్ అయ్యాడు.
శంకరయ్య విషయం తెలిసినప్పటి నుండి నిలువెల్లా వణికిపోతున్నాడు. రిటైర్మెంట్ టైంలో ఈ రిమార్క్ ఏంటని!
పరపతి పాయె.. ఉద్యోగానికి ఎసరాయె.
హతోస్మి!
* * *
ఈ కథకి ఇంతటితో శుభం కార్డ్ పడలేదు.
మరో మాంఛి కుదుపుందండోయ్!
అవినీతికి పాల్పడే వాడెవడైనా ఇతరులను గుడ్డిగా నమ్మనట్టే.. ఇక్కడ శంకరయ్య అంతే...! కీడెంచి మేలెంచే రకం.
గోపాలం ఇప్పుడొచ్చి ఈ అవినీతి మూకతో కలిశాడు గానీ.. అయ్యగారు తన అనుచర మూషిక త్రయం మీద ఎప్పుడో మార్జాలపు కన్నువేశాడు.
అందుకే పరిస్థితులు చెడి.. తన కాలికి తాడుకట్టి వాళ్లులాగే సమయాన, తనతోపాటు వాళ్లు కూడా గోతిలో పడాలన్న తలంపుతో.. తాడు రెండో చివరిని త్రయానికి బిగించేసి ఉంచాడు.
అందుకే ఇప్పుడొచ్చిన ఊస్టింగ్ ఆర్డర్స్ ఒక్క శంకరయ్యకే కాదు.. వీళ్ల ముగ్గురికి కూడా అందాయి. అదన్న మాట కొసమెరుపు.
కుడితిలో పడ్డ ఎలుకల్లా గింజుకున్నారు!
ఇది సరే... ప్రతి కథకు ఓ కథానాయకుడుండటం రివాజు.
మరి ఈ కథలోని పలు మలుపుల నాటకానికి.. అసలు సూత్రధారి మన గోపాలం అన్నమాట...!
* * *
కథానాయకుడు గోపాలం తన చేతులకు మట్టి అంటకుండా ఇక్కడో సేఫ్ గేమ్ ప్లే చేశాడు.
ఆ గేమ్ ఏంటంటే-
ఎవరెవరి దగ్గర ఈ త్రయం (ప్లస్ తను) ఎంతెంత రొక్కం వసూలు చేసింది.. నయాపైసల్తో సహా చిట్టా తయారుచేశాడు.
‘మేం అయ్యగారికి లెక్కలు చూపాలి. పైగా మీరెంతెంత ఇచ్చారో.. వివరాలు తన దగ్గర ఉండాలన్నారు’ అంటూ ఒంటరిగా వెళ్లి అందరి దగ్గరా డబ్బిచ్చినట్టు సంతకాలు తీసుకున్నాడు. రసీదులిచ్చి మరీ సంతకాలు తీసుకొని డూప్లికేట్స్ తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ అవకాశం కోసమే ప్రత్యర్థుల జట్టులో దూరాడు మరి!
శంకరయ్యపై బోలెడు ఆరోపణలు ఉండడం.. ఈయనని సమర్థిస్తూ ‘మా అయ్యగారిని బదిలీ చేయకండి’ అని విచిత్రంగా విన్నపం రావడం.. జిల్లా కలెక్టర్ ఇందులో ఏదో తిరకాసుందని గ్రహించాడు.
పైగా గోపాలం సేకరించిన రసీదులకి, శంకరయ్య అకౌంట్‌లో పడిన ఎవౌంట్‌కి లెక్క సరిపోయింది!
ఉద్యోగులందర్ని విడివిడిగా విచారించిన పిదప... ఆ కమిటీ జిల్లా కలెక్టర్‌కు అందించిన రిపోర్టు ఫలితమే...
ఆ నలుగురి ఉద్యోగాల ఊస్టింగ్!
వానపాము తాను పైకి కనపడకుండా మట్టిలో దాగి ఉంటూ.. నేలను సారవంతం చేయడానికి నడుం బిగించినట్టు...
గోపాలం కొత్త పంథాలో అవినీతి పరులతోనే కలిసిపోయినట్టు నటించి.. ఆ అవినీతినే అంతం చేయడానికి పూనుకున్నాడు...!
* * *
లంచగొండిగా తిమింగలమంత పరిమాణానికి పెరిగిన ఆఫీసర్ని ప్లస్ అనుచర గణాన్ని పట్టివ్వడానికి.. తానొక ఎరగా వానపామై ఉపయోగపడినందుకు గోపాలం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు.
‘వీడుకోలు’కు ఘనంగా ఆశపడ్డ లంచగొండి అధికారికి.. ఏకంగా ఉద్యోగం నుండే ఉద్వాసన పలికిన విషాదమిది.
‘ఉపకారికి ఉపకారమే జరుగుతుంది’ అనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ నానుడికి ప్రతీకగా.. మన కథానాయకుడు గోపాలం పదోన్నతి పొందడంతో,, కథ ఇలా భలేగా సుఖాంతమైంది సుమా!
*
-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055
==================================================================
*కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయిల్‌లో పంపాలి.