S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పదకొండేళ్ల పగ (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

బస్ దిగి ఇంటికి నడిచి వస్తున్న ఆమెని ఓ కొత్త వ్యక్తి పలకరించాడు.
‘హలో మేరియా! నేను గుర్తున్నానా?’
ఆమె ఆగి అతని వంక చూసి తల అడ్డంగా ఊపింది.
‘మీతో మాట్లాడాలి’
‘దేని గురించి?’
‘నేను గుర్తున్నానా? నా వంక సరిగ్గా చూసి చెప్పండి’
‘సారీ. గుర్తు లేదు’
‘పదకొండేళ్ల క్రితం మీరు నన్ను చూశారు’
‘అది చాలా ఏళ్ల క్రితం. ఏ సందర్భంలో కలిశాం?’ మేరియా ప్రశ్నించింది.
‘మీరు నా జీవితాన్ని పూర్తిగా మార్చిన సందర్భంలో’
మేరియా అతని వంక చిత్రంగా చూసింది.
‘మీ జీవితాన్ని పూర్తిగా మార్చిన సందర్భంలోనా? అలాంటిదేం నేను చేయలేదే?’
అతని మొహం ఆవేశంతో ఎర్రబడడం గమనించింది.
‘నా పూర్తి జీవితాన్ని మార్చేశారు. మీకు పామర్ పేరు గుర్తుందా?’
‘పామర్? లేదు. సారీ’
‘మీరు నన్ను జడ్జి చేసిన సందర్భం కూడా గుర్తు లేదా?’
‘మిమ్మల్ని జడ్జి చేశానా? నేనా?’
‘అవును. చేసి, నా జీవితాన్ని అథోగతి పాలు చేశారు’
‘అయాంసారీ. మీరు పొరపడ్డారు. ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నారో?’
‘ఆగండి. నన్ను చూడండి. నేను నిజంగా గుర్తు రాలేదా?’ పామర్ క్రోథంగా ప్రశ్నించాడు.
‘ఎన్నిసార్లు ఆ ప్రశ్న వేస్తారు? అడ్డులెండి. నన్ను వెళ్లనీండి’
‘నేను ప్రతీకారం తీర్చుకోడానికి వచ్చాను’
వాళ్లిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆమె చటుక్కున లేచి తన క్లబ్ ఆఫీస్ గదిలోంచి పారిపోయే ప్రయత్నం చేసింది. కాని పామర్ ఆమెని వెనక నించి పొదివి పట్టుకుని కుడిచేత్తో కత్తిని ఆమె పొత్తి కడుపులో రెండుసార్లు దింపాడు. నాలుగైదు నిమిషాల్లో ఆమె ప్రాణం పోయేలోగా ఎవరూ ఆ సందులోకి రాలేదు. ఈలోగా పామర్ మెయిన్‌రోడ్ మీది రద్దీలో కలిసిపోయాడు.
* * *
‘మీరు గ్లోరియా కదా? నేను లెఫ్టినెంట్ ఛార్లెస్‌ని’
తలుపు తెరిచిన ఆవిడ ఆ పోలీస్ ఆఫీసర్‌ని లోపలికి ఆహ్వానించి అడిగింది.
‘మేరియా హత్య గురించి ప్రశ్నించడానికి వచ్చారా?’
‘అవును. మీది మేరియా పక్కిల్లే. ఆమెని ఎవరు చంపారో చెప్పగలరా?’ ఛార్లెస్ ప్రశ్నించాడు.
‘ఇంకెవరు? ఆమె భర్త’
‘మీకు ఎలా తెలుసు?’
‘మా ఇంటి గోడలు కార్డుబోర్డుతో చేసారనుకుంటా. అన్నీ వినపడతాయి. తరచూ పోట్లాడుకుంటూంటారు. ఆమె రాత్రిళ్లు మగాళ్ల మధ్య పని చేస్తుంది. అది అతనికి ఇష్టం లేదు. రెండు, మూడు రోజుల క్రితం ఆ ఉద్యోగం మానెయ్యకపోతే చంపేస్తానని అతను బెదిరించడం విన్నాను’
* * *
‘నేను నా భార్యని చంపలేదు’ మేరియా భర్త కార్లోస్ చెప్పాడు.
‘మీరు తరచూ పోట్లాడుకునేవారని తెలిసింది’ లెఫ్టినెంట్ ఛార్లెస్ అడిగాడు.
‘దంపతుల మధ్య అది సహజం’
‘కాని ఉద్యోగం మానేయకపోతే చంపుతానని ఏ భర్తా భార్యతో చెప్పడు. నిన్న రాత్రి హత్యా సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు?’
‘ఇంట్లో నిద్రపోతున్నాను. పోలీసులు వచ్చి నిద్ర లేపితే కాని మేరియా చంపబడిందని నాకు తెలీదు’
‘అంటే మీకు ఎలిబీ లేదన్నమాటేగా?’
‘దేనికి ఎలిబీ? నేను బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకునే మూర్ఖుడ్నా? క్యూబా నించి పనె్నండేళ్ల క్రితం మేం అమెరికాకి వలస రాక మునుపు నా దేశంలో నేను ధనవంతుడ్ని. కాని ఆ డబ్బుని వెంట తెచ్చుకోడానికి మా దేశం అనుమతి ఇవ్వలేదు. నాకు ఏ పనీ రాదు. మేరియా సలహా మీద వృత్తి విద్యని ఇక్కడ అభ్యసించి సంపాదిస్తున్నాను. నా సంపాదనకి నా భార్య జీతం నాలుగు రెట్లు అధికం. ఇప్పుడు నా సంపాదనతో నేను జీవించడం చాలా కష్టం’ కార్లోస్ బాధగా చెప్పాడు.
‘ఆవేశంలో ఇవన్నీ ఆలోచించరు. తర్వాత తీరిగ్గా బాధ పడతారు. మేరియాకి ఒక్క శత్రువూ లేరని మా విచారణలో తెలిసింది. సర్కమస్టేన్షియల్ ఎవిడెన్స్ మీ వైపే చూపిస్తోంది’
‘ఐతే ననే్నం చేయమంటారు?’
‘మంచి లాయర్ని కుదుర్చుకోమని నా సలహా’ లెఫ్టినెంట్ సూచించాడు.
* * *
బ్రిడ్జ్ ఆట నేర్పే స్కూల్‌ని నడిపే ఎలిజబెత్ అతనితో చెప్పింది.
‘ఈ అప్లికేషన్ ఫాం మీద సంతకం చేసి వంద డాలర్లని చెల్లించండి. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’
‘కాని మీరు నన్ను ఇదివరకే కలిసారు’
‘మనం ఇదివరకు కలిసామా? సారీ. నాకు గుర్తు లేదు’ ఎలిజబెత్ చెప్పింది.
‘పదకొండేళ్ల క్రితం కలిసాం’
‘అది ఇంకో ప్రపంచం’
‘అవును. నా జీవితాన్ని మార్చేసిన ప్రపంచం’
‘ఓ! వంద డాలర్లు ఇస్తారా?’
‘పామర్ పేరు మీకు గుర్తు లేదా?’
‘పామర్? ఉహు. నాకు గుర్తు లేదు’
‘పదకొండేళ్ల క్రితం మనం ఓ హాల్‌లో కలిసాం. బేండ్ మేళం... లైట్లు.. ప్రేక్షకులు.. గుర్తుకి వచ్చిందా?’
‘సారీ. మీరు పొరబడ్డారు. అది నేను కాదు’
‘మీరే ఎలిజబెత్. నా జీవితపథానే్న మీరు మార్చేసారన్న సంగతి అప్పుడే మర్చిపోయారా? పామర్ పేరు గుర్తు లేదా? నా మొహంలోకి నిశితంగా చూసి గుర్తు తెచ్చుకోండి’ అతను క్రోథంగా చెప్పాడు.
‘ఓ! ఆ పామరా?’ సంభ్రమంగా అడిగింది.
‘ఆ పామర్నే. నేను బదులు తీర్చుకోడానికి వచ్చాను’
అతని చేతిలోని కత్తిని చూసి కాని ఎలిజబెత్‌కి అతను ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. వాళ్లిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆమె చటుక్కున లేచి తన క్లబ్ ఆఫీస్ గదిలోంచి పారిపోయే ప్రయత్నం చేసింది. కాని పామర్ ఆమెని వెనక నించి పొదివి పట్టుకుని కుడి చేత్తో కత్తిని ఆమె పొత్తి కడుపులో రెండుసార్లు దింపాడు.
* * *
లెఫ్టినెంట్ ఛార్లెస్ ఎలిజబెత్ శవాన్ని చూసాక రెండు రోజుల క్రితం మేరియా హత్య చేయబడ్డ విధంగానే ఆమె కూడా చంపబడిందని గ్రహించాడు. కాకతాళీయమా? లేక ఈ రెండు హత్యలూ ఒకరే చేసారా? అని ఆలోచించాడు. అది కాకతాళీయం అని అతనికి అనిపించలేదు. శవాన్ని పోస్టుమార్టంకి తరలించాక సరాసరి మేరియా ఇంటికి చేరుకున్నాడు.
‘లెఫ్టినెంట్ ఛార్లెస్? నిన్న మీకు అబద్ధం చెప్పాను. నా భార్యని నేనే చంపాను’ కార్లోస్ చెప్పాడు.
‘ఇంకా?’
‘ఇంకా ఏమిటి?’
‘ఇంకొకర్ని కూడా చంపారా? రెండు గంటల క్రితం మీరు ఎక్కడ ఉన్నారు?’
‘కార్ఖానాలో. ఇంటికి వచ్చి పావుగంట అయింది. ఆలోచించాక నా తప్పుని ఒప్పుకోవడం సబబనిపించింది’
‘కార్లోస్! మీ భార్యని చంపింది మీరు కాదు’
‘నేనే’ ఆక్రోశంగా చెప్పాడు.
‘ఎలిజబెత్ పేరు విన్నారా?’
‘ఎలిజబెత్? లేదు’
‘మీ భార్య ఎప్పుడైనా ఆ పేరు మీకు చెప్పిందా?’
‘లేదు. చెప్పిన గుర్తు లేదు’
‘వాళ్లిద్దరికీ ఎలాంటి సంబంధం ఉందో మీకు...’ మేంటెల్ పీస్ మీది ఫొటోఫ్రేమ్‌ని అందుకున్నాడు.
‘ఈ ఫొటోలోని ముగ్గురిలో ఒకరు మీ భార్య. ఈ రెండో వ్యక్తే ఎలిజబెత్. ఈ ఫొటో ఎప్పుడు తీసినది?’ ఛార్లెస్ అడిగాడు.
‘పదకొండేళ్ల క్రితం. మేం క్యూబా నించి వచ్చిన ఏడాదికి. మా మొదటి పోట్లాట మేరియా కొన్న ఫొటోలోని ఆ డ్రస్ వల్లే జరిగింది’ కార్లోస్ చెప్పాడు.
‘ఇంకాస్త వివరంగా చెప్పండి’
‘ఎందుకు అంత డబ్బు ఆ డ్రస్‌కి తగలేసావంటే వేల మంది తనని చూస్తారని కొన్నానని చెప్పింది’
‘వేల మంది చూడడం ఏమిటి?’
‘ఏదో టీవీ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఆ డ్రస్‌ని కొన్నదని గుర్తు’
‘ఏ ప్రోగ్రాం అది?’
‘ఏదో రియాలిటీ షో అని మాత్రమే గుర్తు. ఆ సందర్భంగా తీయించుకున్న ఈ ఫోటో, ఓ ఉత్తరం సావనీర్లుగా ఇంట్లో ఉంచుకుంది’
‘ఆ ఉత్తరం చూపించండి’
‘ఇల్లు మారినప్పుడు పోయింది. మేరియా అందుకు బాగా బాధపడింది కూడా’
‘సరే. మేరియా, ఎలిజబెత్ కాక ఫోటోలోని ఈ మూడో అమ్మాయి ఎవరు?’
‘నాకు తెలీదు’
‘మీకు వీళ్ల గురించి చెప్పి ఉంటుంది’
‘ఆ పోట్లాట తర్వాత మళ్లీ ఈ ఫొటో ప్రసక్తి మా మధ్య ఎన్నడూ రాలేదు. ప్లీజ్. నన్ను అరెస్ట్ చెయ్యండి. మేరియాని చంపింది నేనే’ కార్లోస్ అర్థించాడు.
‘జైల్లో ఉచిత భోజనం దొరుకుతుందనా? మరణశిక్ష కూడా పడచ్చు’
‘నా సంపాదన నాకు చాలదు. పేద బతుకు బతికే కంటే చావే శరణ్యం అని నిశ్చయించుకున్నాను. నేను మీకు నా భార్యని చంపానని స్వచ్ఛందంగా రాసిస్తాను. మళ్లీ వెనక్కి వెళ్తానని భయపడకండి’
‘మీరు మీ భార్యని చంపి ఉంటే మీరు కోరకుండానే అరెస్ట్ చేసేవాడిని’
ఛార్లెస్ బయటికి నడిచాడు.
* * *
‘దయచేసి ఈ ఫొటో చూసి ఇందులోని మూడో అమ్మాయి ఎవరో చెప్పగలరా?’ ఛార్లెస్ ఎలిజబెత్ తల్లిని కోరాడు.
‘సారీ. చెప్పలేను’
‘చూడకుండానే ఆ మాటంటారే. ఓసారి చూడండి’
‘నేను గుడ్డిదాన్ని’
‘నిజంగా?’ నివ్వెరపోయాడు.
‘అవును. ఈ గదిలోని ప్రతీ అంగుళం నాకు తెలుసు అని మీకు తెలీదు’
‘పదకొండేళ్ల క్రితం మీ అమ్మాయికి మేరియా అనే స్నేహితురాలు ఉందని మీకు గుర్తుందా? ఎప్పుడైనా చెప్పిందా?’
‘మేరియా? ఎలిజబెత్‌కి మునుపు చంపబడ్డ మేరియానా? లేదు. ఏం?’
‘పోనీ మీ అమ్మాయి పదకొండేళ్ల క్రితం వేల మంది ముందుకి ఏ సందర్భంలోనైనా వెళ్లిందేమో గుర్తుందా?’
‘వేల మంది ముందుకి? ఉహు. లేదు. సందర్భం ఏమిటో చెప్పండి. గుర్తు రావచ్చేమో?’
‘్ఫటో, ఉత్తరం తర్వాత పోస్ట్‌లో వచ్చాయి. ఐతే ఎక్కడ నించో నాకు తెలీదు’
‘సారీ. లేదు. ఒక్క క్షణం... పదకొండేళ్ల క్రితం ఎలిజబెత్ ఓ టీవీ షోలో పాల్గొంది. వేల మంది ముందుగా వెళ్లడమేగా అది?’
‘అవును. ఆ షో పేరేమిటి?’
‘అదీ.. అదీ... ఒక్క క్షణం... మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరు’
‘్థంక్స్ మిసెస్ సింప్సన్’
ఛార్లెస్ అక్కడ నించే ఫోన్ చేసి అది ఏ టీవీ ఛానెల్‌లో వచ్చిందో విచారించి, ఆ టీవీ ఛానెల్‌కి బయలుదేరాడు.
* * *
‘టింకర్ అనే అతను పదకొండేళ్ల క్రితం ఛానల్‌లో ఆ ప్రోగ్రాంని చేశాడు. దానికీ, మేరియా, ఎలిజబెత్‌ల హత్యలకి సంబంధం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది’ టీవీ ఛానెల్ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు.
‘ఐతే నేను వెంటనే టింకర్‌తో మాట్లాడాలి’ లెఫ్టినెంట్ ఛార్లెస్ కోరాడు.
‘అతను ఎనిమిదేళ్ల క్రితం రిటైరవడంతో ఆ ప్రోగ్రాంని ఆపేశాం. అప్పటికి రేటింగ్ పడిపోవడంతో దాన్ని విరమించాం’
‘అతని ఇంటి అడ్రస్ ఉందా?’
‘ఉంది. అతను మా ఛానెల్‌కి ప్రోగ్రాంల విషయంలో సలహాదారుగా పని చేస్తున్నాడు’
ఆ అడ్రస్ తీసుకుని ఛార్లెస్ టింకర్ ఇంటికి బయలుదేరాడు.
* * *
‘పోనీ పదకొండేళ్ల క్రితం మీరు నన్ను జడ్జ్ చేసిన సంగతి గుర్తుందా?’ పామర్ ప్రశ్నించాడు.
అతని మొహంలో అంత క్రోథం ఎందుకు ఉందో, దానికీ, తనకీ ఏం సంబంధమో పినాలోపేకి అర్థం కాలేదు.
‘ఓ టీవీ షోలో అలాంటిదేదో చేసానని గుర్తుంది’
‘ఆ జడ్జ్‌మెంట్ ద్వారా నువ్వు నా మొత్తం జీవితాన్ని నాశనం చేసేసావు’
‘నాకు మీరు చెప్పేది చిత్రంగా ఉంది. ముందు నా ఇంట్లోంచి బయటికి నడవండి’ ఆమె కోపంగా అరిచింది.
‘ఇక్కడే ఉండడానికి రాలేదు. పనయ్యాక’ చెప్పి అతను కత్తిని బయటికి తీశాడు.
దాన్ని చూసి ఆమె ‘హెల్ప్! హెల్ప్!’ అని అరవసాగింది. కొద్ది క్షణాల్లో ఆ అరుపులు ఆగిపోయాయి.
* * *
డెబ్బైయ్యవ పడిలో పడ్డ టింకర్ జవాబుగా చెప్పాడు.
‘అవును. ‘మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరు’ ప్రోగ్రాంని నాలుగేళ్ల పైనే నేను నిర్వహించాను. వందల మందికి అది చేయూతని ఇచ్చిన గొప్ప రియాల్టీ షో. దానికీ, ఆ జంట హత్యలకీ సంబంధం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది’
‘ఉంది. ఈ ఫొటోలోని ముగ్గుర్నీ గుర్తు పట్టగలరా?’
టింకర్ దాన్ని చూసి తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘ఉహు. వందల మంది ఆ షోలో జడ్జీలుగా పాల్గొన్నారు’
‘వీరు జడ్జీలా?’
‘అవును. ప్రోగ్రాం పూర్తయ్యాక జడ్జీలని ఇలా పక్కపక్కన కూర్చోబెట్టి ఫొటో తీసి దాన్ని సావనీర్‌గా ఓ థాంక్స్ లెటర్‌తోపాటు పంపేవాడిని. అందులో పాల్గొన్నందుకు తలో ఐదు వందల డాలర్లు కూడా గౌరవ పారితోషికంగా ఇచ్చేవాళ్లం. వీళ్లని ఎలా ఎన్నిక చేసేవాళ్లమంటే...’
‘ఈ మూడో అమ్మాయి పేరు, చిరునామా నాకు అవసరం. హంతకుడు ఆమెని కూడా హత్య చేయచ్చని నా అనుమానం. అసలు ఆ షో ఉద్దేశం ఏమిటి?’
‘ప్రతి షోకి ముగ్గురుని ఎన్నుకునేవాళ్లం. వాళ్లు వాళ్లకి గల డబ్బు ఇబ్బందులు వివరిస్తారు. ఆ ముగ్గురిలో ఎవరు అర్హులో ఈ న్యాయ నిర్ణేతలు నిర్ణయిస్తారు. వారికి పాతిక వేల డాలర్లు ఇచ్చి వారి జీవితాలని మార్చేసేవాళ్లం. సాధారణంగా ఆ ముగ్గురి బాధాకర ఆర్థిక పరిస్థితులని తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా చూసేవాళ్లు. ఉదాహరణకి నాకు బాగా గుర్తున్న...’
‘ఈ మూడో అమ్మాయి పేరు, అడ్రస్ వెంటనే కావాలి’ ఛార్లెస్ కోరాడు.
‘ఆ ఫొటో వెనక నంబర్ ఉందా?’
‘ఉంది. సి.ఒన్ 1961’ వెనక్కి తిప్పి చూసి చెప్పాడు.
‘ఐతే ఆ సంవత్సరం మార్చిలోని మొదటి వారం ప్రోగ్రాంలో వాళ్లు పాల్గొన్నారు. నా ఆత్మకథలో రాయాలని కాపీలు నా దగ్గర ఉంచుకున్నాను’
టింకర్ ఓ ఫైల్ రేక్ తెరిచి వెదికి ఆ నంబర్ ఫైల్‌ని తెరిచాడు. అది చదివి చెప్పాడు.
‘పేరు పినాలోపే. డైరెక్టరీలో ఆమె ఫోన్ నెంబర్ ఉంటుంది. పాత చిరునామా రాసుకోండి. అమెరికాలో సగటున ప్రతీ పౌరుడు ఓ ఇల్లు మారుతాడని మీకు తెలుసా?’
‘పోటీదార్ల గురించి చెప్పండి’
‘నిక్, జెర్రీ, పామర్. నిక్ గెలిచాడు’
‘ఐతే జెర్రీ, పామర్లలో ఒకరు ఆ హంతకుడు అయి ఉండాలి. వారిద్దరిలో ఎవరో చెప్పగలరా?’
‘నాకు బాగా గుర్తుంది. తను అర్హుడైనా గెలవలేదని పామర్ గొడవ చేస్తే పోలీసుల్ని పిలిచాను. రెండు నెలల తర్వాత అతను పనిచేసే కంపెనీలో డబ్బు కొట్టేసిన నేరానికి పదేళ్లు జైలుశిక్ష విధించారని పేపర్లో చదివాను’
‘పదేళ్లంటే ఇటీవలే విడుదలై ఉంటాడు. నిస్సందేహంగా అతనే అయి ఉంటాడు. నేను వెంటనే పినాలోపేని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి’
ఛార్లెస్ బయటికి వచ్చి పెట్రోల్ కారు ఎక్కిన కొద్ది నిమిషాలకి పినాలోపే హత్య గురించి సమాచారం అందింది. ‘అయ్యో! ఇంకొద్దిగా ముందు తెలుసుంటే ఆమె ప్రాణాలు కాపాడబడేవిగా’ అనుకుంటూ కారుని ఆమె ఇంటికి పోనించాడు.
* * *
‘ఇటీవల సీరియల్ కిల్లర్ చంపిన రెండో హతురాలు ఎలిజబెత్ తల్లి మిసెస్ సింప్సన్ ప్రెస్ మీట్‌కి హాజరైంది. దానికి అనేక పత్రికా విలేఖరులు, టీ న్యూస్ ఛానలర్స్ వాళ్లు విచ్చేశారు. ఆవిడ అందరికీ ఇలా చెప్పింది.
‘నిజం తెలీక అనవసరంగా పామర్ ముగ్గురు అమాయకుల ప్రాణాలని తీశాడు. ఆ రియాల్టీ షోలో అర్హుడ్ని ఎంపిక చేసింది ఆ ముగ్గురూ కాదు. ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ టింకర్. ఆయన ఇచ్చిన పేరుని వాళ్లు ప్రకటించేవారు. ఈ సంగతి నాకు నా కూతురు ఎలిజబెత్ చెప్పింది. ఎలిజబెత్ పుట్టినరోజు పార్టీకి మా ఇంటికి వచ్చిన మేరియా, పినాలోపేలని కూడా నేను అడిగితే అది నిజమేనని చెప్పారు. ఈ నిజం నాతో అంతం కాకూడదని, అమాయకులైన ముగ్గుర్ని పామర్ చంపాడని మీకు తెలియజేస్తున్నాను’
ఆ వార్త అన్ని దినపత్రికల్లో అచ్చయింది. టీవీ వార్తల్లో ప్రసారం అయింది.
ఆ వార్తని టీవీలో చూసిన పామర్ ఒక్కసారిగా కృంగిపోయాడు. తను ఆ ముగ్గుర్ని ఉత్తినే చంపినట్లయింది. తన పగ లక్ష్యం అయిన టింకర్ బతికి ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
టీవీలో దాన్ని చూసిన లెఫ్టినెంట్ ఛార్లెస్ నివ్వెరపోయాడు. అతని ఫోన్ మోగింది.
* * *
‘నేనూ ఇప్పుడే ఆ వార్తని టీవీలో చూశాను. అది పచ్చి అబద్ధం. నేను మిసెస్ సింప్సన్ మీద పరువు నష్టం దావాకి నోటీస్‌ని పంపదలిచాను’ టింకర్ కోపంగా చెప్పాడు.
‘ఆవిడకి ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వే! నీ వల్లే నా జీవితం నాశనం అయింది. ఆ పాతిక వేల డాలర్లు నాకు అంది ఉంటే, కంపెనీ సొమ్ముని వెనక్కి ఇచ్చేసేవాడిని. అప్పుడు వాళ్లు నా మీద పోలీసులకి ఫిర్యాదు చేసేవారు కారు. నీ వల్ల నేను జైల్లో పదేళ్లు కూర్చోవాల్సి వచ్చింది. నా జీవితంలోని పదేళ్లని నేను కోల్పోయాను. నేను చంపిన వారికి చెప్పిన మాటే నీకూ చెప్తున్నాను. బదులుగా నీ మిగిలిన జీవితాన్ని నేను హరిస్తేనే నాకు న్యాయం జరుగుతుంది’
‘కాదు. ఆగు. మా టీవీ ఛానల్ వాళ్లచేత నీకు నిజం చెప్పిస్తాను. స్క్రిప్ట్ రైటర్స్ కూడా కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్తారు’
‘ఆవిడకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు’
పామర్ బొడ్డులోంచి కత్తిని తీశాడు.
‘పామర్! ఆగు’ లెఫ్టినెంట్ ఛార్లెస్ అరిచాడు.
ఆవేశంగా అతను టింకర్ మీదకి చేతిని ఎత్తగానే ఛార్లెస్ చేతిలోని రివాల్వర్ పేలింది. అది గురి తప్పలేదు. కత్తిని పట్టుకున్న చేతిని తాకింది. ‘అబ్బా’ అంటూ పామర్ చేతిలోని కత్తిని వదిలేసి నేల మీద కూర్చుండిపోయాడు.
‘ఇందుకే నేను మీ మీద అబద్ధపు స్టేట్‌మెంట్‌ని ఇచ్చాను. లేదా పామర్ పోలీసులకి చిక్కేవాడు కాడు’ జరిగింది తెలుసుకున్న మిసెస్ సింప్సన్ చెప్పింది.
ఐతే అది పామర్‌ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లాకే చెప్పింది. అతనికి తన పగ తీరలేదన్న బాధని మిగల్చాలనుకుంది.
‘ఓ హంతకుడిని పట్టించానని నా ఆత్మకథలో గర్వంగా రాసుకుంటాను. నాకా అవకాశం ఇచ్చినందుకు మీ మీద అబద్ధం చెప్పినందుకు ఎలాంటి చర్యని తీసుకోను’ టింకర్ ఆవిడతో చెప్పాడు.
‘మీది పెద్ద మనసు అని మా అమ్మాయి చెప్పింది. అందుకే ఆ ధైర్యం చేసాను’ మిసెస్ సింప్సన్ సంతృప్తిగా చెప్పింది.
*

(శామ్ డాన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి