S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిర్ణయం

సికిందరాబాద్ రైల్వేస్టేషన్‌లో.. రైలు దిగి..
ఎదురొచ్చే జనాల్ని, వెంటపడే పోర్టర్లను దాటుకుని, స్టేషన్ బయటికొచ్చి నిలబడింది ప్రియంవద. అక్కడా ఆటోవాళ్లు చుట్టుముట్టారు. వాళ్లనీ కాదని... పైన ఎండ మాడుస్తున్నా.. అలానే నిలబడింది. పది నిమిషాల తరువాత ఊదారంగు పొడవాటి కారు వచ్చి ఆగింది ఆమె ముందు.
మెల్లగా.. వెనుక డోర్ తెరచుకుంది. డోర్‌ని అలాగే తెరిచి పట్టుకుని ‘రండి’ లోనికి ఆహ్వానించాడు శ్రీనివాసరావు. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు కారు నిలిపి ఉంచడం మంచిది కాదు కాబట్టి, సూట్‌కేస్, ఎయిర్‌బ్యాగ్ లోనికి అందించి ఎక్కి కూర్చుంది.
అప్పటి వరకూ పడిన టెన్షను.. అభద్రతా అంతా చేత్తో తీసేసినట్లయి హాయిగా ఊపిరి పీల్చుకుంది.
డోర్ లాక్ చేస్తూ ‘బాగున్నారా?’ అడిగాడు.
‘ఊ’ అంది అతన్ని చూస్తూ చిరు మందహాసంతో.
‘మీ హస్బెండ్ బాగున్నారా?’
ఆయన ఎలా ఉంటే ఈయనకేమిటి? అసందర్భం కాకపోతేను అనుకుంటూ.. దానికీ ‘ఊ’ అనే సమాధానం ఇచ్చింది.
‘ఎట్లుంది.. కొత్త రాజధానిలో.. మీ ఉద్యోగం. మీ ఆంధ్రా ఉద్యోగులు.. మా సిటీని ఖాళీ చేసి పోయినా ట్రాఫిక్ మాత్రం తగ్గలేదు. అరగంటసేపు స్టేషన్ దగ్గరలోనే ఇరుక్కుపోవలసి వచ్చింది. లేటవుతుందని ఒకటే పరేషాన్ ఐనా’ అంటూ ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చాడు శ్రీనివాసరావు.
కారులో డ్రైవర్ ఉన్నాడు. మాట్లాడకుండా ఉండటమే బాగుంటుంది అనుకున్నా.. నోరు విప్పక తప్పింది కాదు.
కొత్త గవర్నమెంటులో...
విజయవాడ దగ్గరలో.. కొత్తగా ప్రారంభించిన వాళ్ల ఆఫీసుని గురించి.. అద్దె ఇంటిని గురించి.. పిల్లలని స్కూల్లో చేర్చడం గురించి చెప్పింది.
ప్రియంవద ఆంధ్రా ప్రాంతానికి చెందినది. అందుకే రాష్ట్రం విడిపోవడంతో కొత్త రాజధాని విజయవాడ వెళ్లిపోవలసి వచ్చింది.
‘పంజగుట్ట’లో ఓ హోటల్ ముందు ఆగింది కారు.
డ్రైవర్ లగేజీ రూంలో పెట్టాడు. ‘నువ్వు బయట వెయిట్ చెయ్యి’ చెప్పాడు శ్రీనివాసరావు డ్రైవర్‌కి.
డ్రైవర్ అటు వెళ్లగానే డోర్ గడియ వేశాడు. ప్రియంవద అతనే్న గమనిస్తూ ‘అంతా బాగానే ఉంది గాని, మీ డ్రైవర్ ఇంట్లో నా గురించి చెబితేనో’ అడిగింది ఆశ్చర్యం.
‘బయట విషయాలు ఇంట్లో చెప్పొద్దని ముందే వార్నింగ్ ఇచ్చినా. చెబితే ఇక నా దగ్గర పనిలో ఉంటాడా వాడు...’ అంటూ, ఆమెకు దగ్గరగా వచ్చి, ఇంకా ఇంకా ఎడబాటు భరించలేనన్నట్లు అమాంతం హత్తుకు పోయాడు ‘ఎన్నాళ్లకు కలిసావే’ అంటూ.
వారించలేదు ప్రియంవద.. కలవక కలిసిన స్నేహం రాష్ట్రం విడిపోవడంతో.. వేరై పోయింది. అతని పరిష్వంగంలో ప్రియంవద కూడా సేద తీరుతోంది.
ఇలాంటి సమయంలో ప్రియంవదకి.. వాళ్లాయన ఆదిరెడ్డి గుర్తొస్తాడు. ఇదే ప్రేమ, అభిమానం తన భర్త మీద చూపిస్తే తన జీవితం కూడా ఆనందమయం కాదా అనుకుంటుంది శ్రీనివాసరావు సమక్షంలో.
కానీ.. ఆ అవకాశం ఎక్కడ? వంక దొరికితే.. చిన్నప్పుడు ఎప్పుడో.. నేర్చుకున్న ‘అలగా’ మాటలు.. ఇప్పటికీ మర్చిపోకుండా పలుకుతాడు. భార్యతో సామరస్యంగా మాట్లాడాలని ఎప్పుడూ అనుకోడు. మందు తాగే వాడికి.. తాగితేనే కిక్కు వచ్చినట్లు.. పొల్లు మాటలు లేకుండా వాక్యం పూర్తి చెయ్యలేడు ఆదిరెడ్డి.
‘అలాంటి మాటలు మాట్లాడి, నా మనసు బాధ పెట్టవద్దు. చదువుకున్న వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎప్పుడూ వినలేదు’ అంటూ ఎన్నోసార్లు చెప్పింది.
అయినా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదన్నట్లు ‘ఇలా చెబితేనే నీకు బాగా అర్థం అవుతుందని’ అంటాడు పైగా.
అదే అసహ్యం ఆమెకి.
సంబంధాలు కుదుర్చుకోవడానికి అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. అవన్నీ పక్కనబెడితే.. ఆర్థిక లేమి.. తండ్రి ఇచ్చే కట్నానికి ఉద్యోగం లేని ఆదిరెడ్డి దిగి రావడంతో ప్రియంవదకు పెళ్లైంది.. సంసారం సాఫీగా నడవాలంటే జోడు చక్రాలూ సాఫీగా నడవాలి.
అలా నడవకే.. మనసు పక్కదోవ పట్టింది.
తప్పెవరిదీ?
అంటే, కాలానిదీ, పరిస్థితులదే అంటుంది ఆమె.
‘ముందు ఫ్రెష్ అయి, కమీషనరేటుకి వెళ్లి.. అక్కడ ఓ ఫైల్ హేండ్‌ఓవర్ చేసి రావాలి. తరువాత మన ఆఫీసులో సర్వీసు వెరిఫికేషను ఎంట్రీ వెయ్యించుకోవాలి. అది వెయ్యకుండానే సర్వీసు రిజిస్టరు వచ్చేసింది. ఈ నెలలోనే నా పిరియాడికల్ ఇంక్రిమెంట్. అందుకే.. అర్జంటుగా రావలసి వచ్చింది’ నేను వచ్చింది ఇందుకే సుమా! అన్నట్లు నవ్వుతూ.
అంతలోనే ‘రేపు సాయంత్రమే నా ప్రయాణం. టిక్కెట్ రిజర్వ్ అయిపోయింది. పనులన్నీ ఈలోపు పూర్తి చేసుకోవాలి’ అంటూ టైమ్ ఆవశ్యకతను కూడా తెలియజేసింది.
‘టిక్కెట్టుదేముంది.. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. వెళ్లిన పని అవ్వలేదని, ఇంకో రోజు ఆగి వస్తానని, మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పు’
* * *
ఒకప్పుడు ప్రియంవద.. శ్రీనివాసరావు సెక్రటేరియట్‌లో.. ఒకే డిపార్ట్‌మెంట్‌లో.. వేరువేరు వింగ్స్‌లో పనిచేసేవారు. ప్రియంవద టైపిస్టు.
పక్క వింగ్‌లో శ్రీనివాసరావు సెక్షన్ ఆఫీసర్. స్ఫురద్రూపి. చూడగానే ఆకట్టుకొనే పర్సనాలిటీ. చక్కటి వాక్చాతుర్యం. తెలియని విషయాలు గురించి చెప్పేవాడు. అలా ప్రియంవద మనసులో అభిమానం సంపాదించుకున్నాడు.
అందరి జీవితాలు వడ్డించిన విస్తరులు కావు. ప్రియంవదదీ అంతే. భర్తది గాలివాటు సంపాదన. టెంపరరీ ఉద్యోగాలు. ఆమె చెల్లించే ఇంటి అద్దె అంత ఉండదు.. అతని జీతం.
నోటితో చెప్పకపోయినా జీవితంలో.. ఆర్థిక ఇబ్బందులతో ‘వెలితి’ హద్దులు దాటింది. శ్రీనివాసరావు అవకాశం ‘ట్రై’ చేసే తుమ్మెద.
‘కాండిల్ టైప్.. జీవితం మీది’ అన్నాడోసారి.
అర్థం కానట్లు చూసింది.
‘అదే క్రొవ్వొత్తిలా.. కరిగిపోతూ కూడా చుట్టుపక్కల వాళ్లకి వెలుగు నివ్వడం’ తన వ్యాఖ్యకి వివరణ ఇచ్చాడు.
తన కుటుంబం కోసం తను కష్టపడుతుంది. భారతదేశంలో తొంభై శాతం కుటుంబాలు ఒక్క వ్యక్తి సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. అందులో తన సంసారం ఒకటి. అందరి ఇళ్లలోనూ సంపాదించేది మగవాళ్లయితే.. ఇక్కడ తిరగబడింది.
ఇందులో ‘తను క్రొవ్వొత్తిలా కరిగిపోవడం’ ఏమిటో అర్థం కాలేదు ప్రియంవదకి. కాకపోతే, గొర్రెతోక బెత్తెడే అన్నట్లు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తిరుగుతుంది కాలచక్రం. నెల తిరిగేసరికి వంద రూపాయలు మిగలని, పరిస్థితి.
ఓ ఆదివారం టర్న్ డ్యూటీలో...
‘ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.. ‘నాదీ, నీలాంటి పరిస్థితే, నీలాగే.. నాకూ ఇంట్లో సుఖం లేదు’ అంటూ మనసులో మాట చెప్పాడు. తనకు తెలియకుండానే అతనికి ‘తన గురించి ఆలోచించే’ అవకాశం ఇచ్చేసింది.
అందుబాటులో జనాలు లేరు.. అందుకనే బయటపడ్డాడు.
ఆ సెక్షన్ వైపు వెళ్లడం మానుకుంది.
అయినా ప్రయత్నించాడు. ఆఫీసరునని కూడా ఆలోచించకుండా, తన స్థాయి తగ్గించుకుని మరీ ప్రయత్నించాడు. నెలల తరబడీ ఎదురుచూశాడు.
ఓసారి...
టైఫాయిడ్ వచ్చి, లేవలేక పోయింది ప్రియంవద. జ్వరం తగ్గినా, నీరసం తగ్గలేదు. అదే సమయంలో పిల్లలకు వేసవి సెలవులు కావడం.. ఆదిరెడ్డి కాంట్రాక్టు పూర్తి అయి ఖాళీగా ఉండడంతో పిల్లల్ని తీసుకుని, స్వంత ఊరు అయిన కంకిపాడు బయలుదేరాడు.
‘అదేమిటి? నాకసలే ఓపిక లేదు. ఆఫీసుకి వెళ్లగలిగే స్థితిలో కూడా లేను! మీరు ఇప్పుడు ఊరు వెళ్లడం ఏమిటి? నాలుగు రోజులు ఆగి వెళ్లొచ్చు కదా’
‘నువ్వెలా పోతే నాకెందుకు? అయినా నీకెప్పుడు బాగుంది గనుక, ఇంకా కూర్చుంటే పిల్లల సెలవులు అయిపోతాయి’ అంటూ వాళ్లని తీసుకుని వెళ్లిపోయాడు.
వచ్చే కన్నీళ్లని ఆపుకుంటూ దిగులు పడుతున్న ప్రియంవదను, పక్క పోర్షన్ వాళ్ల కోడలు చూసింది గాని ‘ఏమిటని’ అడగలేకపోయింది. విషయం చూచాయగా గ్రహించి.
తనుండేది పాతబస్తీ. అక్కడ సరైన డాక్టర్లు లేరు. వైద్యం చేయించుకోవాలంటే, నాంపల్లి వైపు వెళ్లిపోవాలి. ఓపిక లేని స్థితిలో వొంటరిగా అంత దూరం వెళ్లగలదా!
అయినవాడు పట్టించుకోకపోతే.. బ్రతుకు కోసం వొంటరి పోరాటం ఎంతకని చెయ్యగలదు. తెచ్చుకున్న మందులు అయిపోయాయి.
ఓ ప్రక్కన శ్రీనివాసరావు ఆపన్న హస్తం...
అప్పటికే నెల రోజుల నుంచి సెలవు. తనని ఒంటరిగా వదిలేసిన మూర్ఖుడి కోసం.. ఆలోచిస్తూ రోగం పెంచుకుని కృంగి కృశించి పోవడం కంటే.. తన కోసం వచ్చే వాళ్లని కాదనడం ఎందుకు? బ్రతికి ఉంటేనే కదా! ఏదైనా సాధించేది.
ఒక ద్వారం మూసుకుంటే.. మరో ద్వారం తెరుచుకుంటుందట.. అలవికాని పరిస్థితిలో.. భర్త మీద కోపమే ఆమెను మారేలా చేసాయి.
అందుకు పరిస్థితులూ దోహదం చేసాయి.
* * *
వాళ్లతోపాటే పనిచేసే సావిత్రి, బాబూరావులదీ ఇదే తరహా వ్యవహారం. సతీసావిత్రి పేరు పెట్టుకున్న.. ఆధునిక సావిత్రికి, తెల్లటి జుట్టున్న నల్లటి బాబూరావుకు ఎలానో స్నేహం కుదిరింది.
వాళ్లిద్దరూ ఉండేది దిల్‌షుక్‌నగర్ ఏరియా అయినా.. పాతబస్తీ వైపు.. వచ్చి కలుసుకుంటారు. ఆవైపు వెళ్లే బస్సులు ఎక్కి ‘లతా టాకీసు’ స్టేజీ దగ్గర దిగుతారు ఎవ్వరికీ అనుమానం రాకుండా.
పాతికేళ్ల పైన ఆ సినిమా టాకీసు మూతపడి, దానిలో స్టేట్ బ్యాంక్ నడుస్తున్నా.. ఇప్పటికీ ‘లతా టాకీసు’ స్టేజీ అంటారు. తను వెళ్లేది ఆ వైపే.
ఓసారి బాబూరావు.. ప్రియంవద దిగే బస్సుకే ఎదురొచ్చాడు. ఆ దిగబోయేది సావిత్రే అనుకుని, ఆమెను చూసి, అమాంతం, గోడక్కొట్టిన బంతిలా అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తరువాత బస్సులో సావిత్రి దిగింది. అప్పటికే మాట్లాడుకుని పెట్టుకున్న ఆటోలో ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. తనకి ముఖాలు కనబడనివ్వకుండా సీటు వెనక్కి జారబడి కూర్చుని.
ఇలాంటి వ్యవహారంలో వాళ్లకి సమస్యలు లేవా! అంటే.. ఉన్నాయి. అప్పుడప్పుడు సావిత్రి ఇంటికి బాబూరావు భార్య వెళ్లి ‘ఏమే.. నీకు మా ఆయనే దొరికాడా.. దేశంలో ఇంకెవ్వరూ లేనట్లు’ అంటూ పోట్లాడి వస్తుందట.
అలాగే బాబూరావు కనిపించినపుడల్లా.. సావిత్రి భర్త అలాగే పోట్లాడతాడట. ఎలాగో ఆ విషయాలు ఆఫీసులో తెలుస్తుంటాయి.
* * *
కొత్త రాజధాని విజయవాడకి ఉద్యోగులు.. తరలి వెళుతుంటే బాధపడి, కన్నీళ్లు పెట్టుకుని, ఏడ్చిన స్నేహితులంతా.. ఆ రోజు వచ్చిన ప్రియంవదని చూసి సంతోషపడ్డారు. ‘ఎక్కడ దిగినవ్. మా ఇంటికి రాకపోయినవా’ అన్నవాళ్లే.
స్నేహానికి ప్రాంతీయ భావం అడ్డు రాలేదు. రాజకీయాల కోసమే రాష్ట్రం ముక్కలయ్యింది.
ఉద్యోగం వచ్చిన కొత్తలో మెహిదీపట్నంలో ఉన్న.. దూరపు బంధువులైన పిన్నిగారి ఇంటిలో దిగి, అక్కడే.. వాళ్లకి దగ్గరలోనే ఇల్లు తీసుకుంది. తీరా హైదరాబాద్ వదిలి పెట్టి వెళ్లిపోవలసి వచ్చినపుడు ‘రేపు వెళ్లిపోతున్నాం.. పిన్నీ’ అని చెప్పినపుడు...
ఆ పిన్ని ‘అయ్యో’ అనకపోగా...
‘సరే సరే’ అంది. పది సంవత్సరాలుగా పిన్నితో చాలా అనుబంధమే పెంచుకుంది ప్రియంవద. తల్లి తరువాత తల్లిలా భావించింది. కష్టం సుఖం చెప్పుకుంది. అలాంటిది తను ఊరి నుంచి వెళ్లిపోతున్నందుకు పిన్ని కించిత్తు అయినా బాధపడలేదు సరికదా.. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్’ అని కూడా అడగలేదు.
వాళ్ల పిల్లలు. ఒక్కళ్లకీ గవర్నమెంటు ఉద్యోగం రాలేదు. తమ అక్కచెల్లెళ్లు అందరికీ గవర్నమెంటులో ఉద్యోగాలు రావడం ఓ పట్టాన మింగుడు పడదు వాళ్లకి.
అందరికీ ఒకటే సమాధానం. ‘మెహిదీపట్నంలో.. మా పిన్నిగారింటిలో. అదైతే, అలవాటైన ప్రదేశం’ అని.
* * *
మరునాడు.. హోటల్ రూములో..
ప్రయాణానికి సిద్ధమవుతోంది ప్రియంవద. వచ్చేటప్పటికన్నా వెళ్లేటప్పుడు లగేజీలు నిండుగా.. బరువుగా వున్నాయి. పైగా ఓ కర్రల చేతి సంచి ఎడిషనల్‌గా వచ్చింది. పిల్లలకి బట్టలు, ఇంకా ఇంటికి కావలసిన వస్తువులు కొన్నది. కొత్తదైన విజయవాడలో వెతుక్కోవడం కన్నా హైదరాబాద్‌లో అయితే, వెరైటీగానూ.. చవకగానూ ఉంటాయని.
ఎవరైనా కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి కొంత కాలం పడుతుంది.
బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు హైదరాబాదులో కన్నా విజయవాడలోనే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. కొత్తగా తయారవుతున్న రాజధాని కావడంతో, ఇంటి అద్దెలకు రెక్కలొచ్చాయి.
హైదరాబాదులోనే ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ ఎక్కువ అంటారు గాని, ఇంటి అద్దెలు, దారి ఖర్చులూ తప్పిస్తే, మిగిలినవి అన్నీ హైదరాబాదులోనే చవక. అందుకే అవసరం అనుకున్న వస్తువులు కొన్నది.
ఆఫీసు చూసుకుంటూ ఎక్కువసేపు హోటల్ గదిలోనే ఉండిపోయాడు శ్రీనివాసరావు.
చాలాసేపటి నుంచి ఆమెని హడావిడిని గమనిస్తున్న శ్రీనివాసరావు ‘నీ కాస్త ప్రయాణానికి అంత లగేజీలు అవసరమంటావే’ అడిగాడు. అంతకు ముందు ‘మీరు, గారు’ అనేవాడు. తరువాత తరువాత... చనువు పెరిగిపోవడంతో ‘ఏమే’లోకి దిగిపోయాడు. ఇంటిలో.. అలాగే అంటాడేమో అని సరిపెట్టుకుంది. అయినా ఏ మగవాడు ఆడదాన్ని సరిగ్గా గౌరవించాడు గనుక.
జీవితంలో ఓ మెట్టు దిగజారిన తరువాత, గౌరవం కావాలంటే దొరుకుతుందా!
‘ముందు ఒక్క సూట్‌కేస్ సర్దుకున్నాను. ఆఫీసులో ఫైలు ఒకటి కమిషనరేటులో ఇవ్వాలి. ఎలాగూ వెళుతున్నావు, కాబట్టి ఇచ్చెయ్యి’ అన్నారు. చేసేదేముంది. ఫైలు నలిగి పోకూడదు కాబట్టి, దాన్ని సూట్‌కేస్‌లో జాగ్రత్తగా పెట్టుకుని, బట్టలు ఎయిర్‌బేగ్‌లో సర్దుకోవలసి వచ్చింది. అసలుకన్నా కొసరు ముద్దు కదా’ చెప్పింది.
ఆ సాయంత్రం.. మెల్లగా...
ట్రాఫిక్ జామ్ దాటుకుని రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టారు.
ప్రియంవద సూట్‌కేసు, కర్రల బేగ్ పట్టుకుంటే, శ్రీనివాసరావు ఎయిర్‌బేగ్ పట్టుకున్నాడు. ఓవర్‌బ్రిడ్జి ఎక్కి ప్లాట్‌ఫారం మీదకు అడుగుపెట్టారు. ఇద్దరి మధ్యా దూరం బాగానే మెయింటేన్ అవుతుంది. ముందు ప్రియంవద.. కాస్త వెనుకగా శ్రీనివాసరావు.
రైలు రావడానికి ఇంకో పది నిమిషాలు ఉండడంతో, ఏ బోగీ ఎక్కడ ఆగేది ఇండికేటర్స్ పని చేస్తున్నాయి. తన బోగీ ఆగే చోటకి చేరుకుంది ప్రియంవద.
పట్టపగలులా వెలిగిపోతున్న స్టేషన్‌లో ఆమెను అనుసరిస్తూ నడుస్తున్న శ్రీనివాసరావు ఎందుకనో ఒక్కసారిగా అసహనం ఫీల్ అయ్యాడు.
ఈమె వెనకాల నడుస్తున్నాడేమిటి తను? తనది ‘కాని’ బరువైన బేగ్ పట్టుకుని. అసలు తన బ్యాగే తను పట్టుకోవాల్సిన అవసరం లేని ఆఫీసరు తను. ఇలా.. ఓ మామూలు టైపిస్టు వెనకాల.. నడవడం, ఈ స్టేషన్‌లో తనకి.. తెలిసిన వాళ్లు ఎవరైనా చూస్తేనో! మనసు న్యూనత చెందింది.
తను ఎన్నోసార్లు విఐపిల ప్రొటోకాల్ కోసం ఇదే స్టేషన్‌కి వచ్చాడు. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. మనసులోకి ఆ ఆలోచన రాగానే చేతిలోని ఆమె ఎయిర్‌బ్యాగ్.. చిన్న ఊపుతో వదిలేశాడు.
అది ఓ మోస్తరు చప్పుడుతో.. ముందు ఆగి ఉన్న ప్రియంవద కాళ్ల దగ్గర పడింది. పగిలిపోయే వస్తువులేం లేవు కాబట్టి, సరిపోయింది.
కానీ, శ్రీనివాసరావు చేసిన పని బాగా అనిపించలేదు ఆమెకి. రమ్మని పిలిచి అవమానించినట్లు. అదే గుండెను తట్టి లేపింది. మనసుకు వేసుకున్న ముసుగు తొలగినట్లయ్యింది.
స్నేహితురాలనేది.. మొగుడు కుంటోడయినా, గుడ్డోడైనా మొగుడు మొగుడే అనేది. అదే అక్షర సత్యం.
ఇప్పటి వరకూ తను వేరూ, ఆమె వేరూ, కాదన్నట్లు ప్రవర్తించిన తుమ్మెద, అందదనుకున్న పాయసం చేతికంది, తినగా తినగా చేదైపోయినట్లు. అదుపు ఆజ్ఞలు లేని ప్రపంచంలో.. ఆ దూకుడుకి కళ్లెం వేసే దిశలో ఎందుకైనా అభ్యంతర పెడితే...
‘నన్ను దూరం పెట్టకే. నీ బాంచన్ కాల్ మొక్కుత’ అంటూ కాళ్లు పట్టుకోడానికైనా, సిద్ధపడినవాడు. కామాతురాణాం.. న భయం, న లజ్జ అన్నట్లు. ఆకలి తీరాకే అన్నీ గుర్తుకొచ్చాయన్న మాట.
ఆమె బ్యాగ్ పట్టుకోవడం ‘తను’ స్థాయి దిగజారిపోయినట్లుగా భావించడంతో అతడిలోని ‘అహం’ చేతిలోని బ్యాగ్ జారిపోయేలా చేసింది.
శబ్దం చేసుకుంటూ రైలు వచ్చి ఆగింది. హడావుడిగా ఎవరి జాగాలో వాళ్లు సర్దుకున్నారు.
శ్రీనివాసరావే బెర్తు మీద లగేజీ సర్ది, అటుగా వచ్చిన తోపుడుబండి దగ్గర రెండు వార్తాపత్రికలూ, ఓ ఫాంటా బాటిలూ కొని చేతిలో పెట్టాడు. ‘ప్రయాణంలో బోర్ కొట్టకుండా’ అంటూ.
‘ఈ రాత్రి పడుకుంటే, తెల్లవారి.. దిగేదే, ఈ మాత్రం దానికి బోర్ ఏమిటి’ అన్నా వినలేదు.
పది నిమిషాల తరువాత, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న.. రైలు కూత వేయడంతో.. ప్లాట్‌ఫాం మీద నిలబడి, కబుర్లు చెబుతున్న శ్రీనివాసరావు కిటికీలోంచి.. చెయ్యందిస్తూ ‘మళ్లీ ఎప్పుడు’ అడిగాడు, చిన్నగా నవ్వుతూ. అప్పుడే వదిలి వెళ్లిపోతున్నావు నన్ను అన్నట్లు.
అతని నవ్వు ఆమెను సమ్మోహితురాలిని చేస్తుంది. ఆ నవ్వే నైతికాన్ని.. అనైతికం చేసి.. ఆమెను బుట్టలో పడేసింది.
ఆప్యాయత, అభిమానం, సానుభూతి ఇవన్నీ సహజమైన అనుభూతులే అయినప్పటికీ, వాటి నిర్వచనాలను మనం సరిగా అన్వయించుకోలేనప్పుడే ఇలాంటి సంఘర్షణ మొదలవుతుంది. అయితే, దాన్ని మానే్ప శక్తి కాలానికే ఉంది.
ఇదేదీ మరొకరితో చెప్పే అనుభూతి కాదు. కలిసి నడవలేని ఆనందం ఎంతసేపు నిలుస్తుంది. ఎన్నని అనుభవాలని గుండెలో గుంభనంగా దాచుకోగలదు. భయం.. భయంగా ఎన్నాళ్లు? తన జీవితంలో ఎందుకీ చీకటి కోణం?
మన భవిష్యత్తు.. మన చేతుల్లోనే ఉంది.
నాణేనికి మరోవైపు.. లోకానికి తెలీకుండా ఉండాలంటే, తను మళ్లీ ఇలా రాకూడదు. వచ్చి ఆత్మాభిమానాన్ని ఇంకా పోగొట్టుకోకూడదు.
అతని ప్రశ్నకు ‘ఏమో’ అన్నట్లు చిన్నగా నవ్వింది.
కదిలే రైలు ఇద్దరినీ విడదీసింది.. నడిచే కాలంలా.
వౌనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం. జరిగేవన్నీ మన మంచికనే అంటారు కదా! ఇదీ అంతే అనుకుంటూ.
======================================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-శ్రీహర్ష