S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాచ్‌మేన్

‘హలో..! ఇందాకటి నుంచీ కాల్ చేస్తుంటే తీయవేరా?’ విసుక్కున్నాడు సుబ్రహ్మణ్యం.
‘చెప్పరా.. ఇంత పొద్దునే్న ఏంటంత కొంపలు మునిగిపోయే విషయం?’ ఆవులిస్తూ అన్నాను నేను.
‘పొద్దున్నా..? టైం పది గంటలైంది.. ఇంకా నిద్రపోతున్నావురా గాడిద?’
‘రాత్రి బాగగా లేటయ్యిందిలేగానీ.. మ్యాటరేంటో చెప్పు?’
‘నువ్వేదయినా జాబ్ చూడమన్నావు కదా.. దొరికింది’
‘నిన్ననే కదరా చెప్పింది! అప్పుడే చూసేశావా? ఎందుకంత తొందర నీకూ..? ఓ నాలుగు రోజులు ఆగొచ్చు కదా..’
‘ఎందుకూ.. తినేసి, తీరిగ్గా తొంగోడానికా?’
‘ఇంతకీ ఏం జాబు?’
‘బీచ్ రోడ్‌లో ఓ బంగళాకి చెప్పా పెట్టకుండా నైట్ డ్యూటీ చేసే వాచ్‌మేన్ మానేశాడంట! అర్జంటుగా ఎవరైనా ఉంటే చూడమని తెలిసిన వ్యక్తి ఒకాయన కాల్ చేశాడు. నువ్వెలాగూ ఖాళీగానే ఉన్నావుగా.. అందుకే మావాడు వస్తాడని చెప్పాను’
‘ఎప్పుడు రమ్మన్నారు?’
‘ఈ రోజు నుంచీ పనిలోకి వచ్చేయమన్నారు’
‘మరీ ఈ రోజంటే కష్టంరా సుబ్బు’
‘తమరు రూమ్‌లో ఉండి చేసేదేమీ లేదుగానీ.. వెళ్లి తొందరగా జాయిన్ అవ్వు. లేకపోతే అది కూడా దొరకదు’
‘సరేలే. అడ్రస్ మెసేజ్ చెయ్యి’ అని ఫోన్ కట్ చేసి, రాత్రి మిగిలిపోయిన జేమ్స్‌బాండ్ సినిమా చూడటం మొదలుపెట్టాను.
నేను ఉద్యోగం కోసం చెన్నై వచ్చి ఆరు నెలలయ్యింది. చదివిన చదువుకి సరిపడా ఉద్యోగం కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. చిల్లిగవ్వ లేకుండా ఇక్కడ బతకడం కష్టమని తెలుసు. అలాగని ఇంటికెళ్లి పోదామా అంటే నాన్న ఏమంటాడేమోనన్న భయం ఒకటి. ఏం చెయ్యాలో అర్థంకాక నా స్నేహితుడైన సుబ్రహ్మణ్యాన్ని సలహా అడిగాను. నిజానికి వాడున్నాడన్న ధీమాతోనే నేనీ ఊరొచ్చింది. వాడు బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మనకా బ్యాంకు జాబు కొట్టేంత బుర్ర లేదాయే. అందుకే ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరిపోతే కనీసం తిండికి, రూమ్ రెంటుకైనా డబ్బులొస్తాయి కదా అనుకుని, వాడికీ అదే విషయం చెప్పాను. దానికి పర్యవసానమే ఈ వాచ్‌మేన్ ఉద్యోగం.
సాయంత్రం ఐదు గంటలయ్యింది. నేను రెడీ అయ్యి, వాడు చెప్పిన అడ్రస్‌కి బయలుదేరాను.
బీచ్‌కి దగ్గర్లో ఉన్న ప్రదేశం అది. చుట్టూ పెద్దగా ఇళ్లు కూడా ఏమీ లేవు. అక్కడొకటీ అక్కడొకటీ ఉన్నాయి. వాటిల్లో చాలావరకూ కాపురాలు లేనివే. కొన్నికొన్ని అయితే పాడుబడి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. నేను వాచ్‌మేన్‌గా పనిచేయబోతున్న బంగళా మాత్రం కొంచెం బాగానే ఉంది. చుట్టూ ఎతె్తైన ప్రహరీ గోడ. దాని మీద కరెంటు తీగలతో ఫెన్సింగ్ (అలారమ్డ్) వేసున్నారు. గేటు దగ్గర తంగమలై (ఎక్స్ ఎమ్మెల్యే) అని ఇంగ్లీషులో రాసుంది. ఎవరో రాజకీయ నాయకుడిదనుకుంటా! అయినా పదవిలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా సంపాదించడం, ఇలా ఎక్కడబడితే అక్కడ ఇళ్లు కట్టి వదిలేయడం మామూలేలే. తిండి దొరక్క ఏడ్చేవాడు ఒకడైతే, తిన్నదరక్క ఏడ్చేవాడొకడని ఊరికే అన్నారా! అనుకుంటూండగా...
‘యో యార్ నీ?’ అన్నారెవరో తమిళంలో.
తిరిగి చూస్తే వాచ్‌మేన్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఒకతను నా వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. బహుశా పగలు డ్యూటీ చేసేవాడేమో. సన్నగా, నల్లగా ఉన్నాడతను. నేరుగా నా దగ్గరకొచ్చి,
‘ఎన్నా వేణుం?’ అన్నాడు.
‘నైట్ వాచ్‌మేన్ పోస్ట్...’ అని నేను వచ్చీ రాని తమిళంలో ఏదో అనబోతుంటే
‘ఒరు నిమిషం’ అంటూ గేటు తీసుకుని లోపలికెళ్లి, అయిదు నిమిషాల తర్వాత మళ్లీ బయటకొచ్చి,
‘వాంగు వాంగు’ అంటూ లోపలికిపిలిచాడు.
నేను లోపలికెళ్లేసరికి, ఎవరో పెద్దమనిషి ఇంటికి తాళం వేస్తూ కనిపించాడు. నన్ను చూసి,
‘నువ్వేనా సుబ్రహ్మణ్యం ఫ్రెండ్‌వి?’ అన్నాడు గంభీరంగా.
‘హమ్మయ్య తెలుగోడివేనా’ అని మనసులో అనుకుని ‘అవున్సార్’ అన్నాను కొంచెం వినయం నటిస్తూ.
‘ఏం పేరు?’ అడిగాడాయన.
‘ప్రసాద్ సార్’ అన్నాను నేను.
ఓసారి ఎగాదిగా చూసి, ‘పర్వాలేదప్పా’ అని, జీతం గురించి, టైమింగ్స్ గురించి వివరంగా చెప్పి, ఈ రోజు నుంచీ డ్యూటీలో చేరిపోవాలి. మురుగన్ నీకు అన్నీ చెప్తాడు. నేను అర్జంటుగా బయలుదేరాలి’ అని, ఇంతకు ముందు కనిపించిన వాచ్‌మేన్‌కి పరిచయం చేసి, తను కారులో వెళ్లిపోయాడు.
మురుగున్ నాకు యూనిఫార్మ్ ఇచ్చి వేసుకోమన్నాడు. గేటు పక్కనే ఉన్న వాచ్‌మేన్ రూమ్‌లో ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో చూపించాడు. ఆ తర్వాత అరగంటసేపు ఏదేదో మాట్లాడి, సరిగ్గా ఏడు గంటలకు కాగానే,
‘సరి తంబి. నీ పాత్తుకో. నా పోయిటు వరే’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఇక అక్కడి నుంచీ ప్రొద్దున ఏడింటి వరకూ నా డ్యూటీ. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. కిటికీలోంచి మయటకు చూశాను. వెనె్నల్లో సముద్రం అందంగా కనిపిస్తోంది. ఒక్కో అలా తీరాన్ని తాకి, మళ్లీ వెనక్కి పోతున్నాయి. అచ్చం నా ఆలోచనల్లా. ఓ రెండు గంటలు ఏమీ తోచలేదు. ఖాళీగా కూర్చున్నాను. కొంతసేపటికి సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి ఓ గంట మాట్లాడేడు. ఆ తర్వాత మళ్లీ ఏం చేయాలో బోధపడలేదు. బాగా ఆకలేస్తే పార్సిల్ తెచ్చుకున్న పరోటాలు తిన్నాను. అప్పటికి టైం పదకొండు అయింది. నిద్ర నా మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టింది. దాన్నుంచి తప్పించుకోవడానికి, సెల్‌ఫోన్‌లో కాసేపు ఓ యాక్షన్ సినిమా చూశాను. బ్యాటరీ తక్కువగా ఉండటంతో ఇక అక్కడితో ఆపుచేసి, నా బ్యాగులో ఉన్న యండమూరి నవల ‘తులసీదళం’ తీసి చదవడం మొదలుపెట్టాను. వొంటరిగా చదువుతుంటే కాస్త భయమేసింది. టైం చూశాను. పనె్నండు ముప్పై. తీరంలో ఉన్న కొబ్బరి చెట్లు, నవలలో రాసినట్టు, దెయ్యం పూనినట్టుగా ఊగుతున్నాయి. పౌర్ణమి కాబోలు సముద్రం ఎగసెగసి పడుతోంది. పుస్తకం పక్కన పెట్టేసి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను. కిటికీలోంచి జోరుగా వీస్తున్న చల్లటి గాలికి ఎప్పుడు పట్టిందో నిద్ర. నాకు తెలియకుండానే పట్టేసింది. లేచి చూసేసరికి టైం ఒంటిగంట దాటింది. కర్తవ్యం గుర్తుకొచ్చి ఓసారి నలువైపులా పరీక్షగా చూశాను. దూరంగా కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా నా ఒళ్లు గగుర్పొడిచింది.
ఒంటరిగా తీరంలో నిల్చుని ఉంది. తెల్లటి చీర కట్టుకుని, సముద్రం వైపే చూస్తోంది. ఆమె పైటకొంగు గాలికి నెమ్మదిగా ఎగురుతోంది. చూస్తుంటే నా శరీరం భయంతో బిగుసుకుపోయింది.
‘ఇంత అర్ధరాత్రిపూట ఎవరబ్బా..? అదీ మనుషులెక్కువగా తిరగని ఈ ప్రాంతంలో. కొంపదీసి దెయ్యమా..?! ఆ ఆలోచన రాగానే నా ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అప్పుడర్థమైంది నాకు. ఇంతకు ముందున్న నైట్‌వాచ్‌మేన్ చెప్పాపెట్టకుండా ఎందుకు మానేశాడో. నా గుండె వేగం పెరిగింది. పారిపోదామనిపించింది. కానీ బయటకు అడుగు పెట్టడానికే భయమేసింది. ఎందుకైనా మంచిదని నెమ్మదిగా కిటికీ మూసి, సుబ్రహ్మణ్యానికి కాల్ చేశాను. వాడు నిద్రపోయాడు కాబోలు ఎంతసేపు రింగయినా తీయలేదు. ఇంకోసారి ప్రయత్నించబోయాను. బ్యాటరీ నిల్ అనే నోటిఫికేషన్ ఇచ్చి, ఫోన్ స్విచాఫ్ అయ్యింది. ప్రాణం పోయినంత పనయ్యింది నాకు. ఛార్జర్ మర్చిపోయి వచ్చినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఇక చేసేదేమీ లేక నుదుటి మీద చెమటను తుడుచుకుని, ఏమయిందో చూద్దామని మళ్లీ కిటికీ తెరిచాను. ఆమె ఇంకా అక్కడే ఉంది.
‘ఈ రోజు నా చావు ఖాయం’ అనుకుని కిటికీ మూసేయబోయాను. అప్పుడు కనిపించారు ఓ ఇద్దరు యువకులు. ఆమె వైపుగా నడుస్తూ, ఏం జరుగుతుందో చూద్దామని ఓరగా కిటికీ మూసి చూడసాగాను. ఆ ఇద్దరూ ఆమెతో నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు. ఆమె కూడా నవ్వుతోంది. అప్పుడు తట్టింది నాకు అసలు సంగతి. ఆ పిల్ల దెయ్యం కాదు, కేస్ అని. లేకపోతే అంత రాత్రిలో అక్కడెందుకుంటుంది? వాళ్లిద్దరూ ఆమెతో బేరమాడుతున్నట్లున్నారు. నాలో భయం పోయి, ఆసక్తి మొదలైంది. కిటికీని పూర్తిగా తెరిచి గమనించడం మొదలుపెట్టాను. ఇంకా బేరం కుదరనట్టుంది. వాళ్లామెతో వాదులాడుతూనే ఉన్నారు. కాసేపటికి ఆ వాదులాట కాస్తా గొడవగా మారింది. వాళ్లిద్దరిలో ఒకడు ప్యాంటు జేబులోంచి బటన్ కత్తి తీశాడు. ఆమె భయంతో కెవ్వున అరిచి అక్కడ్నించి పరిగెత్తింది. ఆమె వెనుకే ఆ ఇద్దరు కూడా పరిగెట్టారు. నాకేం చేయాలో తెలియలేదు. ఏదో ఒకటి చెయ్యకపోతే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. నా మెదడు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. సరే ఏదయితే అదవుతుంది, ముందు ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలనుకున్నాను. అనుకున్నదే తడవుగా చకచకా బూట్లు తొడుక్కుని, కర్ర తీసుకుని, గబగబా పరిగెత్తాను.
ముందు ఆ అమ్మాయి పరిగెడుతోంది. ఆ అమ్మాయి వెనుక వాళ్లు. వాళ్ల వెనుకే నేను.
వాళ్లు ఇద్దరు ఉన్నారు. నేనేమో ఒక్కణ్ణి. ఆమెతోపాటూ నన్ను కూడా చంపేస్తారేమోనన్న భయమేసింది. మళ్లీ అంతలోనే పాతాళభైరవిలో మాయల ఫకీరు నా బుర్రలోకి వచ్చి, ‘సాహసం సేయరా డింభకా’ అన్నాడు. ఏమో ఈమెను కాపాడితే నాకు రాజకుమారి కాకపోయినా, చెలికత్తె అయినా దొరుకుతుందేమో అనిపించింది. రేపొద్దున్న పేపర్లో నా గురించి రాబోయే వార్త గుర్తొచ్చింది.
‘అర్ధరాత్రి బీచ్ రోడ్‌లో యువతిని అత్యాచారం చేయబోయిన దుండగులు. ప్రాణాలకు తెగించి కాపాడిన ఓ యువకుడు. అతను ఏ సూపర్‌మేనో స్పైడర్‌మానో కాదు, ఒక సాధారణ వాచ్‌మేన్.’
అది తలంపునకు రాగానే ఒళ్లంతా సంతోషంతో పులకరించింది. పొద్దునకల్లా నేనో సెలబ్రిటీ అయిపోతానన్న ఊహ నాకు వంద ఏనుగుల బలాన్నిచ్చింది.
ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి, పక్కనే ఉన్న ఓ పాడుబడిన బంగళాలోకి దూరింది. వాళ్లు కూడా అటువైపు పరిగెత్తారు. నేను వాళ్ల వెనకనే మసక చీకట్లో నక్కి నక్కి వెంబడించాను. ఆ ఇద్దరూ బలిసిన ఆంబోతుల్లా ఉన్నారు. నేనేమో బక్కచిక్కిన కోతిలా ఉన్నాను. అందుకే మొరటుగా వాళ్ల మీదకు దూకడం కన్నా, ఆలోచించి తెలివిగా దెబ్బకొట్టడం మంచిదనుకున్నాను.
వాళ్లిద్దరూ బంగళా లోపలికెళ్లారు. నేను పెచ్చులూడిపోయిన ప్రహరీ గోడవారగా నడుస్తూ ‘ఈ రోజు నక్కతోక తొక్కాను కాబోలు. అందుకే ఈ అమ్మాయిని కాపాడే అవకాశం నాకొచ్చింది’ అని మనసులో అనుకుని రెండు అడుగులు వెయ్యగానే, ‘వౌ...’ అనే అరుపు వినిపించి బిత్తరపోయి దూరంగా ఎగిరిపడ్డాను. ఆ తర్వాత తెలిసింది నేను తొక్కింది నక్క తోక కాదు, అక్కడ పడుకున్న కుక్క తోకని. అది కుయ్యో.. కుయ్యాం.. అని మూలుగుతూ అక్కడ్నించి వెళ్లిపోయింది.
నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బంగళాలోకెళ్లాను. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. పావురాళ్ల కువకువలు తప్ప మరేమీ వినిపించడం లేదు. వాళ్లు ఎటువైపు వెళ్లారో అర్థం కాలేదు నాకు. చెవులు రిక్కించి ఏదైనా శబ్దం వినిపిస్తుందేమోనని చుట్టూ చూశాను. కాసేపటికి మేడ మీద నుంచి టక్.. టక్.. టక్‌మని బూట్ల చప్పుడు నా చెవిన పడింది. వెంటనే హాలులో ఉన్న మెట్ల మీదుగా సరాసరి మేడ మీదకు వెళ్లాను. ఒక్కో గదిని పరిశీలిస్తూ, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెదకసాగాను. ఇంతలో ఎవరో పరిగెడుతున్నట్టు మళ్లీ బూట్ల చప్పుడు. ఆమె ఎక్కడో దాక్కుంది. వాళ్లిద్దరూ ఆమె కోసం వెతుకుతున్నారు. వాళ్ల కంటే ముందు నేను ఆమెని కనిపెట్టి, అక్కడి నుంచి తీసుకెళ్లిపోవా లనుకున్నాను. మళ్లీ వెతకడం మొదలుపెట్టాను. కొన్ని నిమిషాల తర్వాత ‘కాపాడండీ.. కాపాడండీ’ అని కేకలు వినిపించాయి. వాళ్లామెను పట్టేసుకున్నారేమో అనుకుని అరుపులు వినిపించిన గది వైపు పరిగెత్తాను. తీరా వెళ్లి చూస్తే ఆ గదిలో ఎవరూ లేరు. నాకెందుకో నేను రావడం వాళ్లు గమనించారేమో ననిపించింది. చెమటతో చొక్కా మొత్తం తడిసిపోయింది. అయినా నిండా మునిగిన వాడికి చలేంటి? అని ధైరం తెచ్చుకుని అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడుస్తున్న వాడినల్లా, పక్క గదిలోంచి ఎవరిదో ఏడుపు వినిపించి చప్పున ఆగిపోయాను. అది ఆమె ఏడుపే. ఆ దుర్మార్గులు ఏం అఘాయిత్యానికి వొడికట్టారో ఏమో అనుకుంటూ మెల్లిగా తలుపు తీసుకుని లోపలికెళ్లబోయి, గుమ్మం దగ్గరే స్థాణువులా నిలబడిపోయాను. లోపల ఏముందో చూసేసరికి దాదాపు నా గుండె ఆగిపోయినట్టనిపించింది. ఆ ఇద్దరూ రక్తం కక్కుకుని నేల మీద నిశ్చలంగా పడున్నారు. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ, హృదయవిదారకంగా ఏడుస్తోంది. నల్లటి జుట్టులో దాగిన ఆమె ముఖం సరిగ్గా కనిపించడంలేదు. నాకు భయంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క క్షణం పాటు కాళ్లు చేతులు ఆడలేదు. ఇంతలో నెమ్మదిగా తలతిప్పి నా వైపు చూసిందామె. ఆమెకు కళ్లు లేవు. కళ్లు ఉండాల్సిన చోట రెండు గుంతలున్నాయి. ముఖం మీద చర్మం ముడతలు పడి వికారంగా ఉంది. పళ్లన్నీ బయటికి పొడుచుకొచ్చి ఉన్నాయి. బ్యార్‌మని గావుకేక పెట్టాను అప్రయత్నంగా. ఆ కేక బంగళా మొత్తం ప్రతిధ్వనించింది. శక్తినంతా కూడగట్టుకుని కిందికి పరిగెట్టాను. మెట్లు దిగి ముఖ ద్వారం వైపు దూసుకెళ్తున్న నన్ను, వెనక నుంచి తలపై గట్టిగా కొట్టారెవరో.
అంతే...!!
ఆ దెబ్బకి నా కళ్లు బైర్లు కమ్మాయి. సప్తవర్ణాలు ఒక దాని తర్వాత ఒకటి తళుక్కున మెరసి నలుపు వర్ణంలోకి మారిపోయాయి. నాకు స్పృహ తప్పింది.
* * *
కళ్లు తెరిచి చూసేసరికి నేనొక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నర్స్ నన్ను చూసి, పరిగెత్తుకుంటూ బయటకెళ్లింది. ఆమె వెళ్లిన కాసేపటికి డాక్టరూ, ఓ ఇద్దరు పోలీసు అధికారులు లోపలికొచ్చారు.
డాక్టర్ నా తలను కాసేపు పరీక్షించి, ‘యు కెన్ టాక్ టు హిమ్ నౌ’ అన్నాడు పోలీసుల వైపు తిరిగి.
నాకు ఏం జరుగుతుందో అర్థంకాక ఇన్‌స్పెక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆయన నా ఎదురుగా కూర్చుని, తమిళంలో ఏదో అడగబోయి,
‘సారీ తెలుంగు గదా.. మీరు కాపలాగా ఉన్న బంగళాలో రాత్రి దొంగతనం జరిగుండాది. పౌద్దునే వచ్చిన వాచ్‌మేన్‌కి మీరు కనిపించక పోవడంతో మాకు ఫోన్ చేసినాడు. మేం వచ్చి చుట్టుపక్కల వెత్తగా, మీరు ఒక పాడుబడిన బంగళాలో స్పృహ లేకుండా పడుండారు’ అంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్‌తో,
‘అంద కవరు కుడప్పా’ అన్నాడు.
కానిస్టేబుల్ ఏదో ప్లాస్టిక్ కవరు అయన చేతికి అందించాడు.
ఇన్‌స్పెక్టర్ అందులోంచి మాస్క్‌ని ఒకదాన్ని తీసి, ‘ఈ మాస్కు మీరు పడున్న బంగళా మేడ మీది గదిలో దొరికుండాది’ అంటూ చూపించాడు.
అప్పుడు గానీ నాకు అవగతమవలేదు. రాత్రి అదే మాస్కు వాడి నన్ను ట్రాప్ చేసి, నేను కాపలాగా ఉన్న బంగళాలో డబ్బులు ఎంత చాకచక్యంగా కొట్టేశారోనని. జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పేశాను. నా దగ్గర స్టేట్‌మెంట్ తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు. అరగంట తర్వాత సుబ్రహ్మణ్యం వచ్చి, పరామర్శించి బ్యాంకుకి బయల్దేరాడు.
నా తెలివితక్కువ తనానికి నా మీద నాకే కోపం వచ్చింది. అవమాన భారంతో సతమతమవుతున్న మనసుని కుదుటపరచడానికి ఎదురుగా ఉన్న టీవీ ఆన్ చేశాను. లావుపాటి వ్యక్తి ఒకతను వార్తలు చదువుతున్నాడు.
‘బ్రేకింగ్ న్యూస్. రాత్రి బీచ్‌రోడ్‌లో వాచ్‌మేన్‌ను ఏమార్చి ఓ బంగళాలో దొంగలు పడ్డారు. పోయిన నగదు దాదాపు నాలుగు కోట్లని అంచనా...’
వింటున్న నాకు ఎవరో సుత్తితో గట్టిగా తల మీద కొట్టినట్లు అనిపించింది. నీరసంతో మళ్లీ నాకు స్పృహ తప్పింది.
*
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయిల్‌లో పంపాలి.
**

-వెంకట్ ఈశ్వర్ 78930 78164