S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తప్పటడుగులు

ఆ రోజు ఆదివారం. సునంద వరండాలో కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. వాతావరణం మరీ ఎండగానూ, మరీ చలిగానూ కాకుండా సమశీతోష్ణంగా ఉంది. సన్నగా గాలి వీస్తోంది. మెట్ల పక్కన పెట్టిన కుండీల్లోంచి పూల సువాసన గాలలో తేలివస్తోంది.
పుస్తకం చదవటం ఆపి ఎందుకో తలెత్తి చూసిన సునందకి ఎదురింటి మేడ మీద బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి బ్లూకలర్ డ్రెస్ మీద వైట్ చున్నీ వేసుకుని జుట్టు దువ్వి వదిలేసింది. గాలికి ముఖం మీద పడుతున్న వెంట్రుకలను ఎడం చేత్తో పక్కకి సరిచేసుకుంటూ ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతూంది. ఆ అమ్మాయిని వారం క్రితం మొదటిసారి చూసింది సునంద. ‘ఇప్పుడు వచ్చే సినిమాల్లో పరభాషా హీరోయిన్లకన్నా ఈ అమ్మాయిలే నయం. మొహం కళగా వుంది’ అనిపించింది సునందకి ఆ అమ్మాయిని చూడగానే. ఆమెకి ఇరవై మూడు, ఇరవై నాలుగేళ్లు ఉండవచ్చు. ఆమె భర్త కాబోలు అతనికి కూడా పాతికేళ్లలోపే ఉంటుంది. ఇద్దరూ చూడముచ్చటగా ఉంటారు.
ప్రతిరోజూ సునంద స్కూల్‌కి బయలుదేరుతూండగా వాళ్లు కూడా ఉద్యోగానికి వెళుతూ ఎదురుపడతారు. బైక్ బయటకి తీస్తూంటాడు అతను. సునంద ఆ అమ్మాయిని పలకరించాలనుకుంది. కానీ వాళ్లు ఈ లోకంలో లేనట్లు చుట్టుపక్కల వాళ్లని పట్టించుకోకుండా వెళ్లిపోతారు.
సునంద స్నేహశీలి. అటు స్కూల్లో తోటి టీచర్లతోనూ, ఇటు ఇంటి దగ్గర ఇరుగు పొరుగు ఆడవాళ్లతోనూ కలివిడిగా ఉంటుంది. నెలకి ఒకసారి ఏదో ఒక కారణంతో అందరూ ఒకచోట కలుసుకుని సరదాగా గడుపుతారు. ఎవరైనా కొత్తగా వచ్చినా ఏదో విధంగా వారితో పరిచయం చేసుకుని తమ జట్టులో కలిపేసుకుంటుంది సునంద. ఈ రోజు ఈ అమ్మాయిని కూడా పరిచయం చేసుకుందాం, ఆదివారం కాబట్టి వాళ్లు కూడా ఖాళీగానే ఉండి ఉంటారు అనుకుని లేచింది. గేటు తెరచుకుని ఎదురింట్లోకి వెళ్లింది. గేటు తీసిన శబ్దానికి ఆ ఇంట్లో ఆమె వచ్చి చూసి ‘మీరా సునందగారూ!’ అన్నది నవ్వుతూ.
‘పైన ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారు. పలకరిద్దామని...’ అన్నది సునంద.
‘కావ్యా వాళ్లా! అవును. వారం క్రితం అద్దెకు దిగారు’ అన్నది.
సునంద మెట్లెక్కి పైకి వచ్చేసరి కావ్య ఫోన్ మాట్లాడటం అయిపోయి, లోపలకి పోయి తలుపేసుకుంది. సునంద చిన్నగా తలుపు కొట్టింది. కావ్య తలుపు కొద్దిగా తెరిచి తల బైటకి పెట్టి ‘ఎవరండీ’ అని అడిగింది.
‘మేం ఎదురింట్లో ఉంటాము’ చెప్పింది సునంద.
‘ఏం పని మీద వచ్చారు?’ అడిగింది.
‘ఈ పుస్తకం చాలా బాగుంది. నువ్వు కూడా చదువుతావేమోనని తెచ్చాను’
‘సారీ! నాకు బుక్ రీడింగ్ అలవాటు లేదు’ తలుపు టప్‌మని మూసేసింది. సునంద చిన్నబోయిన ముఖంతో వెనుదిరిగింది.
‘ఎవరు కావ్యా?’ లుంగీ, బనీనుతో ఉన్న రాహుల్ కిచెన్‌లో నుంచీ గరిట పట్టుకుని బయటకు వచ్చాడు.
‘ఎదురింటామె! ఈ అమ్మలక్కలకి పనీపాటా ఉండదు. కాస్త కొత్త మొహం కనపడగానే కబుర్లకి తయారవుతారు. అవతల వాళ్లకి ఏమైనా పని ఉందేమో డిస్ట్రబ్ చేసినట్లు అవుతుందేమో అని కొంచెం కూడా ఆలోచించరు’ కావ్య టి.వి. ఎదురుగా సోఫాలో కూర్చుని రిమోట్ చేతిలోకి తీసుకుంది.
‘సరే! లంచ్ రెడీ! డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తావా?’ అడిగాడు రాహుల్.
‘అబ్బా! అంత దూరం రాలేను. బౌల్‌లో పెట్టి స్పూన్ వేసి ఇవ్వు. టీవీ చూస్తూ తింటాను’ అన్నది.
‘విత్ ప్లెజర్ మై ఏంజిల్!’ రాహుల్ లోపలకి వెళ్లి చిన్న గినె్నలో అన్నం, కూర కలిపి తెచ్చాడు. కావ్య సోఫా ముందున్న టీపాయ్ మీద కాళ్లు బారజాపి స్పూన్‌తో తింటూ ‘ఆలూ కర్రీ సూపర్’ అన్నది బొటనవేలు, చూపుడు వేలు కలిపి సున్నాలా చుట్టి చూపిస్తూ.
‘ఓకే కావ్యా! నీకో గుడ్‌న్యూస్’ అన్నాడు రాహుల్.
‘ఏమిటి’ అన్నట్లు నొసలు ఎగరేసింది. ‘నిన్న నీ కోసం ఆర్డర్ ఇచ్చిన టూ వీలర్ రేపు వస్తుంది. ఇక నుంచీ ఎవరి జాబ్‌లకు వాళ్లు ఫ్రీగా వెళ్లొచ్చు. నేను దింపవలసిన పనిలేదు’
‘అలాగా’ అన్నట్లు ఊరుకుంది కావ్య.
‘నాకు థాంక్స్ చెప్పవా’ అన్నాడు గోముగా చూస్తూ.
‘దేనికి? దటీజ్ యువర్ డ్యూటీ. నన్ను బాగా చూసుకుంటావనే కదా, మా పేరెంట్స్‌ని వదిలి నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నది!’ అన్నది.
రాహుల్ ఒక్క క్షణం ఆశాభంగంగా చూసి బెడ్‌రూంలోకి వెళ్లి లాప్‌టాప్ ఓపెన్ చేవాడు. ఒక అరగంట అయిన తర్వాత టీవీ ఆఫ్ చేసి పక్క గదిలోకి వెళ్లింది కావ్య.
రాహుల్ సెల్‌ఫోన్‌లో మెసేజ్ సౌండ్ వచ్చింది. లాప్‌టాప్ పక్కన పెట్టి సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకుని వాట్సప్ ఓపెన్ చేశాడు. ‘రాహుల్! ఏం చేస్తున్నావ్?’ కావ్య మెసేజ్ చేసింది.
‘లాప్‌టాప్‌లో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను’ రిప్లై ఇచ్చాడు.
‘నన్ను అడగకుండా నా బెడ్‌రూంలోకి నువ్వు రావద్దు. నిన్ను అడగకుండా నీ బెడ్‌రూంలోకి నేను రాను. భార్యాభర్తల మధ్య అయినా ప్రైవసీ ఉండాలి’ మళ్లీ మెసేజ్ పెట్టింది.
‘ఓకే’ అన్నట్లు ఎమోజీ పంపాడు రాహుల్.
‘ఈవినింగ్ నీ ప్రోగ్రాం ఏమిటి?’ కావ్య మెసేజ్.
‘కొత్త సినిమా వచ్చింది వెళుతున్నాను. మరి నువ్వు..?’ రాహుల్ రిప్లై.
‘సినిమా నాకు బోర్! షాపింగ్ మాల్‌కి వెళ్లి అలా అలా తిరిగి ఎంజాయ్ చేసి వస్తా’
సరే!’ అన్నట్లు మళ్లీ ఎమోజీ పంపాడు.
‘నా దారికి నువ్వు అడ్డు రావద్దు. నీ దారికి నేను అడ్డు రాను. ఓకేనా!’
‘ఓకే’ మెసేజ్ చేశాడు.
ఎదురింట్లో చక్రపాణి పీట మీద కూర్చుని భోజనం చేస్తూంటే సునంద కూడా పక్కనే కూర్చుని మాటలు చెబుతూ వడ్డిస్తోంది. ‘ఆ అమ్మాయి ఆ ఒక్క మాట చెప్పి ముఖం మీదే తలుపేసుకుందండీ! నా మనసు చివుక్కుమంది. ఇరుగుపొరుగు అన్న తర్వాత కాస్త మంచీ చెడు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా!’
‘పోనే్ల సునందా! వాళ్లకి ఏం అర్జెంట్ పనులున్నాయో ఏమిటో! చిన్న విషయం గురించి అంతసేపు ఆలోచించటం దేనికి?’ అన్నాడు చక్రపాణి భోజనం ముగించి చేతులు కడుక్కుంటూ.
‘అంతే లెండి!’ తుడుచుకోవటానికి టవల్ అందిస్తూ నిట్టూర్చింది సునంద.
* * *
తూర్పున తెలతెలవారుతోంది. ఇంకా చీకట్లు విడిపోలేదు. సునంద తల మీద స్నానం చేసి తలకి తెల్లటి టవల్ చుట్టుకుని పట్టుచీరె కట్టుకుని దేవుడి దగ్గర పూజ చేస్తోంది. పూజా మందిరం పూలతో అలంకరించి ఉంది. నూనె కుందుల్లో దీపాలు వెలుగుతున్నాయి. రెండు గుండ్రటి కొబ్బరి చిప్పలు దేవుడి ఎదురుగా పెట్టున్నాయి. అరటిపండు మధ్యలో అగరొత్తులు గుచ్చి ఉన్నాయి. ఇల్లంతా శుభ్రంగా, అగరొత్తుల సువాసనతో నిండి ఉంది. చక్రపాణి కూడా స్నానం చేసి తెల్లటి ధోవతి, లాల్చీ కట్టుకుని వచ్చాడు.
దేవుడి ముందు నిలబడి ఏకాగ్రతగా కళ్లు మూసుకుని ‘స్వామీ! మేమిద్దరం ఎవరి మీదా ఆధారపడకుండా ఇలా తిరుగుతూనే వెళ్లిపోయేటట్లు చెయ్యి’ అనుకున్నాడు సునంద గంట గణగణ మోగించి లేచి నిలబడి కొబ్బరి నీళ్ల తీర్థం ఇచ్చింది. చక్రపాణి తాగాడు. పూలసజ్జలో పసుపు, కుంకుమ, వత్తులు సర్దుకుంటూ ‘నేను శివాలయానికి వెళ్లి కార్తీక దీపం వెలిగించి వస్తాను. ఇడ్లీలు హాట్‌బాక్స్‌లో పెట్టాను. ఆకలయితే తినండి’ అంది.
‘తొందరేం లేదులే సునందా! నువ్వు కూడా వచ్చిన తర్వాత కలిసే టిఫిన్ చేద్దాం’ అని చెప్పి న్యూస్‌పేపర్ కోసం వరండాలోకి నడిచాడు. అప్పటికే చుట్టుపక్కల ఆడవాళ్లు కూడా పూలసజ్జలు పట్టుకుని వచ్చి ‘సనందగారూ’ అని పిలిచారు. సునంద లోపలి నుంచీ బయటకు వచ్చి వాళ్లతో కలిసి వెళ్లిపోయింది. చక్రపాణి గేటు దగ్గర పడి ఉన్న న్యూస్‌పేపర్ తీసుకుని లోపలకి వచ్చాడు.
ఉదయం ఎనిమిదింటప్పుడు ఎదురింట్లో ఉయ్యాల బల్ల మీద కూర్చుని సునంద, ఆ ఇంటావిడ లక్ష్మి మాట్లాడుకుంటున్నారు. కావ్య ఆఫీస్‌కి రెడీ అయి హ్యాండ్‌బ్యాగ్ భుజానికి తగిలించుకుని మెట్లు దిగి కిందికి వస్తోంది. ‘కావ్యా! మా అందరితోపాటు నువ్వు కూడా కార్తీక దీపాలు వెలిగించటానికి వస్తే బాగుండేది కదా!’ అన్నది లక్ష్మి.
‘నాకు అంత టైం ఉండదు ఆంటీ!’ అంది కావ్య.
‘పోనీ ఎల్లుండి వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు, అబ్బాయి అప్పుడైనా తప్పకుండా రావాలి’
‘రాహల్‌కి వీలవుతుందో లేదో చూద్దాం.. మెసేజ్ పెడతాను’
‘అదేమిటమ్మా! ఫోన్ చేసి అడగొచ్చుగా! ఎంత పని?’ సునంద అన్నది.
‘తను ఏదైనా బిజీ వర్క్‌లో ఉండి ఉంటాడేమో! మెసేజ్ పంపితే వీలయినప్పుడు చూసుకుని రిప్లై ఇస్తాడు’ స్కూటీ స్టార్ట్ చేసి వెళ్లిపోయింది కావ్య.
‘్భర్యతో కూడా మాట్లాడలేనంత బిజీనా?’ విస్మయంగా అడిగింది సునంద లక్ష్మితో.
‘ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. ఇరువైపుల తల్లిదండ్రులకీ ఇష్టం లేదట. బంధువులు ఎవరూ రావటంలేదు’
‘పోనీ నలుగురితో కలివిడిగా ఉంటే మనలాంటి వాళ్లు కష్టం సుఖం కనుక్కుంటాం కదా! అంటీ ముట్టనట్లు ఉంటారు’
‘ఇప్పటి తరం వాళ్లు అంతే!’ అన్నది లక్ష్మి.
వారం తర్వాత, ఆ రోజు హాస్పిటల్‌లో రిసెప్షన్‌లో కూర్చుని కావ్య వెక్కివెక్కి ఏడుస్తోంది. సునంద, లక్ష్మి ఆ అమ్మాయికి చెరొక పక్కన చెమర్చిన కళ్లతో కూర్చుని ఉన్నారు. ‘రాహుల్ బండి సర్వీసింగ్‌కి ఇచ్చాడు ఆంటీ! ఇద్దరం ఒకే బండి మీద వెళుతున్నాం. ఇంతలో ఫోన్ రింగయింది. రాహుల్ ఫోన్ మాట్లాడుతూ ముందు వెళుతున్న బస్‌ను ఓవర్‌టేక్ చేయబోయాడు. ఎదురు నుంచీ ఆటో స్పీడ్‌గా వచ్చి గుద్దేసింది. అప్పటికీ సడెన్ బ్రేక్ వేశాడు రాహుల్. అయినా ఇద్దరం కింద పడ్డాం’ అన్నది కావ్య ఏడుస్తూ.
‘్ఫన్ మాట్లాడుతూ బండి నడపటం తప్పు’ అని చెబుదామనుకుంది సునంద. కానీ ఆ సమయంలో అలా మాట్లాడకూడదనిపించింది. రాహుల్‌కి బాగా దెబ్బలు తగిలాయి. సర్జరీ చేయాలన్నారు. కావ్య మోకాళ్లు, మోచేతులు కొట్టుకుపోయాయి. బ్యాండేజ్ వేశారు. స్కూల్ నుంచీ రాగానే లక్ష్మి వచ్చి ఈ విషయం చెబుతూంటే మంచినీళ్లయినా తాగకుండా వెంటనే బయల్దేరింది సునంద. ‘పాపం! వాళ్లకి పెద్దవాళ్లు ఎవరూ దగ్గర లేరు. వెళ్లకపోతే ఎలా?’ అనిపించింది. చక్రపాణి కూడా ఆఫీస్ నుంచీ వచ్చేశాడు.
రాహుల్‌ని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకువెళ్లారరు. చక్రపాణి దగ్గరుండి అవన్నీ చూసుకుంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచీ కావ్య ఏడుస్తూనే ఉంది. ఆ అమ్మాయిని ఎంత ఓదార్చినా కళ్ల వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి.
‘ఫేస్‌బుక్‌లో వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఎంతో అభిమానంగా మాట్లాడతారు. యాక్సిడెంట్ జరిగినట్లుగా చెప్పి, నాకు శాలరీ రావటానికి పది రోజులు పడుతుందనీ, డబ్బు సాయం చేయమని అడిగితే నన్ను అన్‌ఫ్రెండ్ చేశారు’ అన్నది కావ్య వెక్కుతూ.
ఆ అమ్మాయి అమాయకత్వానికి జాలీ, నవ్వు రెండూ కలిగాయి సునందకు. నవ్వటానికి సమయం కాదని నిగ్రహించుకుంది. ‘నువ్వు అవన్నీ ఆలోచించవద్దు. నేను, మీ అంకుల్ చూసుకుంటాం’ ఓదార్పుగా భుజం చుట్టూ చెయ్యి వేసింది సునంద.
కొద్దిసేపటి తర్వాత చక్రపాణి అక్కడికి వచ్చాడు. అలసినట్లుగా జుట్టు రేగి ఉంది. ఆయన్ని చూడగానే ముగ్గురూ

తప్పటడుగులు (7వ పేజీ తరువాయ)
లేచి నిలబడ్డారు. ‘రాహుల్‌కి ఎలా ఉందండీ?’ అడిగింది సునంద.
‘ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రమాదం నుంచీ బయటపడినట్లే!’ అన్నాడు. సునంద రిలీఫ్‌గా నిట్టూర్చింది. ‘అదృష్టవశాత్తూ రాహుల్ హెల్మెట్ పెట్టుకున్నాడు. లేకపోతే తలకి దెబ్బ తగిలి ఇంకా సీరియస్ అయ్యేది’ అన్నాడు చక్రపాణి.
‘దేవుడి దయ వల్ల తొందరగా తగ్గిపోతే తిరుపతి వస్తానని మొక్కుకో కావ్యా!’ అన్నది లక్ష్మి.
‘ఓకే ఆంటీ! నేను ప్రామిస్ చేస్తున్నాను. తిరుపతి వస్తాను’ అన్నది.
‘ఒక పావుగంటలో ఆపరేషన్ థియేటర్ నుంచీ రూంకి తీసుకువస్తారు. మనం వెళ్లి చూడవచ్చు’ అన్నాడు చక్రపాణి.
పది రోజుల తర్వాత-
రాహుల్ దిండుకు ఆనుకుని బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. ఈ రోజే హాస్పిటల్ నుంచీ డిశ్చార్జి అయి వచ్చాడు. నుదుటికి, కాళ్లకి, చేతులకి అక్కడక్కడ ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. చక్రపాణి, సునంద, కావ్య, లక్ష్మి అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఈ పది రోజులూ చక్రపాణి, సునంద ఆత్మబంధువుల్లాగా ఆదుకున్నారు. హాస్పిటల్ ఖర్చు అంతా చక్రపాణి పెట్టుకున్నాడు. ఎంత అయిందని అడగలేదు కావ్య. ఎంతయినా ఇప్పుడు తన దగ్గర డబ్బు లేదు. సాధ్యమైనంత త్వరగా వడ్డీతోసహా తీర్చివేయాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. సునంద ప్రతిరోజూ ఇంటి దగ్గర నుంచీ భోజనం తీసుకుని హాస్పిటల్‌కి వస్తూంది. సునంద స్కూల్‌కి వెళ్లినప్పుడు లక్ష్మి హాస్పిటల్‌లో కూర్చునేది. కావ్య సునంద వెంటే తిరుగుతూ, పనిలో సాయం చేసేది. ఈ పది రోజుల్లో చాలా దగ్గరయింది కావ్య.
‘ఆంటీ! మీరిద్దరూ చాలా హెల్ప్ చేశారు. మా పేరెంట్స్, రాహుల్ వాళ్ల పేరెంట్స్‌కన్నా, మా కొలీగ్స్‌కన్నా ఎక్కువగా చేశారు. మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటంలేదు’ అన్నది కావ్య.
‘ఇరుగుపొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగమ్మా! మీలాంటి యువత అస్తమానం సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ, ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాతోనే ఎక్కువగా గడుపుతున్నారు. చుట్టుపక్కల వాళ్లని పట్టించుకోవటం లేదు. ఎదురుపడినా కూడా అపరిచితులలాగా వెళ్లిపోతున్నారు. పలకరింపులు తగ్గిపోయాయి. మనుషుల మధ్య మాటలు తగ్గిపోయి వస్తువులకు దగ్గర అవుతున్నారు.
మనం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మనుషులతో అనుబంధం మర్చిపోకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలసిమెలసి ఉంటే ఐకమత్యంగా జీవించటంలో గల ఆనందం తెలుస్తుంది. ఫేస్‌బుక్‌లో వెయ్యిమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కరు కూడా సాయం చేయలేదని చెప్పావు. ఇలాగే ఏదో ఒక కష్టం చెప్పి మోసం చేసి డబ్బు గుంజేవాళ్లు చాలామంది ఉంటారు. ఫేస్‌బుక్ స్నేహాల్లో బలమైన స్నేహితులు ఉండరు. ముఖాముఖి స్నేహం చేసినప్పుడే ఎవరు ఎలాంటి వారో అర్థం అవుతుంది’ అన్నది సునంద.
‘నిజమే ఆంటీ! మా తరం వారు ప్రైవసీ పేరుతో అందరికీ దూరంగా ఉంటూ అడ్డుగోడలు కట్టుకుంటున్నాం. మా ఇష్టాయిష్టాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒంటరిగా ఉండిపోతున్నాం. పదిమందితో కలిసి జీవించాలంటే మా వ్యక్తిగత ఇష్టాలకు ప్రయారిటీ తగ్గించుకోవాలి’ అన్నాడు రాహుల్ ఇదంతా వింటూ.
‘అలాగని టెక్నాలజీకి దూరంగా ఉండమనటం లేదు. అవసరమైనంత వరకే ఉపయోగించాలి. చదువుకన్నా, డబ్బుకన్నా విలువైనది జీవితం. అలాగే ఇంకో మాట. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకువస్తే వారిని బాధపెట్టడం సబబు కాదు. నీకు ఇలా జరిగిందని ఫోన్ చెయ్యి రాహుల్! కన్నవారికి తాత్కాలికమైన కోపమే కానీ దీర్ఘ వైరం ఉండదు’ అన్నాడు చక్రపాణి.
‘అలాగే అంకుల్! మేం తెలిసో తెలియకో లైఫ్‌లో తప్పటడుగులు వేస్తే మీవంటి వారు సరిదిద్ది, సరైన గైడెన్స్ ఇస్తున్నారు’ అన్నాడు రాహుల్.
‘పెద్దవాళ్లు ఉన్నది అందుకే కదా!’ అన్నది సునంద.
‘మీ ఇద్దరూ ఇంత మంచివారని అనుకోలేదు ఆంటీ!’ అన్నది కావ్య.
‘్భలేదానివే! అర్థం చేసుకునే మనసుండాలి గానీ మంచివాళ్లు కానిదెవరు?’ నవ్వుతూ అన్నది సునంద.

----------------------------------------------------------------------------------------------------------------------------
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

గోనుగుంట మురళీకృష్ణ 97012 60448