S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 104 మీరే డిటెక్టివ్

ఇలా దుఃఖించే కౌసల్యని ఓదార్చి రాజభార్యలంతా ఆశ్రమాన్ని చేరి అక్కడ స్వర్గం నించి భూమికి వచ్చిన దేవతలా ఉన్న రాముడ్ని చూశారు. సమస్త భోగాలని వదిలి ఆశ్రమంలో ఉన్న రాముడ్ని చూడగానే కౌసల్యా, ఇతర తల్లులు విచారంతో పెద్దగా ఏడ్చారు. మనుషుల్లో శ్రేష్ఠుడు, మాట తప్పని రాముడు లేచి ఆ తల్లులందరి పాదాలని తాకి నమస్కరించాడు. విశాలమైన కళ్లు గల కౌసల్య, ఇతరులు స్పృశించటానికి సుఖంగా ఉన్న మృదువైన వేళ్లు, అరచేతులు ఉన్న మంగళకరమైన చేతులతో రాముడి వీపునకు అంటుకుని ఉన్న పరాగాన్ని దులిపారు. ఆ తల్లులని చూసి విచారించే లక్ష్మణుడు కూడా రాముడి తర్వాత తల్లులు అందరికీ నమస్కరించాడు. దశరథుడి భార్యలంతా మంగళకరమైన లక్షణాలు గల లక్ష్మణుడ్ని రాముడ్ని ఆదరించినట్లే ఆదరించారు. బాధపడే సీత కూడా అత్తగార్ల పాదాలని తాకి నమస్కరించి, కన్నీరు కారుస్తూ వారి ఎదుట నిలబడింది. వనవాసంతో కృశించి, దుఃఖంతో బాధపడే, దీనురాలైన సీతని కౌసల్య కౌగిలించుకుని చెప్పింది.
‘జనకుడి కూతురు, దశరథుడి కోడలు, రాముడి భార్యైన సీత కూడా ఈ నిర్జనమైన అడవిలో ఈ విధంగా కష్టపడాల్సి వచ్చింది కదా? సీతా! ఎండకి ఎండిన పద్మంలా, నలిగిన కలువలా, దుమ్ము పట్టిన బంగారంలా, మేఘాలు కప్పిన చంద్రబింబంలా ఉన్న నిన్ను చూడగానే కష్టాలనే అరణి నించి పుట్టిన విచారమనే అగ్ని, తనకి ఆశ్రయం ఇచ్చిన చెక్కని కాల్చేసినట్లు నా మనసుని బాగా కాల్చేస్తోంది.’
బాధపడుతూ తల్లి ఇలా చెప్తూండగా రాముడు వశిష్టుడి దగ్గరకి వెళ్లి ఆయన పాదాలకి కూడా నమస్కరించాడు.
అప్పుడు రాముడు, అగ్నితో సమానుడు, మహాతేజశ్శాలైన వశిష్టుడి పాదాలని దేవతల ప్రభువైన ఇంద్రుడు విశ్వామిత్రుడి పాదాలని తాకినట్లు తాకి ఆయన పక్కన కూర్చున్నాడు. వారు కూర్చున్నాక ధర్మాత్ముడైన భరతుడు, మంత్రులు, ప్రధాన పౌరులు, సైనికులు, ధర్మం తెలిసిన ప్రజలు రాముడికి దగ్గరగా కూర్చున్నారు. ఆ సమయంలో ముని వేషంలో తేజస్సుతో వెలిగే రాముడ్ని చూసి భరతుడు నమస్కరిస్తూ రాముడి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు భరతుడు ఏం మంచి మాటలు చెప్తాడా అని అక్కడ చేరిన ప్రజలందరికీ కుతూహలం కలిగింది. సత్యమైన ధైర్యం గల రాముడు గొప్ప ప్రభావం గల లక్ష్మణుడు, ధార్మికుడైన భరతుడు, మిత్రులంతా చుట్టూ కూర్చుని ఉండగా యజ్ఞశాలలో చుట్టూ సదస్సులు కూర్చున్న మూడు అగ్నుల్లా ప్రకాశించారు.
(అయోధ్యకాండ సర్గ 104వ సర్గ 16వ శ్లోకం నించి చివరి దాకా)
స్నేహితులతో కూర్చున్న పురుష శ్రేష్ఠులైన నలుగురు అన్నదమ్ములు విచారిస్తూండగానే ఆ రాత్రి అతి కష్టంగా గడిచింది. తెల్లారాక ఆ సోదరులంతా తమ స్నేహితులతో కలిసి మందాకినీ నదీ తీరంలో హోమజపాలు చేసుకుని రాముడి దగ్గరకి వచ్చి, ఎవరూ ఏమీ మాట్లాడకుండా వౌనంగా కూర్చున్నారు. స్నేహితుల మధ్య కూర్చున్న భరతుడు మాత్రం రాముడితో చెప్పాడు.
‘మన తండ్రి మాటలు మన్నించి నాకు రాజ్యాన్నిచ్చావు. దాన్ని నీకే తిరిగి ఇచ్చేస్తున్నాను. నిష్కంటకమైన ఈ రాజ్యాన్ని అనుభవించు. వర్షాకాలంలో నీటి వేగం వల్ల తెగిన వంతెనలా గొప్పదైన ఈ విశాల రాజ్యాన్ని నువ్వు తప్ప ఎవరూ నిలపలేరు. గాడిద గుర్రం నడకని ఎలా అనుసరించలేదో, సాధారణ పక్షి గరుత్మంతుడి గమనాన్ని ఎలా అనుసరించలేదో అలాగే నీ గమనాన్ని అనుసరించే శక్తి నాకు లేదు రాజా. సదా ఇతరులు తమ జీవిక కోసం ఎవరిని ఆశ్రయిస్తారో అతని జీవితం మంచి జీవితం. ఎవడు ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో వాడిది చెడ్డ జీవితం. రామా! ఓ పురుషుడు ఓ చెట్టుని నాటి దాన్ని పెంచితే అది పొట్టివాడు ఎక్కడానికి శక్యం కానంత లావైన మానుగల మహా వృక్షంగా పెరిగి, పుష్పించి, ఫలాలని మాత్రం ఇవ్వకపోతే దాన్ని దేని కోసం నాటాడో అతనికి ఆ ఆనందం కలగదు. ప్రభువుల్లో శ్రేష్టుడివైన నువ్వు సేవకులమైన మమ్మల్ని పరిపాలించకపోతే ఈ ఉదాహరణలోని అర్థాన్ని గ్రహించు. (నువ్వు రాజ్యాభిషేకానికి అంగీకరించకపోతే మన తండ్రి దశరతుడు ‘నువ్వు రాజువై ప్రజలందరినీ పరిపాలిస్తావు’ అనే అశతో చిన్ననాటి నించి నిన్ను పెంచిన శ్రమంతా వ్యర్థమవుతుంది అని భావం) మహారాజా! శతృసంహారకుడివైన నువ్వు రాజై, తపింపచేసే సూర్యుడిలా ప్రకాశిస్తూంటే శ్రేష్టమైన శ్రేణులన్నీ నిన్ను చూసి ఆనందించు గాక! రామా! నిన్ను అనుసరించి వచ్చే మదించిన ఏనుగులు గర్జించు గాక! అంతఃపురంలోని స్ర్తిలు కుదుటపడ్డ మనసులతో ఆనందించెదరు గాక!’
భరతుడు చెప్పిన ఆ మాటలు విని అయోధ్యావాసులైన జనులు ‘ఇది చాలా బావుంది’ అని అనుకున్నారు. పరాక్రమశాలి, స్థిరమైన బుద్ధి గల రాముడు దుఃఖితుడై విలపించే భరతుడ్ని ఓదార్చాడు.
‘ఏ పురుషుడికి స్వాతంత్రం కాని, తన ఇష్టం వచ్చినట్లు పనులు చేసే సామర్థ్యం కాని లేదు. ప్రతీ ఒక్కడ్నీ దైవం ఇటు, అటు లాగుతూంటాడు. ఎంత పోగు చేసినా ధనం చివరకి నశించక తప్పదు. ఎంత ఉన్నతి పొందినా ప్రతీ ఒక్కడూ పతనం పొంది తీరుతాడు. మానవుల పరస్పర సంబంధాలు చివరికి వియోగంతో అంతమవుతాయి. పుట్టినవాడు మరణించక తప్పదు. పండిన పళ్లకి చెట్టు నించి పడిపోవడం అనేది ఒకటే భయం. అలాగే జన్మించిన మానవుడికి మరణమే భయం. ఎంత దృఢమైన స్తంభాలతో నిర్మించినా కొంత కాలానికి అది జీర్ణమై కూలిపోతుంది. అలాగే మనుషులు కూడా ముసలితనం, మృత్యువులకి వశులై నశిస్తారు. గడిచిన రాత్రి తిరిగి రాదు. నీటితో నిండిన యమునా నది నీరు సముద్రంలో ప్రవేశించాక తిరిగి వెనక్కి రాదు కదా? గడిచిపోతున్న రాత్రులు, పగళ్లు గ్రీష్మ కాలంలో సూర్య కిరణాలు నీటిని పీల్చివేసినట్లు సమస్త ప్రాణుల ఆయుర్దాయాన్ని క్షీణింపచేస్తున్నాయి. నించుని ఉన్నా, నడుస్తున్నా నీ ఆయుర్దాయం తగ్గిపోతూంటుంది. అందువల్ల నువ్వు నీ గురించే విచారించు. ఇతరుల గురించి ఎందుకు విచారిస్తావు? మానవుడు ఎక్కడికి వెళ్లినా మృత్యువు కూడా అతన్ని అనుసరించి వెళ్తుంది. కూర్చునే వాడు మృత్యువుతో కలిసే కూర్చుంటాడు. ఎంత దీర్ఘ ప్రయాణాలు చేసినా మృత్యువుతో కలిసే తిరిగి వస్తున్నాడు. శరీరం మీద ముడతలు పడ్డాయి. వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి. ఇలా ముసలితనంతో జీర్ణించిన మనిషి ఏం చేసినా తనని సమర్థుడిగా చేసుకోలేడు. సూర్యుడు ఉదయించగానే మనుషులు తమ పనులు చేసుకోవచ్చు కదాని సంతోషిస్తున్నారు. సూర్యుడు అస్తమించగానే విశ్రాంతి సుఖాన్ని పొందచ్చని సంతోషిస్తున్నారు తప్ప తమ ఆయుర్దాయం క్షీణిస్తోందని తెలుసుకోవడం లేదు.
‘కొత్త ఋతువు ప్రారంభం చూడగానే మానవులు ఇప్పుడు కొత్తకొత్త పూలు, పళ్లు వచ్చాయి కదా అని సంతోషిస్తున్నారు కాని ఋతువులు మారడం చేత ప్రాణుల ఆయుర్దాయం కూడా క్షీణిస్తుంది. అలాగే భార్యలు, కొడుకులు, బంధువులు, ధనం కొంత కాలం కలిసి ఉండి విడిపోతాయి. వీళ్లు విడిపోవడం తప్పదు. ఈ లోకంలో ఏ ప్రాణి కూడా తనిష్టం వచ్చినట్లు ప్రవర్తించలేదు. అందువల్ల మరణించిన వాడికి కాని, మరణించిన వాడి గురించి ఏడ్చే వాడికి కాని మరణ విషయంలో సామర్థ్యం లేదు. కొందరు బాటసారులు గుంపులుగా నడిచి వెళ్లిపోతూండగా ‘మీ వెనకే నేను కూడా వస్తున్నాను’ అని దారిలో ఉన్న ఒకడు చెప్పినట్లు, పూర్వీకులైన తండ్రులు, తాతలు వెళ్లిన దారి అందరికీ నిశ్చితమైంది. తిరుగులేని ఆ మార్గాన్ని పొందేవాడు ఎందుకు విచారిస్తాడు? జలప్రవాహంలా వెనక్కి మళ్లకుండా వయసు దాటిపోతుంది. అందువల్ల రాజు తన మనసుని సుఖకరమైన ధర్మం మీద లగ్నం చేయాలి. అలా చేయడం వల్ల ప్రజలు సుఖంగా ఉంటారు. ధర్మాత్ముడైన మన తండ్రి దశరథుడు యథాశాస్త్రంగా పుష్కలమైన దక్షిణలు ఇస్తూ అనేక క్రతువులు చేయడం వల్ల స్వర్గానికి వెళ్లాడు.’
------------------------------------------------------------------------------------------------------------------------
(అయోధ్యకాండ సర్గ 105వ సర్గ 32వ శ్లోకం దాకా)

ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధురాలు వణుకుతూ లేచి హరిదాసుతో చెప్పింది.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు హనుమంతుడే ఆ కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఆరు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి.’

ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?

1.గార చెట్టు తెలగపిండిని రాముడు తర్పణానికి వాడాడు. కాని హరిదాసు ఇది చెప్పలేదు.
2.రాముడు, సోదరులు మందాకినీ నదిలో స్నానం చేశారు. కాని అన్ని సందర్భాల్లో దీన్ని హరిదాసు గంగానదిగా చెప్పాడు.
3.రాముడు దోసిలితో నీళ్లు పట్టుకుని దక్షిణం వైపు తిరిగి ఏడుస్తూ చెప్పాడు. కాని ఉత్తరం వైపని హరిదాసు తప్పుగా చెప్పాడు.
4.ఆ ధ్వనికి భయపడ్డ ఏనుగులు, ఆడ ఏనుగులు తమ వెంట రాగా అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు సింహాలు అని తప్పుగా చెప్పాడు.
5.రాముడు ‘మగాళ్లని తండ్రుల లాగా, స్ర్తిలని తల్లుల్లా’ కౌగలించుకున్నాడు. కాని హరిదాసు ‘వాళ్లని’ అని మాత్రమే చెప్పాడు.
6.వశిష్ఠుడు రాముడి దగ్గరికి దశరథుడి భార్యలతో ‘నడిచి’ వెళ్ళాడు. కాని హరిదాసు తప్పుగా ‘రథం మీద’ అని చెప్పాడు.

=================================================================
మీకో ప్రశ్న

గాయత్రి మంత్రంలోని నాల్గవ బీజాక్షరం ‘తు’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
===============================================

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

క్రౌంచ పక్షి అంటే ఏ పక్షి?
క్రౌంచ పక్షి అంటే కొంగ జాతికి చెందిన పక్షి

-మల్లాది వెంకట కృష్ణమూర్తి