S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అరబ్ ద్వంద్వ యుద్ధం

ఆల్‌స్టార్ పిక్చర్స్ స్టూడియో అధినేత వాల్టర్ హార్న్ తన ఆఫీస్ గదిలో పని చేసుకుంటున్నాడు. ఇంటర్‌కంలో సెక్రటరీ ఆలిస్ చెప్పింది.
‘రచయిత హేంక్ బార్ట్‌లెట్ మీ కోసం బయట వేచి ఉన్నాడు’
‘ఐతే పంపించు. కాఫీ కూడా’ వాల్టర్ హార్న్ ఆదేశించాడు.
కొద్ది క్షణాల తర్వాత లోపలకి వచ్చిన హేంక్ ఒంగొని అభివాదం చేస్తూ చెప్పాడు.
‘సలాం’
అతను వాల్టర్ ముందు కూర్చుంటూ అడిగాడు.
‘బెట్టీ ఎలా ఉంది?’
‘బావుంది. ఈ శనివారం రాత్రి పార్టీ ఇస్తోంది. దానికి నువ్వు కూడా రావాలి.’
‘డైరెక్టర్ డబ్ల్యు జె కూతురు కూడా దానికి వస్తుందా?’ అడిగాడు.
‘తెలీదు. బెట్టీ నిన్ను పిలవడానికి కారణం ఓ అమ్మాయితో నృత్యం చేయడానికి ఓ మగాడు అవసరం. నువ్వు అందగాడివి కదా?’ వాల్టర్ నవ్వుతూ చెప్పాడు.
‘నేను రచయితగా నా మెదడుని మెచ్చుకోవాలి అనుకుంటాను’ హేంక్ కూడా నవ్వుతూ చెప్పాడు.
ఆలిస్ వాళ్లిద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది.
‘హేంక్. నీ స్క్రీన్‌ప్లేని నేను జాగ్రత్తగా చదివాను. నిజానికి మూడుసార్లు’
‘బాలేదా?’
‘నాయనా! నువ్వు చెత్త రచయితవి. ఎంత చెత్త రచయితవంటే మంచి స్క్రిప్ట్ రాసినా అది నీకు తెలీదు’ వాల్టర్ చెప్పాడు.
వెంటనే హేంక్ రిలీఫ్‌గా ఫీలయ్యాడు.
ఆలిస్ మళ్లీ లోపలకి వచ్చి ఓ కవర్ ఇచ్చి చెప్పింది.
‘స్పెషల్ డెలివరీలో వచ్చింది’
‘ఎవరు పంపారు?’
‘ఫ్రం అడ్రస్ లేదు’
దాన్ని ఆయన పక్కన పెట్టాడు.
‘ప్లేమ్స్ ఆఫ్ సహారా పేరు నీకు నచ్చిందా?’ హేంక్ అడిగాడు.
‘నచ్చింది. ఆ ఫ్లైట్ సీన్.. దాని పేరేమన్నావు?’
‘అరబ్ ద్వంద్వ యుద్ధం’ హేంక్ చెప్పాడు.
‘ఆ సీన్ చాలా గొప్ప సీన్’
‘్థంక్స్’
‘ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఊహించావా?’
‘కాదు కాదు. నా చిన్నప్పుడు ఇద్దరు అరబ్‌లు కొట్టుకోవడం తప్పని భావించేవాడిని. అందులోంచి అల్లిన సీన్ ఇది’
‘బాగా అల్లావు. ఎడారి అరబ్‌లు ఆడవాళ్ల విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. వాళ్ల కోసం ద్వంద్వ యుద్ధానికి దిగుతారు. వాళ్లు బొప్పిని కాక రక్తాన్ని కళ్లజూడాలని అనుకుంటారు’ వాల్టర్ చెప్పాడు.
‘దురదృష్టవశాత్తు మన హీరో స్టువార్ట్ చాలా మృదుస్వభావి. అంటే వ్యక్తిగత జీవితంలో. అతను పోట్లాడితే ప్రేక్షకులకి నచ్చదని కత్తులు వాడాను. వాటిని అల్యూమినియంతో చేయించచ్చు’ హేంక్ చెప్పాడు.
‘లేదు. నా సినిమాల్లో నకిలీ వస్తువులేం వుండవు. అది నా ఆదర్శం’
‘ఏది ఏమైనా ఈ రక్తం చిందే పోట్లాట తెర మీద చాలా కొత్తగా ఉంటుంది. అరబ్ ద్వంద్వ యుద్ధంలో పోరాడటానికి బలవంతుడైన నటుడై ఉండక్కర్లేదు. ఓ స్టూడియో అధినేత కూడా పోరాడచ్చు’ హేంక్ నవ్వుతూ చెప్పాడు.
అతని మాటల్లో కొద్దిగా ఎగతాళి ధ్వనించినట్లు అనిపించడంతో వాల్టర్ తలెత్తి ఆ రచయిత వంక చురుగ్గా చూశాడు.
‘నా ఉద్దేశం బేంక్ క్లర్క్, స్కూల్ టీచర్.. ఎవరైనా కావచ్చు. ఇందులో గెలవడానికి శారీరక బలం అవసరం ఉండదు.’
‘నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. కాని ఆ అమ్మాయి.. పేరు ఆలీ బెన్ కదా? వీడిని ప్రేమించడం నాకు నచ్చలేదు’
‘మీకు నచ్చలేదా?’
‘అవును. ఓ తెగ నాయకుడి భార్య ఒంటెని నడిపే సేవకుడ్ని ప్రేమించడమా? ఇది హాస్యాస్పదంగా ఉంది. దాన్ని మార్చాలి’
‘ఐతే ఓ నిమిషం ఆలోచించుకోనివ్వండి. ఓంటెని నడిపేవాడు ఆమెకి ఏం ఇవ్వచ్చు? డబ్బు? బట్టలు? నగలు.. ఆనందం. అవును. భర్త ఇవ్వలేని ఆనందం వాడు ఇస్తున్నాడు కాబట్టి’ బయటకి చెప్తూ హేంక్ ఆలోచిస్తూంటే వాల్టర్ ఆ కవర్ని చింపి టైప్ చేసిన ఓ కాగితాన్ని బయటకి తీసి చదివాడు.
మిస్టర్ వాల్టర్ హార్న్:
మీ ఆఫీస్ పని గంటల్లో మీ భార్య ఎవరితో సరదాగా గడుపుతోందో తెలుసుకుంటే మీరు అందంగా ఉండే యువకుడైన వ్యక్తిని కనుగొంటారు.’
-ఓ మిత్రుడు
‘యువకుడు. అందగాడు’ వాల్టర్ అనాలోచితంగా బయటకి చెప్పాడు.
‘అవును. యువకుడు. అందగాడు. దీన్ని దర్శకుడు చక్కగా చెప్పగలిగితే ప్రేక్షకులకి మీకు వచ్చిన అనుమానం రాదు’ హేంక్ చెప్పాడు.
‘ఐతే ఆ సీన్స్‌ని మళ్లీ తిరగరాసి తీసుకురా’ వాల్టర్ కోరాడు.
‘నేను ఇవాళ మా ఇంట్లోంచి పని చేస్తే మీకు అభ్యంతరమా? ఇక్కడ నా గది వేడిగా ఉండి చెమట పడుతోంది’ స్టుడియో ఉద్యోగిగా పని చేసే హేంక్ వెంటనే అడిగాడు.
‘సరే. వెళ్లు. నేను కూడా ఇంటికి వెళ్లి పని చేస్తే బావుండును కాని కుదరదు. నేను నిర్మాతని కాబట్టి. అవసరం వస్తే నేను మీ ఇంటికి ఫోన్ చేస్తాను’ వాల్టర్ అంగీకరించాడు.
హేంక్ వెళ్లాక ఆలిస్ ఇంటర్‌కంలో చెప్పింది.
‘మిస్టర్ లెవిస్ మీ కోసం వేచి ఉన్నారు.’
‘నేను ఇప్పుడు ఎవర్నీ చూడలేనని చెప్పు. నాకు వచ్చే ఫోన్ కాల్స్‌ని కూడా ఇవ్వకు’ ఆయన చెప్పాడు.
తర్వాత కొన్ని క్షణాలు ఆలోచించి హేంక్ స్క్రీన్‌ప్లే వంక చూశాడు. అట్ట మీద ‘ఫ్లేమ్స్ ఆఫ్ సహారా బై హేంక్ బార్ట్‌నెట్’ అని ఉంది. మరి కొంతసేపు ఆలోచించి రిసీవర్ అందుకుని ఇంటికి ఫోన్ చేశాడు. భార్య కంఠం విన్నాక అడిగాడు.
‘హలో బెట్టీ. వాల్టర్‌ని. ఎలా ఉన్నావు?’
‘బానే ఉన్నాను. ఎందుకలా అడిగారు?’ ఆమె నోట్లో సిగరెట్ పెట్టుకుంటూ అడిగింది.
‘పొద్దున నువ్వు అదో రకంగా కనిపించావు’
‘అలాంటిదేం లేదు’ బెట్టీ చెప్పింది.
‘పార్టీ గురించి ఇందాక నేను హేంక్‌తో మాట్లాడాను. వస్తానన్నాడు’
‘మంచిది’
అదే సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ లైటర్ వెలిగించి ఆమె సిగరెట్‌ని ముట్టించాడు. ఆయనకి ఆ చప్పుడు వినిపించి అడిగాడు.
‘ఏమిటది?’
‘సిగరెట్‌ని వెలిగించుకున్నాను. ఇంకేమైనా ఉందా?’
‘లేదు. రాత్రికి వస్తాను’ చెప్పి రిసీవర్ పెట్టేశాడు.
వాల్టర్ ఫ్లేమ్స్ ఆఫ్ సహారా తెరచి అందులోని ఓ పేజీని వెతికి చదివాడు.
ఆల్ బెన్‌తో అహ్మద్:
అతను నీకేం ఇవ్వగలడు? డబ్బు? బట్టలు? బంగారం? ఆనందాన్ని ఇవ్వగలడా? ప్రేమని ఇవ్వగలడా? అతను నీ దగ్గర ఉంటే సూర్యుడు ఇంకాస్త వెలుగుని ఇస్తాడా? నీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? నిజానికి రెండూ జరగవు. ఎందుకు వణుకుతున్నావు? మనిద్దరమే ఉన్నామనా?
వాల్టర్ తన భార్య ఫొటో వంక ఓసారి చూసి ఆ సీన్‌ని చింపి మడిచి జేబులో ఉంచుకుని వేగంగా బయటకి నడిచాడు. తన ముందు నించి వెళ్లే ఆయనతో ఆలిన్ చెప్పింది.
‘సర్. మీరు డైరెక్టర్ డబ్ల్యు జె తో కలిసి ప్రొజెక్షన్ చూడాలి’
‘అది రద్దు చెయ్యి’ చెప్తూ ఆయన వేగంగా ఆఫీస్‌లోంచి తన కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుని దాన్ని పోనించాడు.
కారుని ఇంటి బయట ఆపి అక్కడ అప్పటికే ఉన్న తెల్ల కారు వంక చూశాడు. దాని డ్రైవర్ తలుపు మీద హెచ్ బి అనే అక్షరాలు ఉన్నాయి. దాన్ని చూసి మండిపడ్డాడు. ఆయన తలుపు తాళం తీసి లివింగ్ రూంలోకి వచ్చాడు. పక్కనే ఫ్రెంచ్ డోర్స్ అవతల నించి హేంక్ కంఠం వినిపించింది.
‘డార్లింగ్. నేనా పార్టీకి తప్పనిసరిగా రావాలంటావా?’
‘అవును’ బెట్టీ జవాబు చెప్పింది.
‘సరే. ఆ సాయంత్రం డబ్ల్యు జె కూతురితో నేను ఎంతో ప్రేమగా గడుపుతాను’
‘పాపం. అది ఆ అమ్మాయి అహానికి మంచిది’ బెట్టీ చెప్పింది.
‘నా అహం సంగతేమిటి? మమ్మల్ని చూస్తే నీకు కొద్దిగా కూడా అసూయగా ఉండదా?’
‘నాకు ఎందుకు ఉండాలి?’ బెట్టీ నవ్వుతూ అడిగింది.
‘ఆలోచించు’
‘ఆలోచిస్తే ఉంటుందనే అనిపిస్తోంది.. ఇంకో డ్రింక్ కావాలా?’
‘నువ్వు కూర్చో. నేను తెస్తాను’ చెప్పి హేంక్ లేచి ఇద్దరి గ్లాసులతో లివింగ్ రూంలోకి వస్తూ వాల్టర్‌ని చూసి ఆగిపోయాడు.
అతని వెనకే వచ్చిన బెట్టీ కూడా భర్తని చూసి నివ్వెరపోతూ చెప్పింది.
‘హాయ్ వాల్టర్.. ఏమిటలా చూస్తున్నారు? అంతా సరిగ్గానే ఉందా?’ కొద్దిగా తడబడుతూ అడిగింది.
‘ఉండాలనే నేను అనుకుంటున్నాను’ వాల్టర్ జవాబు చెప్పాడు.
‘నేను మీకు ఫోన్ చేయబోతున్నాను’ హేంక్ చెప్పాడు.
‘దేని గురించి?’ వాల్టర్ అడిగాడు.
‘నేను ఇక్కడ ఉన్నానని. స్టుడియో నించి వెళ్తూంటే నాకు అకస్మాత్తుగా ఈ వేడి వాతావరణంలో మీ స్విమ్మింగ్ పూల్‌లో ఈదటం బావుంటుందనిపించి వచ్చాను. దాన్ని ఉపయోగించుకోవచ్చని బెట్టీ ఏనాడో చెప్పింది’
భర్త దాన్ని నమ్మలేదని గ్రహించిన బెట్టీ చెప్పింది.
‘హేంక్! ఇంకాపు. అందువల్ల ప్రయోజనం లేదు.’
‘ఇది చెత్త డైలాగ్ హేంక్. దాన్ని మళ్లీ తిరగరాసే ప్రయత్నం చేయకు. ఇది ఎంతకాలం నించి సాగుతోంది?’ వాల్టర్ అడిగాడు.
‘నేను బెట్టీతో ప్రేమలో పడ్డాను’ హేంక్ నెమ్మదిగా చెప్పాడు.
‘నువ్వు బెట్టీ?’
‘నాకు తెలీదు’
‘ఆమెకి తెలుసు’ హేంక్ చెప్పాడు.
‘అవును. ఆమెకి తెలుసు. ఎందుకు పడకూడదు. నువ్వు యువకుడివి. అందగాడివి. సాహసవంతుడివి. బహుశ ఆనందాన్ని కూడా ఇస్తావు. అవునా? నువ్వు ఎంత సాహసివి? ఇందాక నా కళ్లల్లోకి చూస్తూ నిర్భయంగా నీ ఇంటికి వెళ్తున్నానని చెప్పావు. తర్వాత నా ఇంట్లోకి దొంగలా ప్రవేశించావు. నువ్వు నా ఈతకొలనులో స్నానం చేసి, నా లిక్కర్ని తాగి, నా భార్యని అనుభవించావు’
‘వాల్టర్. ఆపు’ బెట్టీ ఆందోళనగా చెప్పింది.
‘హేంక్. ఈమెకి అందాన్నిచ్చే సీసాలు, డబ్బాలు, ట్రీట్‌మెంట్స్ నా సంపాదన లోంచే వస్తున్నాయి. నువ్వు అలా వచ్చిన అందాన్ని దొంగిలించే దొంగవి’ వాల్టర్ కోపంగా అరిచాడు.
వెంటనే హేంక్ కోపంగా వాల్టర్ కాలర్ని పట్టుకున్నాడు.
‘మీ ఇద్దరూ ఇక ఆపండి’ బెట్టీ కోపంగా అరిచింది.
బెట్టీ సిగరెట్ అంటించుకుంటూంటే హేంక్ ఆమె పాకెట్లోంచి ఒకటి తీసుకున్నాడు. వెంటనే వాల్టర్ అది కింద పడేలా కొట్టి అరిచాడు.
‘ఇక నించి నీ సిగరెట్లనే తాగు’
‘నీ కళ్లజోడు తీసేయి. తీసేసి నాతో మగాడిలా పోట్లాడు’ హేంక్ ఆజ్ఞాపించాడు.
‘ఇది చాలా బావుంది. నువ్వు ముందు నా భార్యని దొంగిలించావు. తర్వాత ఏవి లేకపోతే నేన చూడలేను ఆ కళ్లజోడుని తీసేయమంటున్నావు. అప్పుడు సరిగ్గా చూడలేని నా మొహాన్ని కాలేజీలో శిక్షణ పొందిన నీ బాక్సింగ్ చేతులతో కొడతావు హేంక్. నేను నీతో బాక్సింగ్ చేయడానికి సిద్ధంగా లేను. నేను అనాగరికుణ్ని. నువ్వు కాలేజీలో నీ కండరాలని పెంచుతూంటే నేను కష్టపడి పని చేసి డబ్బుని సంపాదించాను. అందువల్ల నేను చక్కటి ఇంటిని సంపాదించుకుంటే, అందులోకి దొంగలా ప్రవేశించి, ఖరీదైన, అందమైన దుస్తులతో నేను అలంకరించిన నా భార్యతో సంబంధం పెట్టుకున్నావు. దురదృష్టవశాత్తు నేను కూడా ఆమెని ప్రేమిస్తున్నాను...’
‘...వాల్టర్’ బెట్టీ బాధగా చెప్పింది.
‘నువ్వు తీసే చెత్త సినిమాల్లోని డైలాగ్స్ చెప్తున్నావు’ హేంక్ ఎగతాళిగా చెప్పాడు.
‘అవును. చవకైన సెంటిమెంటల్ డైలాగ్స్’
‘మనం నీ సినిమాల్లోని చెత్త హీరోల్లా కాకుండా పోట్లాడుదాం’

అరబ్ ద్వంద్వ యుద్ధం (11వ పేజీ తరువాయ)
‘సరే. నువ్వు సృష్టించిన అలాంటి చెత్త హీరోల్లా నేను నీతో పోరాడుతాను’ చెప్పి వాల్టర్ గోడకి అలంకరించిన ఓ కత్తిని అందుకున్నాడు.
‘బెట్టీకి నేను నిస్సారమైన వ్యాపారస్థుడిలా కనిపిస్తున్నాను. విషాదం ఏమిటంటే నేను ఆమెని ప్రేమిస్తున్నానని ఆమెకి తెలీదు. అరబ్ ద్వంద్వ యుద్ధం గుర్తుందా హేంక్’ కత్తిని చూపిస్తూ హేంక్‌ని అడిగాడు.
‘మీకు మెదడు సరిగ్గా పని చేయడంలేదు’ హేంక్ చెప్పాడు.
‘బాగా పదునుగా ఉంది’ వాల్టర్ ఆ కత్తిని బల్ల మీద గుచ్చి చెప్పాడు.
‘ఏమిటి మీరు చేస్తున్నది?’ బెట్టీ ఆందోళనగా అడిగింది.
‘నేను హేంక్‌తో అరబ్ ద్వంద్వ యుద్ధం పద్ధతిలో పోరాడబోతున్నాను. సలాం’ కొద్దిగా ముందుకి హేంక్‌కి అభివాదం చేసి చెప్పాడు.
‘దాన్ని కింద పెట్టండి’ హేంక్ కోరాడు.
‘ఇది సాహసవంతమైంది. ఇందుకు చాలా ధైర్యం కావాలి. స్క్రిప్ట్‌లో నువ్వు రాసింది అదే కదా?’
‘మీరు మాట్లాడేదేమీ నాకు అర్థం కావడం లేదు’ బెట్టీ చెప్పింది.
‘అరబ్ ద్వంద్వ యుద్ధం గురించి. నా దగ్గర వారానికి పదిహేడు వందల డాలర్ల జీతం తీసుకునే హేంక్ ఊహ లేదా రీసెర్చ్ ఫలితం ఇది. ఓ ప్రత్యర్థి తన శరీరంలో ఎక్కడో పొడుచుకుంటాడు. రెండో వాడు కూడా అదే పని చేస్తాడు. తర్వాత మొదటి వాడు ఇంకో చోట పొడుచుకుంటాడు. ప్రత్యర్థి మళ్లీ అదే పని చేస్తాడు. ఆ ఇద్దరిలో ఒకడు ఓడిపోయి ఆపేసే దాకా ఈ ద్వంద్వ యుద్ధం కొనసాగుతుంది. అప్పుడు విజేత ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని తన టెంట్‌లోకి లాక్కెళ్తాడు. అవునా హేంక్? అతి సాహసి ఆమెని గెలుచుకుంటాడు కదా? నువ్వు సిద్ధమా హేంక్?’ నిర్ఘాంతపోతూ చూసే హేంక్ దగ్గరికి వచ్చి అడిగాడు.
‘చిన్నపిల్లల్లా ప్రవర్తించకండి’ హేంక్ చెప్పాడు.
‘ముందు నువ్వు మొదలుపెడతావా? లేక నేనా?’
హేంక్ నిర్లక్ష్యంగా వెనక్కి తిరిగాడు. బెట్టీ ఆ ఇద్దర్నీ నిశితంగా గమనిస్తోంది.
‘సరే. నేను మొదలు పెడతాను’
వాల్టర్ కత్తిని పైకెత్తి తన భార్య వంక, హేంక్ వంకా చూసి దాన్ని బలంగా ఎడమ చేతిలో పొడుచుకున్నాడు. చివ్వున చిమ్మిన రక్తం చూసి బెట్టీ కెవ్వున అరిచింది.
‘నేను డాక్టర్‌కి ఫోన్ చేస్తాను’ హేంక్ వెంటనే చెప్పాడు.
‘తప్పకుండా పిలు. మనిద్దరికీ డాక్టర్ అవసరం. ఇప్పుడు నీ వంతు’
బెట్టీ దుఃఖాన్ని ఆపుకుంటూ భర్త వంక చూసి ఆ ద్వంద్వ యుద్ధం వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. ఆయన కత్తిని గాయంలోంచి తీసి హేంక్ వైపు చాపి చెప్పాడు.
‘తీసుకో. నువ్వు ప్రేమించే ఆమె మనిద్దరిలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని ఉత్కంఠగా చూస్తోంది. నువ్వు నాయకుడివా? లేక ఒంటెని నడిపేవాడా? నువ్వు రాసిందేగా?’ జేబులోంచి తను తెచ్చిన కాగితాన్ని అతనికి చూపిస్తూ అడిగాడు.
‘తీసుకో’ బెట్టీ కూడా స్థిరంగా చెప్పింది.
‘మీ ఇద్దరూ పిచ్చివాళ్లు’ చెప్పి హేంక్ తన కోట్‌ని అందుకుని తలుపు తెరచి బయటకి వెళ్లిపోయాడు.
ఆ దంపతుల మధ్య కొద్దిసేపు భయంకర నిశ్శబ్దం.
‘అతను నిజంగా నన్ను ప్రేమించాడని అనుకున్నాను’ బెట్టీ చెప్పింది.
‘నేను ప్రేమించలేదని కూడా అనుకున్నావు’
‘తర్వాత జరిగేది?’
‘నీ గురించి నాకు తెలీదు. నా గురించి నాకు తెలుసు’ గాయంలోంచి రక్తం కారకుండా కట్టు కట్టుకుంటూ చెప్పాడు.
ఆమె కొన్ని క్షణాల వౌనం తర్వాత అతని చేతిని చూస్తూ అడిగింది.
‘బాధగా ఉందా?’
‘కొద్దిగా కూడా లేదు. నేను హీరోలా ప్రవర్తించాను.. చాలాచాలా నొప్పిగా ఉంది’
‘ఓ వాల్టర్! నన్ను ప్రేమించావని నువ్వు నాతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు?’ అతని భుజం మీద తలవాల్చి అడిగింది.
‘ఎలా చెప్పగలను? ఇంతదాకా అది నాకే తెలీదు’ ఆయన జవాబు చెప్పాడు.
* * *
తన ముందు కూర్చున్న కొత్త రచయితని వాల్టర్ అడిగాడు.
‘హలో మిస్టర్ ఫ్రిమ్. స్క్రిప్ట్ చదివారా?’
‘చదివాను. కొన్ని మార్పులు చేయాలి’ ఫ్రిమ్ సూచించాడు.
‘అందుకే మీకు పంపాను. వాటిని చెప్పండి.’
‘ముందుగా ఈ అరబ్ ద్వంద్వ యుద్ధం గురించి. అది మీకు నచ్చిందా?’ ఫ్రిమ్ అడిగాడు.
‘అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను’
‘నాకు నచ్చలేదు’
‘ఎందుకని?’ వాల్టర్ అడిగాడు.
‘ఎందుకంటే అది నమ్మలేనిది. సాధారణ మనిషి తన శరీరాన్ని ఛిద్రం చేసుకోలేడు’
‘కాని మన హీరో అసాధారణమైన మనిషి. అతని ప్రేమ మామూలు ప్రేమ కాదు. అది ప్రేక్షకులు నమ్మచ్చు. నాకు తెలిసి ఇప్పటికే ఒకరు నమ్మారు’ వాల్టర్ ఆనందంగా చెప్పాడు.

(లాస్‌గో గొరాగ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి