S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మర్యాదస్థుడు

జాన్ తన నీలం రంగు కారుని పేవ్‌మెంట్ పక్కన ఆపి, సాధారణంగా డాక్టర్లు మాత్రమే ఉపయోగించే ఓ నల్ల తోలు సంచీని తీసుకుని కిందికి దిగాడు. కారు తాళం వేసి పార్కింగ్ మీటర్లో గంటకి సరిపడే డబ్బుని వేశాడు. తిరిగి వచ్చేసరికి ఆ వేడికి కారు లోపల కుంపటిలా ఉంటుంది అనుకున్నాడు. గోధుమ రంగు టోపి, అదే రంగు సూట్‌ని ధరించిన అతను నల్ల కళ్లజోడు పెట్టుకుని గమ్యానికి బయలుదేరాడు. అప్పుడు సమయం ఉదయం 11.35 ఐంది.
అతను పది నిమిషాల్లో మేక్ హేల్ భవంతిని చేరుకున్నాడు. ఆ బిల్డింగ్ పార్కింగ్‌లాట్‌లోని ప్రకటన బోర్డ్ మీద స్థానిక దినపత్రిక మర్యాద చూపించే డ్రైవర్‌కి ఏదో బహుమతిని ఇస్తోందనే ప్రకటన ఉంది. మరో దాంట్లో వెండి రంగు జుట్టుగల ఓ వ్యక్తి సెనెటర్‌గా తనకి ఓట్ చేయమనే అభ్యర్థన ఉంది. జాన్ మూడో అంతస్థులోని అమెరికానా ఫైనాన్స్ కంపెనీకి చేరుకున్నాడు. అక్కడ తుపాకీ చూపించి దొంగతనం చేయాలన్నది అతని పథకం. అది అతను చేసే పనె్నండో దొంగతనం. మునుపటి పదకొండిటిని నాలుగు రాష్ట్రాల్లో అనేక సంవత్సరాల విరామంతో చేశాడు. ఐనా తను పట్టుబడకపోవడానికి కారణం ఏ రాష్ట్రంలో కూడా మూడుకి మించి దొంగతనాలు చేయకపోవడం అని జాన్ విశ్వాసం.
అతను తన ఆఖరి దొంగతనం కొన్ని నెలల క్రితం న్యూ మెక్సికో రాష్ట్రంలో చేశాడు. తర్వాత కారెక్కి వెయ్యి మైళ్ల రోడ్ మీద ప్రయాణించి ఇంకో రాష్ట్రంలోని ఆ ఊరికి వచ్చాడు. అక్కడ ఇంటింటికి తిరిగి వేక్యూం క్లీనర్లని అమ్మే ఉద్యోగంలో చేరాడు. అందుకు కారణం డబ్బు కాదు. ప్రజల మధ్య నివసించేప్పుడు వాళ్లకి ‘ఇతను పని చేయకుండా ఎలా జీవించ గలుగుతున్నాడు’ అనే అనుమానం రాకూడదని. పైగా ఉద్యోగం మంచి కాలక్షేపం కూడా.
ఆ ఏ.సి. భవంతిలోకి వెళ్లాక జాన్ సౌకర్యంగా ఫీలయ్యాడు. కారిడార్లోంచి అతను రుమాలుని చేతికి కట్టుకుని తలుపు పిడి మీద తన వేలిముద్రలు పడకుండా మెయిన్ డోర్ తెరచుకుని అమెరికానా ఆఫీస్‌లోకి నడిచాడు. లోపల టైప్ చేసే కళ్లజోడు పెట్టుకున్న నలభై ఏళ్ల సన్నటామె, కొద్ది దూరంలో కాగితాలని ఫైల్ చేసే లావుపాటి పొట్టి పాతికేళ్ల యువతి కనిపించారు. టైప్ చేసే ఆమె అతని వంక చిరునవ్వుతో చూస్తూ తన పనిని ఆపి అడిగింది.
‘ఎస్? మీకేం సహాయం చేయగలను?’
‘నా పేరు స్టీఫెన్స్. నేను లోన్ కోసం వచ్చాను’ అతను చెప్పాడు.
‘దయచేసి ఈ ఫారాన్ని నింపండి’ ఆమె అతనికి ఓ ఎర్రరంగు పెన్ను, ఓ కాగితం ఇచ్చి చెప్పింది.
అతను దాంట్లో తప్పుడు సమాచారాన్ని నింపుతూ చుట్టూ గమనించాడు. వాళ్ల వెనక ఫైలింగ్ కేబినెట్లు. వాటి మధ్యగల గాజు తలుపు వెనకది మేనేజర్ గది అని, కుడివైపు తలుపులు బహుశ క్లైంట్‌తో మాట్లాడే కాన్ఫరెన్స్ గదులు అనుకున్నాడు.
‘డి రూంలోకి వెళ్లండి మిస్టర్ స్టీఫెన్స్. మిస్టర్ ఏన్స్ కొద్దిసేపట్లో మిమ్మల్ని కలుస్తారు’ అతను రాసిన తప్పుడు సమాచారం చదివి ఆమె చెప్పింది.
అది చిన్న గది. ఓ బల్ల, రెండు కుర్చీలు. బల్ల మీద యాష్‌ట్రే! అతను దేన్నీ ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ ఓ కుర్చీలో కూర్చుని ఏన్స్ కోసం ఎదురుచూడసాగాడు.
కొద్ది నిమిషాల్లో దృడమైన, ఎతె్తైన ఓ ఏభై ఏళ్ల వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. అతని మొహంలో చిరునవ్వు. అతను కూర్చున్నాక కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘గుడ్ మార్నింగ్ మిస్టర్ స్టీఫెన్స్. నేను ఏన్స్. చెప్పండి. మీకు ఎంత లోన్ కావాలి? ఎందుకు?’
‘నాకు కావాల్సింది లోన్ కాదు. గిఫ్ట్’ జాన్ చెప్పాడు.
వెంటనే అతని మొహంలో ఆశ్చర్యం కనిపించింది. జాన్ చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్‌ని చూశాక ప్రశ్నార్థకం కనిపించింది.
‘ఏమిటిది?’ కుర్చీలోంచి సగం లేస్తూ అడిగాడు.
జాన్ అతని స్పందనని ఉదాశీనంగా చూశాడు. తనకి రివాల్వర్ గురిపెట్టబడ్డ ఒకో వ్యక్తీ ఒకో విధంగా స్పందిస్తారని జాన్‌కి తెలుసు.
‘దయచేసి కూర్చోండి. రివాల్వర్ ముందు మీరు పిచ్చిగా ప్రవర్తించి ప్రాణాల మీదకి తెచ్చుకునే మనిషిలా నాకు కనిపించడం లేదు. నేను చెప్పినట్లు చేస్తే ఈ రివాల్వర్‌ని పేల్చాల్సిన అవసరం రాదు’ జాన్ మర్యాదపూర్వక కంఠంతో చెప్పాడు.
అతను వౌనంగా కూర్చున్నాక జాన్ అడిగాడు.
‘బయట ఇద్దరు ఆడవాళ్లని చూశాను. వాళ్లు కాక ఈ ఆఫీస్‌లో ఇంకెవరైనా ఉన్నారా?’
‘మేం మాత్రమే ఉన్నాం’
‘వాళ్లు మీలా కామ్‌గా ఉంటారా లేక ఆందోళనకి గురై అరిచే రకమా?’
‘మిసెస్ హోలిస్టర్ చాలా కామ్. రెండో ఆమె మిస్ ఓటా.’
‘ఓ. ఇటాలియన్ పేరది’
‘అవును. చిన్నది కాబట్టి భయపడుతుంది. కాని అరుస్తుంది అనుకోను’ ఏన్స్ చెప్పాడు.
‘వాళ్లు ప్రశాంతంగా ఉండేలా చూడండి. ఎవర్నీ కాల్చే ఉద్దేశం నాకు లేదు. కాని అరుపులు, కేకలు, పారిపోయే ప్రయత్నాలు నాకు సరిపడవు. వాటిని వెంటనే ఆపేస్తాను. సారీ. దీంతో’ రివాల్వర్‌ని ఆడిస్తూ జాన్ చెప్పాడు.
ఏన్స్ అర్థమైనట్లుగా తల ఊపాక అడిగాడు.
‘ఇంకోటి. మీ ఆఫీస్‌లో రివాల్వర్ ఉందా?’
‘నా బల్ల సొరుగులో ఉంది’
‘ఐరన్ సేఫ్‌లో?’
‘లేదు. ఈ ఆఫీస్‌లో ఒక్కటే ఉంది’
ఏన్స్ తెచ్చిన తను నింపిన ఫారాన్ని జాన్ అందుకుని దాన్ని జేబులో ఉంచుకుంటూ చెప్పాడు.
‘గ్రాఫాలజిస్ట్‌లకి పని పెట్ట దలచుకోలేదు’
తర్వాత తనతో తెచ్చిన తోలు సంచీని అందుకుని, దాన్ని రివాల్వర్‌కి అడ్డంగా ఉంచి చెప్పాడు.
‘పద. పని పూర్తి చేసి నన్ను త్వరగా పంపు.’
ఏన్స్ హాల్లోకి వచ్చి, గొంతు సద్దుకుని ఆ ఇద్దరు ఆడవాళ్లతో చెప్పాడు.
‘మిసెస్ హోలిస్టర్. మిస్ ఓటా.. మీరు మూర్ఖంగా ప్రవర్తించకండి. స్టీఫెన్స్ దొంగతనానికి వచ్చాడు. అతని చేతిలోని రివాల్వర్ నా వీపునకు గురి పెట్టబడింది. అతనికి సహకరించండి.’
మిస్ ఓటా వెంటనే తన కుర్చీలోంచి లేచి నిలబడింది. ఆమె చెయ్యి తెరచుకున్న నోటికి అడ్డంగా వెళ్లింది. ఆమె మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.
‘మిస్టర్ ఏన్స్ చెప్పినట్లు చేయండి. ఎవరికీ హాని చేసే ఉద్దేశం నాకు లేదు. ముఖ్యంగా ఆడవాళ్లని. కాని ఎవరైనా నన్ను పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం నేను సహించను. కాబట్టి నాకు సహకరించండి. మిస్టర్ ఏన్స్. మీకు పని చెప్తున్నందుకు సారీ. దయచేసి మెయిన్ డోర్ మూసి లోపల గడియ పెట్టండి. ఇప్పుడు ఓ కస్టమర్ రావడం ఎవరికీ మంచిది కాదు.’
ఏన్స్ అతను చెప్పినట్లు చేశాక జాన్ అడిగాడు.
‘మిసెస్ హోలిస్టర్. ఇందాక నేను ఫారం నింపిన పెన్ ఇదేనా? దయచేసి చెప్పండి’
ఆమె ఔనన్నట్లుగా తల ఊపాక జాన్ కౌంటర్ మీది పెన్‌ని తీసుకుని జేబులో వేసుకుని చెప్పాడు.
‘వేలిముద్రల నిపుణులకి పని ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇద్దరూ ఏన్స్ గదిలోకి నడవండి’
పాలిపోయిన మొహంతో ఓటా, ఉదాసీన మొహంతో హోలిస్టర్ వెళ్తూంటే, వాళ్ల వెనక ఏన్స్ నడిచాడు. జాన్ అతన్ని అనుసరించాడు. ఆ గది చిన్నది. పేపర్లతో నిండిన బల్ల, అనేక కుర్చీలు, ఓ మూల స్టీల్ వాల్ సేఫ్.
‘లేడీస్! మీ సహకారానికి థాంక్స్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. మీరు దయచేసి గోడ వైపు ముఖం పెట్టి నించోండి’
ఏన్స్‌ని సేఫ్ తెరవమన్నట్లు సౌంజ్ఞ చేశాడు. జాన్ తనతో తెచ్చిన తోలు సంచీ తెరచి అందులోంచి నల్లటి తాడుని, డక్ట్ టేప్‌ని బయటకి తీశాడు. ఏన్స్ తలుపు తెరిచాక ఆ సంచీని అతని వైపు విసిరి చెప్పాడు.
‘నింపండి’
తర్వాత ఆడవాళ్లతో చెప్పాడు.
‘లేడీస్. ఇది మిమ్మల్ని అగౌరవ పరిచినట్లే కాని తప్పడం లేదు. కాబట్టి మన్నించండి’
అతను వాళ్లిద్దరి నోటికీ డక్ట్ టేప్‌ని అతికించాడు. తర్వాత సేఫ్ ఖాళీ ఐందా లేదా అని తనిఖీ చేశాక ఏన్స్ నోటికి కూడా డక్ట్ టేప్‌ని అతికించి ఆజ్ఞాపించాడు.
‘అంతా నేల మీద బోర్లా పడుకోండి’
వాళ్లు పడుకున్నాక వాళ్ల చేతుల్ని వీపు మీద ఉంచమని వాటిని గట్టిగా కట్టాడు. తర్వాత కాళ్లని కూడా.
‘మీ ముగ్గురూ తెలివిగల వాళ్లు కాబట్టి చక్కగా సహకరించారు. అందువల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. త్వరలోనే మిమ్మల్ని ఎవరైనా విడిపిస్తారు. మీకు కలిగించిన అసౌకర్యానికి మన్నించండి. బై’
అతను రుమాలుని చేతికి కట్టుకుని తలుపు పిడి మీద తన వేలిముద్రలు పడకుండా మెయిన్ డోర్ తెరచుకుని బయటకి నడిచాడు. కారిడార్లోకి వచ్చాక చేతి గడియారం చూసుకున్నాడు. తను లోపల ఉన్నది పదమూడు నిమిషాలే.
కొద్ది నిమిషాల నడక తర్వాత అతను మళ్లీ తన కారులో కూర్చున్నాడు. కారు నాలుగు కిటికీ అద్దాలనీ దింపి స్టార్ట్ చేసి పోనించాడు. త్వరలోనే అతని కారు ట్రాఫిక్‌లో కలిసిపోయింది.
కొద్ది దూరం వెళ్లాక జీబ్రా క్రాస్ దగ్గర మాసిపోయిన బట్టలు, పెరిగిన గడ్డం, దుబ్బు జుట్టుగల ఓ గుడ్డివాడు చేతిలోని తెల్ల కర్రని తాటిస్తూ రోడ్‌ని దాటబోయి అతని కారు చప్పుడు విని ఆగిపోయాడు. మంచి మూడ్‌లో ఉన్న జాన్ కారుని ఆపి అరిచాడు.
‘దయచేసి వెళ్లండి. ఇంకే బళ్లు రావడంలేదు’
అతను కర్రని తాటించుకుంటూ రోడ్‌ని దాటాక మళ్లీ కార్‌ని ముందుకి పోనించాడు.
ఇంటికి వచ్చాక డబ్బు లెక్కపెట్టుకున్నాడు. ఆ రోజు అతను పనిని ఆపలేదు. రెండు వేక్యూం క్లీనర్లని అమ్మాడు.
* * *
మర్నాడు సాయంత్రం జాన్ తన అపార్ట్‌మెంట్‌లోని కుర్చీలో కూర్చుని దినపత్రికలో అమెరికానా ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దొంగతనంలో డబ్బై మూడువేల డాలర్లు పోవడం గురించి చదివాడు. అందులో తేడా లేదు అనుకున్నాడు. ఆ ముగ్గురూ తమ కాళ్లతో నేల మీద బాదారని, కొద్ది నిమిషాల తర్వాత కింది ఫ్లోర్‌లోని వాళ్లు పైన ఏం జరుగుతుందో చూడాలని వచ్చి బంధింపబడ్డ వాళ్లని విడిపించారని చదివాడు. వాళ్లు ఇచ్చిన దొంగ వర్ణన తనకి సరిగ్గా సరిపోయేలా ఉంది అనుకున్నాడు. కాని అది తనకే కాక వేల మందికి సరిపోతుందని జాన్‌కి తెలుసు. ఆ దొంగ చాలా మర్యాదగా ప్రవర్తించాడని కూడా పేపర్లో రాశారు.
దొంగ మర్యాదగా ప్రవర్తిస్తే బాధితులు సహకరిస్తారు. క్రూరంగా ఉన్నా భయంతో సహకరిస్తారు కాని అది జాన్ స్వభావం కాదు. పేపర్లోని మరో భాగంలోకి వెళ్లి తనకి ఇష్టమైన హాబీని, గళ్ల నుడికట్టుని నింపడం ఆరంభించాడు. సగం నింపాక డోర్ బెల్ మోగింది. లేచి వెళ్లి తలుపు తెరిచాడు. బయట ముగ్గురు నిలబడి ఉన్నారు. ఒకతని చేతిలోని కెమెరా బల్బులు వెలిగాయి.
‘మీరు మిస్టర్ జెరోమ్ జాన్ కదా?’ వారిలోని పొడుగు వ్యక్తి అడిగాడు.
‘అవును’
జాన్‌కి తనని ఫొటో తీయడం ఇష్టం లేకపోయింది.
‘మేము హెరాల్డ్ పోస్ట్ నించి. నా పేరు క్లెంప్సన్. ఇతను మా ఫొటోగ్రాఫర్ మార్వెల్. మీది నీలం రంగు కారు కదా? నంబర్ ఏజె 6045 కదా?’
‘అవును. కాని మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడంలేదు’ జాన్ విభ్రాంతిగా ప్రశ్నించాడు.
‘నిన్న మీరు మీ కారుని ఆపి ఓ గుడ్డివాడు రోడ్ దాటడానికి దారి ఇచ్చారు కదా? హెరాల్డ్ పోస్ట్ డ్రైవర్స్‌లో మర్యాదని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టిందని మీకు తెలుసు అనుకుంటాను? గుడ్డివాడికి మీరు చూపించిన మర్యాద గురించి మాకు తెలీగానే మీ ఇంటర్‌వ్యూని మా పత్రికలో ప్రచురించాలనలి అనుకుంటున్నాం. మర్యాదస్థుడిగా మీ ఫొటో మా పేపర్లో రావడం మీకు ఆనందంగా లేదా?’
వెంటనే జాన్ తల అడ్డంగా ఊపుతూ, భయాన్ని అణచుకుంటూ గట్టిగా చెప్పాడు.
‘ఒద్దు. నా ఫొటో పేపర్లో రావడం నాకు ఇష్టం లేదు. నేనా గుడ్డివాడికి చేసిందేం లేదు’
‘మీది చాలా ఫొటోజెనిక్ ఫేస్ మిస్టర్ జాన్’ మార్వెల్ అతని మొహాన్ని ఇంకో కోణం లోంచి ఫొటో తీసుకుని చెప్పాడు.
జాన్ అనాలోచితంగా అతని చేతిలోని కెమెరాని తీసుకుని నేలకేసి కొట్టాడు.
‘ఏమిటిది?’ మార్వెల్ కోపంగా అరిచాడు.
‘జాన్! మీరు భయపడాల్సిన పని లేదు. హింసాత్మకంగా ప్రవర్తించకండి. మాకు కావాల్సిందల్లా...’ అతని ప్రవర్తనని ఎదురుచూడని క్లెంప్సన్ చెప్పాడు.
‘మీరుండండి క్లింప్సన్’ మూడో వ్యక్తి ముందుకి వచ్చి చెప్పాడు.
అతను జాన్‌ని పరిశీలనగా చూసి చెప్పాడు.
‘నేను సిటీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని. మీ మంచి పనిని గమనించి నేను హెరాల్డ్ పోస్ట్‌కి చెప్పాను. మీరు దయ లేదని అనుకుంటున్నారు కాని అది చాలా పెద్ద దయాపూర్వక చర్య. ఎందుకంటే నిన్న దాదాపు వందల కార్ల డ్రైవర్లు ఆ గుడ్డివాడ్ని చూసి కూడా ఆగి అతనికి దారి ఇవ్వలేదు. నిజానికి ఆ గుడ్డివాడు కూడా ఆ వేషంలో డ్రైవర్లని పరీక్షించడానికి ఉన్న పత్రికా విలేకరే...’
అతను చెప్పడం ఆపి మొహం చిట్లించి జాన్ వంక చూస్తూ మళ్లీ చెప్పాడు.
‘నిన్న ఆ సమయంలో... మీరు గోధుమరంగు టోపి, అదే రంగు సూట్‌ని ధరించి నల్ల కళ్లజోడు పెట్టుకున్నారు కదా? మిస్టర్ జాన్! మీ ఫొటోని పత్రికలో ప్రచురించడం మీకు ఎందుకు ఇష్టం లేదు?’

(జెఆర్ స్పెన్సర్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి