S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంగీత మేరు శిఖరాలు..

‘సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలు వలెను
దబ్బునన్ దొర్లిపడు కొండధార మాడ్కి
సహజ కవిత బయల్పడు సన్నుతిగను’
మాతృభాష తెలుగే అయినా, పక్కనే ఆంగ్ల పదాలు కూడా రాస్తే తప్ప, కొందరికి మన భాష, మనకే అర్థం కాదు. కానీ ఈ పద్యంలోని భావం తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.
అచ్చ తెలుగంటే ఆదిభట్ల నారాయణదాసు సహజ కవితా ధోరణి ఎలా వుండాలో ఎంతో సరళమైన భాషలో ఈ పద్యంలో చెప్పాడు. అంతేకాదు సహజమైన సంగీతం కూడా ఎలా వుండాలో చెప్పాడు. ఈ పద్యాలు చదవండి (ఈ రెండింటిలోనూ ఆయన సవ్యసాచి)
‘ఒకసారి పావుర మొదిగి వచ్చినయట్లు/ వానకోయిల పిట్ట పలికినట్లు
ఒకసారి వేల్పుటా వొడిసి పట్టినయట్లు/ మంచుతో మబ్బు గర్జించునట్లు
ఒకమారు వెనె్నలొలికి గాసినయట్లు/ కొలనిలో జలకేళి సల్పినట్లు
ఒక తూరు గవ్వ గిలకరించినయట్లు/ చేడెతో పూలు చెండ్లాడునట్లు
సన్న బెంబేవి జాజులు చల్లినట్లు/ చిన్ని పూతేనెపై పయించిందునట్లు’
‘సంగీత ధార’ వుండాలని చెప్పాడు. అటు సాహిత్యంలోనూ, ఇటు సంగీతంలోనో సమానమైన ప్రజ్ఞా ప్రాభవాలతో ఆంధ్ర దేశంలోని మొత్తం పండితులనూ పామరులను సంగీత విద్వాంసులను గడగడ లాడించిన హరికథా పితామహ ఆదిభట్ల వారి నోట వెలువడిన అచ్చ తెలుగు మాటలివి.
నారాయణదాసు కంఠమెత్తి ‘శంభో’ అంటే ఆ నాదం మైళ్ల దూరం దాకా మారుమ్రోగేది. అలాగే ఒక్కసారి గొంతెత్తి ‘హరిఓం’ అనగానే ‘కైలాసానే్న ప్రతిధ్వనింపజేసి అంభో నిధులను కదిలించిన విద్వాంసుడు ఖాన్ సాహెబ్ బడే గులామాలీఖాన్ డ్యౄళ ఘూళ ఱ్యూశ దిళ్ఘఆ అన్న షేక్‌స్పియర్ మాటకు సాక్ష్యమే ఈ ఉస్తాద్.
నా సంగీత గురువు వోలేటిగారికి మానసిక గురువు.
నల్లని బుర్ర మీసాలతో నిండైన విగ్రహంతో నాదామృత భాండాన్ని తన కడుపులో వుంచుకున్న బడే గులాంను ఆదర్శంగా వుంచుకున్న వోలేటి గారి రూపం, ఆయన గానం కూడా అలాగే వుంటాయనేది సంగీత రసికులకు, ఆయన అభిమానులకు బాగా తెలుసు. ఆయన ఉస్తాదోం కా ఉస్తాద్. పాకిస్తాన్‌లోని లాహోర్ జన్మస్థలమైనా మన భారత్‌లో స్థిరపడ్డారు.
సుప్రసిద్ధ పాకిస్తాన్ ఘజల్ గాయకుడు ‘గులామాలీ’ బడేగులాం తమ్ముడు, బర్‌కత్ ఆలీఖాన్ శిష్యుడే.
విశాఖపట్నంలో వుండే ప్రసిద్ధ వైణికుడు వాసా కృష్ణమూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, ద్వారం నాయుడు గారలందరూ ఈ బడేగులాం అభిమానులే. సంగీతానికి ఎల్లలు లేవు, కుల మతాలుండవు. భాషా భేదం అసలుండదు. సంగీతం ఎక్కడకు వెళ్లి విన్నా ఆ ఏడు స్వరాలే అయినా, పాడే పద్ధతిలోనే వైవిధ్యం.
సంగీతాన్ని ఉపాధిగా చేసుకున్న వారు వేరు. ఉపాసించేవారు వేరు. రెండో కోవకు చెందినవారు అరుదు.
‘నాదోపాసనచే శంకర నారాయణ విధులు వెలసిరి మనసా’ అంటాడు త్యాగయ్య. సమర్పణ బుద్ధితో మననం చేస్తే మంత్రం శర్వస్య శరణాగతి చేస్తూ గానం చేస్తే సంగీతం. నిజమైన నాదోపాసన అంటే అదే.
మంత్రమే కదా, అందులో వుండేవి అక్షరాలే కదా అని తేలికగా భావిస్తే అక్షరాలా అలాగే జరుగుతుంది.
స్వరాలను బీజాక్షరాలుగా భావించి నాదమయ లోకాలలో విహరించిన గాన యోగులలో ఉస్తాద్ బడేగులాం ప్రముఖులు.
కర్ణాటక సంగీతానికి పీఠం’ అనబడే మదరాసు నగరంలో 1940 ప్రాంతాలలో మహా విద్వాంసుల సమక్షంలో ఓ సాయంత్రం ఉస్తాద్ గానం ఏర్పాటైంది.
ఆ రోజుల్లో గొప్ప స్టార్ సింగర్‌గా ప్రసిద్ధుడైన జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు పళని సుబ్రహ్మణ్య పిళ్లై, మరి కొందరు సంగీతాభిమానులందరూ ఏకమై నిర్వహించిన ఆ కార్యక్రమానికి కర్ణాటక సంగీత విద్వాంసులు, స్థానిక ప్రముఖులు, సంగీత రసికులు హాజరయ్యారు.
వారందరి సరసన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు కూడా వుండటం విశేషం.
* * *
కేవలం కర్ణాటక సంగీత బాణీ వినడానికే అలవాటుపడ్డ ఆ చెవులకు మొదటిసారి నాదానుభవం లభించింది. అంతకు ముందు పాకిస్తాన్ గాయని రోషనారా బేగం గానం మ్యూజిక్ ఎకాడెమీలో విన్న అనుభూతులు ఇంకా వారి మనసులలో నుంచి చెరగలేదు.
ఉస్తాద్ బడే గులాం ఖాన్ సంగీత మాధుర్యంలో మానవాంతరంగాలను హిమ శృంగాలుగా మార్చగల మహత్తర శక్తి, మనిషిని మమతల శృంగం మీద ప్రతిష్టించగల అనిర్వచనీయమైన భక్తి, అనురక్తి అన్నీ కలబోసుకుని సంగీత రసజ్ఞులను ఆనందసాగరంలో ఓలలాడించేశాయి.
‘స్వర సామ్రాట్’ ఉస్తాద్ జీ గానం వినటం మనందరి పూర్వజన్మ సుకృతం. ఈ జన్మకు ఇది చాలు.
ఈ మహా విద్వాంసుణ్ణి సన్మానించటం సుకృతం అని సభా మధ్యం నుంచి జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం వేదిక నెక్కి, పాదాభివందనం చేసి ఉస్తాద్‌ను గజమాలతో సత్కరించాడు.
సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వేదిక కుడి వైపు నుండి ఘంటసాల, వేదికనెక్కి ఉస్తాద్‌కు తనను పరిచయం చేసుకున్నాడు. చేతిలో వున్న శాలువా కప్పి పాదాభివందనం చేశాడు.
మదరాసులోని యావత్ తమిళ, సంగీతాభిమానులకూ ఆ సాయంత్రం జరిగిన ఉస్తాద్ కచేరీ, మరచిపోలేని దివ్య సంగీతానుభూతుల్ని మిగల్చటం ఒకటైతే ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆ ముస్లిం విద్వాంసునికి తలవంచి పాదాభివందనం చేయటం, అక్కడి కొందరి ఛాందస తమిళ విద్వాంసులకు నచ్చలేదు. తనకంటే గొప్పగా పాడే విద్వాంసుణ్ణి మెచ్చుకోగలగటం విద్వాంసుల సంస్కారానికి గుర్తు. సంగీత లోకంలో ఇది అరుదే.
సంగీతానికున్న సహజ లక్షణం అసూయ. మరొకరికున్న ఉన్నతిని చూసి ఏడ్చి సాధిస్తారు కొందరు. సాధించలేక ఏడ్చేవాళ్లే ఎక్కువ. మరునాడు ఆ సంఘటనను కాస్త పెద్దదిగా చేసి చూపిస్తూ తమిళ విద్వాంసులంతా పత్రికాముఖంగా నిరసన తెల్పి, వారి ఐకమత్యాన్ని చాటినట్లు భావించారే గానీ, ఉస్తాద్ సంగీతాన్ని సంస్కార భావంతో చూడలేక పోయారు. ప్రాంతీయ అభిమానం కాస్త ఎక్కువ కదా. పర్యవసానంగా ఉస్తాద్ ఒప్పుకున్న సంగీత కచేరీలన్నీ రద్దై పోయి ఖాన్ సాహెబ్ ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది.
తామర పువ్వుల్లోని మకరంద మాధుర్యం తెలిసేది ఒక్క తుమ్మెదలకే - ఖాన్ సాహెబ్ గానానికి పరవశించిన సంగీత రసికుడు ఘంటసాల -ఉస్తాద్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.
ఉస్తాద్ ఘంటసాల ఆతిథ్యాన్ని అంగీకరించి పరివారంతో సహా ఆయన ఇంట్లోనే బసకు దిగారు.
ఉదయం అల్పాహారం పాట, మధ్యాహ్నం భోజనానంతరం పాట, ఆయన ఇంట్లో వున్నన్నాళ్లూ ఆ సంగీతమే సర్వస్వంగా గడిపేశారు ఘంటసాల.
ప్రతిరోజూ ఉదయమూ, సాయంత్రమూ ఖాన్ సాహెమ్ గానానికి తంబురాతో సహకరించిన విద్వాంసుడు తాతాచారి (పి.బి.శ్రీనివాస్ సోదరుడు), ఓ రోజు అక్కడే కాపురముంటున్న వోలేటి గారిని ఖాన్ సాహెబ్‌కు పరిచయం చేశాడు.
ఇద్దరూ కలిసి సంగీతానందంతో మైమరచి పాడిన సన్నివేశాన్ని స్వయంగా తాతాచారే నాకు మద్రాసులో కలిసిన రోజుల్లో చెప్పేవారు. ఘంటసాల కోసం హిందూస్తానీ రాగాలలో ‘రాగేశ్వరి’ ఒకరోజు ఉస్తాద్ గంటల తరబడి పాడి, వినిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
‘సారంగధర’లో -అన్నానా భామినీ’ పాతాళ భైరవిలో - ఎంత ఘాటు ప్రేమయో’ అభిమానంలో -ఊయలలూగే నా మనసు’ వంటి ఎన్నో పాటల్లో ఉస్తాద్ పాడిన రాగేశ్వరి గానంలోని పసందైన సంగతులన్నీ ఘంటసాల గొంతులో వినిపిస్తాయి, గమనించి వుంటే.
చాలాకాలం క్రితం ఘంటసాల సతీమణి సావిత్రి గారితో వివిధభారతిలో నేనో పరిచయ కార్యక్రమం చేశాను. ఆ ప్రత్యేక జనరంజనిలో ఉస్తాద్ కబుర్లు బాగా చెప్పారు. ఒక్కటే -కర్ణాటక సంగీతానికి, హిందూస్తానీ సంగీతానికి బాణీలలో వైవిధ్యం వుంది. ఒకరి బాణీ మరొకరికి రుచించక పోవటానికి కారణం, గొంతులో అందరికీ అన్ని గమకాలు పలకవు.
దక్షిణాదిలో ఎస్.కల్యాణరామన్ అనే విద్వాంసుడు హిందూస్తానీ సంగీత ప్రియుడు. ఆ బాణీ తన కంఠంలో పలికించేవాడు. వోలేటి గారు అభిమానించేది హిందూస్తానీ బాణీ. ఈ బాణీ ఎవరి దగ్గరా కూర్చుని నేర్చుకుంటే లభించింది కాదు.
ఆయన కేవలం వినికిడితో తెచ్చుకున్నదే. ఉస్తాద్ పాడిన ‘పహాడే’ అనే హిందూస్తానీ రాగం విని ఆ రాగంలో ‘తిల్లానా’ చేయమని లాల్‌గుడి జయరామన్‌ని ప్రోత్సహించారు.
లాల్‌గుడి తిల్లానాల సీడీలో ‘పహాడీ’ రాగంలోని వయ్యారాలు వినవచ్చు.
ఆ రోజుల్లో తెలుగు వారి కోసం మద్రాసు రేడియో కేంద్రం నుంచి కొన్ని కార్యక్రమాలు ప్రసారమవుతూండేవి. లలిత సంగీత కార్యక్రమంలో పాడేందుకు వచ్చే ఘంటసాల ఓసారి ఖాన్ సాహెబ్ పాడిన రాగేశ్వరి రాగానికి ప్రభావితుడై తమిళంలో ఒక పాట కంపోజ్ చేసుకుని పాడాడు. చుట్టూ వున్న వారిలో ఆ వేళ స్టూడియోలో ఆ పాట విన్న ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ఎం.ఎస్. గోపాలకృష్ణన్, పక్కవారితో ‘పాటంటే ఇలా వుండాలి. స్వచ్ఛమైన సంగీత లక్షణమే యిది’ అని వ్యాఖ్యానించటం ప్రత్యక్షంగా విన్నాను. విద్వాంసులు మెచ్చినదే పాట.

- మల్లాది సూరిబాబు 90527 65490