సంపన్నులను చేసే అప్పు
Published Saturday, 27 October 2018అప్పు అంటే కొందరి దృష్టిలో మహాపాపం . రూపాయి ఆస్తి లేకపోయినా పైసా అప్పు లేకపోతే సంపన్నుడే అన్నట్టుగా భావించే వారు ఒకప్పుడు. అప్పు లేని వాడే అసలైన సంపన్నుడు అనే సామెతలు మనకు ఎన్నో ఉన్నాయి.
నిజంగా అప్పు పాపమా? అప్పు లేకపోవడమే ఆదృష్టమా?
కాదు కానీ కాదు. అప్పు ఉండడం తప్పేమీ కాదు. ఐతే ఆ ఆప్పుతో ఏం చేశాము అనేది ముఖ్యం. సరైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే మీరు చేసే అప్పు కూడా మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది. నిర్ణయాల్లో తేడా ఉంటే అదే అప్పు మీ జీవితాన్ని నరకంగా మారుస్తుంది. అప్పుల ఊబిలో ముంచేస్తుంది.
అప్పు అంటే మీరు ఇతరులకు చెల్లించాల్సిన డబ్బు. ఇతరులకు తిరిగి చెల్లించాల్సింది ఎప్పుడైనా భారమే కదా? అనిపించవచ్చు. నిజమే కానీ అప్పులు లేనిదే ప్రపంచం లేదు. దేశాలు, రాష్ట్రాలు, కంపెనీలు, సంస్థలు, చివరకు వ్యక్తిగతంగా మనం అప్పులు చేయందే సాధ్యం కాదు.
కుటుంబరావు పెద్ద మనిషి ఒక్క రూపాయి అప్పు కూడా లేదు. అప్పు చేయడం పాపం చేయడమేనని ఆయన గట్టి నమ్మకం. ఉన్నదాంట్లో సంతోషంగా బతకాలి అప్పులు చేసి కష్టాలు పాలు కావద్దు అనేది ఆయన తత్వం. అలానే మధ్య తరగతి జీవితాన్ని సాగిస్తున్నారు.
ప్రకాశ్‌రావుకు 50లక్షల రూపాయల అప్పు ఉంది.
ఇద్దరిలో తెలివైన నిర్ణయం ఎవరిది అంటే అప్పు చేయక పోవడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ప్రకాశ్ 50 లక్షల రూపాయలు దేని కోసం అప్పు చేశారు. 50లక్షల అప్పుకు అతను చెల్లిస్తున్నది ఎంత? అతనికి వస్తున్నది ఎంత అనే లెక్కలతో అతని అప్పు మంచిదా? కాదా? అని తేలుతుంది. అంబానీ వారసులకు కూడా వేలకోట్ల రూపాయల అప్పు ఉంటుంది. అయితే వారు విలాసాల కోసం కాదు కంపెనీల విస్తరణ కోసం, వ్యాపారం కోసం ఆ అప్పుచేస్తారు.
చీరలు మొదలుకొని విదేశాల్లో విహార యాత్రల వరకు అన్నింటికీ అప్పు లభిస్తుంది. మన మానాన మనం పని చేసుకుంటూ ఉన్నా ఫోన్ చేసి మరీ అప్పులిచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అప్పులకు అవకాశాలు ఎలా ఉన్నా మనం చేసే అప్పు దేని కోసం అనేది ముఖ్యం.
ఈ మధ్య సెలవుల్లో యాత్రలకు, ప్రయాణాలకు సైతం కొన్ని సంస్థలు అప్పులు ఇస్తున్నాయి.
కారు కొనేందుకు, పెళ్లి వంటి శుభకార్యాలు, యాత్రలు, ఇంట్లో ఫర్నిచర్, ఎసి వంటి వాటి కోసం చేసే అప్పులు మీ జేబులను ఖాళీ చేసేవి. ఉదాహరణకు ఐదారు లక్షల రుణంతో కారు కొంటే ఆ కారుకు నెలకు ఆరువేల రూపాయల వరకు వడ్డీ, ఎంతో కొంత అసలు, నిర్వాహణా వ్యయం దాదాపు నెలకు 30వేల రూపాయల వరకు అవుతుంది. పైగా ఏటేటా కారు విలువ తగ్గిపోతుంది. అవసరం అనుకుంటే కారు కొనడం వేరు. ఇతరులకు చూపించుకోవడానికి అప్పుతో కారు కొనడం అనేది ఏ విధంగానూ సరైన నిర్ణయం కాదు. అదే ఆదాయం కోసం అప్పుతో కారు కొనడం ప్రయోజన కరమే.
ఉదాహరణకు ఆరులక్షల అప్పుతో కారు కొని దానిని ఓలా వంటి సంస్థకు అప్పగిస్తే ఇఎంఐ ఇతర ఖర్చులు 15వేలు, మీకు నెలకు 30వేలు వస్తుంది అనుకుంటే ఆ కారు వల్ల మీకు నెలకు 15వేల రూపాయల ఆదాయమే కాబట్టి దీన్ని మంచి అప్పుగా భావించవచ్చు.
ఇంట్లో ఫర్నిచర్ వంటి వాటిని నెల నెల కిస్తులుగా చెల్లించడానికి అప్పు చేయడం కన్నా నగదుతో కొనుక్కునే స్థాయికి చేరుకునేంత వాటిని కొనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే సరైన నిర్ణయం.
ఇంటి కొనుగోలు వంటి వాటికి అప్పు చేసినా తరువాత అప్పుపై చెల్లించే వడ్డీని మించిన ప్రయోజనం చూపిస్తాయి కాబట్టి ఇలాంటివి మంచి అప్పులు అవుతాయి.
ఉదాహరణకు హైదరాబాద్ వంటి నగరంలో ఇండిపెండెంట్ ఇంటిని బ్యాంకు రుణంతో కొనుగోలు చేస్తే. గత కొన్ని సంవత్సరాల రికార్డును చూస్తే హైదరాబాద్‌లో ఇంటి విలువ ఏటా 20 శాతం వరకు పెరుగుతుంది. సగటును ఇంటిపై నాలుగు శాతం ఇంటి అద్దె వస్తుంది. అంటే 20 శాతం వరకు ధర పెరగడం, నాలుగు శాతం అద్దె అంటే ఏటా 24శాతం ఆదాయం ఉంటుంది. దీనితో పాటు పన్ను రాయితీ లభిస్తుంది. ఇక దీనిపై చెల్లించాల్సిన వడ్డీ దాదాపు 8శాతం వరకు ఉంటుంది. 24శాతం పెరుగుదలలో ఎనిమిది శాతం వడ్డీ చెల్లిస్తే ఇంటి అప్పుపై ఏటా 16శాతం ఆదాయం లభిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో మరే ఇనె్వస్ట్‌మెంట్‌లోనూ ఆదాయం లభించే అవకాశం లేదు. అందుకే ఎక్కువ మంది అప్పుతో ఇంటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
లక్ష రూపాయల జీతం ఉన్నా చాలా మంది ఐటి ఉద్యోగాల్లో ఉన్న యువత అప్పులకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్ల విలాస వంతమైన జీవితం గడిపేందుకు అవసరమైన వాటి కోసం అప్పులు చేస్తున్నారు. ఇలాంటి అప్పులు ఎప్పుడైనా ప్రమాదకరమే. లక్ష జీతం వస్తుంది కదా అని కారుతో సహా అన్ని అప్పులతో కొని నెల జీతం మొత్తం కిస్తులు చెల్లించడానికే సరిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి. కంపెనీ పరిస్థితి మారి ఉద్యోగం ప్రమాదంలో పడితే ఇలాంటి వారి పరిస్థితి దయనీయంగా మారుతంది. జీతం ఎంతైనా కావచ్చు. ప్రమాదకరమైన అప్పుల జోలికి వెళ్లవద్దు. అప్పుతో ఇంటిని కొన్నవారి ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడవచ్చు కానీ మిగిలిన వారితో పోలిస్తే వీరికి అప్పు అంత ప్రమాదమేమీ కాదు. నాలుగైదేళ్లలో ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ఆ సమయంలో అమ్ముకున్నా అప్పులు తీరిపోయి ఇంకా మిగులుతుంది. కానీ అదే అప్పుతో కారు కొంటే మొత్తం కారు అమ్మినా సగం అప్పు తీరదు. ఇటు కారు మిగలదు, అటు అప్పు తీరదు.
అన్నింటి కన్నా ప్రమాదకరమైన అప్పులు క్రెడిట్ కార్డు. ఈ నెల బిల్లుపై పది శాతం చెల్లించండి మిగిలింది వాయిదాలపై చెల్లించండి అంటూ అడగ ముందే అప్పు ఇస్తుంటారు. వీటికి దాదాపు 36శాతం వరకు వడ్డీ పడుతుంది. అత్యంత ప్రమాదకరమైన అప్పులు ఇవి. మనం అప్పు తీసుకుంటున్నప్పుడు వాటికి ఎంత శాతం వడ్డీ చెల్లిస్తున్నాం, మనకు వచ్చే వడ్డీ శాతం ఎంత అనే స్పష్టమైన లెక్కలు ఉండాలి. లెక్కలు అర్థం కాకపోతే జీవితం తలక్రిందులవుతుంది. అప్పుల్లో మునిగిపోతారు.
ఆదాయం ఇచ్చే అప్పు ఆరోగ్యకరం. కంటికి కునుకు లేకుండా చేసేది అనారోగ్యకరమైన అప్పు.