నీలాంటి మరొకరు..
Published Sunday, 21 October 2018నిన్ను పోలిన మనిషి ఎదురయితే..!
మనిషిని పోలిన మనిషి ఉండడం మామూలే. ఇక కవలల సంగతి తెలిసిందే. కానీ కొంచెం లోతుగా వెళ్లి చూస్తే కవలల మధ్య కూడా కావలసినన్ని తేడాలు ఉంటాయి. వారిని సులభంగా గుర్తించవచ్చు. ఇక నిన్ను పోలిన మనిషి ఏ రకంగానూ నీలాంటి మనిషి కాదనడం విచిత్రం కానేకాదు.
అమ్మ ఆప్యాయంగా తన బిడ్డ వంటి వారు ఈ ప్రపంచంలో మరొకరు లేనే లేరు అంటుంది. ఆమె కేవలం ప్రేమకొద్దీ ఆ మాట అంటుంది. కానీ పరిశోధకులు సైన్స్ ఆధారంగా అదే మాట అంటున్నారు. నిజంగానే చుట్టూ ఒకసారి చూడండి. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా కనిపించరు. మనుషులంతా ఒక్కటే అన్న మాట సామాజిక పరంగా మాత్రమే బాగుంటుంది కానీ, సైన్స్‌లోకి వస్తే అది చెల్లదు. పోల్చి చూడడానికి ముఖం ఒకటి చాలు. ఒకే రకంగా ఉన్న ముఖాలలో కూడా కొంచెం పరిశీలిస్తే తేడాలు కనిపిస్తాయి. ఆ తరువాత శరీరంలోని భాగాలు, అది పనిచేసే తీరు మరొక మెట్టు. ఇక మెదడు కూడా కలుగజేసుకుని నడవడి మొదలవుతుంది. వ్యక్తిత్వాలు వెలువడతాయి. ఇవన్నీ ఎవరికి వారుగా ప్రత్యేకంగా ఉంటాయి అంటే నమ్మక తప్పదు.
ఒక్కసారి మొత్తం మానవాళిని ఊహించండి. ఏడు బిలియన్‌లకు పైగా మనుషులు ఇవాళ ప్రపంచంలో ఉన్నారు. గడిచిన యాభయి వేల సంవత్సరాలలో కనీసం వంద బిలియన్‌ల మంది పుట్టి గిట్టారు. అయినప్పటికీ, అంత మందిలోనూ ఒక మీరు, ఒక నేను అన్ని రకాలుగాను ప్రత్యేకంగా ఉన్నాము. అంత సులభంగా నమ్మడానికి వీలుకాని మాట ఇది. ఇప్పటివరకు బ్రతికిన వారు, ఇప్పుడు ఉన్నవారు, ఇక ముందు పుట్టబోయే వారు అందరిలోనూ ఏ ఇద్దరు ఒక తీరు వారు కారు అంటే నమ్మాలి. అందుకు కావలసినన్ని ఆధారాలు ఉన్నాయి.
వ్యక్తుల ప్రత్యేకతను గుర్తించడానికి మనకు తెలిసి వేలిముద్రలను వాడుతున్నాము. అటువంటి మరిన్ని లక్షణాలు కూడా ఈ మధ్యన వాడుకలోకి వచ్చాయి. అన్నింటికీ మించి సరికొత్త పద్ధతిలో జన్యు పదార్థం, డిఎన్‌ఏ పరీక్షలు వచ్చాయి. అన్నీ ఒకే మాట చెపుతున్నాయి. ఎవరికి వారే ప్రత్యేకంగా అంటున్నాయి. పరిశీలించి చూస్తే ఆ మాట మనం కూడా సులభంగానే అంటాము.
డిఎన్‌ఎ
జీవుల నిర్మాణం, బతుకు తీరులను నిర్ణయించే రసాయన ఆధారం డిఎన్‌ఎ. దానే్న జన్యు పదార్థం అంటున్నారు. ఒకే కణంగల జీవి మొదలు మనిషి దాకా ఎక్కడికక్కడ శరీర నిర్మాణం, శరీర ధర్మాలు మొదలయినవి డిఎన్‌ఏ ఆధారంగానే కొనసాగుతాయి. కనుక మనుషులలో వైవిధ్యం గురించి పరిశీలించడానికి ఈ కీలకమయిన రసాయనంతోనే మొదలుపెట్టడం అన్ని రకాలా సమంజసం. జన్యుపరంగా మనుషులందరు ఎవరికి వారే ప్రత్యేకం అని ముందు రుజువు అవుతుంది.
మనిషి శరీరం మిగతా జీవులన్నిటిలాగే కణాల కూర్పుతో కట్టి ఉంది. ఈ కణాలు కంటికి కనిపించనంత చిన్నవి. వాటిలో ఒక కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో డిఎన్‌ఎ అనే జన్యు పదార్థం ఉంటుంది. అది మెలివేసిన తాటినిచ్చెన పద్ధతిలో పొడుగయిన పోగులుగా ఉంటుంది. మనిషి డిఎన్‌ఎ నిర్మాణాన్ని లోతుగా పరిశీలించే ప్రయత్నం ‘హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్’ అనే పేరున 2001లో మొదలుపెట్టారు. అనుకున్న సమయానికి ముందే ఫలితాలను సాధించగలిగారు. అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన విషయం తెలిసింది. మనుషులు అందరిలోనూ 99.9 శాతం డిఎన్‌ఎ ఒకేలాగ ఉంటుంది. మరి బిలియన్‌ల సంఖ్యలో మానవులు ఎవరికి వారు ప్రత్యేకంగా ఉండడం వెనుక కిటుకు ఏమిటి అన్నది ప్రశ్న. ఈ వైవిధ్యానికి కేవలం 0.01 శాతం డిఎన్‌ఎలోనే ఆధారాలు ఉన్నాయి. కొంత వెసులుబాటు కలుగజేస్తే ఈ అంకెను 0.05 వరకు పెంచవచ్చు. అంటే మొత్తం జన్యు పదార్థంలో అదేమంత ఎక్కువ భాగం కానే కాదు.
డిఎన్‌ఎ పోగులు నాలుగు రకాల రసాయనాలతో ఏర్పడి ఉంటాయి. అవి కూడా రెండు రకాలుగా కలిసి వరుసలుగా పేరుకుని ఉంటాయి. ఈ కలయికలను అక్షరాలు అనుకోవచ్చు. వాటి వరుసలను కోడ్ అనుకోవచ్చు. మొత్తం డిఎన్‌ఎలో 3.2 బిలియన్‌ల కోడ్‌లు ఉంటాయి. అందులో 0.05 శాతం అంటే పదహారు మిలియన్ అక్షరాలు. అంటే ఒక కోటి అరవయి లక్షలు. అది చిన్న అంకె కానేకాదు. ఉండే నాలుగు అక్షరాలు రకరకాలుగా కలయికలు ఏర్పడుతూ ఉంటే ఈ ఒక కోటి అరవయి లక్షలలో వైవిధ్యాన్ని సులభంగానే ఊహించవచ్చు. ఆ అంకెను నాలుగుతో హెచ్చవేస్తే అన్ని రకాల కలయికలు వీలవుతాయి. అది నిజంగా చాలా పెద్ద అంకె. ఆది నుంచి నేటి వరకు అంతమంది మనుషులు పుట్టనే లేదు. ఇక ముందు పుట్టబోయే వారిని కలిపినా అంత మంది కారు. కనుకనే మనుషులంతా ఎవరికి వారు ప్రత్యేకంగా లక్షణాలు కలిగి ఉండడం వీలయింది. ఏ ఇద్దరిలోను ఒకే రకమయిన జన్యు పదార్థం ఉండవలసిన అవసరం కనిపించలేదు.
ఒకే అండం ఫలదీకరణ చెంది పుట్టే కవలల విషయంలో కూడా వైవిధ్యం ఉంది. మొదటి దశలో ఆ ఇద్దరు శిశువులు జన్యుపరంగా కూడా నూటికి నూరు శాతం ఒకేలా ఉంటారు. ఇక ఆ తరువాత జన్యువులలో మార్పులు మొదలవుతాయి. శరీరం పెరిగిన కొద్దీ ఇద్దరి మధ్యన తేడాలు ఎక్కువవుతాయి. ఒక కణంగా మొదలయిన జీవి పూర్తి మానవుడిగా రూపుదాల్చడానికి కణాల విభజన అవసరం. ఆ రకంగా వాటి సంఖ్య పెరుగుతుంది. కణాలు విడివడి ఒకటి రెండుగా, రెండు నాలుగుగా పెరుగుతూ పోతాయి. కవలలోలాగే మిగతా మనుషులలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కణాల విభజన డిఎన్‌ఎ పోగుల విభజనతో మొదలవుతుంది. ఈ పోగులు నిలువునా చీలిపోతాయి. తగిన భాగాలు వచ్చి చేరినందుకు రెండు పోగులు పుడతాయి. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొన్ని అనుకోని మార్పులు జరుగుతాయి. వాటిని మ్యూటేషన్స్ అంటారు. మార్పు కేవలం ఒక అక్షరం విషయంగానే జరగవచ్చు లేదా వరుసగా కొన్ని అక్షరాలు కలిసిన కోడ్ తారుమారు కావచ్చు. కొన్ని కోడ్‌లు అసలు లేకుండా పోవచ్చు.
జన్యు పదార్థంలో వచ్చిన అన్ని మార్పుల వల్ల మనిషిలో ప్రభావం కనిపించవలసిన అవసరం లేదు. అన్ని జన్యువుల ప్రభావం వైవిధ్యంలో కనబడదని మనం అనుకున్నాము. కొన్ని జన్యువులు ఆయా జన్యువుల పనితీరును నియంత్రించడానికి కూడా ఉంటాయి. వాటిని ఎపిజెనెటిక్ మార్కర్స్ అంటారు. వాటిలో వచ్చిన మార్పులు ఫలితాలను చూపిస్తాయి. ఆ మార్పుల కారణంగానే ఒకే కణం నుంచి మొదలయిన కవలలో కూడా తేడాలు కనపడతాయి.
చిన్నచిన్న తేడాలు వచ్చి మనిషికి మధ్య చెప్పలేని వైవిధ్యాన్ని ఇస్తాయని తెలుసు కానీ, జన్యు పదార్థంలో ఈ తేడాలు సరిగ్గా ఎక్కడ వస్తున్నది మాత్రం గుర్తించడం వీలుకాలేదు. మామూలుగా ఈ మార్పులు ప్రొటీన్ల ఉత్పత్తికి, జన్యువుల ప్రకటనకు సంబంధం లేని ప్రాంతాలలో జరుగుతాయి. కోడింగ్ ప్రాంతాలలో జరిగినప్పటికీ, వాటివల్ల జన్యువుల మీద, వాటి పనితీరు మీద ప్రభావం కనబడదు. అయితే వచ్చిన మార్పులు మరీ చిన్నవి అయినప్పటికీ, శారీరక లక్షణాలలో వాటి ప్రభావం చక్కగా తెలుస్తుంది. కంటిరంగు ఇందుకు సులభమయిన ఉదాహరణ. వ్యాధులకు లొంగే తీరు కూడా ఈ రకం మార్పుల కారణంగా వేరువేరుగా ఉంటుంది.
మొత్తానికి ఎవరికి వారు ప్రత్యేకం అనడానికి జన్యువులలోనే ప్రారంభం జరుగుతుంది అని అనుమానం లేకుండా చెప్పవచ్చు. అంతటితో కథ మాత్రం ముగియదు. వాతావరణం, శిశువుగా కడుపులో ఉన్నప్పుడు చుట్టుపట్ల గల భౌతిక శక్తుల ప్రభావం కూడా మార్పులకు కారణమవుతాయి. అందుకు ఉదాహరణగా తరువాతి అంశాన్ని గమనించవచ్చు.