S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ..?

బతికేందుకు మనిషికి తిండీ నీళ్లే కాదు. విహరిస్తూ తిరిగేందుకు విశాలమైన స్థలం, పీల్చడానికి స్వచ్ఛమైన గాలీ వెలుతురూ కావాలి. మనకు తెలియకుండా యివన్నీ మన శరీరానికి ప్రాణవాయువు నందించాలి. యివన్నీ చుట్టూ పుష్కలంగా వుంటేనే మనిషి మనుగడ. వీటిలో ఏది లోపించినా శారీరకంగానూ మానసికంగానూ ఒంటికి రావలసిన రుగ్మతలన్నీ చేరటం ఖాయం. కళ్లూ, చెవులూ, నోరు అబద్ధం చెప్పవచ్చునేమో గాని, ముక్కు అబద్ధం చెప్పదు.
ప్రాణాయామానికి కేంద్ర స్థానం నాసిక. వాయువును నిరోధించేదీ, వదిలేదీ రెంటి స్థానం ఇదే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏర్పడేదే నాదం. ఒక విధంగా నాదానుభూతి తెలిసిన గాయకులకు అప్రయత్నంగా లభించిన వరం గానం. వారికదే ప్రాణాయామం. ఊపిరిని బిగించి పాడే మాటలుంటాయి. వదులుతూ భావంతో నిండిన మాటలు కొన్ని వుంటాయి. అది తెలిసి పాడితే చాలు. అదే ఆరోగ్యం. పైగా ఈ పట్టూ విడుపుల మర్మం తెలిస్తేనే సాహిత్యంలోని భావం తిన్నగా వినేవారి చెవులకు సుఖంగా చేరుతుంది. నిజానికి దేవాలయాలలో పూజా నివేదనలతోబాటు వినబడవలసినది సామ వేద గానం, భక్త్భివం నిండిన సంగీతం. వాద్యాల కంటే నాదోపాసనకు అనువైనది గాత్ర సంగీతం. ఒకప్పుడు సంగీత, నృత్యాది కార్యక్రమాలు అన్నీ సమస్త కళలూ దేవాలయాల్లోనే ఎక్కువగా జరిగేవి. లేదా రాజ దర్బారుల్లో జరిగేవి.
దేవదాసీ వ్యవస్థ ఇందుకే పుట్టింది. క్రమక్రమంగా ఈ కళలన్నీ దేవాలయాలకు దూరమై, భౌతిక జగత్తులో మనోరంజక మార్గాన్ని పట్టి, శ్రోతల స్థాయికి దిగజారటం ఆరంభమై జీవనోపాదులుగా అవతరించాయి.
సంగీతం ఆత్మవిద్య అని మరిచిపోయాం. కేవలం ఈశ్వర ప్రసాద లభ్యమే కాని, సంగీతం వంశ పరంపరాగతంగా లభించేది కాదు. ఎప్పుడూ దేవతలు ధర్మం వైపే ఉంటారు. అధర్మాన్ని ఆశ్రయించేది రాక్షసులు. ధర్మాన్ని అధర్మం కబళించినప్పుడే యుగధర్మం ప్రభావం కనిపిస్తూంటుంది. ఇపుడు మనం చూస్తున్నది ఇదే. అసలు నిత్య నైవేద్యానికీ దీపారాధనకూ నోచుకోని ఎన్నో దేవాలయాలు మూలుగుతూ పడి వుంటే, ఈ సంగీత సాహిత్యాల్ని పట్టించుకునేదెవరు? ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా వుండవలసిన దేవాలయాల్లో దర్శనమే గగన కుసుమమై తీర్థ ప్రసాదాలతోనే జీవితాలు సాగిపోతున్నాయి. మనశ్శాంతి నివ్వవలసిన ఆలయాల్లోనే ప్రశాంతత లేదు. మన పాలకులు భక్తులకు వితరణ చేసే ప్రసాదాలపై చూపే శ్రద్ధ్భాక్తులు, పవిత్రమైన దివ్యమైన సంగీతం మీద పెట్టకపోవడం చాలా శోచనీయం. అంతా యాంత్రికమే. చిత్తశుద్ధి లేని పూజలు పత్రి చేటు.
పరమేశ్వరుడు నాద స్వరూపుడు. నా భక్తులెక్కడ గానం చేస్తారో అక్కడ నేనుంటానన్నాడు. కనీసం ఆయన వున్న చోటునైనా ఆయన విని సంతోషించేలా సంగీతం వినిపించే ప్రశాంత వాతావరణం ఈ వేళ ఏ దేవాలయంలోనైనా కనిపిస్తోందా? అందుకే మన పూర్వీకులు ఆరాధనా స్థలాలను ఆర్భాటాలకు దూరంగా గందరగోళంగా లేని చోట ఏ నదీ తటాలకు సమీపంలోనో వుండేలా చూశారు. అలాగే ఓపికతో వెళ్లి వచ్చేవారు. అసలు మనం దేవాలయాలకు వెళ్లేదెందుకు? మనసు ప్రశాంతంగా వుండేందుకు. ఔనా?
మనసెందుకు ప్రశాంతంగా ఉండదు అంటే మాయదారి బ్రతుకు కాబట్టి. మనమే కాదు. కదిలీ కదలకుండా కనిపించే జగత్తు అంతా అలా ఏర్పడిందే. బ్రతుకు బొమ్మలాటలో గాలిపోయటంలోనూ, తీయటంలోనూ ఆరితేరిన ఆటగాణ్ణి నమ్ముకుని బ్రతకాలిగా? కనీసం గుళ్లల్లోనైనా ప్రశాంత వాతావరణం కనిపిస్తోందా? చెప్పండి.
ఎక్కడ చూసినా, ఎక్కడో ఒకచోట విద్వాంసులకూ, కళాకారులకూ లోటు లేదు - కనీసం ప్రతిరోజూ ఓ గంటైనా గానం చేస్తూ, వచ్చిన భక్తులకు, నయనానందంతోపాటు శ్రవణానందాన్ని కలిగించలేని స్థితిలో వున్నాం. అటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కలిగించలేని పాలకుల భావ దారిద్య్రమే కారణం. అతి లఘు దర్శనం, లఘు దర్శనం, దీర్ఘ దర్శనం, ప్రత్యేక దర్శనం, తీర్థ ప్రసాదాలు, ఆదాయ వ్యయాలే లక్ష్యంగా వున్న చోట సంగీత సాహిత్యాలు గుర్తుకొచ్చే అవకాశం లేదు. అసలు వాటి అవసరం తెలిసిన వాళ్లుంటే గదా? ఈవేళ చాలామందికి సంగీతం ఒక కాలక్షేప వస్తువు. ఎలా పాడినా వినేవాళ్లూ, ఏం పాడినా తలకాయలూపేస్తూ బాగుందనే వాళ్లూ ఉన్నారు. భద్రాచల రామదాసు కీర్తనలు, నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలాతరంగిణి గుళ్లల్లోనూ, గోపురాల్లోనూ ఒకప్పుడు పాడిపాడి ప్రచారం పొందనవే. ఒరిజినల్ బాణీలన్నీ అలా విన్నవే. అంతేకాదు. ప్రతి గ్రామంలోనూ రామ మందిరాలు, భజన కూటములుండేవి. పాడాలనే ఉత్సాహమున్న పది మందీ కలిసి ఒకరిని చూసి మరొకరు జాగ్రత్తగా శృతిలయలు పాటిస్తూ, నాలుగు రోడ్ల మీద నిలబడి, చేతుల్లో చిరతలతో భూ నభోంతరాళాలు దద్దరిల్లేలా పాడటం నేనెరుగుదును - అలా నాలుగు వీధులూ తిరిగి, ఆ గ్రామంలోని ప్రధాన ఆలయానికి చేరి హరతులిచ్చి, ఆ స్వామికి నివేదించి ప్రసాదాన్ని తిని ఇళ్లకు వెళ్లేవారు. ఆ రోజులన్నీ గతించాయి. కోరికలు తీర్చే దేవుళ్లు శుచి, శుభ్రత, నీతి నియమాలు ఆశిస్తారు. ఆ వాతావరణం కాస్తా మృగ్యమై పోయి, భక్తి యాంత్రికమై భగవంతుడు కూడా వ్యాపార వస్తువై నిలిచాడు. నియమ నిష్టలు లేని పూజలు సత్ఫలితాన్ని ఇవ్వలేవు.
అతి చిన్నచిన్న దేవాలయాల దగ్గర నుండి, అత్యంత ప్రపంచ ప్రసిద్ధమైన తిరుపతి వంటి పెద్ద దేవాలయాల్లో సహితం ఇదే పరిస్థితి. సంగీత సాహిత్యాల మీద అనురక్తి కల్గిన కార్యనిర్వహణకారులే చాలా చాలా అరుదు. ఉత్సవ మూర్తుల్ని ఊళ్లల్లో తిప్పే దౌర్భాగ్యం దాపురించి భక్తి వ్యాపారమై పోయింది. అంతెందుకు? నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలన్నీ క్రమబద్ధంగా జరిగే తిరుపతి వెంకన్న సన్నిధిలో పట్టుమని పదే పది నిమిషాలు కళ్లు మూసుకుని ఆయన మూర్తిని స్మరించుకుంటూ గడిపే సన్నివేశాలెక్కడైనా మీకు కనిపిస్తాయా? గమనించండి. అంతా ప్రసాదాల మీదనే దృష్టి. ఉత్సవాలు విజ్ఞాన ప్రసార కేంద్రాలు. ఒకానొక అధిష్టాన దేవత సంతృప్తి కోసం ఇహ పరాల ప్రయోజనం ఆశించి శాస్తవ్రిధిన జరిగే కార్యకలాపం. దీనికి మించి భేద భావం లేకుండా అందరూ కలిసి ఒకచోట తిరగటం, తినటం - మీకో విషయం చెప్తాను. వెనకటి రోజుల్లో త్యాగరాజు జన్మించిన తిరువయ్యార్‌లోనే ప్రణతార్తి హరుని ఊరేగింపు ఎంతో వైభవంగా జరిగేదట.
ముఖ్యంగా పల్లకీసేవ. త్యాగరాజుని ప్రథమ శిష్యగణంలోని సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్ సోదరులిద్దరూ కలిసి, రోజు రోజంతా ఆ పల్లకీ వెంటే నడుస్తూ గానం చేసేవారు. వారి గానం వినేందుకే జనం గుమిగూడి నిలబడేవారు. ఆహా! ఏమి సన్నివేశం? ఏమా వైభవమా?
వాస్తవానికి మనసుకు చేరువై మురిపించేది ఆట, పాట. ఆకట్టుకునే అందులోని పద విన్యాసం. ఆ సమయంలో వినవలసినది అదే భగవంతుని గుణగానమే. సాక్షాత్తూ త్యాగరాజ శిష్యులే పల్లకీ సేవా ప్రబంధాన్ని నడుపుతూ పాడితే ఆ విన్నవారి అదృష్టాన్ని వర్ణించగలమా? అది సామాన్య గానమా?
భగవంతుడు మెచ్చే ఆ గానం విన్నవారెంత ధన్యులో కదా? అనిపిస్తుంది. 19వ శతాబ్దంలో త్యాగరాజుకు పరమ సన్నిహితులైన శిష్యులలో ఈ సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్ ద్వయం అఖండ స్వర జ్ఞాన సంపన్నులే అయినా, సాగతీయకుండా ఎంత రాగం పాడాలి, కీర్తనకు ఎంత స్వరకల్పన పాడాలి అనే విషయాల్లో ఎంతో జాగ్రత్తగా వుండేవారు.
సంక్షిప్తంగా రాగం పాడి కీర్తనలోని భావాన్ని చక్కగా వివరించేవారుట. గంగా ప్రవాహంలా గానం సాగిపోయేది. ప్రణతార్తి హరుని ఊరేగింపు, తిరువయ్యార్‌కు సమీపంలోని ఏడు ప్రదేశాలను చుట్టివచ్చి తిరిగి రావటానికి 20 గంటలకు పైగా పట్టేది. ఓసారి ఉదయం 6 గంటలకు బయలుదేరుతూ ‘బిలహరి’ రాగం అందుకున్నారు. కీర్తనలోని అర్థం వివరించారు. (అక్కడున్న వారిలో అత్యధికులు తమిళులే కదా!) ‘దొరకునా ఇటువంటి సేవ’ త్యాగరాజస్వామి ప్రసిద్ధమైన కీర్తన పాడి ముగించి కదిలారు. నిలబడి అక్కడే వింటున్న మహా వైద్యనాథ శివన్ వీరి గానానికి మురిసిపోయాడు. కదిలిపోయాడు. ఆనందాశ్రువులతో పులకించిపోయాడు. ఔరా! ఏమి గానం? అనుకుని సుందర, కృష్ణ భాగవతార్‌ను అభినందించి వారితోబాటే ఊరేగింపులో కలిసి సాగాడు. చేతులు జోడించి నిలబడ్డ భక్తజనం ఆనందానికి అవధుల్లేవు. నిజమైన నాద నీరాజనానికి అద్దం అదే. పాటకు జరిగే పట్ట్భాషేకం అదే. మన విద్వాంసులకు అటువంటి యోగం లభిస్తుందా ఎప్పటికైనా?

- మల్లాది సూరిబాబు 90527 65490