S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్విల్ట్

హిక్స్ బామ్మ తన ఎనభై ఐదేళ్ల జీవిత కాలాన్ని కొండ మీది ఆ ఇంట్లోనే గడిపింది. 1921లో జేక్ హిక్స్‌ని పెళ్లి చేసుకున్నాక జేక్ ఆవిడ కోసం కట్టిన పైన్‌వుడ్ కేబిన్‌కి మారింది. ఏభై ఏళ్ల పాటు వారు ఇద్దరూ కలిసి జీవించారు. జేక్ మరణించాక బామ్మ ఒంటరిగా ఆ కేబిన్‌లో జీవిస్తోంది. వారిద్దరికీ సంతాన భాగ్యం లేకపోయింది.
నేను బామ్మ వయసు ఎనభై ఐదని చెప్పాను కాని హైఫర్స్ క్రాసింగ్‌లో ఎవరికీ ఆవిడ అసలు వయసు తెలీదు. ఆవిడకి కూడా తెలుసని నేను అనుకోను. ఒకటి, రెండేళ్లు అటూ ఇటూ ఉండచ్చు.
జేక్ మరణించాక ఆవిడ క్విల్ట్‌లని తయారు చేయసాగింది. హైఫర్స్ క్రాసింగ్‌లోని ప్రజలంతా ఆవిడ దగ్గర కనీసం ఒక్క క్విల్ట్‌నైనా కొన్నవాళ్లే. మొదట్లో వాటికి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఆవిడ విరాళాలు స్వీకరించదు కాబట్టి ప్రజలు ఆవిడకి సహాయం చేయాలని వాటిని కొనసాగారు.
ఓ రోజు హైఫర్స్ క్రాసింగ్‌లోని ఓ జనరల్ స్టోర్‌లోకి ఓ పాత వస్తువుల వ్యాపారస్థురాలు వచ్చింది. అక్కడ గోడకి వేలాడే బామ్మ క్విల్ట్‌ని, ‘అమ్మకానికి’ అనే బోర్డ్‌ని చూసింది. ఇరవై డాలర్లు, నగరం నించి వచ్చిన ఆమె దాన్ని కొని తీసుకెళ్లింది. నగరం నించి మరి కొంత మంది వాటిని కొనడానికి రాసాగారు.
త్వరలోనే బామ్మ డిమాండ్‌కి సరిపడా క్విల్ట్‌లని తయారు చేయలేక పోవడంతో వాటి ధరలు పెరగసాగాయి. ధర పెంచినా కొనుగోలుదార్లు వెనక్కి వెళ్లలేదు. క్విల్ట్ కుడివైపు మూలలో ‘మిరాండా హిక్స్’ అని కుట్టిన ఏ క్విల్ట్‌నైనా తన కస్టమర్లు కొంటారని ఓ సారి ఓ వ్యాపారస్థుడు నాతో చెప్పాడు.
వాటి ధర పెరగడం నా ఆలోచన. నా పేరు ఆల్విన్ బ్రిడ్జెస్. హైఫర్స్ క్రాసింగ్‌లోని జనరల్ స్టోర్ యజమానిని. కానిస్టేబుల్‌ని కూడా. కానిస్టేబుల్‌గా వచ్చే జీతం సరిపోదు కాబట్టి షాప్‌ని కూడా నడుపుతున్నాను.
బామ్మకి వాహనం లేకపోవడంతో నేను వారానికోసారి ఆవిడ ఇంటికి వెళ్లి, నా షాప్‌కి తీసుకువచ్చి ఆవిడకి కావల్సిన సరుకుని అమ్మేవాడిని. నెలకోసారి ఆవిడ బస్‌లో సమీపంలోని ఊరికి వెళ్లొస్తూండేది. నేను నా కార్లో ఊరికి తీసుకెళ్తానని చెప్తే సున్నితంగా నిరాకరించింది.
క్విల్ట్‌లన్నీ త్వరగా అమ్ముడవుతూండటంతో నేను ధరని పెంచమని సూచించాను. కాని అది సబబు కాదని అందుకు ఆవిడ ఇష్టపడలేదు.
‘మిరాండా! నగర వాసులు అధిక ధర చెల్లిస్తే కాని దేనికీ విలువ ఇవ్వరు. అమ్మకంలో అది మొదటి నియమం’ చెప్పాను.
‘నువ్వు అమ్మకాల మీద కమిషన్ తీసుకుంటావు కాబట్టి ధర పెంచమని అడుగుతున్నావు కదా?’ చిరుకోపంగా అడిగింది.
‘ఓ అదనపు డాలర్ సంపాదించడం తప్పు కాదు’ చెప్పాను.
‘సరే. ధర నిర్ణయాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను ఆల్విన్. కాని ఆ డబ్బుని నేనేం చేసుకోను?’ బామ్మ అడిగింది.
అప్పటి నించి ఆవిడ దగ్గర చాలా డబ్బు మూలుగుతోందనే వదంతి పాకింది. ఇది జరిగి పదిహేనేళ్లైంది. ఇంకా బామ్మ ఒకదాని తర్వాత మరో క్విల్ట్ తయారుచేస్తూనే ఉంది. ఒకో దాని ధరని ఇరవై డాలర్ల నించి ఐదు వందల డాలర్లకి పెంచగలిగాను.
ఆవిడ సంపాదించే డబ్బంతా ఏం చేస్తోందనే విషయం మీద చాలా ఊహాగానాలు సాగాయి. ఆవిడ తన కేబిన్‌లో దాస్తోందని చాలామంది నమ్మారు. నేనా వదంతిని అణచేయాలని ప్రయత్నించి విఫలమయ్యాను. వదంతులని నిర్మూలించడం చాలా కష్టం. ఓసారి వదంతి మొదలైందంటే, ఓ మంచు బంతి కొండ మీద నించి కిందకి జారడం లాంటిది. ఇక ఈ రెంటినీ ఆపలేం.
నేను బామ్మని తన డబ్బుని ఏం చేస్తోందని అడిగే ధైర్యం చేయలేదు. ఆవిడ నోరు మెదపకూడదు అనుకుంటే ఇక చస్తే మెదపదని నాకు తెలుసు. ఆ సమాచారం నాతో పంచుకుంటుందని నేను భావించలేదు.
అప్పుడే స్టీఫెన్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను బామ్మ భర్త జేక్ వైపు చుట్టం. వరసకి ముని మనవడు. స్టీఫెన్ మంచివాడు కాదు. పదేళ్ల క్రితం తన పదహారో ఏట స్టీఫెన్ హైఫర్స్ క్రాసింగ్‌ని వదిలి వెళ్లిపోయాడు. తర్వాత అతని గురించిన సమాచారం తెలీలేదు. అతను తన ఈడు మిత్రుడి మీద కత్తితో దాడి చేశాడు. నేను స్టీఫెన్ని అరెస్ట్ చేసేందుకు వారంట్ తీసుకున్నానని తెలీగానే పారిపోయాడు. ఇప్పుడు అతను తిరిగి వచ్చేసరికి స్టేచ్యూ ఆఫ్ లిమిటేషన్స్ (నేరం జరిగాక కొంత కాలానికి ఇక దాన్ని విచారించకూడదనే పరిమితి) పూర్తవడంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిన కారణం నాకు కనిపించలేదు. స్టీఫెన్ పక్క రాష్ట్రంలోని జైలు నించి పారిపోయి వచ్చాడని నాకు ఆలస్యంగా తెలిసింది.
నేను బామ్మని నా షాప్‌నకు తీసుకురావడానికి వెళ్లినప్పుడు మొదటిసారిగా నాకు స్టీఫెన్ తిరిగి వచ్చాడని తెలిసింది. నా పాత కారు చప్పుడు విని ఆవిడ ఎప్పుడూ గేట్ దగ్గర నా కోసం వేచి నిలబడుతుంది. ఆ రోజు ఆవిడ కనపడక పోవడంతో నిద్ర పోతోందా అనుకుంటూ నేను తలుపు తట్టాను.
అడుగుల చప్పుడు వినిపించింది. కాని అవి ఆవిడవి కావు. తలుపు తెరచుకున్నాక స్టీఫెన్ కనిపించగానే నివ్వెరపోయాను.
‘ఎలా ఉన్నావు కానిస్టేబుల్? చాలా కాలమైంది. నన్ను చూసి మీరు సర్‌ప్రైజ్ అయ్యారనుకుంటాను?’ స్టీఫెన్ నవ్వుతూ అడిగాడు.
‘అవును. ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ ప్రశ్నించాను.
‘ఎందుకు రాకూడదు? నాకున్న ఏకైక బంధువు బామ్మేగా. ఆవిడని చూడాలని అనిపించి, అవకాశం దొరకగానే వచ్చాను’
‘ఆవిడ కులాసానా?’ చురుగ్గా చూస్తూ అడిగాను.
‘కులాసాగా ఎందుకు ఉండదు?’ ఎదురు ప్రశ్న వేశాడు.
‘నేను ఆవిడని పచారీ సరుకు కొనడానికి తీసుకెళ్లాలని వచ్చాను’
‘మీకా శ్రమ వొద్దు. ఆవిడ అవసరాలన్నీ ఇక నించి నేనే చూస్తాను. ఆవిడ పడుకుంది. నేను నిన్న అర్ధరాత్రి వచ్చాను. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకుంటూ మేలుకునే ఉన్నాం.’
అది నిజమా అని నాకు అనుమానం కలిగింది. ఆవిడని చూడకుండానే తిరిగి వెళ్లడం నాకు నచ్చలేదు. కాని అతన్ని తోసుకుని లోపలకి వెళ్లడం అమర్యాదగా అనిపించి చెప్పాను.
‘సరే. వెళ్తున్నాను. శుక్రవారం ఆవిడ ఇస్తానన్న క్విల్ట్ తీసుకోడానికి వస్తానని చెప్పు’ కోరాను.
‘తప్పకుండా కానిస్టేబుల్’
* * *
స్టీఫెన్ తలుపు మూసి లోపల గడియ పెట్టాడు. తను కానిస్టేబుల్‌ని మోసం చేసినందుకు ఆనందించాడు. రాకింగ్ చెయిర్‌కి కట్టబడి, నోట్లో గుడ్డలు కుక్కబడ్డ హిక్స్ దగ్గరికి వెళ్లాడు. ఆ కుర్చీ కదలకుండా దాని కింద ఓ చెక్కముక్కని ఉంచాడు.
ఎనభై ఐదేళ్ళావిడ అంత పట్టుదల గల మనిషని అతను ఎదురు చూడలేదు.
‘ముసల్దానా! మనం మళ్లీ అసలు విషయానికి వద్దాం. నీ ముల్లె ఎక్కడ దాచావో చెప్పు’ కోరాడు.
నోటికి అడ్డంగా ఉంచిన ప్లాస్టర్ని మొరటుగా తీశాడు. ఆవిడ బాధగా అరిచింది.
‘బాధగా ఉందా? చెప్పకపోతే ఇంకా ఎక్కువ బాధని అనుభవిస్తావు. చెప్పు’
ఆవిడ నాలికతో పెదాలని తడి చేసుకుని అడిగింది.
‘మంచినీళ్లు. కాసిని మంచి నీళ్లు ఇస్తావా?’
అతను వంట గది వైపు నాలుగైదు అడుగులు వేసి అకస్మాత్తుగా ఆగాడు.
‘నీళ్లు లేవు ముసల్దానా! అది ఎక్కడ ఉందో చెప్పేదాకా నీళ్లు, ఆహారం ఇవ్వను’ చెప్పాడు.
‘ముల్లేం లేదు స్టీఫెన్. ప్రజలు ఆ వదంతిని సృష్టించారు’ చెప్పింది.
‘వదంతా? సరే చూద్దాం. నీకు ఆకలి దంచడం ఆరంభమయ్యాక నువ్వే చెప్తావు’ అరిచాడు.
ఆవిడ కుర్చీ చుట్టూ అవిశ్రాంతంగా తిరగసాగాడు. అప్పటికే అతను కాఫీ పొడి, చక్కెర డబ్బాలు, పిండి సీసాలు, ఇంకా అతనికి వంట గదిలో కనిపించిన ప్రతీది తీసి వెదికాడు. ఆవిడ పక్షి ఈకల పరుపుని కూడా చింపేశాడు. అతనికి కనిపించిందల్లా ఆవిడ హేండ్‌బేగ్‌లో ఇరవై డాలర్లు. దాన్ని ఎక్కడో పాతిపెట్టి ఉంటుంది, చెప్పకపోతే ఇక జీవించదు అనుకున్నాడు. ఆవిడని ప్రాణాలతో వదిలి వెళ్తే కానిస్టేబుల్‌తో తన గురించి చెప్తుందని అతనికి తెలుసు.
ఆవిడ మరణించే ముందుగా ఆ డబ్బుని ఎక్కడ దాచిందో తెలుసుకోవాలి. ఆహారం, మంచినీళ్లు లేకుండా అంత ముసలావిడ ఎంత కాలం జీవించగలదు? కొద్ది రోజులు మించి జీవించలేదు’ అనుకున్నాడు.
‘స్టీఫెన్. నా కట్లు విప్పుతావా? శుక్రవారానికి నేను క్విల్ట్‌ని పూర్తి చేసిస్తానని మాట ఇచ్చాను కదా? ఆల్విన్ అది చెప్పగా నువ్వు విన్నావు’ కోరింది.
శుక్రవారం. అదింక మూడు రోజులే. ఆ సరికి ఆవిడ చెప్పకపోతే కానిస్టేబుల్ మళ్లీ వచ్చి ఆవిడని చూడాలంటాడు.
‘్భయపడకు. నేను నీకన్నా వేగంగా పరిగెత్తి పారిపోలేను’ బామ్మ చెప్పింది.
క్విల్ట్ పనివల్ల ఆవిడ త్వరగా అలసిపోవచ్చని స్టీఫెన్‌కి అనిపించింది.
‘సరే. కాని నీ కాళ్లని కట్టేస్తాను. రాత్రుళ్లు నీ చేతుల్ని కూడా ఆ కుర్చీకి కట్టేస్తాను’
అతను ఆవిడ కట్లువిప్పి గొణుగుతూ చెప్పాడు.
‘నేను అడిగేది నువ్వు చెప్పగానే నేనా డబ్బుతో వెళ్లిపోతాను’
‘నేను నీకది చెప్పలేను స్టీఫెన్. కారణం ఇక్కడ డబ్బు లేనే లేదు’
ఆవిడ క్విల్ట్ పని చేస్తూంటే అతను వెనక నిలబడి కేవలం ఆసక్తి వల్ల దాన్ని చూడసాగాడు. అనేక చదరాలని కలుపుతూ ఆ క్విల్ట్‌ని ఆవిడ చేస్తోంది. ఓ చిత్రాన్ని రూపొందించే ఓ చదరం, దాని పక్కది సాధారణ రంగుది. ఆ చిత్రపు చదరాలన్నీ అతనికి ఒకేలా కనిపించాయి. తలుపు తెరచిన కేబిన్, ఇంటి బయట పోర్చ్‌లో రాకింగ్ చెయిర్లో ఓ ముసలావిడ.
కొద్దిసేపటికి స్టీఫెన్‌కి ఆసక్తి చచ్చిపోయి వెళ్లిపోయాడు. ఎవరైనా వాటికి ఎందుకు ఎక్కువ డబ్బిచ్చి కొంటారో అతనికి అర్థం కాలేదు. కొందరు డబ్బున్న మూర్ఖులు పిచ్చి వాటికి ఖర్చు చేస్తారు అనుకున్నాడు. ఒకో క్విల్ట్‌కీ ఐదు వందల డాలర్ల దాకా! ఆ డబ్బుతో తనని వెదికే రాష్ట్ర పోలీసులకి దూరంగా వెస్ట్ కోస్ట్‌కి వెళ్లచ్చు. అందుకు చేయాల్సింది ఆవిడ డబ్బు ఎక్కడ దాచిందో కనుక్కోవాలి.
బామ్మ క్విల్ట్‌ని చేస్తూంటే స్టీఫెన్ ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని మండే కట్టెల పైన ఉన్న రాళ్లని చూశాడు. అలాంటి రాళ్ల కింద విలువైనవి దాస్తారని ఓ సినిమాలో చూడటం గుర్తొచ్చింది. లూజుగా ఉండే రాయి కోసం వెదికాడు కానీ దొరకలేదు. చివరికి వంట గదిలోకి వెళ్లి మాంసం కోసే కత్తితో వచ్చి, ఆ రాళ్ల మధ్య ఉన్న సిమెంట్‌ని తొలగించా రాళ్లని తీసి చూశాడు.
డబ్బు దొరక్కపోవడంతో కోపంతో నేల మీద చెక్కలని తొలగించసాగాడు.
‘స్టీఫెన్! నువ్వు చేసే పని నిరుపయోగమైంది’ ఆవిడ అతని వైపు చూడకుండా తన పనిని కొనసాగిస్తూ చెప్పింది.
‘నోరు మూసుకో ముసల్దానా! ఆ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు. లేదా ఇల్లంతా పీకి పందిరేస్తాను’ కోపంగా అరిచాడు.
‘లేదు స్టీఫెన్. అది అసలు ఉంటేగా నీకు దొరకడానికి.’
‘నువ్వు అబద్ధమాడుతున్నావని నాకు తెలుసు. దాహం, ఆకలి నిన్ను బాధించేప్పుడు నువ్వే చెప్తావు’ కసిరాడు.
చీకటి పడేసరికి ఆ ఇల్లంతా చిందర వందరైంది. ఐనా స్టీఫెన్‌కి డబ్బు దొరకలేదు. నూనె దీపాన్ని వెలిగించాక తిరిగి రాకింగ్ చెయిర్‌కి ఆవిడని కట్టేశాడు. అతను ఐస్ బాక్స్‌లోంచి మూడు గుడ్లు, హేమ్ (పంది మాంసం) తీసుకుని కార్న్ బ్రెడ్‌ని వేడి చేసుకుని, హేమ్‌ని వేయించుకున్నాడు. దాన్ని ఆనందంగా తిని, మజ్జిగ తాగుతూ చెప్పాడు.
‘రుచికరమైన భోజనం ముసల్దానా!’
ఆవిడ వౌనంగా అతని వైపు నిరసనగా చూసింది.
అలసిపోయిన స్టీఫెన్ గినె్నలని ఎక్కడివక్కడ వదిలి పడక గదిలోకి వెళ్లి పడుకున్నాడు. అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మెలకువ వచ్చినప్పుడల్లా లేచి ముసలావిడ కట్లని పరిశీలించాడు. ఆవిడ తల ముందుకి వేలాడేసి కునుకుతోంది.
మర్నాడు ఉదయం అయిష్టంగానే ఆవిడని ఇంటి వెనక బాత్‌రూంకి తీసుకెళ్లాడు. ఆవిడ కోసం కాక తన కోసం, తర్వాత మళ్లీ క్విల్ట్ పనిచేసే చోట కూర్చోబెట్టాడు. ఆవిడ క్రితం రోజుకన్నా బలహీనంగా ఉండటం అతనికి స్పష్టంగా తెలిసింది. ఐనా ఆవిడ క్విల్ట్ పనిని కొనసాగించింది.
స్టీఫెన్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని తింటూ ఆవిడ వంక చూశాడు. లంచ్ టైంలో కూడా ఆవిడ అతని వంక చూడకుండా తన పనిని కొనసాగించడం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆ సరికి నీళ్లు, భోజనం కోసం ముల్లె రహస్యం చెప్తుందని ఆశించాడు. చాలా మొండి ముసల్ది అనుకున్నాడు.
మిగిలిన రోజంతా అతను ఆ డబ్బు కోసం మళ్లీ ఇల్లంతా వెతకసాగాడు. కాని మనసు పెట్టి కాదు. తనంతట తానుగా ఆవిడ ముల్లెని కనుక్కోలేడని అతనికి అనిపించసాగింది. కోపంతో ఆవిడని హింసించి ఆ రహస్యం తెలుసుకోవాలని అనుకున్నాడు. కాని అందువల్ల ఆవిడ ఒంటి మీద గుర్తులుంటాయి. దాంతో వాళ్లు తనని హత్యానేరం మీద వెదుకుతారు. ఆవిడ ఒంటి మీద ఎలాంటి గుర్తులు వదలకుండా చంపాలన్నది అతని ఆలోచన. అందువల్ల ఆవిడది సహజ మరణం అని పోలీసులు భావిస్తారని అనుకున్నాడు. ఆవిడ ఇంక ఎక్కువ కాలం తట్టుకోలేక మర్నాడు డబ్బు గురించి చెప్తుందని ఆశించాడు.
చీకటి పడుతూండగా ఆవిడ దగ్గరికి వెళ్తే చెప్పింది.
‘పూరె్తైంది. ఆల్విన్ వచ్చేసరికి సిద్ధంగా ఉంటుంది’
స్టీపెన్ దాని వంక అనాసక్తంగా చూశాడు. తర్వాత మడిచి చెప్పాడు.
‘్థంక్స్ బామ్మ. నాకో ఐదు వందల డాలర్లు వస్తాయి.’
* * *
మర్నాడు ఉదయం నేను మళ్లీ బామ్మ ఇంటికి వెళ్లినప్పుడు స్టీఫెన్ వెళ్లిపోయి ఉంటాడని ఆశించాను. కానీ మళ్లీ అతనే తలుపుని కొద్దిగా తెరిచాడు. ఆ సందులోంచి అతను మడిచిన క్విల్ట్‌ని అందించాడు.
‘మీరు వచ్చింది దీని కోసమేగా కానిస్టేబుల్?’ అడిగాడు.
‘నేను బామ్మకి డబ్బు ఇచ్చి మాట్లాడి వెళ్లాలని అనుకుంటున్నాను’ చెప్పాను.
‘ఊహు. కుదరదు. దీన్ని చేస్తూ ఆవిడ అలసిపోయింది. నిన్న రాత్రంతా చేస్తూండటంతో నిద్ర పోతోంది. ఐదు వందల డాలర్లు తీసుకోమంది’ చెప్పాడు.
‘అమ్మాక. అదీ నాకు, ఆవిడకి గల ఒప్పందం’ చెప్పాను.
నాకు బలవంతంగా లోపలికి ఆవిడ్ని కలవడానికి వెళ్లాలనే కోరిక క్షణకాలం కలిగింది. కాని అందుకు ఆవిడకి సరైన కారణాన్ని వివరించలేను. దాంతో తమాయించుకుని వెనక్కి తిరిగి కారు దగ్గరికి నడిచాను. కాని నాకు ఆ ఇంట్లో ఏదో జరుగుతోందనే అనుమానం బలంగా కలగసాగింది. కార్లో కూర్చుని ఆ కేబిన్ వంక చూశాను. మళ్లీ సరుకుల రోజు నేను వచ్చినప్పుడు స్టీఫెన్ నన్ను ఆవిడని చూడనివ్వకపోతే చూడకుండా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
కారెక్కి గేర్ మార్చి కొండ కిందకి పోనించాను. కొద్ది దూరం వెళ్లాక నా దృష్టి పక్క సీట్లోని క్విల్ట్ మీద పడింది. అకస్మాత్తుగా నేను బ్రేక్ నొక్కి ఆ రాళ్ల రోడ్ మీద ఓ సైడ్‌కి కారుని ఆపాను. క్విల్ట్‌ని అందుకుని విప్పి చూసాను. నేను ఎప్పుడూ బామ్మ తర్వాతి క్విల్ట్‌లో ఏ డిజైన్ వేస్తుందా అని ఆసక్తిగా చూస్తూంటాను. అది ఆవిడకి ఇష్టమైన పేట్రన్‌లో చేసింది. ఆవిడ కేబిన్ బొమ్మది. అది కస్టమర్లకి అభిమాన డిజైన్.
ప్రతీ చిత్రం చదరం ఆ చెక్క కేబిన్ బయటి భాగాన్ని చూపిస్తోంది. పక్కనే పైన్ చెట్టు. పోర్చ్‌లో రాకింగ్ చెయిర్లో బామ్మ కూర్చుని ఉంది. నేను కళ్లు చికిలించి దాని వంక చూశాను. ఎప్పటిలా కాక అందులో చిన్న మార్పు కనిపించింది. గ్రానీ కాళ్లు చేతులకి కట్లున్నాయి. నేనో ‘బూతు’ పదాన్ని అరిచి కారు వెనక్కి తిప్పాను. దాన్ని కేబిన్ ముందాపి గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లోంచి నా పాత పాయింట్ 45 రివాల్వర్ కనపడేలా పట్టుకుని తలుపు తట్టాను. అతను తలుపు తెరవగానే అతన్ని నెట్టుకుని లోపలికి నడిచాను.
ఎదురుగా రాకింగ్ చెయిర్లో కట్టబడ్డ బామ్మ కనిపించడంతో నిర్ఘాంతపోయాను. ఆవిడ నన్ను చూసి నవ్వి బలహీనంగా చెప్పింది.
‘మంచిది ఆల్విన్. అర్థమైందన్నమాట’
నేను ఆవిడ్ని రక్షించడం ఆలస్యమైంది. స్టీఫెన్‌కి బేడీలు వేసి, ముందు సీట్లో నా పక్కన కూర్చోబెట్టి, స్పృహలో లేని బామ్మని వెనక సీట్లో పడుకోబెట్టి కారుని కొండ మీంచి సరాసరి హాస్పిటల్‌కి పోనించాను. ఆవిడ మళ్లీ స్పృహలోకి రాకుండానే మరణించింది. ఆవిడ వృద్ధాప్యం వల్ల నీరు, ఆహారం లేకుండా జీవించలేక పోయిందని డాక్టర్ చప్పాడు.
ఆవిడకి కర్మకాండ జరిగాక ఆవిడ లాయర్ చెప్పింది హైఫర్ క్రాసింగ్‌లోని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్ని సంవత్సరాలుగా బామ్మ నగరంలోని బేంక్‌కి నెలనెలా వెళ్లి డబ్బుని తన ఎకౌంట్లో దాస్తోంది. ఆవిడ నెలకోసారి షాపింగ్ కోసం బస్‌లో ఎందుకు ఒంటరిగా వెళ్లి వస్తోందో అందరికీ అర్థమైంది. ఆ మొత్తం లక్ష డాలర్ల పైనే. ఆవిడ తన విల్లులో దాన్ని తన ఏకైక బంధువుకి రాసింది.
భర్త తరఫు బంధువు స్టీఫెన్ హిక్స్‌కి.
స్టీఫెన్ వేచి ఉంటే ఆ మొత్తం చట్టబద్ధంగా అతనికి చెందేది. ఇక ఎన్నటికీ అతను దానికి వారసుడు కాలేడు. ఆవిడ మరణానికి కారణమైన అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
బామ్మ ఆఖరి క్విల్ట్?
అదింకా నా షాప్‌లో వేలాడుతోంది. అది ఆవిడ ఆఖరి క్విల్ట్ కాబట్టి చాలా ఎక్కువ ధరకి కొంటామని చాలామంది ముందుకి వచ్చారు. నేను దాన్ని ఎప్పటికీ అమ్మదలచుకోలేదు.
ఆ క్విల్ట్ గురించి ఇక ఎవరికీ ఏమీ చెప్పకూడదనే రోజు వచ్చేదాకా దాన్ని అమ్మను.
*
---------------------------------------------------
(క్లేటన్ అండ్ పేట్రీషియా మేథ్యూస్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి