నమో నమో జగన్మాత
Published Saturday, 13 October 2018అనేకత్వంలో ఏకత్వాన్ని వీక్షించే దృష్టిని అలవరచేవే భారతీయుల పండుగలు, పర్వదినములు. భారతీయ సంస్కృతిలో ప్రతి పనీ భగవత్కర్మే. ప్రతి కర్మ ఆత్మస్మృతిని కలిగించటానికే అనే జాగృతిని కలిగించేవి మన పండుగలు, పర్వదినములు. సామరస్యాన్ని, సమైక్యతను తెలియజేసేవి పండుగలు. మానవులను సంస్కరించటానికి నిర్దేశింపబడినవి - పండుగలు.
*
పండుగలు కేవలం ఆహార విహార వినోద కార్యక్రమాలతో ఆనందాన్ని అనుభవించే నిమిత్తం ఏర్పడినవి కావు. ఆరాధనా నిమిత్తమై ఆత్మతత్త్వానే్వషణ నిమిత్తమై ఏర్పడినవి. ధర్మాచరణే భగవత్ సేవగా ఎంచి, నిత్య జీవితంలో ధర్మాచరణను అవలంబించి, దైవ విశ్వాసం దృఢపరచుకోవడమే పండుగల లక్ష్యం.
మనం, మన జీవిత ప్రయాణంలో ఎంత దూరం శ్రేయోమార్గంలో పయనిస్తున్నాం, అని పరిశీలించుకొని పురోగమించడానికి మార్గదర్శకాలు మన పండుగలు.
ఉపవాస, జాగరణ దైవచింతనలతో కూడిన ఆరాధనా క్రమములో విందు భోజనాలతో పుణ్యకథా శ్రవణాదులతో, సద్గ్రంథ పఠనాదులతో గడిపేవి, కొన్ని పండుగలు దైవములను మనము చేయు షోడశ పూజ అలంకరణ, నివేదన ఇలా అన్నీ ఆరోగ్యపరముగా విజ్ఞానపరముగా, నైతిక ధార్మిక ఆధ్యాత్మిక పరముగా ప్రాశస్త్యము కలిగి ఉంటాయి, మన భారతీయ పండుగలు.
మన పండుగలలో ప్రధానంగా పేర్కొనబడేది - శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములు. శరదృతువులో, ఆశ్వయుజ మాసంలో, శుక్ల పాడ్యమి నుండి జగన్మాతను వివిధ అలంకారములు అవతారములలో నవమి వరకు పూజించి పదవ రోజైన విజయదశమి నాడు శమీ వృక్షము దగ్గర శివశక్తుల ఏకేశ్వరోపాసన చేయటం, మనలోని పశు రాక్షసత్త్వాలను అణచి, మానవతా విలువలను పెంపొందించుకొని, అంకురించే దైవీతత్త్వాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింప చేసుకొని, సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించే పండుగ - శ్రీదేవి శరన్నవరాత్రుత్సవములు.
శ్రీదేవీ పూజలో, ప్రాముఖ్యమైనది, మూలానక్షత్రం రోజున జరిపే శ్రీ మహాసరస్వతీ పూజ, ఆరాధన, ఉపాసన.
జ్ఞానవిజ్ఞాన దేవత, చదువుల తల్లి - మహాసరస్వతి. సంగీత సాహిత్యాది లలిత కళలన్నీ ఆ దేవీ స్వరూపం. మహా సరస్వతి మంచి మాట తీరునిస్తుంది. ఎంత భాగ్యం ఉన్నా, దాన్ని అనుభవంలోకి తెచ్చేది జ్ఞానం. అది లేకపోతే అన్నీ వ్యర్థం. సప్తమి తిథి, మూలా నక్షత్రం కలిసిన రోజు చేసే పూజ - సరస్వతీ పూజ. జీవిత లక్ష్యాన్ని పొందించే జగన్మాత మహా సరస్వతి.
సరస్వతీ నమస్త్భ్యుం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
విద్యారంభమున అందరిచే కొలువబడే దేవత సరస్వతీ మాత. కనుకనే ఆమె చదువుల తల్లిగా ప్రశంసింపబడుతోంది. సరస్వతీ దేవి, బ్రహ్మదేవుని అర్ధాంగి. బ్రహ్మదేవుని ముఖ కమలమున సరస్వతి విలసిల్లుతుందని శాస్తమ్రులు ఉటంకిస్తున్నాయి. తల్లిని ఆరాధించే వారి ముఖములు కూడా సరస్వతీ నిలయములై విరాజిల్లుతాయి. బాల్యము నుండి ఆరాధింపబడే సరస్వతీ మాత, భక్తుల పాలిటి వరద, కామరూపిణి. అంటే తల్లి తన భక్తులను కోర్కెలను తీర్చే కల్పలత, కామధేనువు. అంతేకాదు భక్తుల ఆధివ్యాధులను నశింపజేయు ధన్వంతరి. కనుకనే ఆమె ప్రతిరోజూ ‘నిశే్శష జాడ్యాపహా’ అని కీర్తింపబడుతోంది.
సరస్వతి విద్యాధిదేవత. జ్ఞానరూపిణి, విజ్ఞానప్రదాత్రి. కొన్ని చోట్ల నదీ స్వరూపిణిగాను వేదాలలో వర్ణింపబడింది. జ్ఞానం చేత భవసాగరాన్ని దాటిస్తుంది.
‘సరాంసి జలాని సంతి అస్యాః ఇతి సరస్వతీ’ లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక రస స్వరూప సరస్సులో సదావహించే విద్యాశక్తి. జ్ఞానశక్తి సరస్వతి అని పేర్కొన్నది మేదినీ కోశం.
‘అకారాది క్షకారాంత వర్ణాయవ శాలినీ
వీణాపుస్తక హస్తవ్యాత్ ప్రణోదేవీ సరస్వతీ
యావర్ణ పద వాక్యార్థ గద్య పద్య స్వరూపిణీ
వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతీ’
‘అ’కారాది ‘క్ష’కారాంత వర్ణములు, ఆవర్ణములచే వచ్చు పదములు, తత్ పద సముదాయ వాక్యములు, గద్య పద్య రూప కవిత - ఈ అన్నింటి రూపమున ఏ దేవి వెలుగొందుచున్నదో ఆమెయే సరస్వతీదేవి, అన్నారు ఆదిశంకరాచార్యులు.
ప్రసన్న వదనము, దయార్ద్ర నేత్రములు, మందహాస సుందర వదనము, కంబు సదృశ కంధరము, వీణాగ్రాహిణులైన హస్తములతో బ్రహ్మతేజోమయ రూపమున విరాజిల్లుతూ, భక్తులకు స్వచ్ఛ సాత్విక స్వభావమును ప్రసాదించు వరదాయిని - శ్రీ మహాసరస్వతి.
లోచనములకు గోచరము గాని జ్ఞాన జ్యోతి - సరస్వతీ దేవి. ‘సరః’ అనే పదమునకు ‘సంచరించు’ అని అర్థము. అది తేజస్సు, కాంతి అనగా వెలుగునకు సంబంధించినది. వాగ్దేవి - మేధాశక్తిని, బుద్ధిని, విద్యను జ్ఞానమును ప్రసాదించి సమస్త విద్యా స్వరూపిణి అయి, తనను పూర్తి శరణాగతితో ధ్యానించి ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని, వివేచనా శక్తిని, జ్ఞాపకశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదించు కరుణామయి - సరస్వతీదేవి.
‘సరస్వతీ శ్రుతి మహతీ మహేయతామ్’ శ్రుతులు - సరస్వతీ దేవి మహిమను కొనియాడుచున్నవని, సంగీత స్వర మహితమైన సరస్వతి అధిక మనోహరియై, పూజలనందుకొంటున్నదని, ఎనె్నన్నో విశేషార్థాల్ని యిమిడ్చి ఒక చిన్న వాక్యంలో చెప్పాడు - వాగ్దేవీ వరప్రసాదుడు - కాళిదాసు మహాకవి.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేవి - లలిత కళలు. అవి సంగీత, సాహిత్య, నాట్య, శిల్పములు (చిత్రలేఖనం). ఇవన్నీ మహా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే గాని రావు. తల్లి కటాక్షం సంపూర్ణంగా ఉన్నవారికి ఆయా కళలలో రాణింపు ఉన్నతంగా ఉంటుంది. లలిత కళలను ఉపాసించిన వారిలో ఒక అనిర్వచనీయ ఆకర్షణా శక్తి ఉంటుంది. అది ఆ సరస్వతీ మాత చిద్విలాసం. యోగులైన వారు, యోగ్యులైనవారు సాత్వికులు, తమలో ఉన్న శక్తిని, ఆ కళామతల్లితో అనుసంధానం చేసి క్షణికమైన ఆకర్షణకు లోనుగాక, ఆత్మతత్త్వాన్ని అనే్వషిస్తారు, జీవన్ముక్తులవుతారు. అలా కాని వారు తల్లి ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఎంత ఎదిగామనుకున్నా పతనమవుతారు. సంపూర్ణ భక్తి భావంతో, సాత్విక సాధనతో పవిత్ర భావనతో, నిర్మల హృదయంతో నిశ్చల మనస్సుతో లలిత కళలను ఆరాధించి, ఆత్మానందాన్ని పొంది, భావితరం వారికి ఆదర్శంగా ఉండాలని హెచ్చరిస్తోంది - మహా సరస్వతి.
మానవ జీవితంలో ముఖ్యమైనది - వాక్కు అనగా మాట. వాక్కు అంటే శబ్ద ‘శక్తి’. ఎవరినీ నొప్పించకుండా, చెప్పదలచుకొన్న విషయాన్ని చక్కటి మాటలతో చెప్పటమే - శబ్దశక్తి ఉపాసన. అందరిచేత ఒక వ్యక్తిగా గౌరవింపబడేటట్లు చేసేది - అతని వీనులవిందైన వాక్కు. మాటతో మనిషి, తన మనసును మూటగట్టి ముందు తరం వారికిచ్చి మాన్యుడవుతాడు. మాట తీరు, మనిషి సంస్కారానికి అద్దం పడుతుంది. కనుక మాట ప్రభావం మహోదాత్తమయింది.
బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి తీసికోవచ్చు గాని, పెదవి దాటిన మాటను వెనక్కి తీసికోవటం, బ్రహ్మదేవునికి కూడా సాధ్యంకాదు. ఇంత సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. మనిషికి, మాట ఆ సరస్వతీ దేవి ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
మూలా నక్షత్రం - ధనూరాశిలో ఉంటుంది. ధనూరాశికి అధిపతి ధన, విద్యా, వాక్, కుటుంబ కారకుడైన బృహస్పతి అనగా గురుడు. బృహస్పతిలోని ‘శక్తి’యే మహా సరస్వతి. అందుకే మూలా నక్షత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో, మహా సరస్వతీ పూజ చేస్తారు. మాట తీరును మదుర తరం చేసి, జీవన సరళిని ఆనందమయం చేసి, మనశ్శాంతిని, ఆత్మస్థైర్యాన్ని యిచ్చే మహాశక్తి - వాగ్దేవి, చదువుల తల్లి సరస్వతీదేవి. అందుకే ‘ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవలే ధీనామ విత్య్రవతు’ అన్నది సరస్వతీ ప్రార్థనా శ్లోకం.
విషయాన్ని ఊహించి, దర్శించి ఇతరులకు అర్థమయ్యేటట్లుగా ప్రతిభావంతంగా, నవనవోనే్మషముగా చెప్పేవాడు - ప్రజ్ఞానవంతుడు. ప్రజ్ఞ - ప్రజ్ఞానజన్యం. దాని కాంతియే - వాక్కు. దాని రమణీయ అభివ్యక్తియే - ఉక్తి. వాక్కు, ఉక్తి, సూక్తి అనేవి - సత్య సౌందర్య శివ రూపాలు. ఈ మూడింటి స్వరూపమే - మహా సరస్వతి.
‘నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్’
అని పేర్కొన్నాడు వ్యాస భగవానుడు, మహాభారత ఇతిహాస ఆరంభంలోనే. స్వతస్సిద్ధమైన చైతన్యమే నారాయణుడు, పరమాత్మ. అటువంటి పరమాత్మకు ముందుగా నమస్కరించాలి. తరువాత నరుడు. నరుడంటే జీవాత్మ. చైతన్యరూపంగా జీవాత్మ పరమాత్మ ఇద్దరూ ఒక్కటే. వస్తుతః భేదం లేదు. శరీరాది ఉపాధులే శాశ్వతమనుకొన్న నరుని, దేహాభిమానమే అతణ్ణి నారాయణుని నుంచి వేరు చేస్తున్నాయి. శరీరం అశాశ్వతమని, తను ఆత్మస్వరూపుడినని తెలిసికొని స్వస్వరూప జ్ఞానాన్ని పొందిన నరుడు - నరోత్తముడు అనగా అక్షరుడైన ఈశ్వరుడు. అపుడే, నరోత్తముడు నారాయణుడు ఒక్కరే అవుతారు. కనుక ఇద్దరికీ నమస్కరించాలన్నారు వ్యాస మహర్షి.
అయితే, నరుడు నారాయణుడు అవటానికి ఆత్మస్వరూపాన్ని అర్థం చేసికోవాలి. అదుగో ఆ ప్రయత్నం శ్రీ మహా సరస్వతీ ఉపాసనతో వస్తుంది. సరస్వతి అంటే విద్యాధిదేవత. పర అపర అని రెండు రకములైన విద్యలు లలితా సహస్ర నామంలో పేర్కొనబడ్డాయి. ఆత్మస్వరూపమైన మోక్ష పురుషార్థానికి సంబంధించిన విద్య అపర విద్య. నరుణ్ణి నరోత్తముడిగా చేసి నారాయణత్వాన్ని ప్రసాదించే విద్యా స్వరూపిణి - శ్రీ మహా సరస్వతి.
ఇతిహాస పురాణములు, శ్రుతి స్మృతులు, మహాకావ్యాలు, వర్ణ సమామ్నాయం, విశ్వ భాషా పదజాలం, అంతా మహా సరస్వతీ స్వరూపం. మహారాజులు కూడా కవి రాజుల్ని గౌరవిస్తారు, ఆరాధిస్తారు. మహా సరస్వతిని ఉపాసించిన వారికి లౌకిక సంపదలే కాదు, అలౌకిక ఆధ్యాత్మిక మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ప్రసాదించే జగన్మాత - మహా సరస్వతి. ఉపాసనా బలంతో వాక్సుద్ధి కలిగిన మహాకవులు, తాము మృత్యువును జయించటమే కాక, యితరులను కూడా అమరత్వాన్ని ప్రసాదించగలరు. ఇది మహా సరస్వతీ కటాక్షం. ఇందుకు ఉదాహరణగా నిలిచేవాడు - కాళిదాస మహాకవి.
సృష్టికి పూర్వం అంతా జలమయం, అని చెప్పబడింది. ‘సరస్వతి’ అంటే జలములు గలది అని అర్థము. ఇది నదీవాచకం. నది ప్రవాహ రూపం. జలములకు ‘సరణాత్’ అను పదానికి, జీవనము అని పేరు. అంటే, జీవన ప్రవాహమే - సరస్వతీ మాత. విశ్వమందలి సర్వభూతములు ప్రాణము, అన్నము, అమృతము, వేదములు, సర్వదేవతలు, ప్రణవము, అన్నీ జల స్వరూపం, అనగా మహాసరస్వతీ స్వరూపం. ప్రాణ చైతన్య జనిత భావనా ప్రవాహ రూపం - మనో జగత్తు. భావనా ప్రవాహ జనితం - ఆనంద జగత్తు. ఆ ఆనంద స్వరూపమే - శ్రీ మహా సరస్వతీ రూపం.
గాలి వదిలేటప్పుడు ‘హం’ అనే శబ్దం తోటి, శ్వాస లోనికి పీల్చేటప్పుడు ‘సా’ అనే శబ్దం తోటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి. ఇదే ‘హంస’. బ్రహ్మకు, సరస్వతీ మాతకు వాహనం ‘హంస’. సృష్టికి మూలాధారం ప్రాణ వాయువు. అందుకే ‘నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి’ అని చెప్పబడింది. ఉచ్ఛ్వాస అంటే బ్రహ్మ స్వరూపం - ప్రాణవాయువు. నిశ్వాస అంటే ‘కర్బనం’. ఈ రెంటినీ లయం చేస్తే, అవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడే కరిగిపోతాయి. అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. ఈ జీవ బ్రహ్మైక్య స్థితిని విశదపరచే జ్ఞానాన్ని ప్రసాదించే జగన్మాత, వేదమాత, యోగ విద్యాప్రదాయిని - మహా సరస్వతి.
శుంభ నిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు - సోదరులు, వారు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. శుంభుడు రాజుగా, నిశుంభుడు మంత్రిగా, చండముండి రక్తబీజ ధూమ్రలోచనులు సేనాపతులుగా, ప్రజాపీడనంగా రాజ్యపాలన జరుగుతోంది. ఇంద్రాది దేవతలకు అభయమిచ్చి, వాగ్దేవి తన శరీరము నుండి ‘కౌశికి’ అనే శక్తిని సృజించింది. ఆ కౌశికియే ‘కాళీమాత’. కాళీ శక్తితో రాక్షస సంహారం గావించింది వాగ్దేవి.
కాల తత్త్వానికి సూచన, కాళీమాత. కాలగర్భంలో సర్వమూ ఉదయిస్తాయి, సర్వమూ లయమవుతాయి. సర్వవిద్యాధిష్ఠాత్రి - కాళీమాత. అందుకే ‘బాల’ బీజ మంత్రంతో కాళీశక్తిని అనుష్ఠించి, ఉపాసించి, మాతానుగ్రహాన్ని పొంది, వాక్సుద్ధితో మహాకవియై, సాహిత్య వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతూ చిరస్థాయిగా నిలిచినవాడు - కాళిదాస మహాకవి. తమోగుణం నలుపు వర్ణాన్ని సూచిస్తుంది. ఇదే కాలీ వర్ణం. రూపం అరూపమయితే, అది నలుపు. ప్రళయ కాలంలో మానవులు పశుపక్ష్యాదులు అన్ని జీవరాశులు నశించి పోయి, మళ్లీ విధానంలో లీనమవుతాయని, కాళీమాత చేతిలోని మానవ కపాలం సూచిస్తోంది. కాళీమాతను ఉపాసించి, పరమహంస అయినాడు - రామకృష్ణ పరమహంస.
వ్యాస మహాముని గావించిన స్తోత్రములకు సంతుష్టురాలైంది మహా సరస్వతి. ‘వాసరా’ నగరమున సుమనోహరమగు గోదావరి నదీ తీరమున నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజింపమని, అనుగ్రహించింది, శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయిన జ్ఞాన సరస్వతీమాత. ఆ మహాక్షేత్రమే నేటి ‘బాసర’ పుణ్యక్షేత్రం. ‘సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి జగతా మాది భూతాత్వం, జగత్త్వం జగదాకృతిం’ అని సరస్వతీదేవిని స్తోత్రించాడు వ్యాస భగవానుడు (బ్రహ్మాండపురాణాంతర్గతము)
‘చదువది ఎంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు...’ ఎంత చదువు చదువుకున్నా రసజ్ఞత ఇంచుక చాలకుంటే ఆ చదువు వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అన్నాడు భాస్కర శతకకర్త. తనలో ఉన్న జాంతవ ప్రకృతిని క్షాళన చేసికొని, రాక్షస ప్రవృత్తిని రూపుమాపుకొని, మానవ ప్రకృతిని మధురంగా పండించుకొని అంకురించే దైవ తత్త్వాన్ని దేదీప్యమానంగా ప్రకాశింప చేసుకోవాలి. అదే రసజ్ఞత. అప్పుడు అందరిలోను ఒకే చైతన్యాన్ని దర్శించగలుగుతారు. చదువుతోపాటు రసజ్ఞతను కూడా అనుగ్రహించే తల్లి - మహా సరస్వతి. ‘చదువులలోన మర్మమెల్ల యెఱిగితి తండ్రీ’ అన్న ప్రహ్లాదుని వాక్యంలోని మర్మమూ ఇదే.
వీణా పుస్తకధారిణీమాశ్రయే వేగవాహినీం వాణీమాశ్రయే వేగవాహినీం వాణీమాశ్ర, పరాద్యఖిల శబ్ద స్వరూపావకాశాం పౌర్ణమీ చంద్రికా ధవళ సంకాశాం, కరారవిందాం, కల్యాణదాం, భాషాం కనక కదంబ దామ భూషా విశేషాం, వీణా పుస్తకమును ధరించిన వేగవాహినీ నామముగల వాణిని ఆశ్రయిస్తున్నానని, ‘శ్రీ సరస్వతీ నమోస్తుతే పరదేవతే సకల మంత్రాక్షరగుహే’ అంటూ ఆరభి రాగంలోని ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు మహా సరస్వతీ పూజకు స్ఫూర్తినిస్తాయి.
జీవిత లక్ష్యాన్ని పొందే మంచి మార్గాన్ని తెలిసికొని విజ్ఞానవంతులై స్వార్థరహితంగా సర్వ మానవాళి సేవలో జగన్మాతను దర్శించటమే భక్త ప్రహ్లాదుడు చెప్పిన ‘చదువులలోన మర్మమెల్ల చదవడం’ అని చెప్తోంది, చదువుల తల్లి జ్ఞాన సరస్వతీదేవి.
దుర్గాష్టమినాడు దుర్గామాతగా, మహర్నవమి నాడు మహిషాసుర మర్దినిగా, విజయదశమినాడు శ్రీ రాజరాజేశ్వరిగా పూజలందుకొంటోంది జగన్మాత.
శివశక్తుల ఏకేశ్వరోపాసనగా శమీపూజ, తెప్పోత్సవంతో నేత్రానందంగా, శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములు ముగుస్తాయి.