S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆమె ఒక సమూహం

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
*
పదేళ్ల కిందటి సంగతి...
జూన్‌లో ఓ రోజు సాయంత్రం తొలిసారి ఆమె నన్ను కలిసింది, ఉద్యోగం కోసం!
‘ఇదొక చిన్న ట్రస్ట్ మేడమ్. ఏడాదిలో మూడో నాలుగో కార్యక్రమాలు చేస్తానంతే. మీకు ఉద్యోగమివ్వగలిగినంత పెద్ద సంస్థ కాదు’ నచ్చజెప్పబోయాను.
ట్రస్టు వార్షికోత్సవంలో భాగంగా ఆ రోజు నిర్వహించిన మెడికల్ క్యాంపు జనంతో కిక్కిరిసిపోయింది. అదే రోజు పనె్నండు మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేశాం. ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఊళ్లో నెలకొన్న పండుగ వాతావరణం చూసి, ఆమె పొరబడి ఉంటుందని భావించాను.
ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్‌లో స్థిరపడినా, నాన్నగారి స్మృత్యర్థం ప్రారంభించిన ట్రస్టు పుణ్యమాని ఊరితో సంబంధాలు కోల్పోలేదు. నెలలో కనీసం ఒక్కసారైనా వస్తూంటాను. శక్తికొలదీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూంటాను.
‘నాకు తెలుసు సార్. నా పేరు సునీత. నా దగ్గర ఓ ప్రపోజల్ ఉంది. మీరు రెండు నిమిషాలు టైమిస్తే...’
‘రెండు నిమిషాలు కాదు, రెండు గంటలిస్తా. నా కాల్షీట్ మరీ అంత కాస్ట్‌లీ కాదు’ నవ్వుతూ కుర్చీ చూపించాను.
‘మీరు పది కుట్టుమిషన్లు కొనండి. ఒక్కో గ్రామంలో మూడు నెలల చొప్పున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించండి. రెండు బ్యాచ్‌ల చొప్పున యాభై మందికి నేర్పించవచ్చు. ఆ తర్వాత మరో గ్రామంలో. అలా ఏడాదికి రెండు మూడొందల మందికి నేర్పించవచ్చు..’ అదీ తన ప్రతిపాదన.
లెక్కలు వేశాం. పది మిషన్లు.. సుమారు యాభై వేలు. ఆమె జీతం నెలకు ఆరు వేలు. అద్దె లేకుండా హాలు వసతి చూపించే గ్రామంలో మాత్రమే శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించాం.
సూదులు, దారాలు పెద్ద లెక్కలోవి కావు. ఏతావతా ఏడాదికి లక్ష రూపాయలు!
నేను పచ్చజెండా ఊపాను. పది రోజుల్లో కుట్టుమిషన్లు మా ఊరికి చేరుకున్నాయి. శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించాం. యాభై మంది మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా విభజించాం. సునీత రోజూ మా పక్క గ్రామం తుళ్లూరు నుంచి బస్సులో వచ్చి వెళ్లేది.
మొదటి నెల బాగానె గడిచింది. రెండో నెల నుంచి మహిళలు సమయానికి రాకపోవటం, వచ్చిన వాళ్లు ముచ్చట్లు చెప్పుకోవడం, సునీతను లెక్క చేయక పోవడం.. పరిస్థితి మెల్లగా క్షీణించింది.
మూడు నెలలు గడిచేసరికి అయిదుగురు మిగిలారు. నేను మాత్రం నా శాలరీ రాగానే, ప్రతినెలా రెండు మూడు తేదీల్లో, ఆరు వేలు సునీత అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేవాణ్ణి, ఆమె శాలరీ కింద.
ఓ రోజు సునీత ఫోనే్జసి వీలైనంత అర్జెంటుగా రమ్మని అడిగింది.
నేను హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్లాను. సునీత మొహం నిండా దిగులు మేఘాలు. ఉత్సాహమంతా నీరుగారినట్లుంది. బహుశా తన ప్రతిపాదన అలా ఫెయిలైనందుకు బాగా డిజప్పాయింట్ అయినట్లుంది.
‘సారీ సర్, ఇలా అవుతుందనుకోలేదు. మీతో చాలా పెట్టుబడి పెట్టించాను’ బాధగా అందామె.
‘అయ్యో, దీనికే ఇలా డీలా పడితే ఎలా మేడమ్?’ ధైర్యం చెప్పాను.
పోస్టుమార్టం మొదలైంది. లోపం ఎక్కడుందో కనిపెట్టాను.
‘ఉచితంగా శిక్షణ ఇవ్వడమే మనం చేసిన తప్పు’ అన్నాను. అర్థం కానట్లు చూసింది సునీత.
‘ఓ పని చెయ్యండి. అర్జెంటుగా ఈ కేంద్రం మూసెయ్యండి. మీ ఊరి పక్కనే ఉన్న మందడం వెళ్లండి. అక్కడ యాక్టివ్‌గా ఉండే మహిళా సంఘాల సభ్యులతో ఓ సమావేశం పెట్టండి. మన ప్రపోజల్ వివరించండి. నేర్చుకునే వాళ్లు మూడు నెలలకు కేవలం రెండొందలు కట్టాలని చెప్పండి. అలా ఇష్టమైన వాళ్లే బాధ్యతగా వస్తారు’ తేల్చి చెప్పాను.
‘డబ్బులు కట్టాలంటే ఎవరూ రారేమో సర్...’ అనుమానంగా ఆగిందామె.
‘పర్వాలేదు. ప్రయత్నించండి. రెండొందలు పెద్ద ఎక్కువ మొత్తమేం కాదు’
* * *
మూడు నెలలు గడిచాయి. మందడం గ్రామంలో శిక్షణ కార్యక్రమం సూపర్‌హిట్. అరవై మంది మహిళలు రెండొందలు చెల్లించి మరీ శిక్షణ పొందారు. చాలా ఆసక్తి చూపారు.
మధ్యలో ఓసారి నేను ఆ కేంద్రానికి వెళ్లినప్పుడు అందరితో మాట్లాడాను. ముగ్గురమ్మాయిలు నన్ను ఆకర్షించారు. ముగ్గురూ ఇంటర్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. ఫీజు కట్టే స్తోమత లేక, చదువు మానేసి, కుట్టుశిక్షణకు వస్తున్నట్లు తెలుసుకున్నాను. ఆ ముగ్గురికీ ట్రస్టు తరఫున ఫీజులు చెల్లించి, తాడికొండ కళాశాలలో చేర్పించాను.
ఆ తర్వాత, సంవత్సరం తిరక్కుండానే మరో ఆరు గ్రామాల్లో ట్రస్టు పేరు మార్మోగింది. శిక్షణ పూర్తయ్యేలోగా ప్రతి గ్రామానికీ ఒక్కసారైనా వెళ్లేవాణ్ని. అభ్యాసకులతో మాట్లాడేవాణ్ని. ఎన్నో గాథలు. ఎనె్నన్నో కన్నీటి కథలు. తోచిన విధంగా ట్రస్టు తరఫున సాయమందించడానికి ప్రయత్నించేవాణ్ణి.
* * *
భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. గొడవ మొదలైంది. అత్తగారు చోద్యం చూస్తున్నారు.
‘మర్యాదగా చెబుతున్నా. ఆ పొలం అమ్మేసి, డబ్బు తీసుకురా’ గర్జించాడు భర్త.
‘ప్రాణం పోయినా ఆ పని చెయ్యను’ ఎదురు చెప్పిందామె.
విసురుగా వెళ్లి, జుట్టు పట్టుకుని ఆమెను కుదిపేశాడు.
భర్త చేతుల్ని విదిలించుకుని ‘ఇద్దరు కూతుళ్లున్నారు. పెళ్లీడుకొస్తున్నారు. వాళ్లకేమిస్తావు? ఏం, మీ అమ్మ పొలం అమ్మొచ్చుగా, అప్పులు తీర్చడానికి’ జుట్టు ముడేసుకుంటూ పౌరుషంగా అడిగిందామె.
‘ఏమిటే, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు...’ అంటూ ఆమె వీపు మీద దభీదభీమని మోచేతుల్తో మోదాడు.
అతని పట్టు నుంచి విడిపించుకోవడానికి ఆమె పెనుగులాడుతోంది.
‘రేయ్ రేయ్, దానె్నందుకురా కొట్టడం? చేతుల్నెప్పి తప్ప ఒరిగేదేం లేదు. అమ్మి డబ్బు తెచ్చిందా సరే! లేదంటే ఇంట్లోంచి బయటకి నడవమను..’ అత్త కొత్త తీర్పు నిచ్చింది.
‘కరెక్ట్. నడవ్వే.. బయటకి నడువ్. సామాను సర్దుకో’ హూంకరించాడు భర్త.
... దాదాపు ఆరు నెలల తర్వాత నేనోసారి పొనె్నకల్లులో శిక్షణ కేంద్రం సందర్శించడానికి వెళ్లినప్పుడు, సాయంత్రం అభ్యాసకులందరూ వెళ్లిపోయాక, సునీత మొదటిసారి తన వ్యక్తిగత వివరాలు వెల్లడించింది.
‘అప్పుడేం చేశారు?’ ఆసక్తిగా అడిగాను.
‘సాయంత్రం కాలేజీ నుంచి రాగానే ఇద్దరమ్మాయిల్నీ నాతో తీసుకుని, బయటికొచ్చేశాను. ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. మీరిచ్చే శాలరీతోనే సంసారం నెట్టుకొస్తున్నాను’ భారంగా చెప్పిందామె.
నేను వౌనంగా ఆమె మొహంలోకే చూస్తూండిపోయాను.
‘పెద్దమ్మాయి ఎంబీఏలో చేరింది. చిన్నమ్మాయి బీటెక్ సెకండియర్. నాకు కట్నంగా నెల్లూరులో మా నాన్నిచ్చిన రెండెకరాల పొలం ఎందుకూ పనికిరాదంటూ మా ఆయనా అత్తా ఇరవయ్యేళ్లుగా ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడా పొలానికి బాగా రేటొచ్చింది. ఈయన చొస్తే, నెలకో ఉద్యోగం మానేస్తాడు. ఎక్కడా కాలు నిలవదు. ఆర్భాటాలెక్కువ. కాస్ట్‌లీ ఫర్నిచర్ ఉండాలి. మోడర్న్ సోఫా సెట్లుండాలి. ఖరీదైన కర్టెన్లు వేలాడాలి. అవసరమా? తనలో ఇంకో కోణముంది. అమ్మ మాటే వేదం అన్నట్లు నటిస్తాడు గానీ నిజానికి అమ్మ కన్నా ఆమె పేరు మీదున్న ఆరెకరాల మాగాణి అంటేనే అతనికి మమకారం. ఎన్నో భరించాను. సహించాను. అతను మారడని తేలిపోయింది. నా కాళ్ల మీద నేను నిలబడాలి. నా పిల్లల చదువులు పూర్తి కావాలి. వాళ్ల పెళ్లిళ్లు చేయాలి. కానీ అదెలా సాధ్యమో నాకర్థం కావడంలేదు...’ ఆమె మాటల్లో సందేహం తప్ప సంశయం లేదు.
‘ఏదీ అసాధ్యం కాదండీ. మీ ఇద్దరు పిల్లలకీ ట్రస్టు తరఫున ఫీజులు కడతాను. మీరు మన శిక్షణ కార్యక్రమాల్ని తర్వాతి దశకు తీసుకెళ్లాలి. అది కూడా నేనే ప్లాన్ చేస్తాను’ ఆమెకు ధైర్యం చెప్పాను.
* * *
హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘అపెరల్ ట్రైనింగ్ అండ్ డిజైనింగ్ సెంటర్’ వాళ్లను సంప్రదించి, గ్రామీణ ప్రాంతాల్లో మేమందిస్తున్న శిక్షణ గురించి వివరించాను. వాళ్లు బాగా ఇంప్రెస్ అయ్యారు. మా గ్రామాల్లో ఇండస్ట్రియల్ మెషీన్ల మీద ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
మొదటగా మా ఊరికి పాతిక మిషన్లు చేరుకున్నాయి. ఫ్యాకల్టీని వాళ్లే నియమించారు. అట్టహాసంగా శిక్షణ మొదలైంది. గ్రామాలు తిరగడం, నేర్చుకునే మహిళలను సమీకరించడం, వారిని చైతన్యపర్చడం, కేంద్రం ప్రారంభించడానికి కమ్యూనిటీ హాళ్లను వెతకడం.. సునీతకు చేతినిండా పని.
సంవత్సరంన్నర గడిచేసరికి పది గ్రామాల్లో దాదాపు ఎనిమిది వందల మంది మహిళలు శిక్షణ పొందారు. వీరిలో చాలామందికి రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చాయి.
ఆ తర్వాత తాడికొండలో ఓ రూరల్ మార్టు ప్రారంభించాం. అందుకోసం అద్దెకు తీసుకున్న ఆఫీసు నిర్వహణకు, ఇతరత్రా అవసరాలకు 15 నెలలపాటు ‘నాబార్డు’ ఆర్థిక సహకారం అందించింది. ఈలోగా సుమారు వెయ్యి మంది మహిళలను ఆ మార్టులో సభ్యులుగా చేర్పించి, చీరలు, చిన్నపిల్లల రెడీమేడ్ గార్మెంట్స్ అమ్మకం ప్రారంభించింది సునీత. లాభాలు వచ్చాయి.
ప్రభుత్వం ఎలిమెంటరీ స్కూళ్లకు ఉచితంగా అందించే పిల్లల యూనిఫామ్స్ కుట్టేందుకు నలభై లక్షల రూపాయల వర్క్ ఆర్డర్ తీసుకురాగలిగింది. గుంటూరు, విజయవాడల్లోని రెడీమేడ్ వస్త్ర దుకాణాలకు వెళ్లి మరికొన్ని ఆర్డర్లు సంపాదించింది. ప్యాటర్న్ ప్రకారం కట్ చేసిన క్లాత్‌ను ఇంటి వద్ద సొంత మెషీన్లు ఉన్న మహిళలకు ఇచ్చి, కుట్టమని చెప్పేది. తద్వారా సుమారు 150 మంది మహిళలకు ఉపాధి కల్పించగలిగింది. పెద్దమ్మాయికి ఉద్యోగం రావడం ఆమెకు బోనస్.
ఆమె బాగా నిలదొక్కుకోగలిగింది. పైగా ట్రస్టుకు కొంత విరాళం ఇచ్చింది.
జనవరి 26 సందర్భంగా గుంటూరులో కలెక్టర్ చేతుల మీదుగా సునీత మెడల్ అందుకుంటున్న దృశ్యం చూసినప్పుడు నాకు గతం గుర్తొచ్చి, కళ్లు తడిదేరాయి.
* * *
ఓ రోజు ఫోనే్జసిందామె. పెద్దమ్మాయి పెళ్లి కుదిరిందనీ, ఎన్ని పనులున్నా తప్పకుండా రావాలని చెప్పింది.
పెళ్లికి వారం ముందు మళ్లీ ఆమె ఫోను. ‘చాలామందితో కబురంపాడు. చివరికి తనే వచ్చాడు రాత్రి. అమ్మ అక్కర్లేదు, నువ్వే కావాలంటూ వెంట పడుతున్నాడు. ఏం చేయమంటారు?’
చాలా కష్టమైన ప్రశ్న.
కాసేపు ఆలోచించి, ‘మీ ఇష్టం. ఎవరి మీదా ఆధారపడవద్దు. ఈ విషయంలో మీరే నిర్ణయం తీసుకోండి’ స్పష్టంగా చెప్పాను.
పెళ్లి ఘనంగా జరిగింది. అన్నీ తానే అయి కష్టపడింది సునీత. ‘అతని’ జాడలేదు.
ఆమె తరఫున ఆమె అన్న, వదిన ‘కన్యాదానం’ చేశారు.
కొత్త దంపతులు పీటల మీంచి లేవగానే, సునీత వారిద్దరినీ వెంటబెట్టుకుని, ముందు వరుసలో కూర్చున్న నా దగ్గరకు తీసుకొచ్చింది.
వాళ్లిద్దరూ వంగి నా పాదాలకు నమస్కరించారు. నాకు నోట మాట రాలేదు.
సునీత మాత్రం మెరుస్తున్న కళ్లతో చూస్తూండిపోయింది.
ఉపసంహారం
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిన్నకూతురికీ పెళ్లి చేసింది సునీత. ఆమె తన సైన్యాన్ని ఇంకా పెంచుకునే యజ్ఞాన్ని కొనసాగిస్తూనే, రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ముప్పై మంది మహిళలు అందులో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం, నవ్యాంధ్ర రాజధానికి భూములు కోల్పోయిన వందల మంది మహిళలకు ఆ కేంద్రంలో పని కల్పించాలని ఆమె ప్రణాళికలు రచిస్తోంది. ఆమె మీద నాకు నమ్మకముంది. ఆమె సైన్యానికి కూడా!

M.V.Rami Reddy