‘విదేశీ అతిథుల’ విడిది కేంద్రాలు
Published Sunday, 7 October 2018================================
కనుచూపుమేరంతా నీళ్ల తివాచీ..
ఊగిసలాడే సన్నని అలలపై ఆహ్లాదం..
ఎక్కడికక్కడ కిలకిలారావాలు..
రంగురంగుల రెక్కల సందడి..
తాజా.. తాజా చేపలకై వెతుకులాట..
ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అరుదైన పక్షిజాతులు..
దేశ, విదేశాల నుంచి సంతానోత్పత్తికై ఇక్కడికి వచ్చి విడిది చేస్తాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు ఎదిగేదాకా, ఎగిరే శక్తి సంపాదించుకునేంతవరకు ఉండి.. మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. ఇది శతాబ్దాలుగా జరుగుతున్న తంతు.. సంతానోత్పత్తి కోసం ప్రపంచం నలుమూలల నుండి మనదేశంలోని కొన్ని సహజసిద్ధమైన విడిదికేంద్రాలకు ఈ అరుదైన పక్షులు వలస వస్తుంటాయి. ఆ సమయాల్లో ప్రజలందరూ వీటిని తిలకించడానికి తరలివస్తుంటారు.
=================================
తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు అరుదైన విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అటు తెలంగాణ టూరిజం శాఖ, ఇటు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖలు పర్యాటకుల కోసం పలు ఏర్పాట్లు చేస్తున్నాయ. విదేశీ పక్షులు గుంపులు గుంపులుగా రావడంతో ఆయా ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా భాసిల్లుతూ ప్రజలకు కనువిందు చేస్తున్నాయి.
తేలినీలాపురం..
విదేశీ విహంగాలకు నెలవుగా భాసిల్లుతోంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని తేలినీలాపురం గ్రామం. కొన్ని దశాబ్దాల నుండి ఇక్కడికి సైబీరియా వంటి విదేశాల నుండి అనేక రకాల పక్షులు వలస వస్తున్నాయి. దాదాపు 20 నుండి 30 వేల కి.మీ. దూరం నుండి ఈ విదేశీ విహంగాలు ఇక్కడికి వస్తూంటాయి. సంతానోత్పత్తి చేసుకోవడానికి సముద్ర తీరాన్ని ఎంచుకుని ఇక్కడే ఆరునెలల పాటు ఉండి గుడ్లు పెట్టి పిల్లలు ఎదిగిన తరువాత తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతాయి. పెయింటెడ్ స్టార్క్స్, పెలికాన్స్, సైబీరియన్ మైగ్రేట్స్ ఇత్యాది రకాల పక్షులు సెప్టెంబర్ మాసంలో ఇక్కడికి వచ్చి చెట్లపై గూళ్లు నిర్మించుకొని గుడ్లు పెట్టి పొదుగుతాయి. కొన్ని రకాల పక్షులు రెండడుగులు పైబడి ఎత్తు, ఐదు కేజీల పైబడి బరువు కలిగి ఆహ్లాదాన్ని కలిగించే అందాల రూపును కలిగి ఉంటాయి. వందేళ్ల నుండి విదేశీ పక్షులు తేలినీలాపురం వస్తున్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈ పక్షుల్ని ఎవరూ వేటాడకుండా గ్రామస్థులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్షి ప్రేమికులకు ఇదో ఆహ్లాదకరమైన ప్రదేశం.
కొల్లేరు సరస్సు..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 15 కి.మీ. దూరాన ఉన్న కొల్లేరు సరస్సు ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరు గాంచింది. ఇది ఒక బర్డ్ శాంక్చురీగా తీర్చిదిద్దబడింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్యన 901 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. కొల్లేరు చుట్టూ 122 గ్రామాలు పైబడి జనసంచార ప్రదేశాలున్నాయి. తమ్మిలేరు, బుడమేరు అనే రెండు పెద్ద వాగులు కూడా ఈ సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రదేశంలో ఉండటంతో వర్షాకాలంలో దీని వైశాల్యం మరింత పెరుగుతుంది. ఇన్ని కారణాల వల్ల ఇక్కడికి అనేక విదేశీ విహంగాలు వస్తాయి. సైబీరియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా వంటి సుదూర ప్రాంతాల నుండి 190కు పైగా రకాల పక్షులు కొల్లేరు వలస వచ్చి సేద తీరుతాయి. అక్టోబర్- మార్చి మధ్య ప్రాంతంలో విదేశీ పక్షులు 2 లక్షల పైబడి వస్తాయని అంచనా. అందువల్లే 1972 నుండి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెలికాన్ సంరక్షణ కేంద్రం పేరుతో శాంక్చురీగా తీర్చిదిద్దింది. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో ఇక్కడ పెలికాన్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. ఇక్కడికి అరుదైన పెలికాన్ పక్షి జాతితోపాటు ఓపెన్ బిల్‌స్ట్రాక్స్, పెయింటెడ్ స్ట్రాక్స్, గ్లోసీ ఇబిసెన్, వైట్ ఇబిసెస్, టీల్స్, పిన్‌టైల్స్, షో వెల్లెర్స్, రైడ్ క్రిస్టెడ్ పో చార్ట్స్, బ్లాక్ వింగ్‌డ్ స్టిల్ట్స్, ఎవోసెట్స్, కామన్ రెడ్‌షాక్స్, క్రిస్టియన్ గాబు, లార్జి విజిటింగ్ టైల్, గ్రేట్ క్రిస్టడ్‌పోచార్, బ్లాక్ హెడెడ్ గ్రిల్, గద్వాల్స్, కార్మోరాస్ట్, జాయింట్ ఇత్యాది అనేక వందల రకాలు కొల్లేరు వచ్చి నివాసమేర్పరచుకొని గుడ్లు పెట్టి, తమ సంతతిని అభివృద్ధి పరచుకొని వెళ్లిపోతుంటాయి. ఇవికాక కొల్లేరు సరస్సులో నత్తకూటు, వెండిపిట్ట, వేపరాయి, తూటుకూర, దూడ కొంగలు, తెల్ల కొంగలు కనిపిస్తుంటాయి. వింత ఏమిటంటే- కొద్ది సంవత్సరాల క్రితం వేసవిలో ఇంత పెద్ద మంచినీటి సరస్సు పూర్తిగా ఎండిపోయి నేల కూడా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగించింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్ల సమస్యలు సద్దుమణిగి మళ్లీ కొల్లేరుకు పూర్వ వైభవం వచ్చింది. కొల్లేరులో బోటు షికారు చేస్తూ కూడా విదేశీ విహంగాలను వీక్షించవచ్చు.
నేలపట్టు..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సు సమీపాన నేలపట్టు ఉంది. ఏటా శీతాకాలంలో ప్రపంచ నలుమూలల నుండి 160 రకాల పక్షులు రమారమి 20 వేల కి.మీ. దూరం ప్రయాణించి పులికాట్ సరస్సుకు చేరుకుంటాయి. నేలపట్టులో గూళ్లు ఏర్పరచుకుని తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. నేలపట్టు నుండి 15 కి.మీ. దూరాన ఉన్న పులికాట్ సరస్సుకు వెళ్లి ఆహారం తిని, తమతోపాటు కొంత ఆహారాన్ని తీసుకొని తిరిగి నేలపట్టుకు వచ్చి పిల్ల పక్షులకు తినిపిస్తాయి. కొన్ని జాతుల పక్షుల ముక్కు దిగువ భాగాన సంచి ఉంటుంది. సరస్సులో సేకరించిన ఆహారాన్ని ఆ సంచిలో భద్రపరచుకొని నేలపట్టులోని తమ సంతతికి తినిపిస్తాయి. ఇక్కడి పక్షులు మనం చూస్తుండగానే సమూహాలుగా ఎగిరిపోతాయి. ఈ దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. ఈ పక్షుల్లో పెలికాన్ పక్షులతో పాటు కొల్లేటి కొంగలు, గూడ కొంగలు ఉంటాయి. అమెరికా, చైనా, అంటార్కిటికాతోపాటు సైబీరియా కొంగలు కూ డా వస్తాయి. గ్రే పెలికాన్స్, ఓపెన్ బిల్డ్ స్ట్రాక్స్, చిన్నసైజు కార్మొరెంట్ పక్షులు, స్పూన్ బిల్స్, వైట్ ఇబిసెస్, నైట్ హారన్స్, ఇగ్రెట్స్, టెర్న్‌స్, బాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పులికాట్ సరస్సు 690 చ.కి.మీ. విస్తీర్ణంలో వుంది. ఇక్కడికి విచ్చేసే సుందరపక్షి ఫ్లెమింగో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. అక్టోబర్ నుండి మార్చి వరకు ఇవి పులికాట్ ప్రాంతంలో వుంటాయి. ఇది శాకాహార పక్షి. ఈ జాతిని పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి నెలలో ఫ్లెమింగో ఉత్సవాల పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఈ పక్షి జాతి పరిరక్షణకు కృషి చేస్తున్నది.
పులికాట్ సరస్సు
విదేశీ విహంగాల విడిది కేంద్రంగా భాసిల్లుతోంది పులికాట్ సరస్సు. ఇది నెల్లూరు పట్టణానికి 110 కి.మీ., సూళ్లూరుపేటకు 10 కి.మీ. దూరాన ఉంది. మన దేశంలోని రెండవ అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఇది. 690 చ.కి.మీ. విస్తీర్ణంలో పులికాట్ సరస్సు విస్తరించి ఉన్నది. ఇందులో మూడు వంతులు తమిళనాడు రాష్ట్రానికి, ఒక వంతు మన రాష్ట్రానికి చెందుతుంది. 3వ శతాబ్దానికి చెందిన చంద్రగుప్తుని శాసనంలో పేర్కొన్న పాలక్కాట్ నేటి ఈ పులికాట్ సరస్సు అని పేర్కొనబడింది.
పులికాట్ సరస్సుకు తూర్పున భారతీయ తొలి ఓడరేవు దుగ్ధ రాజపట్నం రేవు, పడమర ‘తడ’ అనే చిన్న గ్రామం, దక్షిణం వైపు ప్రళయకావేరీ రేవు ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని 1976లో అభయారణ్యంగా గుర్తించింది. 23 లక్షల రూపాయలతో భీమునివారి పాలెం వద్ద కాటేజీలు నిర్మించి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
160 జాతుల పక్షులు
పులికాట్ సరస్సుకు ఫ్లెమింగో పక్షులు, పెయింటెడ్ స్టార్క్స్, సైబీరియా కొంగలు ఇత్యాది 160 రకాల పక్షులు యుఎస్‌ఏ, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుండి వలస వస్తాయి. వైట్ హారన్స్, ఇగ్రేట్స్, ఓపెన్ బిల్డ్ స్ట్రోక్స్, స్పూన్‌బిల్స్, గ్రే పెలికాన్స్ ఇలా అనేక రకాల పక్షులు నయనానందం చేసినప్పటికీ ఫ్లెమింగో పక్షులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పక్షిని సముద్రపు రామచిలుక అని కూడా పిలుస్తుంటారు. పొడవైన కాళ్లు, అంతకు మించిన మెడ, చిలుక ముక్కు, శే్వతవర్ణ శరీరాకృతి, రెక్కలపైన నలుపు, ఎరుపు వర్ణం అందానికి ప్రతిరూపంలా కనిపిస్తుంది. ఫ్లెమింగో పక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులికాట్ సరస్సులో తప్ప మరెక్కడా కనిపించవు.
ఫ్లెమింగో ఉత్సవాలు
ఫ్లెమింగో శాకాహార పక్షి. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ పక్షులు వలస వచ్చి తమ సంతతిని వృద్ధి చేసుకుని తిరిగి వెళ్లిపోతుంటాయి. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పక్షుల పేర ఫ్లెమింగో ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల వల్ల పులికాట్ సరస్సు ప్రత్యేకత ప్రజలకు తెలుస్తోంది. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తూంటారు.
అంతర్జాతీయ గుర్తింపు
ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా పుష్ప ప్రదర్శన, పర్యాటకుల పడవ విహారం, నీటి పక్షుల ఫొటోల ప్రదర్శన, సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాటం, బుట్టబొమ్మలు, కీలుగుర్రం ఇత్యాది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నారు. పులికాట్ పక్షి పరిశీలనా కేంద్రమే కాదు, మంచి విహార యాత్రా కేంద్రం కూడా. అంతర్జాతీయ స్థాయిలో ఈ సరస్సుకు గుర్తింపు ఉంది.
ఉప్పలపాడు..
దేశ విదేశాల అరుదైన పక్షుల విడిది కేంద్రంగా ఉప్పలపాడు భాసిల్లుతోంది. ఈ గ్రామం గుంటూరు నుండి 6 కి.మీ. దూరాన నందివెలుగు వెళ్లే దారిలో ఉంది. ప్రతి ఏడాది నవంబర్ నెలలో శీతల దేశాల నుండి 30కి పైగా జాతుల విదేశీ పక్షులు ఉప్పలపాడుకు వస్తాయి. చుట్టూ చెరువు, మధ్యలో దీవిలా పెద్ద దిబ్బ... అక్కడి తుమ్మచెట్లపై ఇవి నివాసాలేర్పరచుకుంటాయి. అక్కడే ఉన్న రాళ్ల గుట్టల్లో అందమైన గూళ్లు నిర్మించుకుంటాయి. అలా నివాసం ఉంటూ గుడ్లను పెడతాయ. వాటిని పొదిగి, కొంతకాలం ఉండి సగానికి పైగా పక్షులు తమ స్థలాలకు వెళ్లిపోతాయి. మిగిలిన పక్షులు ఏడాదిపాటు ఇక్కడే ఉండి, ఉప్పలపాడు చుట్టుపక్కల సంచరిస్తూ, ఆహారాన్ని సేకరించి, తిరిగి సాయంత్రానికి ఉప్పలపాడులోని తమ గూటికి చేరతాయి.
ఉప్పలపాడుకు వచ్చే విదేశీ పక్షుల్లో మిడతల దండును హరించే రోజీ పాస్టర్స్ వేల సంఖ్యలో శీతాకాలం మధ్యలో వస్తాయి. పాములాంటి మెడ కలిగిన పర్పూల్, హోరాన్ పక్షి బహుసుందరంగా ఉంటుంది. ఇంకా లిటిల్ ఇగ్రేట్స్, ఓపెన్ బిల్‌స్టార్క్, కాటిల్ ఇగ్రేట్, వైట్ ఇబీస్, నైట్ హోరాన్, లిటిల్ కోర్మరాన్స్, పెయింటెడ్ స్టార్క్, పెలికాన్ పక్షులు ముఖ్యమైనవి. నైట్ హోరాన్ పక్షి రాత్రుల్లో సంచరిస్తుంది. ఊదావర్ణంతో మెరుస్తూ, ఆకుపచ్చ, బూడిద వర్ణాల మిశ్రమంతో అందంగా ఉంటుంది.
ఇన్ని వేల విదేశీ పక్షులు ఉప్పలపాడు గ్రామానికి ఎందుకు వస్తున్నాయ? అనే ప్రశ్నకు ఎవరూ కచ్చితంగా జవాబు చెప్పలేరు. కానీ, ఈ పక్షుల వల్ల తమ గ్రామానికి మంచి పేరు వస్తుందని గ్రామస్థులంతా గర్విస్తుంటారు. ఈ పక్షులు రెట్టలు వేయడం వల్ల గ్రామంలోని మంచినీటి చెరువు కలుషితమై పోతోందని ఒక దశలో కొందరు బాధపడినప్పటికీ, ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడంతో అందరూ సంతోషించారు. స్వార్థపరులైన కొందరు వేటగాళ్లు ఈ పక్షుల్ని చంపి, వాటి మాంసాన్ని విక్రయించడం మొదలుపెట్టారు. పెలికాన్ లాంటి కొన్ని పక్షులు ఆరు కేజీలపైబడి మాంసాన్నిస్తాయి. అంత పెద్ద పక్షులు 10వేల మైళ్లు ఎగురుతూ ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంతాల నుండి ఉప్పలపాడు వస్తుంటే, వాటికి రక్షణ కరువైంది. దీంతో గ్రామస్థులంతా కలిసి వేటగాళ్లకు దేహశుద్ధి చేశారు. ఇక్కడికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో వస్తున్నాయని తెనాలికి చెందిన పాత్రికేయులు వెలుగులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నాయకులు పూనుకుని, లక్షలాది రూపాయలు కేటాయించి పక్షులు నివాసమేర్పరచుకున్న చెరువు చుట్టూ కంచె వేయించారు. ఇద్దరు కాపలాదారులను నియమించారు. ప్రస్తుతం ఎవరైనా ఉప్పలపాడులో పక్షుల్ని వేటాడితే బెయిల్ కూడా రాని విధంగా శిక్షలు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. దీంతో విదేశీ పక్షులకు రక్షణ ఏర్పరచినట్లైంది.
గుంటూరులోని మానస సరోవరం పార్కు నుండి ఉప్పలపాడు గ్రామం రెండు కి.మీ. దూరాన ఉంది. మానస సరోవరానికి వచ్చే యాత్రికులు సరదాగా వీటిని తిలకించడానికి వెళ్లొచ్చు. అనేకులకు ఇక్కడ విదేశీ పక్షులు విడిది చేశాయనే విషయం తెలియక వెళ్లడం లేదు. ప్రకృతిలోని ఇటువంటి అందాలను కాపాడుకొని, తగిన ప్రచారమిచ్చి దీనిలోని ఆనందాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.
చుండూరులో..
తెనాలి నుండి నిడుబ్రోలు వెళ్లే రైలు మార్గంలో ఉన్న గ్రామం చుండూరు. ఇక్కడికి శ్రావణమాసంలో అనేక రకాల విదేశీ విహంగాలు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు కొద్ది రోజులు కనువిందు చేస్తాయి. ఉప్పలపాడుకు వచ్చే పక్షుల ఇక్కడ కొద్దిరోజులు ఉండి వెళుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రాంతంలో లభించే నత్తల్ని ఈ పక్షులు మక్కువగా ఆరగిస్తాయి.
వీరాపురం..
దేశీ విహంగాల విడిదిగా ప్రసిద్ధి పొందింది వీరాపురం. ఇది అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలంలో ఉంది. హిందూపురం నుండి లేపాక్షి మీదుగా చిలమత్తూరు, మరువ కొత్తపల్లి మీదుగా వీరాపురం చేరుకోవచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం విదేశీ పక్షులు వీరాపురం సమీపాన గల వెంకటాపురం వచ్చేవి. అక్కడ తుపాకులతో వేటాడి చంపడం వల్ల ప్రాణభయంతో వీరాపురం వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి.
ప్రతి ఏడాది జనవరి నాటికి సైబీరియా పక్షులు వీరాపురం వచ్చి జులై వరకూ ఇక్కడే ఉండి తర్వాత తిరిగి వెళ్లిపోతాయి. కరువు ప్రాంతంగా పిలువబడే అనంతపురం జిల్లాలోని వీరాపురానికి ఈ పక్షులు ఎందుకు వస్తున్నాయనేది అంతుబట్టని విషయం. ఒకప్పుడు ఈ పక్షి కేంద్రం గురించి ఎవరికీ తెలియదు. మీడియా ప్రభావం వల్ల వెలుగులోకి వచ్చి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. వీరాపురం వచ్చే పక్షుల్లో కొంగజాతికి చెందిన అరుదైన పక్షులు ఉన్నాయి. ఈ జాతిని పక్షి శాస్త్రంలో ‘ఐబిస్ లకాషి ఫెలన్’ అంటారు. ఈ జాతిలో మగపక్షి, ఆడపక్షిఒకేలా కనిపించడం విశేషం. వీటి దేహంలో అతి తక్కువ ఈకలు ఉంటాయి. ఒక్కో పక్షి మూడు అడుగుల పైగా ఎత్తు ఉంటాయి. నాలుగు కిలోల పైగా బరువుంటాయి. పెయింటెడ్ స్టార్క్స్ అని పిలువబడే ఈ పక్షులు సైబీరియా దేశం నుండి వీరాపురం గ్రామానికి వేల సంఖ్యలో వలస వస్తుంటాయి. చేపలు, కప్పలు, పురుగుల్ని తిని బతుకుతాయి. వీరాపురంలోని చింత, రావి, కొబ్బరి ఇత్యాది చెట్లపై గూళ్లు నిర్మించుకుంటాయి. ఒక్కో పక్షి మూడు నుండి నాలుగు వరకూ గుడ్లు పెడతాయి. అయిదు నుండి ఆరు వారాలలోపు పిల్లలు బయటకి వస్తాయి. గుడ్లను పొదిగేటప్పుడు, అవి పిల్లలుగా ఎదిగేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటాయి. గుడ్లను పొదిగి సంతానోత్పత్తి చేసుకోడానికి
తగిన వాతావరణం ఇక్కడ వుండడం వల్ల ఇవి విదేశాల నుండి వీరాపురం వస్తున్నాయని శాస్తవ్రేత్తల అభిప్రాయం. ఒక్కోసారి వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు ఎండిపోయినట్లైతే ఈ పక్షులు రావు. గతంలో ఈ పక్షులు రాని సందర్భాలున్నాయి. ఏ సంవత్సరం ఈ విదేశీ పక్షులు రావో ఆ సంవత్సరం తాము కరవుతో అలమటిస్తామని వీరాపురం ప్రజలు చెబుతుంటారు. ఎంతో అందంగా కనిపించే ఈ విదేశీ విహంగాల జీవితకాలం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. వీటి కాళ్లు ఎర్రని రంగులో ఉండడం వల్ల వీటిని వీరాపురం వాసులు ఎర్రకాళ్ల కొంగలుగా పిలుస్తూంటారు. వీరాపురానికి విదేశీ పక్షులు వస్తున్నట్లు తెలియజేయడానికి ఇక్కడ అనేక చర్యలు చేపట్టారు. మరువకొత్తపల్లి సమీపంలోనూ, కోడికొండ చెక్‌పోస్టు వద్ద ఈ పక్షుల నమూనా విగ్రహాలను పెట్టి పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారు. అమరాపురం నుండి వీరాపురం వరకూ చక్కటి రోడ్డు నిర్మాణానికై నిధులు మంజూరు చేశారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పనులు చురుకుగా సాగిస్తే పర్యాటకుల సందడి మరింత పెరిగి ఈ వీరాపురం మరింత రమణీయతను సంతరించుకుంటుందనటంలో సందేహం లేదు.
తెలంగాణ ప్రాంతంలో..
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సైతం అరుదైన విదేశీ పక్షులు వలస వస్తుంటాయి.
కొత్తపల్లికి తెల్లకొంగలు...
ఒకప్పటి కాకతీయ రాజుల విడిది కేంద్రమైన వరంగల్ జిల్లాలోని కొత్తపల్లికి తెల్లకొంగలు వస్తుంటాయ. అక్కడ మూడు చెరువులున్నాయి. ఇదే రీతిలో పాకాల గ్రామానికి కూడా తెల్ల కొంగలు వచ్చి కొద్దికాలం ఇక్కడ నుండి ఆ తరువాత వెళ్లిపోతాయి. ఈ పక్షులు తమ గ్రామాలకు రాకపోతే ఆ ఏడాది వర్షాలు సక్రమంగా పడవని ప్రజల విశ్వాసం.
మంజీరా పక్షి సంరక్షక కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో మంజీరా పక్షి సంరక్షక కేంద్రం ఉంది. హైదరాబాద్ నుండి 50 కి.మీ. దూరంలో ఇది నెలకొని ఉంది. ఇక్కడకు 70 రకాల పక్షులు వలస వస్తుంటాయి. ప్రతి ఏడాది నవంబర్ నుండి ఇక్కడకు వలస పక్షులు వచ్చి మార్చి వరకు నివాసముంటాయి. ఈ కాలంలో ఇక్కడే గూళ్లు కట్టుకుని, గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి.
పోచారం పక్షుల సంరక్షణ కేంద్రం
ఇది మెదక్ నుండి 15 కి.మీ. దూరంలో నెలకొని ఉంది. ఇక్కడకు అక్టోబర్ నుండి జూన్ వరకు పక్షులు వలస వస్తుంటాయి. 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పోచారం అభయారణ్యం విస్తరించి ఉంది. ఇందులో ఈ పక్షి సంరక్షణా కేంద్రం ఉంది.
ప్రాణహిత పక్షుల సంరక్షణా కేంద్రం
ఇది పాత ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడకు 50 రకాల పక్షులు వలస వస్తుంటాయి. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని పిల్లలు ఎదిగిన పిదప తమ ప్రాంతాలకు వెళ్లిపోతాయి.
అమీన్‌పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం
ఇది మియాపూర్ నుండి బొల్లాపూర్ వెళ్లే దారిలో ఉంది. శీతాకాలంలో అమీనుపూర్ చెరువు సమీపాన అనేక పక్షులు వస్తుంటాయి.
ఉస్మాన్‌సాగర్ పక్షుల సంరక్షణ కేంద్రం
హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్‌ను గండిపేట చెరువు అని కూడా పిలుస్తారు. వర్షాకాలం ఇక్కడకు అనేక పక్షులు వచ్చి కనువిందు చేస్తుంటాయి.
చింతపల్లి పక్షుల సంరక్షణ కేంద్రం
ఖమ్మం పట్టణానికి 15 కి.మీ. దూరాన చింతపల్లి ఉంది. ఇక్కడ చింతచెట్లు అధికంగా ఉండటంవల్ల ఈ గ్రామానికి చింతపల్లి అని పేరు వచ్చింది. ఇక్కడకు సైబీరియాకు చెందిన పక్షులు వలస వస్తుంటాయి. వీటిని ఎర్రకాళ్ల కొంగలు అని స్థానికులు పిలుస్తుంటారు. డిసెంబర్ చివరి నుండి ఈ పక్షులు విదేశాల నుండి వలస వచ్చి చింతపల్లిలోని చింతచెట్లపై గూళ్లు నిర్మించుకుని, గుడ్లు పెట్టి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని పిల్లలు ఎదిగిన పిదప జూలై ప్రాంతంలో వెళ్లిపోతాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఈ పక్షులు ఇక్కడకి వేల సంఖ్యలో వలస వస్తుంటాయి. ఎర్రకాళ్ల కొంగల వల్ల చింతపల్లి గ్రామంలో అనేక వివాదాలు వచ్చాయి. ఈ పక్షులు తమ గ్రామానికి వలస రావడం అరిష్టమని కొందరు వాదించారు. పక్షులు వేసే రెట్టల వల్ల దుర్వాసన ప్రబలుతుందని మరి కొందరి వాదన. ఆ కారణంగా ఈ పక్షులు తమ గ్రామానికి రాకూడదని చింతచెట్లను సైతం కొందరు నరికేశారు. అందువల్ల కొద్దికాలం ఎర్రకాళ్ల కొంగలు చింతపల్లికి రావడం తగ్గించాయి. ఆ తరువాత ప్రజల్లో అవగాహన కలిగి ఈ పక్షుల వల్ల తమ గ్రామానికి మంచి గుర్తింపు వచ్చిందని భావించి తిరిగి వలస పక్షులు ఇక్కడికి వచ్చేందుకు చర్యలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో విదేశీ విహంగాలతోపాటు పలు ప్రాంతాల పక్షులు ఇక్కడికి వలస వచ్చి పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాలలోని పర్యాటక శాఖలు ఈ పక్షి కేంద్రాల అభివృద్ధికై శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అరుదైన ఇటువంటి పక్షిజాతులను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
*