S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గజదొంగ

పబ్లిక్ అండ్ బేకర్‌ఫీల్డ్ అడ్వర్టయిజింగ్ కంపెనీలో ప్రకటనలని రూపొందించే ఉద్యోగం చేసే హేరిసన్ తమ కొత్త క్లైంట్‌తో మీటింగ్‌లో పాల్గొన్నాడు. హోల్డ్‌వెల్ సేఫ్ కంపెనీ వాళ్లు కొత్తగా తయారుచేసిన ఐరన్ సేఫ్‌ని మార్కెట్లో ప్రవేశపెట్టబోయే ముందు చేయాల్సిన ప్రకటన గురించి వాళ్లు చర్చించడానికి సమావేశమయ్యారు.
‘మా కొత్త ఐరన్ సేఫ్ పేరు 801. గత మోడల్ కన్నా చాలా పటిష్ఠమైంది. ఏ దొంగా దీన్ని పగులకొట్టలేడు అన్న సత్యాన్ని మనం ప్రజలకి అందించాలి’ హోల్డ్‌వెల్ సేఫ్ కంపెనీ సేల్స్ మేనేజర్ సూచించాడు.
భార్యాపిల్లలతో ఒంటె మీద వెళ్లే తెల్లవాళ్ల కుటుంబం తమ వెంట 801ని తీసుకెళ్లే స్కెచ్‌ని ఓ ఆర్టిస్ట్ అప్పటికప్పుడు గీశాడు. దాన్ని చూసి పెదవి విరిచిన సేల్స్ మేనేజర్ చెప్పాడు.
‘ఇలాంటి రొటీన్ ప్రకటన కాదు. మేం కోరేది ఏదైనా అసాధారణమైంది.’
హేరిసన్‌కి ఆ ఉదయం దినపత్రికలో చదివిన ఓ వార్త గుర్తొచ్చింది. చిన్నగా దగ్గి, అంతా తనవైపు చూసాక చెప్పాడు.
‘పత్రికా విలేకరులు, టి.వి. కెమెరాల ముందు సేమీ 801ని తెరవగలిగితే అతనికి కొంత బహుమతిగా ఇస్తామని ప్రకటిద్దాం. సేమీ ఎలాంటి ఐరన్ సేఫ్‌నైనా పదిహేను నిమిషాల్లో తెరవగలడని పోలీసులు నిన్న చెప్పారు.
‘సేమీ ఎవరు?’
‘అతను పేరుపడ్డ ఐరన్ సేఫ్‌లని తెరిచే దొంగ. చాలా సంవత్సరాలు జైలుశిక్షని అనుభవించి నిన్ననే విడుదలయ్యాడు.’
‘ఓ నిపుణుడైన దొంగని మనం ఛాలెంజ్ చేయడం మంచి ఆలోచన. ఆ పావుగంటలో ఏం జరుగుతుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తారు. కాని చివరికి అతను దాన్ని తెరవలేక పోవడాన్ని ప్రజలు నమ్మరేమో?’ సేల్స్ మేనేజర్ అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
‘801లో అందరి ముందూ ఏభై వేల డాలర్ల నగదుని ఉంచి తాళం వేస్తాం. అతనికి దాన్ని తెరవడానికి అవసరమైన అన్ని పరికరాలని ఇస్తాం. అది తెరవగలిగితే ఆ మొత్తం అతను తీసుకోవచ్చు. అప్పుడు మనం అతన్ని నటించమన్నామని ఎవరూ భావించరు. ఒకవేళ అతను తెరవలేకపోతే అతనికి ఐదువేల డాలర్లు మాత్రమే ఇస్తాం’ హేరిసన్ చెప్పాడు.
‘ఇది చాలా మంచి ఆలోచన. మా యజమాని దీని గురించి ఏమంటాడో మాట్లాడి పావుగంటలో మా నిర్ణయం చెప్తాను. కాని సేమీ అందుబాటులో ఉన్నాడా? దీనికి ఒప్పుకుంటాడా?’ సేల్స్ మేనేజర్ అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
‘పోలీస్ శాఖలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. అతని అడ్రస్ సంపాదించి మాట్లాడి చూస్తాను’
‘ఏభై వేల డాలర్లంటే అతను తప్పకుండా ఒప్పుకుంటాడు. పావుగంట పనికి అమెరికా అధ్యక్షుడికే అంత రాదు’ హేరిసన్ మేనేజర్ ఉత్సాహంగా చెప్పాడు.
ఆ ప్రకటన కేంపైన్ వల్ల తమ కంపెనీకి పేరు వస్తుందని అప్పటికే అతను గ్రహించాడు.
పావుగంట తర్వాత సేల్స్ మేనేజర్ చెప్పాడు.
‘మా యజమానితో ఫోన్‌లో మాట్లాడాను. ఇది ఆయనకి బాగా నచ్చింది. ఏ దొంగల బారి నించి కాపాడుకోడానికి ఐరన్ సేఫ్‌లని కొంటారో అలాంటి ఓ దొంగ చేత దాన్ని పగలకొట్టించే ప్రయత్నం చేయడం మంచి పబ్లిసిటీ. అతను విఫలం అవడం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.’
‘సరే. హేరిసన్ సేమీతో మాట్లాడాక ఇది కన్‌ఫం చేస్తాను. ఆ తర్వాత మిగతా ఏర్పాట్లు చూడచ్చు’ హేరిసన్ మేనేజర్ హోల్డ్‌వెల్ ఐరన్ సేఫ్ సేల్స్ మేనేజర్‌తో కరచాలనం చేస్తూ చెప్పాడు.
* * *
సేమీని చూడగానే హేరిసన్ కొద్దిగా నిరాశ చెందాడు. ఐరన్ సేఫ్‌లని పగలగొట్టే దొంగంటే ఆరడుగుల ఎత్తు, బాగా బరువుగల ఆజానుబాహుడ్ని ఊహించాడు. కాని ఏభై పైబడ్డ సేమీ సన్నగా, పొట్టిగా ఉన్నాడు. అతను దొంగలా కన్నా లెక్కల టీచరా అనిపించేట్లు కనిపించాడు.
‘కూర్చోండి. నా ఫోన్ నంబర్ మీకు ఎవరిచ్చారు?’ సేమీ ప్రశ్నించాడు.
‘లెఫ్టినెంట్ ఐజాక్ నా కజిన్. అతను ఇచ్చాడు.’
‘ఓ! నాతో ఏమిటి పని?’
‘నేను ఓ ప్రకటనల కంపెనీలో ప్రకటనలని రూపొందించే ఉద్యోగిని. హోల్డ్‌వెల్ కార్పొరేషన్ మా క్లైంట్. వారి కొత్త ఉత్పత్తి ప్రచారానికి మీ సహకారం కోరి వచ్చాను.’
‘నా సహకారమా? అంటే?’
‘వాళ్లు ఏ దొంగా తెరవలేని ఓ కొత్త మోడల్ ఐరన్ సేఫ్‌ని తయారుచేశారు..’
‘.. అది నిజం కాదు. ఏ దొంగా తెరవలేని ఐరన్ సేఫ్ అంటూ ప్రపంచంలో ఉండదు’ సేమీ నవ్వుతూ చెప్పాడు.
‘ఉంటుందని ఋజువు చేయడానికి మీ సహకారం కావాలి. మీరా సేఫ్‌ని తెరిచే ప్రయత్నం చేయాలి. షరతులు ఉన్నాయి. పావుగంటలో తెరవగలగాలి. మీకు కావాల్సిన పరికరాలనీ మీ వెంట తెచ్చుకోవచ్చు.’
‘సారీ మిస్టర్ హేరిసన్! నేను జైల్లో ఉండగా ఆ పనిని ఇక మానేయాలని నిర్ణయించుకున్నాను. ఇంకోసారి పట్టుబడి మళ్లీ జైలుకి వెళ్తే నా శేష జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుంది.’
‘ఇది జైలుకి పంపే పని కాదు’
‘అని చెప్తే ఏ జడ్జీ నమ్మడు. సారీ. నేను ఇంకో పనిని నేర్చుకుని దాంతో జీవిస్తున్నాను. ఇంకెవర్నైనా చూసుకోండి’
‘ఇంకెవరూ సేమీ కారు. ఐరన్ సేఫ్‌లని తెరవగలిగే సామర్థ్యం ఒక్క మీకే ఉందని మీక్కూడా తెలుసు.’
‘అవును. అది నాకు నష్టాన్ని కలిగించింది. క్రితం సారి బేంక్ ఆఫ్ అమెరికా వాల్ట్‌ని తెరచి దొంగతనం జరిగినప్పుడు అది నా పనే అని పోలీసులు భావించి నన్ను పట్టుకున్నారు. వాళ్లకి చాలా ఆధారాలు దొరకడంతో శిక్ష పడి జైలుకి వెళ్లాను.’
‘కానీ ఈసారి అలా కాదు. నిజానికి మీరు పోలీసు అధికారుల ముందే 801ని తెరిచే ప్రయత్నం చేస్తారు’ హేరిసన్ చెప్పాడు.
‘ఐతే అసలీ పని చేయను. నేను పిచ్చివాడ్ని కాను’
‘్భయపడకండి. మీరు 801 ప్రకటన కోసం చట్టబద్ధంగా ఆ పని చేస్తారు. అదీ టీవీలో లైవ్ కార్యక్రమంలో. 801ని మీరు తెరవలేకపోతే దాన్ని దొంగలు ఎవరూ తెరవలేని ఐరన్ సేఫ్ అని రికమండ్ చేయాలి.’
‘కాని సరిపడే పరికరాలు, సమయం ఉంటే నేను దేన్నైనా తెరవగలను’
‘ఆ సేఫ్‌ని మీరు తెరిచే ప్రయత్నానికి మీకు ఐదు వేల డాలర్లు ఇస్తాం. మీకు తెలిసిన అన్ని విద్యలూ ప్రదర్శించి దాన్ని తెరవగలగాలి. అనేక మంది పత్రికా విలేకరులు, సాక్షుల ఎదుట మీరీ పని చేయాలి.’
‘పోలీసులు దొంగతనానికి సాక్షులుగా వస్తారంటారా?’
‘అవును. దానికి కొత్త టైం లాక్ మెకానిజం అమర్చడం వల్ల అది దుర్బేధ్యమైందని హోల్డ్‌వెల్ కార్పొరేషన్ వాళ్లు చెప్తున్నారు. ఆ సేఫ్‌లో అందరి ముందూ నేనో కవర్ని ఉంచుతాను. ఆ కవర్లో ఏభై వేల డాలర్లు ఉంటాయి. దాన్ని తెరవగలిగితే ఆ సొమ్ము మీదే అవుతుంది. తెరవలేక పోతే మీ ప్రయత్నానికి ఎటూ ఐదు వేల డాలర్లు ముడుతాయి.’
‘అంటే, దాన్ని నేను తెరవగలిగితేనే నాకు ఎక్కువ లాభం అన్న మాట’
‘అవును. మీరా లాకర్ని తెరచి ఆ డబ్బు తీసుకోవడం చట్టపరిధిలోదే కాబట్టి భయపడకుండా తెరవండి.’
సేమీ ఆలోచిస్తూండటంతో హేరిసన్ చెప్పాడు.
‘మీరు ఇంకో పని ద్వారా డబ్బు సంపాదిస్తున్నా పాత విద్యని మర్చిపోయారు అనుకోను’
‘సరే మిస్టర్ హేరిసన్. నేను అందుకు ఒప్పుకుంటున్నాను.’
‘్థంక్స్ సేమీ. మీరా ఏభై వేల డాలర్లని సంపాదించాలని నేను వ్యక్తిగతంగా ఆశిస్తున్నాను.’
‘తప్పకుండా ఆ డబ్బు నా జేబులోకి వస్తుంది. ఇందులో ఎంత మాత్రం నాకు సందేహమే లేదు’ సేమీ నమ్మకంగా చెప్పాడు.
* * *
మీడియా దానికి ఆపరేషన్ సేఫ్ క్రాక్‌గా పేరు పెట్టింది. న్యూయార్కర్ పత్రిక తమ సీనియర్ రిపోర్టర్లని దానికి పంపింది. నాలుగు ట్రూ డిటెక్టివ్ పత్రికల ఎడిటర్సే స్వయంగా హాజరయ్యారు. 801 సేఫ్ ప్రమోషన్‌కి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దానికి ప్రధాన అతిథిగా హాజరయ్యాడు.
రాత్రి తొమ్మిదికి కార్యక్రమం ఆరంభమైంది. ముందుగా ఏంకర్ సేమీ పేరు, వయసు, ఐరన్ సేఫ్‌లని తెరిచే అనుభవాలని, జైలు జీవితం ఎలా ఉందని అతన్ని అడిగాడు. సేమీ కొద్దిగా తడబడుతూ వాటికి జవాబులు చెప్పాడు. తర్వాత సేమీ ఉపయోగించే పరికరాలను చూపించి వాటి ఉపయోగాలని వివరించాడు.
తెర పక్కకి తొలగి, దాని వెనక కేవలం దాని మీద మాత్రమే పడే వెలుగులో 801 గంభీరంగా కనిపించింది. ఏంకర్ దాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు.
‘దీని పేరు 801. హోల్డ్‌వెల్ కార్పొరేషన్ రేపు ఉదయం నించి అమ్మకాలని మొదలపెట్టే సరికొత్త ఐరన్ సేఫ్. ప్రపంచంలోని ఏ దొంగా దీన్ని తెరవలేడని దీని తయారీదారులు సవాల్ చేస్తున్నారు. ప్రపంచంలోని ఏ సేఫ్‌నైనా తను తెరవగలనని ఇందాకే సేమీ చెప్పాడు. మరి ఈ ఇరుపక్షాల వాదనల్లో ఏది నిజం? అది ఇంకో పావుగంటలో మనం తెలుసుకోబోతున్నాం. నాకైతే చాలాఉత్కంఠగా ఉంది. దీని బరువు 2370 పౌన్లు. దీని ముందున్న సేమీ బరువు నూట పనె్నండు పౌన్లు.’
స్టూడియోలోని ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు. హేరిసన్ ప్రేక్షకుల ముందుకి వచ్చి వారికి ఓ కవర్లోని నోట్లని తీసి చూపించి చెప్పాడు.’
‘ఇవి ఏభై వేల డాలర్లు. ఈ కవర్ని మీ ముందే 801లో ఉంచి తాళం వేస్తారు. హార్డ్‌వెల్ కంపెనీ యజమాని మిస్టర్ గ్రాడ్.. మిస్టర్ గ్రాడ్...’
ఆయన వచ్చి ఆ కవర్ని సేఫ్‌లో ఉంచి తాళం వేశాడు.
‘ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్‌కి వాటిని ఇస్తున్నాను’ ఆ తాళాలని పోలీస్ కమిషనర్‌కి ఇచ్చి మళ్లీ ప్రేక్షకుల్లో కూర్చున్నాడు.
పోలీస్ కమిషనర్ వాటిని జేబులో వేసుకున్నాడు. హేరిసన్ చెప్పాడు.
‘లేడీస్ అండ్ జెంటిల్మెన్. హోల్డ్‌వెల్ కార్పొరేషన్ ఇప్పుడు అమెరికాలోని నంబర్ వన్ దొంగ సేమీకి, తమ నూతన తయారైన 801ని కూడా తెరవలేడని సవాల్ చేస్తోంది. సేమీ సరిగ్గా పావుగంటలో దాన్ని తెరచి, అందులోని ఏభై వేల డాలర్లని తన స్వంతం చేసుకోవచ్చు. ఆ డబ్బు ఇంక అతను ఎవరికీ, ఎప్పటికీ తిరిగి ఇవ్వక్కర్లేదు. అది అతని స్వంతమవుతుంది. ఒకవేళ అతను సేఫ్‌ని తెరవలేక ఓడిపోతే అతనికి ఐదు వేల డాలర్లని చెల్లిస్తారు.’
‘నీ టైం ఇప్పుడు మొదలవుతుంది’ ఏంకర్ చెప్పాడు.
వెంటనే టి.వి. మానిటర్ మీద పావుగంట కౌంట్ డౌన్ అంకెలు కూడా కనిపించాయి. సేమీ ఆ సేఫ్ చుట్టూ రెండుసార్లు తిరుగుతూ పరిశీలించాడు. దాన్ని అక్కడక్కడా పరీక్షగా తడిమాడు. తన పనిలో ముణిగిపోయిన సేమీ అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని పూర్తిగా విస్మరించినట్లుగా కనిపించాడు. మోకాళ్ల మీద కూర్చుని దాని తలుపుల్ని, దానికి అమర్చిన డయల్‌ని పరిశీలించాడు. బయటకి కనపడకుండా మడతబందులు ఉన్న చోట చేత్తో తడిమాడు. దానికి నాలుగు పక్కలా ఆరు అడుగుల ఎత్తులో లైట్లు ఉన్నాయి.
మొదటి పది నిమిషాలు అతను తలుపు ముందు బుద్ధుడిలా కూర్చుని దాన్ని పరిశీలిస్తూంటే చర్యలు లేకపోవడంతో కొందరు ప్రేక్షకులకి విసుగు పుట్టింది. చివరికి అతను వర్క్ బెంచీ మీది ఎలక్ట్రిక్ డ్రిల్‌ని అందుకుని ఓ సాకెట్‌లో దాని ప్లగ్‌ని ఉంచాడు. పోలీస్ కమిషనర్ ఓ ఇన్‌స్పెక్టర్‌ని అతను చేసేది గమనించమని చెవిలో చెప్పాడు.
సేఫ్ తలుపు ఎడమ వైపు అతను డ్రిల్ చేయడం ఆరంభించాడు. ఆ శబ్దం కొందర్ని ఇబ్బంది పెట్టింది. డ్రిల్ బిట్ కొద్దిసేపటికి విరిగింది. సేమీ దాని వంక విచారంగా చూస్తూంటే ఒకరిద్దరు ప్రేక్షకులు బయటకి పెద్దగా నవ్వారు.
అతను లేచి వర్క్ బెంచీ మీది పరికరాలని చూసి, ఓ బలిష్టమైన సుత్తిని, ఉలిని తీసుకుని ఇందాక డ్రిల్ చేసిన చోట ఉలిని ఉంచి సుత్తితో నాలుగైదుసార్లు బలంగా కొట్టి దెబ్బ తగిలిన చోట పరీక్షించాడు. అతని మొహంలోని ఆశ్చర్యం నిజమైందని అంతా గ్రహించారు.
ఆ రెంటిని మళ్లీ వర్క్ బెంచీ మీద ఉంచి చిన్న సుత్తి తీసుకున్నాడు. హేరిసన్ని పిలిచి ఏదో కోరితే అతను తల ఊపి, పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లి ఆయనతో ఏదో చెప్పాడు. ఆయన తల ఊపి ఇన్‌స్పెక్టర్ చెవిలో ఏదో చెప్పాడు. అతను, యూనిఫాంలోని మరో ముగ్గురు పోలీసులు వెళ్లి సేమీ కోరినట్లుగా ఆ ఐరన్ సేఫ్‌ని పడుకోబెట్టారు. పోలీసులే దొంగకి సహాయం చేస్తున్నారని ఏంకర్ నవ్వుతూ చెప్పాడు. అది అక్కడి వత్తిడిని తొలగించింది.
సేమీ మోకాళ్ల మీద వంగి కూర్చుని సేఫ్ అడుగు భాగాన్ని పరిశీలించాడు. దాని మీద చిన్న సుత్తితో తట్టాడు. శబ్దం విన్నాక డ్రిల్ తీసుకుని దానికి కొత్త బిట్‌ని అమర్చి డ్రిల్ చేయసాగాడు. మూడు నిమిషాల తర్వాత ఆ బిట్ కూడా పగిలిపోయింది. అతను దాన్ని మళ్లీ నిలబెట్టమని పోలీసులకి సౌంజ్ఞ చేశాడు. తర్వాత ఎస్టైలిన్ టార్చ్‌ని తీసుకున్నాడు. ఆ వేడి మంటతో సేఫ్ మడతబందులు ఉన్న చోట ఆగకుండా తగుల్తూనే ఉంది. దాని రంగు మారింది తప్ప సేమీ దాన్ని తెరవలేకపోయాడు. అతని చొక్కా చెమటతో తడిసిపోయింది. ఆఖరి ప్రయత్నంగా నైట్రో గ్లిజరిన్‌ని అందుకున్నాడు. 801 పటిష్టతకి నిజమైన పరీక్ష అది. బిల్డింగ్ ఏమీ కానంత, కేవలం సేఫ్‌ని పగలకొట్టేంత మాత్రమే మందుగుండుని సేమీ ఉపయోగించాడు. ప్రేక్షకుల్ని ఇరవై అడుగులు వెనక్కి పంపించాడు. సేమీ 801 మడత బందులున్న చోట ఆ నైట్రో గ్లిసరిన్‌ని టేప్‌తో అతికించాడు. ఇందాకటి చిన్న సుత్తిని తీసుకుని పదడుగులు వెనక్కి వెళ్లి దాన్ని ఆ కేష్‌షూల్ మీదకి విసిరాడు. అది ఆ సీసాని తాకగానే అతడు వెంటనే నేల మీద పడుకుని రెండు చెవుల్ని చేత్తో మూసుకున్నాడు. ఆ పేలుడికి ఆ బిల్డింగ్ కిటికీ అద్దాలు పగల్లేదు కాని అల్లల్లాడాయి.
‘పావుగంటైంది’ ఓ కంఠం ప్రకటించింది.
‘సారీ. నా వల్ల కాలేదు’ సేమీ చెప్పాడు.
వెంటనే అంతా చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు, ఈలలు 801కి కాక సేమీకే. పోలీసులు కూడా చప్పట్లు కొట్టారు. కొందరు పత్రికా విలేకరులు తమ ఎడిటర్స్‌కి సమాచారం ఇవ్వడానికి బయటకి ఫోన్ బూత్‌ల వైపు పరిగెత్తారు. హేరిసన్ ఇచ్చిన చల్లటి బీర్ బాటిల్‌ని సేమీ కృతజ్ఞతగా అందుకున్నాడు. గ్రాడ్ ఐదు వేల డాలర్లని ఇచ్చి థాంక్స్ చెప్పాడు. సేమీ ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు.
* * *
మర్నాడు ఉదయం హోల్డ్‌వెల్ కార్పొరేషన్ నించి ఆ ప్రకటన కంపెనీ మేనేజర్‌కి ఫోన్ వచ్చింది. అవతల నించి చెప్పింది విన్న మేనేజర్ మొహం వెంటనే కందగడ్డైంది.
‘కనుక్కుని వెంటనే ఫోన్ చేస్తాను’ చెప్పాడు.
హేరిసన్‌ని తన గదిలోకి పిలిపించాడు. తన ఇంక్రిమెంట్ గురించి అనుకుంటూ హేరిసన్ మేనేజర్ గదిలోకి వెళ్లాడు. అతని మొహం చూడగానే ఏదో తిరకాసు జరిగిందని అర్థమైంది.
‘ఎస్సార్?’ అడిగాడు.
‘ఇవాళ ఉదయం 801 టైం లాక్ తెరచుకున్నాక లోపల చూస్తే వాళ్లకి ఏం కనపడిందో తెలుసా? కవర్లో డాలర్ సైజులోని ఏభై చిత్తు కాగితాలు కనిపించాయి’
‘చిత్తు కాగితాలా?’ హేరిసన్ అదిరిపడ్డాడు.
‘అవును. ఏభై వేల డాలర్లు లేవు. ఆ డబ్బుని ఆ కంపెనీ వాళ్లు నీకు ఇచ్చారు. నువ్వు దాన్ని ప్రేక్షకులకి చూపించాక కవర్లో ఉంచి దాన్ని గ్రాడ్‌కి ఇచ్చావు. ఇచ్చేప్పుడు కవర్లని మార్చావు. సాయంత్రంలోగా నువ్వా ఏభై వేల డాలర్లని చెల్లించకపోతే జైల్‌కి వెళ్తావు’
‘ఓ సేమీ!’ వెంటనే హేరిసన్ బాధగా మూలిగాడు.
‘ఏమిటి సేమీ? అతని మీదకి నెట్టక. అతను దాన్ని తెరవలేక పోయాడు.’
‘సేమీ తన పనిని మార్చుకున్నానని చెప్పాడు. అదేమిటని నేను అతన్ని అడిగి ఉండాల్సింది. అతను ఐరన్ సేఫ్‌ని పగలగొట్టడం నించి జేబు దొంగతనాలకి మారాడని వెళ్తూ నాతో చెప్పెళ్ళాడు’ హేరిసన్ ఆక్రోశంగా చెప్పాడు.
(హెన్రీ స్లీసర్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి