S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీరు ఆర్థిక అక్షరాస్యులా?

చదువు నిర్వచనం మారిపోయింది. దేశంలో దాదాపు 60 శాతం మంది అక్షరాస్యులున్నారు. అంటే సంతకం చేయడం వచ్చిన వారందరినీ అక్షరాస్యులుగానే గుర్తిస్తారు. ఈ లెక్కన దేశంలో 60 శాతం మంది అక్షరాస్యులు. ఇప్పుడు రోజులు మారాయి. అక్షరాలు రావడమే కాదు. గొప్పగొప్ప పుస్తకాలు రాసిన వారు కూడా కొత్త నిర్వచనం ప్రకారం నిరక్షరాస్యులు. ఇప్పుడు టెక్నాలజీనే రాజ్యం ఏలుతోంది. మీరెంత పండితులైనా టెక్నాలజీ నిరక్షరాస్యులైతే ఈ కాలంలో బతకడం కష్టం. అమెరికాలో ఉన్న పిల్లలతో మాట్లాడాలన్నా, ప్రపంచ జ్ఞానం అంతా అరచేతిలో ఇమిడిపోవాలన్నా ఎంతో కొంత టెక్నాలజీ అవసరం. పిల్లలు బుద్ధిగా కూర్చుంటే టీచర్ పాఠాలు చెప్పే దృశ్యాలు పాతవి. తలపండిన పెద్దలు బుద్ధిగా కూర్చుంటే 20ఏళ్ల కుర్రాళ్లు వాళ్లకు కంప్యూటర్ పాఠాలు చెప్పడం ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తుంది. కాలంతో పోటీ పడాలంటే ఏ వయసులోనైనా నేర్చుకోక తప్పదు.
చదువు, కంప్యూటర్ పరిజ్ఞానం సరే మరి ఆర్థిక అంశాల్లో మీరు అక్షరాస్యులేనా?
ఏ స్థాయి వారైనా కావచ్చు. ప్రతి ఒక్కరి జీవితానికి అత్యవసరమైనవి ఆర్థిక పాఠాలు. కానీ చిత్రంగా ఈ పాఠాలు ఏ పాఠశాలలో నేర్పించరు. జీవితమే నేర్పిస్తుంది. మీరే కాదు దేశంలో చాలా మంది ఆర్థిక అంశాల్లో నిరక్షరాస్యులే.
చదువు రాని వారు వింత పశువు అని కటువుగా చెప్పుకున్నాం కానీ ఆర్థిక అక్షరాస్యత విషయంలో కొన్నిసార్లు బాగా చదువుకున్న వారి కన్నా చదువురాని వారి పరిజాఞనమే ఎక్కువ.
బాగా చదువుకున్న వారే ఆన్‌లైన్ మోసాల పాలవడం గమనించవచ్చు. ఆ మధ్య హైటెక్ సిటీ ప్రాంతంలో ఒకరు కార్యాలయం ప్రారంభించి. 50 రూపాయలతో సభ్యత్వం వెంటనే రెండు వందల రూపాయల విలువైన వస్తువులు తీసుకు వెళ్లవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చారు. సభ్యత్వ రుసుం 50 రూపాయలు కార్డు ద్వారానే చెల్లించాలని షరతు విధించారు. వందల మంది ఐటి కుర్రాళ్లు ఎగబడి సభ్యత్వం తీసుకున్నారు. 50రూపాయలకు వెంటనే నాలుగింతల విలువైన వస్తువులు ఇస్తున్నారు పోయేదేముంది అనుకున్నారు. తీరా వీరికి జీతాలు వచ్చాక చూసుకుంటే అకౌంట్‌లో ఏమీ లేదు. కార్డు ద్వారా వీరు సభ్యత్వ రుసుం చెల్లించినప్పుడు పాస్‌వర్డ్ కాపీ చేసిపెట్టుకున్నారు. జీతం పడగానే స్వాహా చేశారు. కార్యాలయానికి తాళం వేసి వెళ్లారు. ఆన్‌లైన్‌లో లాటరీ, తక్కువ ధరకు బంగారం ఇలా ఆన్‌లైన్‌లో రకరకాల మోసాలకు బలయ్యేది విద్యావంతులే. నిరక్షరాస్యుల వద్ద ఈ ఆటలు చెల్లవు. కిలో కరక్కాయ పొడికి వెయ్యి రూపాయలు ఇస్తామనే స్కీమ్ గురించి చెబితే అక్షరాస్యులు నమ్ముతారేమో కానీ నిరక్షరాస్యులు అదెలా సాధ్యం అని సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. చదువురాని వారిని ఇలాంటి స్కీముల పేరుతో మోసం చేయడం అంత ఈజీ కాదు.
చదువు రాకపోయినా వారికి జీవితం ఆర్థిక అక్షరాస్యతను నేర్పుతుంది. ఆర్థిక మోసాల సంగతి ఎలా ఉన్నా ఈ కాలంలో ఆర్థిక అక్షరాస్యత చాలా అవసరం. చదువుతో సంబంధం లేకుండా ఆర్థిక ఆక్షరాస్యత అవసరం. ఇది ఎంత చిన్న వయసులో ఈ అవగాహన కలిగితే సంపన్నుడిగా మారేందుకు, ఆర్థిక స్వేచ్ఛకు అది అంతగా ఉపయోగపడుతుంది. ఒకే జీతంతో ఒకే ఉద్యోగం చేసే ఇద్దరు వ్యక్తుల ఆర్థిక స్థితిగతులు ఒకే విధంగా ఉండవు. డబ్బులపై వారికి ఉన్న అవగాహన, పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్, ఖర్చు చేసే విధానం వంటివన్నీ వారి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. జీతం వచ్చిన రెండు వారాల్లోనే చుట్టుపక్కల వారిని అప్పు అడిగే వారు కొందరైతే తనకున్న అవకాశాల మేరకు ఎంతో కొంత పొదుపు చేసి రేపటి కోసం ఆలోచించే వారు కొందరు.
డబ్బు లక్షణాలు, జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఎత్తు పల్లాలు ఉంటాయి. ఊహించని ఖర్చులు వస్తాయి. పిల్లల చదువు వ్యయం పెరుగుతుంది. రేపటి కోసం ఆలోచించే వారి ఆలోచనా ధోరణి ఖర్చు చేసే విధానం ఒక రకంగా ఉంటుంది. ఈ ఆలోచనలేమీ లేనివారి జీవితం ఒక విధంగా ఉంటుంది.
డబ్బు లక్షణాలేమిటి? కొందరి వద్ద డబ్బు నిలిస్తే మరికొందరి వద్ద ఎందుకు నిలవదు. డబ్బు డబ్బును ఎలా సంపాదిస్తుంది. వడ్డీ ఏమిటి? బ్యాంకు వడ్డీకి ప్రైవేటు వడ్డీకి తేడా. తక్కువ వడ్డీ రేటుకు హోం లోన్ పొందాలంటే ఏం చేయాలి. సిస్టమెటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)పొదుపును మంచి ఆదాయం వచ్చే చోట ఎలా ఇనె్వస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు ఐదువందల రూపాయలు కూడా ఇనె్వస్ట్ చేయవచ్చు అనే విషయం మీకు తెలుసా? అద్దె ఇంటిలో ఉండడం లాభదాయకమా? బ్యాంకులో అప్పు తీసుకోనైనా సొంత ఇంటిని సమకూర్చుకోవడం మంచిదా? చిట్టీలు ఏమిటి? బాండ్లు, డిబెంచర్లు ఎలా కొనాలి. ద్రవ్యోల్బణం మన వద్ద ఉన్న రూపాయి విలువ ఎలా తగ్గిస్తుంది. అంతకు మించిన ఆదాయం పొందాలంటే ఏం చేయాలి? డబ్బు గురించి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. బికాం డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొవడం రాని వారు ఎంతో మంది ఉన్నారు. ఐఐటిల్లో చదివి ఐటి కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారికి సైతం వడ్డీ గురించి తెలియదు.
సత్యం కుంభకోణం బయటపడిన సమయంలో ఇలాంటి వారంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి జీతం 25వేలైతే ఐటి కంపెనీలో కుమారుడి జీతం 50వేలు. ఇంత సర్వీసులో 25వేల జీతం అంటే అది ఒక జీతమేనా అని ఈసడించుకున్న కుమారుడు సత్యం కుంభకోణం తరువాత ఒక్కసారిగా వణికిపోయాడు. అప్పటి వరకు పొదుపు మాటెత్తితేనే చిరాకు పడ్డ అతను తండ్రి మాట ప్రకారం జీతాన్ని జాగ్రత్తగా వాడుకోవడమే కాకుండా బ్యాంకు లోన్‌తో ఇళ్లు కొన్నాడు. సత్యంలో ఉద్యోగం అని కోరి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నవారు కూడా కుంభకోణం బయటపడగానే సంబంధాలు రద్దు చేసుకున్నారు. చదువురాని వారి కన్నా ఐటి నిపుణుల్లో ఆర్థిక అక్షరాస్యులు తక్కువ అని ఆ రోజుల్లో అనిపించింది. ఆ దెబ్బతో ఏదీ శాశ్వతం కాదు అనే భావన ఐటి యువతకు కలిగింది. ఆర్థిక అక్షరాస్యత ఉన్నవారు ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవడానికి ముందస్తుగానే సిద్ధమై ఉంటారు. ప్రతి సంక్షోభంలోనూ వారు కొత్త అవకాశాలను వెతుక్కోగలరు. మరి మీ ఆర్థిక అక్షరాస్యత ఎంత మీకు మీరే తేల్చుకోవాలి. తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి వయసు అడ్డంకి కాదు. ఏ వయసులోనైనా తెలుసుకోవచ్చు.

-బి.మురళి