గజిబిజి సినిమా
Published Saturday, 29 September 2018అవి నేను బనారస్‌లో చదువుతున్న రోజులు అంటాడు హీరో తండ్రి. అప్పట్లో అతను ఏదో పిచ్చి పని చేసి ఉంటాడు. దాని ఆధారంగానే మొత్తం సినిమా నడుస్తుంది. ఆ సంగతి చివరిలో కానీ చెప్పడు ఆ పెద్ద మనిషి. లేదంటే మనిషి ముఖం మీద సుడులు తిరుగుతున్నట్టు చూపించి కథలోని గతంలోకి వెళ్లిపోతాడు. దీన్ని ఫ్లాష్ బ్యాక్ అంటారు. పద్ధతిని సినిమాలో మొదటిసారిగా ప్రయోగించి బలంగా వాడుకున్న దర్శకుడు అకిరా కురొసావా అని ఎక్కడో చదివినట్టు గుర్తు.
ఇక వరుస పెట్టి రెండు మూడు విషయాలు చెప్పాలి. అంటే ఇప్పటివరకు చెబుతున్నది విషయాలు కావు అంటారా. కానీ వౌఖిక భాషలో ముచ్చట చెబుతున్నపుడు ఈ రకమైన మాటలు వాడడం బాగా అలవాటు అయింది. నేను ముఖ్యంగా రేడియోలో శిక్షణ పొందిన మనిషిని. కనుక మాటలన్నీ ఎదుటి వారికి చెబుతున్న పద్ధతిలోనే చెప్పడం అలవాటు అయినట్టుంది. రాతలో కూడా ఆ పద్ధతి బాగుందని చాలామంది అనడంతో అదే పద్ధతిలోనే రాత కూడా సాగుతున్నది.
నిజంగా నేను రేడియోలో పని చేస్తున్న కాలం అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెడతాను. అప్పట్లో లలిత కళాతోరణంలో ఒక నాటకం ప్రదర్శన జరిగింది. నాటకం పేరు రషోమన్. అందులో శశికపూర్ కుమార్తె సంజనా నటించినట్టు, లేదా ఆ నాటకాన్ని సమర్పించినట్టు గుర్తుంది. రమణాచారి ఆ అమ్మాయిని అంగూరు పండు అంటూ వర్ణించడం కూడా గుర్తుంది. ఎంఎస్ సత్యు అనే దర్శకుడు ఆ నాటకం ప్రదర్శనలో ప్రధాన పాత్ర వహించాడు. ఆ నాటకాన్ని ర్యునోసుకే అకుతగవా అనే రచయిత రాశాడు. ఇది జపనీస్ అని సులభంగానే అర్థం అయి ఉంటుంది. అది ఒక చిన్న కథ. దాన్ని నాటకంగా చూపించారు. రషోమన్ అంటే నగర ద్వారం అని అర్థం. క్యోటో నగరంలో ఒక వైపున ఉన్న పాడుపడిన ద్వారం వద్ద ఈ కథ నడుస్తుంది. అప్పట్లో లలిత కళాతోరణంలో వేదిక మీద భారీ ఎత్తున సెట్ వేశారు. రెండంతస్తుల ద్వారాన్ని కూడా చూపించారు. అందులో రెండు అంతస్తులలోను మనుషులు ఉండి దృశ్యాలను ఒకేసారి ప్రదర్శించిన జ్ఞాపకం ఉంది. కథ మాత్రం గుర్తు లేదు.
రషోమాన్ కథను అకిరా కురొసావా సినిమాగా తీశారు. ఈ సినిమా నేను నిన్న మొన్నటి వరకు చూడలేదు. కురొసావా సినిమాలు చాలా చూశాను. చాలా ప్రభావినికి గురి అయ్యాను. నేను గొప్ప సినిమా విద్యార్థిని అని చెప్పుకోను గాని నా పద్ధతి ప్రకారం ప్రపంచంలోని గొప్ప సినిమాలను మామూలు దృష్టితో కాకుండా విశే్లషణ దృష్టితో చూడడం చాలా రోజులుగా అలవాటు. మా అబ్బాయి నాలాగే పుస్తకాలు సినిమాలను చాలా ఇష్టంగా చదువుతాడు చూస్తాడు. నాలాగే వాటిని సేకరిస్తాడు కూడా. అతని కంప్యూటర్లో బోలెడన్ని సినిమాలు సీరియల్స్ ఉన్నాయి. వాటిని నేను నెట్ సాయంతో ఇక్కడి నుండే ఫ్లెక్స్ అనే అప్ ద్వారా చూస్తూ ఉంటాను. నేను అడిగినందుకే అబ్బాయి కురోసావా సినిమాలను కొన్నింటిని సేకరించి అందులో పెట్టాడు. వాటిలో మాదదయో అనే సినిమాను నేను ముందు చూశాను. ఉక్కిరి బిక్కిరి అయ్యాను. దాన్ని గురించి పదుగురితో పంచుకోవాలని కూడా అనుకున్నాను. ఆ పని జరిగే లోపలే మరొక విచిత్రం జరిగింది. నిజానికి అకుతగవా కథల పుస్తకం నా దగ్గర చాలా రోజులుగా ఉంది. కానీ ఎందుకో దాన్ని చదవడానికి వీలు కుదరలేదు. ఈ మధ్యన మళ్లీ ఒక పుస్తకం దొరికింది. అందులో అతను రాసిన కథలు మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు అగ్ని. మొత్తానికి ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టాను. చదవడం మొదటి కథ రషోమన్‌తో మొదలైంది. కథ ముఖంలో గుద్దినట్టు ఉంది. ఈ కథను కంప్యూటర్‌లోని సినిమా వర్షన్‌లో సబ్ టైటిల్స్ లేవు. నాకు కొంత నిరాశ కలిగింది. వచ్చే యూట్యూబ్‌లో వెతికాను. సినిమా దొరికింది. అక్కడ కూడా సబ్ టైటిల్స్ లేవు. సబ్ టైటిల్స్ కావాలని పద్ధతి పెట్టి వెతికాను. ఈసారి మాటలు కూడా దొరికాయి. నా ఆశ్చర్యానికి అంతు లేదు. పుస్తకంలో నేను చదివిన కథ వేరు. సినిమాగా కురొసావా చూపించిన కథ పూర్తిగా వేరు.
పుస్తకంలోని కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కథలో కనిపిస్తారు. అందుకే నేను సినిమా గురించి ఆశ్చర్యపోయాను. సినిమాలో చాలామంది ఉన్నారు. ఈ సినిమా కారణంగా రషోమన్ అన్న మాటలకు అర్థం మారిపోయింది అని కూడా నాకు తెలిసింది. ఒకే విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పి కలిగించే గజిబిజిని రషోమన్ ప్రభావం అంటున్నారట. ఇది సినీ దర్శకునికి చాలా గొప్ప నివాళి.
అసలు కథలో వర్షం బాగా కురుస్తుండగా ఒక బీద మనిషి పనిని కోల్పోయి నగర ద్వారం దగ్గరకు వచ్చి ఆ నీడలో కూర్చుంటాడు. వర్షం వెలిస్తే బాగుండును అని అతను అనుకుంటాడని మనం అనుకోవచ్చు. కానీ వర్షం ఆగిన తరువాత కూడా వెళ్లడానికి ఎక్కడా చోటు లేదు. అంతలో అతనికి పై అంతస్తులో అలికిడి వినిపిస్తుంది. ధైర్యం చేసి వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక ముసలావిడ మృతశరీరం నుండి తల వెంట్రుకలు లాగుతూ ఉండడం కనిపిస్తుంది. దాన్ని చూచి ఈ మనిషి ఆశ్చర్యపోతాడు. వాళ్లిద్దరికీ కొంత మాటలు సాగుతాయి అది వేరే విషయం. కథ చెప్పను. మీరు వెతికి చదవండి.
ఇక సినిమాలోకి వస్తే నగర ద్వారం ఉంది. బీద మనిషి ఉన్నాడు. అక్కడే ఒక మత బోధకుడు కూడా ఉన్నాడు. ఆ వర్షంలో నుంచి మరొక మనిషి కూడా అక్కడికి వస్తాడు. ఆ వచ్చిన మనిషి మిగతా ఇద్దరినీ మాటలలోకి దించుతాడు. నిజానికి మొదటి మాటగా ఈ సినిమాలో ‘నాకు అర్థం కాలేదు, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు’ అన్న వాక్యాలు వినిపిస్తాయి. సినిమా నాకు కూడా అర్థం కాలేదు.
సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే కురొసావా దగ్గర పని చేస్తున్న ముగ్గురు అసిస్టెంట్లు ఒకేసారి వచ్చి సినిమా కథ తమకు ఏ మాత్రం అర్థం కాలేదు అని చెప్పారట. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అర్థం కావాలనే కదా నేను రాసింది, అంటూ ఈ రచయిత, దర్శకుడు జవాబిచ్చాడు. మొహమాటానికి ఏమో ఇద్దరు అర్థమైనట్టే తల ఊపారు. మూడవ అసిస్టెంట్ మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నాడు. సినిమాలో ఒక హత్య గురించి ముగ్గురో నలుగురో సాక్ష్యం చెబుతారు. ఒక్కొక్కరు ఒక రకంగా ఒకే హత్య గురించి వర్ణిస్తారు. చివరికి హంతకుని గురించి వివరం మాత్రం తెలియదు. దర్శకునికి కావలసిందే గజిబిజి అన్న మాట. సినిమాకు డబ్బులు పెడతామన్న నిర్మాతలు కూడా గజిబిజి కథను సినిమా పద్ధతిని చూసి ఇందులో తమ పేరు వేయవద్దు అన్నారట. దర్శకునికి మరి ఎంత ధైర్యంగా ఉండేదో నాకు తెలియదు. సినిమా వచ్చింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు బంగారు సింహం అవార్డు వచ్చింది. అకాడెమీలో దీన్ని అత్యుత్తమ ఇతర భాషా చిత్రంగా గుర్తించారు. అప్పుడు గాని నిర్మాతలకు సినిమా గురించి అర్థం కాలేదు. సబ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరించారు. ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఆదరించి ఒక గొప్ప రికార్డు నిలబెట్టారు. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ పద్ధతులను గురించి ప్రపంచమంతటా చర్చ సాగింది. స్క్రీన్‌ప్లే గురించి అప్పట్లో విమర్శకులు గొప్పగా చెప్పుకున్నారు. బీద మనిషి అడవిలో కొంత దూరం నడుస్తాడు. ఆ తరువాత శవాన్ని చూస్తాడు. నిజానికి ఆ సన్నివేశాన్ని చూస్తుంటే నాకు కొంచెం ఓపిక తగ్గింది. కానీ ఆలోచిస్తే మాత్రం అతని నడకను, మార్గంలో గజిబిజి నీడలను, వాడుకుని దర్శకుడు చూపించిన పద్ధతి చెప్పకుండానే ఎన్నో సంగతులు చెప్పింది అని అర్థమయింది. నిజం చెబుతున్నాను. నేనింకా రషోమాన్ పూర్తిగా చూడలేదు. నాకు చూడాలని అనిపించడం లేదు. కారణం తెలియదు.
కురొసావా ఒకప్పుడు సెవెన్ సమురాయ్ అని ఒక సినిమా తీశాడు. అది చాలా పేరు పొందింది. నాకు మాత్రం కొంచెం గజిబిజిగా అనిపించింది. అతను కథ చెప్పే తీరులోనే గజిబిజి ఉంటుందని నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది. ఈ సినిమా నుండి సూత్రాన్ని అందుకుని షోలే సినిమా తీశారని ఎవరో అన్నప్పుడు, నాకు అవునా అనిపించింది. ఊరి వాళ్లు తమ రక్షణ కోసం మరెవరినో సాయం తెచ్చుకోవడం ఈ సినిమాలో విషయం.
కగేముష అన్న మరో సినిమా కూడా చూశాను. అది నిజానికి థియేటర్‌లో చూశాను. అందులో ఒక యోధుని కథ ఉంటుందని మాత్రం గుర్తుంది. కురోసావా మొత్తం 30 పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆ సినిమాలన్నీ చూడాలన్న కోరిక నాకు ఇప్పుడు కలుగుతున్నది. ఒక గొప్ప దర్శకునికి ప్రపంచమంతా పేరు వచ్చిందంటే అతనిలో తప్పకుండా ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. కురొసావా విషయంలో అది అతని స్క్రీన్‌ప్లే అని నాకు అర్థం అవుతున్నది. కెమెరాలు వాటికి కనిపించిన వాస్తవాలను మన కళ్లకు కట్టి చూపిస్తాయని అనుకుంటాము. కానీ అందులోనూ అనుమానం ఉందని ఈయన సినిమాలు చూసిన తర్వాత అర్థం అవుతుంది. రషోమాన్ అనే చిత్రం ఎప్పుడో నేను పుట్టిన కాలంలో తీసినది. నిజానికి అంతకు ముందే వచ్చింది చిత్రం. అయినా ఆ సినిమా నన్ను పట్టి కుదిపింది.
కురొసావా తాను 83 ఏళ్ల వయసు వాడు అయిన తర్వాత కూడా ఒక చిత్రాన్ని ప్రపంచానికి అందించాడు. అది ఒక ముసలి ప్రొఫెసర్ గురించిన కథ. అతను ప్రతి సంవత్సరం పుట్టిన రోజు పేరున తన విద్యార్థులు అందరిని పోగేసుకుని పెద్ద పార్టీ చేస్తాడు. అంతా కలిసి ఆటగా జరిగే ఆ పార్టీలో సినిమా పేరు వినిపిస్తుంది. మాదదయో అంటే ఇప్పుడే కాదు అని అర్థం. ఆ ప్రొఫెసర్ నేను ఇప్పుడప్పుడే చావపోవడం లేదు అని చెప్పడానికి ఆ మాటలు వాడుతాడు. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పి ఊరుకుంటే చాలదు. మరోసారి ఆ ముచ్చటలు చెప్పుకుందాం. జపనీస్ నవల నుంచి సినిమాలలోకి దూకిన నాకు మధ్యలో మళ్లీ బెంగాలి సినిమాలు, సీరియల్స్ కలిసి మెదడుకు పని చెబుతున్నాయి. ప్రతి విషయము నాకు ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రతి విషయం గురించి నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని ఉంటుంది. అలా నేను పంచుకున్న విషయాలను మీలాంటి మిత్రులంతా ఆదరిస్తున్నారు కూడా. కనుకనే నేను రాస్తున్నాను. మీరు చదువుతున్నారు. వీలైతే రషోమన్ సినిమాను యూ ట్యూబ్‌లోకి వెళ్లి చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు నాతో చర్చించటానికి వీలు కలుగుతుంది. నేను చెప్పిన నాలుగు మాటలు విని ఊరికే ఉండనవసరం లేదు. మీరు సినిమా చూచి ఆనందించాలన్నది నా కోరిక.