S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారసులు

డెబ్బై ఐదేళ్ల లైనెల్ తెలివైన తన పనిని ఎవరికీ తెలీకుండా చేసేవాడు. అతన్ని తక్కువ మంది గమనించేవారు. అది అతను చేసే పనికి ముఖ్యం. ఈ రోజు అతను చేసే పని ఎప్పటి లాంటిదే. ఆ వృద్ధాశ్రమంలోకి వెళ్లాడు. లోపల ఆయనకి నచ్చని డెటాల్ వాసన వేస్తోంది. రిసెప్షనిస్ట్ ఆయన్ని చూసి అడిగింది.
‘ఏం కావాలి?’
లైనెల్ తన చేతికర్ర మీద వాలి నవ్వుతూ చెప్పాడు.
‘నేను నా మిత్రుడు టాడ్‌ని కలవడానికి రూం నంబర్ 404కి వెళ్తున్నాను’
‘అలాగా? సరే’ ఆమె నవ్వుతూ చెప్పింది.
ఓ గది నంబర్, అందులోని మనిషి పేరు, ఒంటి మీది ఖరీదైన సూట్, వృద్ధాప్యం తనని అనుమానించేలా చేయవని ఆయనకి తెలుసు. ఆయన క్లైంట్ ఇచ్చిన గది నంబర్ అది కాదు.
నిద్రపోతున్న టాడ్ గది ముందు ఆగకుండా 400వ నంబర్ గదికి చేరుకున్నాడు. టీవీలో నాటకం వినిపిస్తోంది.
‘మిస్టర్ ప్లింట్’ తలుపు బయట నించి లైనెల్ పిలిచాడు.
గది తలుపు తెరచుకుని లోపలకి వెళ్లాడు. ప్లింట్ నిద్రపోతున్నాడు. ఆ మంచం పైన గోడకి వేలాడే కార్క్ బోర్డ్‌లో ప్లింట్ మనవల గ్రాడ్యుయేషన్ ఫొటోలు, చాలా ఏళ్ల క్రితం తీసుకున్న వెలిసిపోయిన ఆయన ఫొటోలు ఉన్నాయి. ఆయన పక్కనే నిలబడ్డ ముసలావిడ ఆయన భార్య అనుకున్నాడు. ఇంకో ఫొటోలో ఆయనకి అటు, ఇటు నిలబడ్డ యువతీ యువకులు అతని పిల్లలని పోలికలని బట్టి గ్రహించాడు. వాళ్ల పెళ్లిళ్ళ, పుట్టిన రోజు పార్టీల ఫొటోలు కూడా ఉన్నాయి. అంత్యక్రియల సమయంలో ఎవరూ ఫొటోలు తీయరని లైనెల్‌కి వాటిని చూస్తే అనిపించింది. ఎవరూ విషాదాన్న ఫొటోల్లో బంధించాలని అనుకోరు.
లైనెల్ తన చేతికర్ర కింది భాగంలోని రబ్బర్ టిప్‌ని తీస్తే ఓ సిరంజి బయటకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లో తయారైన దాని సూది అతి సన్నగా ఉంది. క్లైంట్ చెప్పిన శరీర భాగాన్ని చూశాడు. క్లింట్ చేతికి రెండు రోజుల క్రితం గ్లూకోజ్ పెట్టిన సూది గుర్తు లీలగా గమనించి లైనెల్ జాగ్రత్తగా అందులోకి సూదిని గుచ్చి ఇంజెక్షన్ చేశాడు.
క్లింట్ తక్షణం కళ్లు తెరచి చూసి ఏదో మాట్లాడటానికి నోరు తెరిచాడు. ఆయన చూపు అలాగే నిలిచిపోయింది. లైనెల్ సూదిని తీసి మళ్లీ చేతికర్రలో ఉంచి రబ్బర్ మూతిని బిగించాడు. ఫొటోల్లోని ఆయన పిల్లల వంక చూసి వారిలో ఎవరు తన తండ్రిని హత్య చేయించారో అనుకున్నాడు. బహుశ చిన్న కొడుకై ఉంటాడు. అతను చిత్రకారుడని ఓ ఫొటోని బట్టి గ్రహించాడు. సున్నితమైన కళాకారుడు తన తండ్రి అల్జిమీర్స్ వ్యాధితో ఎక్కువ కాలం బాధ పడకూడదని ఈ పని చేసి ఉంటాడు. లేదా మిగిలిన ముగ్గురిలోని ఓ చెడ్డ వ్యక్తి తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఆయన్ని చంపించి ఉంటాడు.
వారు ఎవరైనా తండ్రి మీద ప్రేమ లేకపోలేదు. ఆయన హింసాత్మకంగా కాక ప్రశాంతంగా పోవాలనే షరతు పెట్టారు. లైనెల్ చేతి రుమాలతో తలుపు పిడిని శుభ్రంగా తుడిచి తలుపు మూశాడు. ఆయనకి ఆ చేతి రుమాల చూడగానే తన మేనకోడలే గుర్తొస్తుంది. అది ఆమె ఇచ్చిన బహుమతి.
బయటకి వెళ్తూ రిసెప్షనిస్ట్‌తో చెప్పాడు.
‘టాడ్ నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉండటంతో పిలిచినా లేవలేదు.’
* * *
తృప్తి చెందిన తన క్లైంట్స్ ఇతరులకి చెప్పడం ద్వారా లైనెల్‌కి కిరాయి హత్యల పని వస్తూంటుంది. తన ఫోన్‌కి వాయిస్ స్క్రేంబ్లర్ (కంఠ ధ్వనిని మరుగుపరిచే పరికరం) వాడడంతో ఆయన కంఠాన్ని రికార్డు చేసినా గుర్తించలేరు. నగదే తీసుకుంటాడు. ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు. వయసు కూడా. తన వయసుని కూడా వృత్తిపరమైన రహస్యంగా కాపాడుతున్నాడు.
వృద్ధాశ్రమం నించి సరాసరి ఫోర్ట్ లేడర్‌డేల్ బస్ టెర్మినల్‌కి చేరుకున్నాడు. మిగిలిన పదివేల డాలర్లని అక్కడి లాకర్‌లోంచి తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నడవడానికి ఆయనకి కర్ర సహాయం లేదు కాబట్టి దాన్ని కార్లోనే ఉంచాడు. చేతులు కడుక్కుని ఓ బీర్ కేన్‌ని తెరిచి కిటికీలోంచి బయటకి చూస్తూ బీర్‌ని తాగసాగాడు.
హత్య చేసిన ప్రతీ సారి ఆయనకి విచారంగా ఉంటుంది. వెనక్కి వెళ్లి తను చంపిన వాళ్లకి తిరిగి ప్రాణం పోసి బతికించలేడు. కాని ఈసారి చేసిన హత్య తర్వాత అలాంటి విచారం కలగలేదు. కారణం క్లింట్‌ది దయా, కరుణలతో కూడిన హత్యగా భావించడం.
ఫోన్ మోగింది. ఆ ఇంట్లో రెండు లేండ్ లైన్స్ ఉన్నాయి. వాటిలో ఒక వృత్తిపరమైన ఫోన్. వాయిస్ స్క్రేంబ్లర్ అమర్చిన రిసీవర్ని అందుకుని చెప్పాడు.
‘హలో?’
‘నేను గ్రిమ్‌తో మాట్లాడచ్చా?’ ఓ కంఠం అడిగింది.
అది ఆయన వృత్తిపరమైన పేరు.
‘మీరు మాట్లాడేది గ్రిమ్‌తోనే’ చెప్పాడు.
‘నాకో సమస్య ఉంది. మీరు సహాయం చేస్తారని ఆశిస్తాను’
‘నేనూ ఆశిస్తాను. ఎవరు?’
‘నా మేనమామ.. ఆయన చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కాని ఆయన ఆరోగ్యం బాలేదు. ఆయన ఆలోచనా శక్తి, విచక్షణా నశిస్తున్నాయి. ఆయన పిచ్చి ప్రవర్తనని మేం భరించలేక పోతున్నాం.’
‘అర్థమైంది. నా ఫీజ్ ఇరవై వేలు. సగం ముందు, సగం దయాపూర్వకమైన పని పూర్తయ్యాక.’
లైనెల్ ఎన్నడూ తన పనిని హత్య లేదా చంపడం అనడు.
‘ఆయన... బాధ పడడు కదా?’ అవతల నించి సందేహంగా అడిగాడు.
‘లేదు’
‘సరే. థాంక్ యూ. నా బరువు తీరింది’ ఆ వ్యక్తి దీర్ఘంగా నిట్టూర్చడం విన్పించింది.
‘మీ మామయ్య పేరేమిటి?’ తనకి డబ్బు ఎలా అందజేయాలో వివరించాక అడిగాడు.
‘లైనెల్ డూపి’
లైనెల్ కొన్ని క్షణాల నినె్వరపాటు తర్వాత అడిగాడు.
‘ఇంటి అడ్రస్, స్పెల్లింగ్ దయచేసి చెప్తారా?’
* * *
తనని చంపడానికి తనే అంగీకరించాక లైనెల్ రిసీవర్ పెట్టేసి ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి బీర్ కేన్‌ని అందుకున్నాడు. ఈసారి అది రుచిగా అనిపించకపోవడంతో దాన్ని సింక్‌లో పారపోసి స్ట్రాంగ్ కాఫీ కలుపుకున్నాడు. అది తాగుతూ ఆలోచించాడు. తనకి ఇద్దరు మేనల్లుళ్లు, ఓ మేనకోడలు ఉన్నారు. విడాకులు తీసుకున్న స్కాట్ అట్లాంటాలో లాయర్‌గా పని చేస్తున్నాడు. క్రిస్మస్ సమయంలో మాత్రమే తనకి గ్రీటింగ్స్ పంపుతూ రాసే ఉత్తరంలో తను విజయం పొందిన కేసుల గురించి గొప్పలు చెప్తూంటాడు.
ఆర్లెండోలోని ఓ థీమ్ పార్క్‌లో స్ట్రైపీ అనే జీబ్రా పాత్ర దుస్తులు తొడుక్కుని నృత్యాలు చేసే గేరీ నించి క్రిస్మస్‌కి కూడా గ్రీటింగ్ రాదు. షెఫ్‌గా పనిచేసే మేనకోడలు జిల్ ఇటీవలే బ్రాడ్ అనే రెస్ట్‌రెంట్ యజమానిని పెళ్లి చేసుకుని మయామీలో ఉంటోంది. థాంక్స్ గివింగ్‌కి, క్రిస్మస్‌కి ఆ జంట ఆహ్వానిస్తే లైనెల్ ఆనందంగా వెళ్లాడు.
ఈ పని గేరీదై ఉండచ్చు అనుకున్నాడు. కాని ఆ కంఠం గేరీ కంఠంలా అనిపించలేదు. అతను ఏక్టింగ్ స్కూల్లో చదువుకున్నాడు కాబట్టి బహుశ గొంతు మార్చి ఉంటాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది కూడా గేరీనే. జీబ్రా నృత్యాలు ఎక్కువ సంపాదనని తెచ్చిపెట్టవు. క్రితం వేసవిలో తామిద్దరు రేస్ కోర్స్‌కి వెళ్లిన సంగతి గుర్తొచ్చింది. గేరీ గుర్రపు పందాలు కూడా కాస్తూంటాడు.
ఆ ముగ్గురిలో ఎవరు తనని చంపాలని అనుకుంటున్నారో తెలుసుకోవడం తేలిక అనుకున్నాడు.
మర్నాడు బస్ టెర్మినల్‌కి వెళ్లి తనని ప్రేమిస్తున్నారు అనుకునే ఆ ముగ్గురిలో ఎవరు తను చావాలని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు అనుకున్నాడు. లైనెల్‌కి కొంత అనుమానం కూడా కలిగింది. స్కాట్, జిల్, గేరి చిన్నప్పుడు తన ఒళ్లో కూర్చుని తనిచ్చే బహుమతుల్ని తీసుకునేవారు. సలహాలకి తన దగ్గరకే వచ్చేవాళ్లు. తల్లితో పోట్లాడి బయటకి వస్తే తన ఇంటికే వచ్చేవారు.
వాళ్లు తను సౌత్ అమెరికా నించి దుస్తులు, కుండలు దిగుమతి చేసుకునే వ్యాపారి అనుకుంటున్నారు. రెండేళ్ల క్రితం తను విల్లు రాసాక ఎవిరకి ఏ ఆస్థి వెళ్తుందో థాంక్స్ గివింగ్ డే నాడు చెప్పడం పొరపాటైందని లైనల్‌కి ఇప్పుడు అనిపించసాగింది. ఆ ముగ్గురిలో ఎవరికో ఇప్పుడు డబ్బవసరం వచ్చి ఉండచ్చు.
ఆయన కాఫీ తాగుతూ తన సంపద విలువని గుర్తు చేసుకున్నాడు. శక్తివంతులైన వ్యక్తులకి సహాయం చేయడం ద్వారా జీవితకాలం సంపాదించిన ఆ సంపద తన విల్లు ద్వారా చెందే దాకా ఓ వ్యక్తి ఆగలేకపోయాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. తనని చంపాలని అనుకునే బంధువుని ముఖాముఖి కలుసుకుని నిలదీస్తే తనే మిస్టర్ గ్రిమ్ అన్న సంగతి తెలిసిపోతుంది. ఆ వ్యక్తి మిగిలిన ఇద్దరికి కూడా చెప్తాడు. తను కిరాయి హంతకుడని వాళ్లకి తెలీడం లైనెల్‌కి ఇష్టంలేదు. ఆ రహస్యాన్ని వాళ్లు దాచలేరు.
ఆ వ్యక్తిని ముఖాముఖీ కలుసుకోకుండా తను ఇంకా జీవించే ఉంటే ఆ హంతకుడు లేదా హంతకురాలు మిస్టర్ గ్రిమ్‌కి ఏమైంది? అనుకుంటారు. తను లైనెల్‌ని చంపనని చెప్తే ఆ వ్యక్తి మరో హంతకుడ్ని నియమంచచ్చు. సాధారణంగా కిరాయి హంతకులు నలభై లోపు వాళ్లు అయి ఉంటారు తప్ప, తనలా వృద్ధులు కారు.
టీవీ ఆన్ చేసి పాత సినిమాల ఛానల్‌ని పెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలోని ఆ సినిమా మధ్యలో ఉండగా లైనెల్‌కి తన సమస్యకి ఓ పరిష్కారం తట్టింది. అది ఏకైక పరిష్కారం అనుకున్నాడు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు.
* * *
మర్నాడు ఉదయం బస్ టెర్మినల్‌లోని ఓ కేఫ్‌లో కూర్చుని రుచి లేని కాఫీని తాగసాగాడు. తనని చంపాలనుకునే తన బంధువు తనని గుర్తుపట్టకూడదు అనుకున్నాడు. బండద్దాల కళ్లజోడు, తెల్ల గడ్డం, నలిగిన టోపి, షోల్డర్ పేచ్ ధరించడంతో సన్నటి లైనల్ లావుగా కనిపిస్తున్నాడు.
ప్రతీ క్లైంట్‌కి ఇచ్చే సూచనలనే ఈ కొత్త క్లైంట్‌కి కూడా ఇచ్చాడు. లాకర్ నంబర్ 1411 తాళం చెవి గల కవర్ని పబ్లిక్ ఫోన్ బూత్‌లోని ఎడమ నించి మూడో ఫోన్ బూత్‌లో ఫోన్ కింద టేప్‌తో అతికించి ఉంటుంది. దాన్ని తీసుకుని లాకర్ తెరిచి పది వేల డాలర్లని అందులో ఉంచాలి. చంపాల్సిన క్లైంట్ చిరునామా, ఫోన్ నెంబర్, అతనికి గల వ్యాధుల వివరాలు, ఎక్కడ పని చేస్తాడు మొదలైనవి కూడా. లాకర్ తాళం వేసి టిక్కెట్ కౌంటర్‌కి అతి సమీపంలో పబ్లిక్ ఫోన్ కింద దాన్ని మళ్లీ టేప్‌తో అతికించి తక్షణం బస్ టెర్మినల్‌ని వదిలి వెళ్లిపోవాలి. తన క్లైంట్ సౌకర్యార్థం టేప్‌ని కూడా లాకర్లో ఉంచుతాడు. క్లైంట్ టెర్మినల్ లోంచి తక్షణం వెళ్లకపోతే ఆ డబ్బుని తీసుకోవడమే కాక క్లైంట్ కాల్లో గుండు దిగుతుందని వాళ్లని భయపెట్టడానికి చెప్తూంటాడు.
లైనల్ కూర్చున్న చోటు నించి లాకర్ ఫోన్ బూత్‌లు, టెర్మినల్ ప్రవేశ ద్వారం, టిక్కెట్ కౌంటర్లు కనిపిస్తున్నాయి. కాఫీ తాగుతూ వేచి చూడసాగాడు. ఆయన ప్రవేశ ద్వారాన్ని కాని, పబ్లిక్ ఫోన్‌లని కాని చూడకుండా 1411 లాకర్ వైపే చూడసాగాడు. ఎక్కువసేపు వేచి ఉండాల్సిన రావచ్చు కాబట్టి దినపత్రిక బదులు లావుపాటి వార్ అండ్ పీస్‌ని చదవసాగాడు. ఐతే అది గ్రీక్ భాషలో అచ్చయిన పుస్తకం. ఆ అట్ట మీది గ్రీక్ అక్షరాలు చూసిన, కలుపుగోలు స్వభావం గల ఎవరూ తనతో మాట కలిపే ప్రయత్నం చేయరు. ఒకవేళ పలకరించినా ఇంగ్లీష్ రానట్లుగా నటిస్తాడు.
నలభై నిమిషాల తర్వాత ఒకరు 1411 లాకర్ని తెరవడం చూశాడు. ఐతే ఆ వ్యక్తి తన అక్క సంతానంలో ఎవరూ కాదు. ఇరవై రెండేళ్ల అందమైన యువతి. లాకర్లో దళసరి కవర్ని ఉంచి మూసి టిక్కెట్ కౌంటర్ సమీపంలోని ఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేస్తున్నట్లు నటిస్తూ తాళం చెవిని ఫోన్ కింద అతికించడం చూశాడు. పావు నిమిషం తర్వాత రిసీవర్ పెట్టేసి ఆమె తల వెనక్కి తిప్పి, చూసింది. ఆమె దృష్టి ఆయన మీద పడినప్పుడు ఆయన కళ్లు గ్రీక్ పుస్తకాన్ని చదువుతున్నాయి. ఆయన ఇరవై దాకా లెక్కపెట్టి, వేలిని నాలికతో తడి చేసి పేజీ తిప్పుతూ చూశాడు.
ఆమె లేదు. గేట్లోంచి బయటకి వెళ్తూ కనిపించింది. హంతకుడు లేదా హంతకురాలికి ఓ సహాయకురాలు కూడా ఉందన్నమాట. లేచి ఆమెని అనుసరించాడు.
పార్కింగ్ లాట్లో ఆమె వెండి రంగు మెర్సిడిస్ కార్లో ఎక్కడం చూశాడు. లైసెన్స్ ప్లేట్ కనపడకుండా బురద రాసి ఉంది. ఆయన ఆమె చాకచక్యానికి ఆశ్చర్యపోయాడు. వెనక్కి తిరిగి టెర్మినల్లోకి వెళ్లాడు. ఆమె ఆయన సూచనలని తు.చ తప్పకుండా పాటించింది. డబ్బు, ఆయనకి చెందిన సమాచారం గల కాగితం, ఆయన ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఆ పెద్ద కవర్లో ఉన్నాయి. ఆ కవర్ని కోట్ జేబులో ఉంచుకుని ఇంటికి చేరుకున్నాడు. ఒకో నోట్‌ని జాగ్రత్తగా పరిశీలించాడు. వాటి మీద ఎలాంటి గుర్తులు లేవని నిర్ధారణ చేసుకున్నాడు.
‘నాకు ఉన్నది ఒకటే ఛాయిస్. నన్ను నేను చంపుకోవాలి’ లైనెల్ అనుకున్నాడు.
* * *
రెండు రోజుల తర్వాత లైనెల్ తనింట్లోని వంట గదిలో కూర్చుని దోషి కోసం ఎదురు చూడసాగాడు. రెండు గంటల క్రితమే ఆయన స్క్రేంబ్లర్ ఫోన్‌లోంచి ఫోన్ చేసి చెప్పాడు.
‘పనైంది’
‘నిజంగా ఐందా?’ అవతల వ్యక్తి అనుమానంగా అడిగాడు.
‘ఐంది’
‘బాధ పడలేదుగా?’
‘ఆ సంగతి నేనాయన్ని అడగలేదు’ లైనెల్ జవాబు చెప్పాడు.
‘మీరు బాధ కలక్కుండా చంపుతానన్నారు?’
‘సూది గుచ్చుకుంటే అతనికి బాధ కలిగిందా అని నేను అడగలేదు... మిగిలిన డబ్బు?’
‘ఈ రాత్రికే’ అవతల నించి జవాబు చెప్పారు.
‘లాకర్ తాళం చెవి క్రితంసారి లానే అదే ఫోన్ కింద అతికించి ఉంటుంది. మూడో ఫోన్’
‘్థంక్ యూ. నేను, నా కుటుంబం.. కాదు, నేను నీకు థాంక్స్ చెప్తున్నాను. ఇది దయాపూర్వకమైన హత్య’
‘అది అర్థం చేసుకోగలను. మీ మామ లైనెల్ చాలా ముసలివాడు’ రిసీవర్ పెట్టేశాడు.
అతను మిగిలిన సొమ్ము సక్రమంగా చెల్లించడని అనుమానించాడు. లైట్లార్పేసి చేతిలో రివాల్వర్‌తో వేచి చూడసాగాడు.
* * *
ఆయన ఐదు గంటలు ఓపికగా వేచి ఉన్నాడు. ఓ కునుకు తీస్తూండగా తలుపు మీద ఎవరో మృదువుగా కొడుతున్న చప్పుడుకి ఉలిక్కిపడి లేచాడు. కళ్లు తెరిస్తే అంతా చీకటి. మరోసారి అదే చప్పుడు. మరోసారి. తర్వాత గట్టిగా ఓ కంఠం. బహుశ ఇరుగు పొరుగు కోసం, వినిపించింది.
‘అంకుల్ లైనల్. నువ్వు ఓకేనా?’
లైనెల్ జవాబు చెప్పకుండా వేచి ఉన్నాడు. ముగ్గురి దగ్గరా ఆ ఇంటి తాళం చెవులు ఉన్నాయి. మరోసారి తలుపు చప్పుడు వినిపించాక ఎవరో తాళం తెరుస్తున్న శబ్దం. లైనెల్ రివాల్వర్ సేఫ్టీ కేచ్ తీసి సిద్ధంగా ఉన్నాడు. తలుపు తెరచుకోగానే వెలుగు లేక గుమ్మం దగ్గర నీడలా కనిపించాడు. తలుపుని మూయగానే నిశ్శబ్దం. కొన్ని క్షణాల తర్వాత లైట్ వెలిగింది.
బ్రాడ్!
జిల్ భర్త! రెస్ట్‌రెంట్ యజమాని.
లివింగ్ రూంలో దేని కోసమో వెదుకుతున్నట్లుగా అటు, ఇటు చూశాడు. తనకి కావల్సింది కనపడకపోవడంతో పడక గది తెరచి లైట్ వేసి చూసి తర్వాత వంట గది వైపు నడిచాడు.
‘నా శవాన్ని చూసి అరిచే ఉద్దేశం నీకుంటే అది మర్చిపో’ లైనల్ కఠినంగా చూస్తూ చెప్పాడు.
వంట గదిలోని లైనెల్‌ని చూసిన బ్రాడ్ విగ్రహంలా స్తంభించిపోయాడు. క్రమంగా బలహీనమైన చిరునవ్వు అతని మొహంలో అలముకుంది.
‘అంకుల్! చేతిలో ఆ రివాల్వర్‌తో చీకట్లో కూర్చున్నారే?’ అడిగాడు.
‘హంతకుడి కోసం. నేను ఎంత త్వరగా మరణిస్తే నా విల్లు ద్వారా మీ ఆవిడకి వచ్చేది అంత త్వరగా వస్తుంది. అదీ కాక నా హత్య రూఢి అయితే కాని నీ జేబులోని పది వేల డాలర్ల కవర్ని లాకర్లో ఉంచవు కదా?’
‘మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంకుల్’
‘మిస్టర్ గ్రిమ్‌కి అర్థమైంది’
ఆ పేరు వినగానే బ్రాడ్ మరోసారి నివ్వెరపోయాడు.
‘జిల్ బయట కార్లో వేచి ఉందా?’
‘లేదు’
‘చెక్ చేయడానికి జిల్ నిన్ను పంపించిందా?’
‘లేదు. దీంట్లో ఆమెకి భాగం లేదు’
‘మంచిది. నీ చేతులు తల మీద ఉంచు.’
‘సీరియస్‌గానా?’
‘చాలా సీరియస్‌గా’ ఆయన చెప్పాడు.
‘ఎందుకు?’ అతను చేతులు తల మీద ఉంచుకుని అమాయకంగా అడిగాడు.
‘నన్ను చంపడానికి కిరాయి హంతకుడ్ని నియమించడం నేరం అని తెలీదా?’
‘మీరు ఋజువు చూపిస్తే పొరపాటు ఎక్కడ ఉందో తెలుస్తుంది’ అతను ఓ గుటక వేసి చెప్పాడు.
‘నీ ఫోన్ సంభాషణని రికార్డ్ చేసి మిస్టర్ గ్రిమ్ ఇచ్చిన కేసెట్ నా జేబులో ఉంది. ఎఫ్‌బిఐ కంప్యూటర్లలో ఒకటి అది నీ కంఠం అని తేలిగ్గా గుర్తించగలుగుతుంది. బుకాయించి సమయం వృథా చేయక’
‘గ్రిమ్ ఏడి?’
‘పడక గదిలో. మంచానికి అవతల. గుమ్మం లోంచి అతని శవం కనపడదు. నాకో ఇంజెక్షన్ ఇవ్వబోతూంటే నేనా రాక్షసుడ్ని కాల్చి చంపాను’
‘కాల్చారా?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును. ఆత్మరక్షణకి.. ఎందుకు?’
‘మీరు అస్తవ్యస్థంగా ప్రవర్తిస్తూంటే మేమంతా...’
‘ఆగు. మీ అందరికీ కలిపి ఉన్న మేథాశక్తి కంటే నాకు రెట్టింపు ఉంది. ధైర్యం కూడా ఎక్కువే ఉంది. నన్ను ఎందుకు చంపాలనుకున్నావో నిజంగా చెప్పు’
బ్రాడ్ మరోసారి గుటక వేసి చెప్పాడు.
‘రెస్ట్‌రెంట్స్. నేను నడిపే రెస్ట్‌రెంట్స్ నష్టాల్లో పడ్డాయి. అందుకు మళ్లీ పెట్టుబడి అవసరం. లేదా మొత్తం కోల్పోతాం. కొంత పెట్టుబడి లభిస్తే అవి లాభాల బాట పడతాయి.’
తన జీవితం టేబుల్స్, కుర్చీలు గల ఓ గది కోసం ఓ రెస్ట్‌రెంట్ కోసం, అందులో వడ్డించే చెత్త భోజనం కోసం, అక్కడ వందల మంది మాట్లాడుకునే ప్రాముఖ్యత లేని విషయాల కోసం, మురికి ప్లేట్లు, లిప్‌స్టిక్ అంటిన వైన్ గ్లాసుల కోసం అంతమవడమా?
‘బస్ టెర్మినల్లోని నీ అందమైన అసిస్టెంట్ గురించి చెప్పు’
బ్రాడ్ వౌనంగా ఉండిపోయాడు.
‘గ్రిమ్ దగ్గర నాకో డిజిటల్ కెమేరా దొరికింది’
‘ఆమె కేవలం ఓ ఫ్రెండ్’
‘జిల్‌కి ఆమె గురించి తెలుసా?’
‘తెలీదు’
‘కనీసం అనుమానం కూడా లేదా?’
‘లేదు’
‘నిజాయితీగా నువ్వు అంతా వొప్పుకున్నందుకు సంతోషం. నన్ను అప్పడగాలనే ఆలోచన నీకు ఎప్పుడూ కలుగలేదా?’
‘మీరు ఇవ్వనంటారని భయపడ్డాను. ఐయాం సారీ’
‘ఇది మనమే పరిష్కరించాలి బ్రాడ్. నువ్వు జైల్లో ఉన్నా, లేదా దివాలా తీసినా జిల్‌కి బాధ. ఆమె విచారించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీకు సహాయం చేయదలచుకున్నాను.’
బ్రాడ్ కళ్లల్లో రిలీఫ్ కనిపించింది.
‘ఎంతో చెప్పనా?’ ఆశగా అడిగాడు.
లైనెల్ రివాల్వర్‌ని సింక్ పక్కన పెట్టి చెప్పాడు.
‘ఇది ఖాళీది. దయచేసి కార్లోంచి నా చేతి కర్రని తెస్తావా? మనం నడుస్తూ ఈ విషయాలు మాట్లాడుకుని నీ సమస్య పరిష్కారానికి ఎంత అవసరమో చర్చిద్దాం.’
* * *
మర్నాడు పోలీస్ అధికారి లైనెల్‌ని అడిగాడు.
‘అతను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తించాడా?’
‘లేదు. కాని చాలా అప్‌సెట్ ఐనట్లుగా కనిపించాడు.’
లైనెల్ కిటికీ లోంచి కిందకి, ఆ తెల్లారుఝామున బ్రాడ్ శవాన్ని కనుగొన్న ప్రదేశం వంక చూశాడు.
‘మేము వాదించుకున్నాం. అతనికి డబ్బవసరం ఉందని చెప్పాడు. తన రెస్ట్‌రెంట్స్ దివాలా తీస్తున్నాయని, డబ్బు అప్పివ్వమని కోరాడు. నన్ను భాగస్వామిగా కూడా చేర్చుకుంటానని చెప్పాడు. కాని నేను నిరాకరించాను. అతను ఆవేశంతో నా మీద చేతిని ఎత్తకపోతే నా మేనకోడలి కోసం బహుశ సహాయం చేసి ఉండేవాడిని. చెయ్యి దించి కోపంగా వెళ్లిపోయాడు.’
‘ఐ యాం వెరీ సారీ మిస్టర్ లైనెల్’ ఆ అధికారి చెప్పాడు.
అతను ఆత్మహత్య చేసుకున్నాడని నేను నమ్మలేక పోతున్నాను. అతని భార్యకి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పడం దుర్భరమైన బాధ్యత.’
‘మీరు ఆమెకి తగిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తాను’
లైనెల్ విచారంగా నవ్వుతూ, తన చేతికర్ర మీదకి వంగి చెప్పాడు.
‘అవును. నా విల్లు మారుస్తాను. కుటుంబ సభ్యుల పట్ల దయగా ఉండాలి.’ *
(జెఫ్ అబౌట్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి