S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైకుంఠనాథుని వైభోగం

కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండపై... వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు సకల సింగారాలతో సిరసంపదలతో స్వర్ణరథంలో ఊరేగుతుండగా భక్తకోటి సముద్రపు అలలను తలపిస్తూ ముందుకు కదులుతుంటే తిరువీధులు వైభవ శోభితమై పులకిస్తాయి. చీమల్లా పరుచుకున్న మహాజనసముద్రపు వేదికపై బ్రహ్మ దగ్గరుండి ఆ వేంకటేశ్వరుడి ఊరేగింపును నడిపిస్తుంటే ముక్కోటి దేవతలు ఆ బ్రహ్మోత్సవ మురిపాన్ని చూడడానికి మూకుమ్మడిగా తరలివస్తారని భక్తుల ప్రగాడ విశ్వాసం.
తొమ్మిదిరోజులు పాటు స్వామివారు ఒక్కో రోజు రెండు వాహనాలపై ఊరేగుతూ భక్తజనకోటికి దర్శనభాగ్యం కల్పిస్తారు. ప్రతియేడు స్వామివారికి ఒక బ్రహ్మోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే మూడు సంవత్సరాలకు ఒకమారు అధికమాసాన్ని పురస్కరించుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు. అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకమారు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వారికి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా టీటీడీ నిర్వహిస్తోంది. తొమ్మిదిరోజుల్లో ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి సుమారు 8లక్షల మంది భక్తులు దేశవిదేశాల నుండి తరలి వస్తుంటారు. ఒక్క గరుడసేవ రోజున మాత్రమే నాలుగు లక్షల మంది భక్తులు తరలి వస్తారు. ఇక వచ్చే భక్తులకు వసతీ, దర్శన సౌకర్యాలతో పాటు వారి భద్రతకు కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసి పెట్టింది. ఇక ఈ ఉత్సవాలను తిలకించడానికి వచ్చే అవకాశం లేని భక్తుల కన్నులను కూడా కనువిందు చేసేందుకు టీటీడీ తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తిచానల్ ద్వారా వాహనాల సేవలను ప్రత్యక్షప్రసారం చేస్తోంది. ఈ ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల మంది భక్తులు దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదు.
శ్రీవారికి స్వయంగా బ్రహ్మ నిర్వహించే బ్రహ్మోత్సవాలు
వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణానక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు దగ్గరుండి ఉత్సవాలు నిర్వహించారట. అందువలన ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది పొందాయి. చరిత్రలో ఎందరో రాజులు తమ విజయపరంపరకు చిహ్నంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఒక్కోసారి నెలకొకరు చొప్పున ఏటా పనె్నండు బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవి. స్వామి ఊరేగే వాహన సేవల సంఖ్యను బట్టి రోజుల సంఖ్య మారుతూ వచ్చింది. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా బ్రహ్మోత్సవాలు నేటికీ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. టీటీడీ ఏర్పడ్డాక బ్రహ్మోత్సవాలు ఏటా తొమ్మిదిరోజులు పాటు జరుగుతున్నాయి. కాగా ఈ ఏడాది స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 13న ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 21న రాత్రి జరిగే ధ్వజావరోహణంతో ముగిస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10న ప్రారంభమై 18న చక్రస్నానంతో ముగియనున్నాయి. ఈ రెండు బ్రహ్మోత్సవాలు వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం కలియుగ వైకుంఠమై కన్నుల పండుగగా అలరారుతోంది. ఈనెల 13న గురువారం మధ్యాహ్నం 2 నుండి 3.30గంటల మధ్య మకరలగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అదే రోజు రాత్రి 8 నుండి 10గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు పెద్దశేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రెండవ రోజైన 14 శుక్రవారం నాటి ఉదయం స్వామివారు కృష్ణావతారంలో చిన్నశేషవాహనంపైన, రాత్రి సరస్వతీ అవతారంలో హంసవాహనంపైన చతుర్వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. మూడవ రోజైన 15 శనివారం నాటి ఉదయం స్వామివారు యోగ నరసింహ అవతారంలో సింహవాహనంపైన, రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి గజేంద్రమోక్షం దృశ్యాన్ని తలపిస్తూ ముత్యపు పందిరి వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కరుణించారు. ఇక ఈ బ్రహ్మోత్సవాలకు ముందు 11వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయశుద్ది) కార్యక్రమం నిర్వహించారు. 12వతేదీ బుధవారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. స్వామివారిక సేనాధిపతియైన విష్వక్సేనుల వారు పరివార దేవతలతో కలసి బుధవారం రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళ తాళాల మధ్య చేరుకుని నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో లలాట, బాహు, స్తన ప్రదేశాల నుండి పుట్టమన్నును సేకరించి ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. దీనే్న మ్రిత్సవం గ్రహణం అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(కుండలు) శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలైన నవధాన్యాలను పోసి ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభించారు. ఈ కార్యక్రమాకంతా సోముడు(చంద్రుడు) అధిపతి, శుక్లపక్ష చంద్రునిలా పాళికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థించారు. నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం
న భూతో న భవిష్యతి అనేలా నిర్వహఙంచే బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులనూ ఆహ్వానిస్తారు. తస్వామి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరించారు. దీన్ని గరుడజద్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్దం చేశారు. ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మకరలగ్నంలో కొడితాడును కట్టి, పైకి ఎగుర వేశారు. ధ్వజస్థంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలనుకు ఆహ్వానం పత్రం. ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారు.
పెద్దశేషవాహనం
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు.
చిన్నశేషవాహనం
రెండవ రోజు ఉదయం స్వామి వారు ఐదు శిరస్సుల చిన్నశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పెద్దశేషవాహణం ఆదిశేషుడిగానూ, చిన్నశేషవాహణం వాసుకి గానూ భావించవచ్చును.
హంసవాహనం
రెండవ రోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంసవాహణంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పాలు, నీళ్లు వేరే చేసినట్లే గుణాగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా ఈ వాహనం స్వామి అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అల్ఘాంటి హంసపై పరమహసం అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్దమైన మనతోమందిరమని కూడా అర్థం ఉంది. పరమాత్మ వేదోపదేశాన్ని హంసరూపంలోనే చేసినందువల్ల తుచ్చమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి భక్తులకు చాటుతారని ఐతిహ్యం.
సింహవాహనం
మూడవ రోజు ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. జంతువులకు రాజైన సింహ సైతం తానేనని, మనుషులు తమలోని జంతు ప్రవృత్తిని అందుపు చేసుకోవాలని స్వామి చాటుతారు. ముత్యపుపందిరి వాహనం
మూడవ రోజు రాత్రి స్వామికి జరిగే సుకుమారసేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామి చాటి చెబుతారు.
కల్పవృక్ష వాహనం
నాల్గవ రోజున స్వామివారు సర్వాలంకార భూషితుడై కల్పవృక్షవాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతారు. కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలిస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలిచ్చే దేవదేవుడు వేంకటాద్రావాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామి శాశ్వత కైవల్యం ప్రసాదించే కల్పతరువు.
సర్వభూపాల వాహనం
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాలుతూ స్వామి నాల్గవరోజు రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఈ వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది.
మోహినీ అవతారం
అత్యంత ప్రధానమైన ఐదవ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలూ వాహన మండపం నుండి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహనపరిచి, క్షీరసాగర మథనం నుండి వెలువడిన అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహంలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీదుల్లో విహరిస్తాడు.
గరుడవాహనం
ఐదవ రోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతాడు. స్వామి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ్వర సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. వేంకటేశ్వరుడిని అనేక విధాల కొనియాడిన గోదాదేవి శ్రీవల్లిపుత్తూరు నుండి పంపే తులసిమాల, నూతన ఛత్రాలను గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది.
హనుమవాహనం
ఆరవ రోజు జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామి తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను చాటి చెబుతూ
రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్ని తానేనని ఈ వాహనం ద్వారా స్వామి తెలియజేస్తారు.
గజవాహనం
గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడుతానని చాటి చెప్పడానికి స్వామి ఆరవ రోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతారు. గజవాహనారూడుడైన స్వామివాని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
సూర్యప్రభ వాహనం
ఏడవ రోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.
చంద్రప్రభ వాహనం
ఏడవ రోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూమాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారున. సూర్యుడి తీక్షణం, చంద్రుని శీలత్వం రెండు తన అంశలేనని ఈ వాహనాల ద్వారా తెలియజేస్తారు.
రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదవరోపజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం.
అశ్వవాహనం
ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది. అశ్వబలం, కలియుగాతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశ్యం.
చక్రస్నానం
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణంలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయనాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహష్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
ధ్వజావరోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్థంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
వేంకటాద్రి సమంస్థానం
బ్రహ్మాండే నాస్తికించన
వేంకటేశ నమోదేవే
నభూతో నభవిష్యత్..

*

తిరుమల క్షేత్ర విశేషాలు
* తిరుమల ఆలయం దాదాపు 2.2 ఎకరాల విస్తీర్ణంలో, 413 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. గర్భాలయం పొడవు 12.9 అడుగులు, వెడల్పు 12.9అడుగులు.
* శ్రీవారి ఆలయం సముద్రమట్టానికి 2980 అడుగుల ఎత్తులో ఉంది.
* రాచరికాలు అంతమయ్యే వరకు శ్రీవారి ఆలయం భక్తులైన చక్రవర్తులు, పాలకుల ఏలుబడిలో నడిచింది. తరువాత కొంతకాలం పాటు అర్కాటు నవాబు, ఆపైన ఈస్టిండియా కంపెనీల చేతుల్లోకి మారింది. ఆంగ్లేయుల హయాంలో 1933లో టీటీడీ ఏర్పడింది.
* ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు స్వామి సేవలో పాలుపంచుకున్నారు. ముప్పై రెండు వేల సంకీర్తనలతో స్వామిని కీర్తించిన పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు, త్యాగరాజు, అక్బర్‌తో పాటు ఎందరో రాజులు, రాణులు, తెల్లదొరలు, మహంతులు స్వామివారి వైభవాన్ని చాటినవారే.
* దేవాదాయ ధర్మాదాయ చట్టపరిధిలో భారతదేశంలోని 40 ఉప ఆలయాలు కలిగిన పెద్ద ఆలయం టీటీడీ.
* రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన అధ్యక్ష, 14మంది మండలి సభ్యుల టీటీడీ ట్రస్ట్‌బోర్డు నేతృత్వంలో పాలన సాగుతోంది.
* తిరుపతి, తిరుమలలో సుమారు 8వేల వసతీ గదులతో రోజుకు 60వేల మంది యాత్రికులకు టీటీడీ బస కల్పిస్తోంది.
* టీటీడీలో 48విభాగాలు, 11వేల మంది ఉద్యోగులు, 10వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.
* టీటీడీ కరెంటు బిల్లు సంవత్సరానికి 28కోట్ల రూపాయలు
* తిరుమలలో టోపీల వ్యాపారం మహాజోరుగా సాగుతుంది. అనధికార అంచనాల ప్రకారం రోజుకు 10లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
* శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయం ప్రాకారంపై సుమారు 60 శాసనాలు ఉన్నట్లు పురావస్తుశాఖా నిపుణులు గుర్తించారు. ఇందులో 43 తమిళం, 8 తెలుగు, 7కన్నడం, మరో 2 హిందీలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

**
విశిష్టతల సమాహారం బ్రహ్మోత్సవం
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతికి సమానమైన పుణ్యక్షేత్రం కానీ తిరుమలలో వెలసి ఉన్న శ్రీనివాసుని సాటి రాగల దైవం కాని భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో లేడని ప్రతీతి. ఇదే విషయాన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి.
తిరుమల వేంకటేశుని విగ్రహం ఎంత ప్రాచీనమైనదో చెప్పటం అసాధ్యం. శ్రీనివాసుడు స్వయం ప్రభువుగా వెలసినాడని ప్రతీతి. అనందాన్ని అధికం చేసేది ఉత్సవం. ప్రతి బ్రహ్మోత్సవం ఒక యజ్ఞం వంటిది. ఈ యజం సర్వలోక కళ్యాణం కోసం స్వలాభాపేక్ష లేకుండా జరిపేది. ఇందులో మొదటిది అంకురార్పణం. ఆనాడు నిత్య కైంకర్యాలు అయితన తరువాత సాయంవేళలో సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనులవారు గరుడాది దేవతలను అంకురార్పణకు యాగశాల వద్దకు తీసుకువస్తారు. యాగశాల వద్ద నవధాన్యాలు పోసి శాస్త్రోక్త రీతిలో అంకురార్పణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం ప్రారంభానికి ఇదే గుర్తు. మరునాటి నుండి వరుసగా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఉత్సవమూర్తులకు శ్రీయళయప్ప స్వామివారు, ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవిలతో అలంకృతులై ఊరేగింపుగా బయలుదేరుతారు. అనంతరం ఉత్సవమూర్తులు తిరుమల రాయమండపంలో వేంచేసి ఉన్న సమయంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ మిరాశీదారుడు ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆలయంలో ధ్వజస్థంభం వద్ద మంత్రోచ్ఛారణలతో ముక్కోటి దేవతలను, అష్టదిక్పాలకులను ఉత్సవానికి వేంచేయమని ఆహ్వానించి అభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి తొలి వాహనసేవ జరుగుతుంది. పెద్దశేషవాహనంపై స్వామివారు ఉభయ నాంచారులతో పురవీధుల్లో ఊరేగుతారు. ఇదే విధంగా తొమ్మిది రోజుల పాటు శ్రీవారు ఉదయం రాత్రి వేర్వేరు వాహనాలపై ఊరేగుతూ అశేష భక్తజనాలకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల్లో గరుడ, రథోత్సవ సేవలు ముఖ్‌యమైనవి. ఉత్సవాల్లో చివరిరోజున చక్రస్నానంతో తొమ్మిదిరోజులు జరిగే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొలుత చతుర్ముఖుడు బ్రహ్మ జరిపినందువల్లే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉత్సవవాహన సేవలలో ముందుగా బ్రహ్మరథం నడిపిస్తారు. అందులో సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆశీనుడై తొమ్మిదిరోజుల ఉత్సవాలన్నింటినీ విజయవంతంగా జరిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పురాణాలలోనే కాక చారిత్రకంగా శాసనపరంగా క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలోనే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయనటానికి ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం పదవ శతాబ్దంలో పల్లవరాణి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నది. అప్పుడు ప్రారంభమైన తెలుగు పల్లవరాజు విజయగండ గోపాల హేవర్‌తో 1254లోను, 1583వ సంవత్సరంలో అచ్యుతరాయలు పాలనలోను ఒక్కొక్క రాజు పేరుతో బ్రహ్మోత్సవాలు జరుగుతూ వచ్చాయి. కాలక్రమంలో రాజ్యాలు, రాచరికాలు అంతరించినందు వలన రాజుల పేరుతో నిర్వహించే ఉత్సవాలు కూడా అదృశ్యమయ్యాయి. కానీ బ్రహ్మదేవుడు న్విహించిన ఉత్సవాలు నేటికీ బ్రహ్మోత్సవాల పేతో అత్యంత వైభవంగా జరుగుతూనే ఉన్నాయి.
అలంకార ప్రియుని నిలయం ...
దివ్య ఆనందనిలయం
వైష్ణవాలయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నిరంతరాయంగా అభివృద్ది చెందుతూ వైదిక కార్యక్రమాలు, భక్తుల గోవిందనామస్మరణలతో మారుమోగే పవిత్ర ఆలయంగా ప్రసిద్దికెక్కింది తిరుమల శ్రీనివాసుని దివ్య ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు నవరత్న ఖచిత దివ్యాభరణాలతో, పట్టు పీతాంబరాలతో, జవ్వాజి-కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యాలతో కూడిన ఊర్ద్వపుండ్రంతో స్వామివారు ప్రకాశిస్తుంటారు. స్వామివారు చతుర్భుజాలతో, నాగభరణాలతో ఉంటారు. ఊర్ద్వ హస్తాలలో శంఖు, చక్రాలు ధరించబడి ఉంటాయి. అధో హస్తాలలో కుడిహస్తం అభయహస్తంగాను, వామహస్తం కఠిహస్తంగాను ఉంటాయి. ఇక వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ మహిమాన్వితమైన స్వామివారు స్వర్ణరేకుపూతలతో కూడిన దివ్య ఆనందనిలయంలో కొలువుదీరి ఉంటారు. ఈ ఆనంద నిలయం దివ్యవిమానం, రెండు గోపురాలతో, మూడు ప్రాకారాలతో, సప్తద్వారాలతో, నిర్మింపబడి ఉంటుంది. విమానాంతార్థుడైన ఆ భగవంతుని శ్రీమన్నారాయణుడని, వైకుంఠ వాసుడని, ఆపద మొక్కుల వాడని, ఆనాధరక్షకుడని, ఆపద్భాంధవుడుని, వడ్డీకాసులవాడని ఇలా పలు నామాలతో భక్తులు వారి వారి మనోప్రవృతిని బట్టి వెంకన్నను పిలుస్తుంటారు. శ్రీనివాసుని స్థానం వెంకటగిరి. ఇది సాక్షాత్తు వైకుంఠంలో పాలసముద్రంపై గల ఆదిశేషువు అని పురాణాల్లో కీర్తింపబడి ఉంది. ఈ పర్వతానికి వృషభాద్రి,నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి అని అనేక నామాంతరాలు ఉన్నాయి. ఈ ఆగ్నిపై ఉండే వృక్షాలు, జంతువులు, పక్షులు తదితరాలు అన్ని పరమశక్తి సంపన్నులైన రుషులుగా వెంకటాచల మహత్యం అభివర్ణిస్తోంది. వేంకటాద్రి వాసునికి జరిగే పూజాకైంకర్యాలు అన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ఆ ఆగమం శ్రీనివాసుని అర్చించడానికే వైదిక పద్దతిలో ఆవిర్భవించిందన్నది పెద్దల మాట. మాసపూజలు, వారపూజలు, నిత్యపూజలు, నైమిత్తి పూజలు అన్ని కూడా ఈ ఆగమ విధానంతోనే అర్చకులు నిర్వహిస్తుంటారు. ఈ పూజలన్నింటిలోను ఒక ప్రత్యేకతను సంతరించుకునేది బ్రహ్మోత్సవం. వేంకటాచల మహత్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి ప్రస్తావించబడింది. రవి కన్యామాసంలో ప్రవేశించిన తరువాత వచ్చే శ్రవణానక్షత్రం రోజున అవబృదమనే కార్యక్రమాన్ని నిర్ణయించుకుని దానికి తొమ్మిదిరోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తున్నారు.
బ్రహ్మోత్సవం అంటే ఏమిటి?
సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మచే స్వయంగా స్వామివారికి నిర్వహించబడిన ఒక ఉత్సవం బ్రహ్మోత్సవం. సృష్టికి మూలకారకుడైన పరబ్రహ్మయే ఈ మహావిష్ణువు కనుక ఆయనకు జరిగే ఉత్సవాన్ని బ్రహ్మోత్సవమని గొప్పనైన ఉత్సవమని కూడా పిలుస్తారు.
తొమ్మిదిరోజులు ఉత్సవాలెందుకు?
స్వామివారికి తొమ్మిదిరోజులు బ్రహ్మోత్సవాలు జరపడంలో ఒక ప్రత్యేకత ఉంది. 9సంఖ్య పూర్ణసంఖ్య. సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదికి ప్రముఖ స్థానం ఆక్రమించి ఉంది. జ్యోతిష్య శాస్త్ర రీత్యా భూమండలాన్ని పరిపాలించేది నవనాయకుడు. అక్కడ కూడా తొమ్మిదికి ప్రాధాన్యత కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు సృష్టిలో నవబ్రహ్మలుగా ఏర్పడ్డాడట. ఈ నవబ్రహ్మలు శ్రీ శ్రీనివాసుని ఉత్సవంలో రోజుకొకరు భాగస్వాములు అవుతారనేది భక్తుల నమ్మకం. తొమ్మిదిరోజులు జరిగే ఈ ఉత్సవానికి ముందు వైఖానస ఆగమోక్తంగా యజమానునిచే నియమింపబడు ఆచార్యులు అంకురార్పణ చేస్తారు.
అంకురార్పణ అంటే...
అంకురములను అర్పన చేయటం. భూమిపై ఆవిర్భవించిన ధాన్యపు గింజలను తీసుకువచ్చి ఒక చోట ఉంచి ఆనందనిలయ దివ్య విమానానికి నైరుతి భాగంలో ఉండు వసంత మండపం వద్ద ఆచార్యస్వామి, రుత్వికులతో మేళతాళాలు, భాజాభజంత్రీలతో వెళ్లి అక్కడ క్రియాపరిసమాప్తికి గణనాధుని పూజించి, పుణ్యాహవచనం అనే కార్యక్రమంతో ఆ ప్రదేశాన్ని శుద్ది చేసి భూదేవిని ఆహ్వానించి, ధూప,దీప నైవేద్యాది ఉపచారములు అర్పించి, మట్టిని గ్రహించి గ్రామప్రదక్షిణగా ఆలయంలోనికి వెళతారు. అనంతరం స్వామివారి పరివార దేవతలు అయిన అనంత, గరుడ, విశ్వక్సేన దేవతలను పూజించి ఈశాన-వర్ణన్య- జయంత-మహేంద్ర తదితర బహిర్దేవతలను ఇంద్ర, అగ్నియామాది అష్టదిక్పాలకులను, అప్పరసలను ఆహ్వానించి పూజించి వీరికి మధ్యన బ్రహ్మను ఆరాధించి పాలికాదు(కుండలు)ల్లో మట్టిని వేసి అందులో ధాన్యపు గింజలను ఓషదిసూక్తంతో వేసి అభిమంత్రిస్తారు. ఇదే అంకురార్పణ. అంటే చేయబోయే కార్యక్రమానికి శుభసూచకంగా జరుపబడే ఒక వైదిక కార్యక్రమం. ఏ కర్మనైనా ఇదిముందు ఆచరించబడుతుంది. ఆ మొలకల అభివృద్ధిని బట్టి కార్యఫలితం ఉంటుందనేది పెద్దల విశ్వాసం.
తొలిరోజు కార్యక్రమం
ఆలయంలో నిత్యపూజలు అయిన తరువాత ఆచార్యులు అగ్నిని ప్రతిష్టించి అందులో ధ్వజపట వాస్తుశుద్దికై వాస్తుహోమం జరిపి, ధ్వజపటంను ప్రతిష్టిస్తారు. ఆ ధ్వజపటంలోనికి గరుడుడిని ఆహ్వానిస్తారు. ఉభయనాంచారులతో శ్రీమలయప్పస్వామి గ్రామోత్సవానికి కంకణధారణ చేస్తారు. ఆచార్యునికి కంకరణధారణ జరిపి, ఆయా దేవతల ఆహ్వానార్థం వాయిద్య విశేషమైన భేరిని పూజించి ఆచార్యుడు తాడన జరుపుతాడు. దీంతో పారశపుడు అను వాయిద్యవేత్త బ్రహ్మోత్సవ తొమ్మిది దినముల గ్రామోత్సవములో ముందు నడుస్తాడు. ఆ తరువాత ఆలయాంతర్గతులైన ద్వారదేవ-ద్వారపాల-లోకపాల-విమానపాలురను, బ్రహ్మను ఆహ్వానించేందుకు అందరు గ్రామోత్సవానికి బయలుదేరుతారు.
గ్రామోత్సవ దేవతాహ్వానం
ఆచార్యుడు పట్టువస్త్రాలు ధరించి ద్వార పాలురను, ఆలయాంతర్గత దేవతలను వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పబడిన రీతిలో గద్య, పద్య, మంత్ర, తంత్రయుక్తంగా ఆవాహన జరిపి, పుష్పం-తోయం- బలిం-తోయం అనే నాలుగు ఉపచారాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ఆచార్యులు బ్రహ్మస్థానం వద్ద ప్రోక్షణ చేసి ఆయన పర్యవేక్షణలో ఈ ఉత్సవం దిగ్విజయంగా పరిసమాప్తి కావాలని ప్రార్థిస్తూ స్తోత్ర-గద్య-పద్య-మంత్ర తంత్రయుక్తంగా ఆహ్వానించి బలిని చేస్తారు. ఆ తరువాత అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తారు. ఈ బ్రహ్మోత్సవంలో దిగ్దేవతలను ఆహ్వానించడం ఒక ప్రత్యేకత. ఇంద్ర, అగ్ని, యమ, నిరేరుతి, వరుణ, వాయు కుబేర, ఈశాన్య దేవతలు, దిక్పాలురు. దిక్పాలురే ప్రజాజీవనానికి సహకారులు. అందుకే వీరిని ఆలయం నలువైపుల గల నాలుగుమాడవీధుల సందుల్లో మంత్ర, తంత్ర,గద్య, పద్య, స్తోత్ర సంయుక్తంగా ఆహ్వానిస్తారు. వీరు వేంకటాద్రి వాసుని అనుగ్రహంతో ప్రజలకు వారి వారి ఆధిపత్యాన గల శక్తియుక్తులను అందిస్తారు.
ఇంద్రుడు- జీవరాశులను కోరిన కోర్కెలు అందిస్తాడు.
అగ్ని- చరాచర ప్రాణకోటికి తగిన వేడిని ప్రసాదిస్తాడు.
యముడు- జీవులకు ఆయుష్షును అనుగ్రహిస్తాడు.
నిర్రుతి- జీవన సమూహం దైనందిన కార్యక్రమాలు జరుపుకునేందుకు తగినంత శక్తిని ప్రసాదిస్తాడు.
వరుణుడు- నదీనదములకు ఆధిపత్యం వహించి వీటిని అనుగ్రహిస్తాడు. వాయువు- వాయువు లేనిదే జీవరాశులకు జీవనం లేదు. గాలిని అనుగ్రహించడంలో వాయువే కీలకం.
కుబేరుడు - కుబేరుడు ధనం ప్రసాదిస్తాడు.
ఈశాన - లయకారకుడైన ఈశ్వరుడు
వీరందరిని ఆహ్వానించి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయితే
తిరుమల శ్రీవెంకన్నకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ధ్వజా అవరోహణంతో ముగుస్తాయి. ఈ క్రమంలో తిరుమల క్షేత్రంలో నివాసం ఉండే ప్రజలు ఉత్సవాలు ముగిసేంత వరకు వేరొక ప్రదేశానికి తరలివెళ్లకూడదు. ఒక వేళ ప్రయాణం చేసినా ధ్వజా అవరోహణం నాటికి తిరిగి తిరుమలకు చేరుకోవాలని ఆగమ సంగీత ప్రమాణం.
విమాన నిర్మాణ వైశిష్ట్యం
తిరుమల క్షేత్రంలో ‘ ఆనంద నిలయ విమానం’ అనే ప్రసిద్ధమైన పేరును పొంది ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగరు గోపురం ‘త్రితల గోపురం’ (మూడంతస్తుల గోపురం) అని చెప్పబడుచున్నది. క్రింది మొదటి రెండంతస్థులు దీర్ఘచతురస్త్రాకారంగానూ, మూడవది అయిన చివరి అంతస్థు వర్తులాకారంగానూ నిర్మింపబడినది.
నిర్మాణ వర్ణన
వేసరశైలిలో ఏకకలశ శిఖరంలో నిర్మింపబడిన ఈబంగారు గోపురం ఎత్తు కలశంతో సహా 37 అడుగులా 8 అంగుళాలు. ఈ గోపురం కింద నిర్మింపబడిన ప్రాకారం ఎత్తు 27 అడుగులా 4 అంగుళాలు. అనగా భూమితలం నుంచి బంగారు కలశం వరకు కూడా మొత్తం ఆనందనిలయ విమానం ఎత్తు 65 అడుగులా 2 అంగుళాలు. బంగారు శిఖరంలో దీర్ఘచతురస్రాకారపు మొదటి అంతస్థు 10 అడుగులా 6 అంగుళాలు ఎత్తును కలిగి ఉంది. ఈ భాగంగా ఎలాంటి బొమ్మలు లేవు. కేవలం చిన్న చిన్న లతలు, తీగలు, మకరతోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇక గోపురంలోని దీర్ఘచతురస్రాకారపు రెండవ అంతస్థు 10 అడుగులా 9 అంగుళాల ఎత్తును కలిగి ఉండటమే కాకుండా ఇందులో చుట్టూ 40 బొమ్మలు ఏర్పాటుచేయబడినవి. ఈ రెండవ అంతస్థులోనే ఉత్తర దిక్కున పడమటి వారకు (వాయవ్యమూలకు) ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఉత్తరాభిముఖంగా వేంచేసి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈయనే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. ఇక గోపురంలోని చివరి అంతస్థు వర్తులాకారాన్ని కలిగి ఉండి, 16 అడుగులా 3 అంగుళాల ఎత్తులో విరాజిల్లుతోంది. ఈ భాగంలో మహాపద్మంతో పాటు 20 బొమ్మలు ఉన్నాయి. ఈ చివరి వర్తులాకారంలోనే నాలుగు మూలల్లో 8 సింహాల బొమ్మలు ఉన్నాయి. అనగా ఒక్కొక్క మూలలోచిన్న పద్మాన్ని పరివేష్టించిన రెండు సింహాల వంతున నాలుగు మూలల్లో మొత్తం 8 సింహాలున్నాయి. బంగారు కలశానికి ఆనుకొని కింది భాగంలో ఉన్న ‘మహాపద్మ’ చిలకలు, లతలు, హంసలు మున్నగు చిత్రాలతో అత్యంత విలక్షణంగా ఆకర్షణీయంగా విరాజిల్లుతూ ఉంది.
విమాన కైంకర్యాలు
క్రీ.శ 839వ సంవత్సరంలో పల్లవరాజు అయిన విజయదంతి విక్రమవర్మ ఈ ఆనంద నిలయ విమానానికి స్వర్ణకవచం సమర్పించుకొన్నాడు. పిదప క్రీ.శ 1262వ సంవత్సరంలో జాతవర్మ సుందరపాండ్యదేవుడు కూడా స్వర్ణ కవచాన్ని సమర్పించాడు. పిదప క్రీ.శ 1359వ సంవత్సరం జూలై 6వ తేదీన సాళువ మంగిదేవ మహారాజు ఆనందనిలయ విమానంపై ఉన్న పాత కలశాన్ని తీసివేసి కొత్త బంగారు కలశాన్ని ప్రతిష్టించాడు. క్రీ.శ 1417 వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం అమాత్యుడగు చంద్రగిరి మల్లన తిరుమల శ్రీవారి ఆలయంలో ఎన్నో మండప నిర్మాణాలు చేపట్టినాడు. క్రీ.శ 1417 ఆగస్టు 25 నాటికి బంగారువాకిలి ముందున్న మహామణి మండపాన్ని (ఘంటామండపం) నిర్మించాడు. ఈ సందర్భంలో ఆనందనిలయ విమాన జీర్ణోద్ధారణ చేశాడు. అటు తరువాత సాహితీసమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్యాధినేత అయిన శ్రీ కృష్ణ దేవరాయులు, సర్వజగత్సార్వభౌముడైన సప్తగిరీశునకు ఎన్నో సేవలు, ఉత్సవాలు నిర్వహించినాడు. ఎన్నో ఆభరణాలు, బంగారు పాత్రలు సమర్పించుకున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమాల విరాణ్మూర్తితో పాటు ఉత్సవమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్పస్వామికి అనేక నగలు, నాణ్యాలు సమర్పించుకున్నాడు. ఈ విజయనగర చక్రవర్తి క్రీ.శ 1513 నుంచి 1521 వరకు 7 పర్యాయములు తిరుమలక్షేత్రాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర ప్రభువులను అర్చించి, ఆరాధించినాడు.క్రీ.శ 1517 జనవరి 2న ఐదవసారి తిరుమల యాత్రకు వచ్చిన సందర్భంలో ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి అభిముఖంగా తన దేవేరులు తిరుమలదేవి, చిన్నాదేవిలతో కూడి తమ నిలువెత్తు విగ్రహాల్ని నమస్కార భంగిమలో అతి నిరాడంబర భక్తుల వేషంలో ప్రతిష్టించుకున్నాడు. ముఖ్యంగా క్రీ.శ 1518 సెప్టెంబర్ 9వ తేదీ గురువారం బహుధాన్య సంవత్సరం కన్యామాసం (బాధ్రపద) పౌర్ణమినాడు 30వేల బంగారు వరహాలతో ఆనందనిలయ విమానానికి బంగారు మలాము చేయించాడు. ఆ తర్వాత విజయనగరరాజు అయిన వీరనరసింగదేవ యాదవరాయులు తన ఎత్తు బంగారాన్ని తులాభారం వేసుకొని, ఆ బంగారంతో ఆనందనిలయ విమానంతో పాటు వాకిళ్లకు కూడా బంగారు పూతను చేయించాడు. క్రీ.శ 1630లో కంచిక్షేత్ర వాస్తవ్యులైన కోటి కన్యాధానం తాతాచార్యులు అనే వైష్ణ ఆచారాలు ఆనంద నిలయ విమానానికి బంగారు మలాము చేయించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం, మహంతుల పాలనలో ఉన్న సమయంలో అంటే క్రీ.శ 1908 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన అనగా కీలకనామ సంవత్సరం అశ్వయుజ పౌర్ణమినాడు తిరుమలలోని బావాజీమఠం మహంతు అయిన ప్రయాగదాసుకు సోదర శిష్యుడైన అధికారి రామలక్ష్మణదాసు ఆనంద నిలయం విమానంపై బంగారు కలశాన్ని ప్రతిష్టించాడు. పిదప 1958 ఆగస్టు 18 నుంచి 27 వరకు 10రోజులపాటు మహా వైభవంగా ఆనందనిలయ విమాన మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుపబడింది. మళ్లీ శ్రీవారి విగ్రహం (మేడికర్ర విగ్రహం)లోని కళలను యథాతథంగా ఆనందనిలయంలోని శ్రీశారి దివ్యమాల విరాణ్మూర్తికి కళాకర్షణ కార్యక్రమం అత్యంత ఘనంగా సశాస్ర్తియంగా వైఖానసాగమోక్తంగా నిర్వహించబడింది. 1958లోజరిగిన మహా సంప్రోక్షణ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వేలాధిమంది భక్తులు పాల్గొని దర్శించారు.
ఆనంద జనకత్త్వాత్తం ఆనంద నిలయం విధు:
పరపద్మాసనే సుస్థాం విధాయ కమలాలయం
అనగా సాక్షాత్తూ శ్రీ వేంక్వేరుడు పద్మాసనియైన వక్షస్థలమహాలక్ష్మితో వెలసిన ఈ దివ్యస్థలాన్ని దర్శించినంతనే ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక దీనికి ఆనంద నిలయం అని ప్రసిద్ధి కలిగింది.
పూలబావి
అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరంవైపున వెలసి ఉన్న బావి పూలబావిగా ప్రసిద్దిచెందింది. పుష్పాలంకార ప్రియుడైన శ్రీవారి అలంకరణకు ఎన్నోరకాల పూలమాలలు ఉపయోగపడుతున్నాయన్నది విదితమే. స్వామివారికి సమర్పించే తులసి, పుష్పం, పూలమాలలను వేరెవరూ ఉపయోగించకుండా ఈ పవిత్రమైన బావిలో వేస్తారు. అందుకే దీనిని పూలబావి అని పేరువచ్చింది. చారిత్రక ప్రాశస్థ్యం నేపథ్యంలో ఈ బావిని ‘్భ తీర్థం’గా కూడా వ్యవహరిస్తారు. సాక్షాత్తూ భూదేవి తిరుమలలో ఏర్పాటుచేసిన తీర్థం కనుక దీనికి ఆ పేరు సిద్ధించింది. అయితే కాలాంతరంలో ఈ తీర్థం ఇక్కడే నిక్షిప్తమైపోయింది. అనంతరకాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఓ బావిని త్రవ్వగా ఈ భూతీర్థం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ స్వామివారి పూజకై సంపంగి, చామంతి తోటలను పెంచాడు. తరువాతి కాలంలో రంగదాసే తొండమాన్ చక్రవర్తిగా పునః జన్మించాడని చరిత్ర చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి గత జన్మలో రంగదాసు నిర్మించిన శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించగా తొండమానుడు ఈ బావిని రాతితో కట్టి అవసరమైనపుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళుతుండేవాడు. వరాహపురాణాంతర్గత వేంకటాచల మహత్యం అనుసారం ఒకప్పుడు శత్రువులతో యుద్ధంలో తరమబడిన తొండమానుడు ఈ రహస్యబిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడు. ఈ సమయాన తన ఉభయ దేవేరులతో ఏకాంతంలో స్వామివారు ఉన్నారు. అయితే తటాలున వచ్చిన తొండమానుని చూసి శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనూ, భూదేవి అమ్మవారు సిగ్గుతో బావిలో దాక్కున్నారని తెలుస్తుంది. శ్రీ వేంకటాచల ఇతిహాసమాల ప్రకారం భగద్రామానుజులవారు తిరుమలకు వేంచేసినపుడు భూదేవి బావిలో దాక్కున్నదన్న పురాణ నేపథ్యంలో ఈ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి తీర్థ్ధాపతిగా స్వామివారికి అరచనాది నివేదనలు జరుగుతున్నాయని అంతేగాక స్వామివారికి అలంకరించబడి తొలగించబడిన నిర్మల్యాన్ని (పూమాలలు, తులసిమాలలు వగైరా) భూదేవి కోసమే ఈ బావిలో వేస్తున్నారని తెలియజెప్తున్నది.
శంఖనిధి- పద్మనిధి
మహాద్వారానికి ఇరుప్రక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలే సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తున్నాయి. కదా ! వీరే శ్రీ వేంకటేశ్వర స్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత, రెండు చేతుల్లోనూ రెండు శంఖాలు ధరించి ఉండటం గమనించండి! ఈయన పేరు ‘శంఖనిధి’ ఇలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరింపబడి ఉన్నాయి. ఈయన పేరు ‘పద్మనిధి’. ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణంగల రాతి విగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండటం గమనించండి. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలిది. బహుశా అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చు. ఆగమశాస్త్రం ప్రకారం సాదారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకారం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటుచెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతున్నది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం. రెండవది విమాన ప్రదక్షిణం. మూడవది సంపంగి ప్రదక్షిణం. మహద్వార దేవతలైన శ్రీ శంఖనిధి, పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరిద్దాం.
జయ విజయులు
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని తిరమమహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంఖుచక్ర గధాధారులై ద్వారపాలకులగు జయవిజయులు నిలచి ఉండి స్వామివారిని సదా సేవిస్తుంటారు. సుమారు 10 అడుగుల ఎత్తుగల ఈ పంచలోహ విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ద్భాక్తులతో వ్యవహరించండని సూచిస్తున్నట్లుగా జయుడు కుడిచేతి చూపుడువేలును విజయుడు ఎడమచేతి చూపుడువేలును చూపిస్తూ ఉంటాడు. రెప్పపాటు కాలం ఏమరుపాటు చెందకుండా స్వామి భక్తిపరాయణులగు జయవిజయులు స్వామివారి సన్నిధికి వేయికళ్ల కావలికాస్తుంటారు. తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తూ శ్రీ మహావైకుంఠాన్ని తలపించేరీతిలో వీరు బంగారువాకిట కావలి కాస్తారు. *

-రామాపురం రాజేంద్ర