S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 96 మీరే డిటెక్టివ్

‘నిన్న మనం అయోధ్య కాండ 93వ సర్గ చెప్పుకున్నాం. ఇవాళ 94వ సర్గ చెప్తాను. వినండి’ హరిదాసు ఆ రోజు హరికథని ప్రారంభిస్తూ చెప్పాడు.
భరతుడు చెప్పడం ఇలా కొనసాగించాడు.
‘డెక్కల చేత ఎగరకొట్టబడ్డ పుప్పొడి అడవిని కప్పేస్తూంటే, గాలి నాకు ప్రియం చేయాలని అనుకుంటోందా అన్నట్లుగా పుప్పొడిని వేగంగా, దూరంగా ఎగర కొడుతోంది. ఓ శతృఘ్నా! శ్రేష్టులైన సారధులు ఎక్కిన ఈ రధాలని గుర్రాలు అడవిలో వేగంగా లాగుతున్నాయి. చూట్టానికి అందంగా ఉన్న ఈ నెమళ్లు, పక్షులు భయపడి తమ తమ నివాసాలకి వెళ్లడం చూడు. ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తోంది. స్వర్గమార్గంలా ఉన్న ఇది తప్పకుండా ఋషుల నివాస స్థలమే. ఈ అడవిలో కుందేళ్లు, నెమళ్లు, ఒంటి మీద చుక్కలు ఉన్న లేళ్లు ఆడ లేళ్లతో కలిసి పూలతో చిత్రించబడ్డాయా అనిపించేలా మనోహరమైన రూపాలతో విహరిస్తున్నాయి. సైనికులంతా అడవిలోకి ప్రవేశించి పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు కనపడే దాకా వెదకాలి’
భరతుడి మాటలు విన్న శూరులైన మగవాళ్లు ఆయుధాలు ధరించి ఆ అరణ్యంలోకి ప్రవేశించారు. వారికి ఓ చోట అగ్ని కనపడింది. వాళ్లు భరతుడి దగ్గరికి వచ్చి చెప్పారు.
‘మనుషుల్లేని చోట అగ్ని ఉండదు. రామలక్ష్మణులు తప్పకుండా ఇక్కడే ఉండి ఉంటారు. లేదా ఇక్కడ శతృసంహారకులు, నరశ్రేష్ఠులైన ఆ రాజకుమారులు లేకపోతే రాముడితో సమానులైన మునులు ఎవరైనా ఉండచ్చు. ఇది స్పష్టం’
శతృసైన్యాలని సంహరించే భరతుడు పెద్దలకి ఇష్టమైన వారి మాటలని విని వారితో చెప్పాడు.
‘మీరంతా ఇక్కడే సిద్ధంగా ఉండండి. ముందుకి వెళ్లద్దు. నేను, శతృఘు్నడు, సుమంత్రుడు, వశిష్ఠుడు వెళ్తాం’
వారంతా భరతుడి ఆజ్ఞ ప్రకారం అక్కడే ఆగిపోయారు. భరతుడు పొగ కొస కనిపించే వైపు చూశాడు. ఆ విధంగా భరతుడు నిలిపేసిన సైన్యం, తన ఎదుటి ప్రదేశాలని చూస్తూ తను ప్రేమించే రాముడి దర్శనం త్వరలోనే కలగబోతోందని తెలుసుకుని చాలా సంతోషించాడు. (అయోధ్య కాండ 93వ సర్గ, 15వ శ్లోకం నించి)
దేవతలతో సమానుడైన, కొండల మీద, అడవుల మీద ప్రీతి గల రాముడు ఆ పర్వతం పైన చిరకాలం నించి నివసిస్తూ సీతకి ఇష్టమైన, ఆమెని ఆనందింప చేసే చిత్రమైన ఆ చిత్రకూట పర్వతాన్ని దేవేంద్రుడు స్వాహా దేవికి చూపించినట్లు చూపించాడు.
‘మంగళప్రదురాలైన ఓ సీతా! ఈ అందమైన పర్వతాన్ని చూస్తూంటే రాజ్యం కోల్పోవడం కాని, స్నేహితులు దూరమవడం గాని నన్ను బాధించడం లేదు. ఇది అనేక రకాల పక్షులతో నిండి ఉంది. అనేక మూలికలు, ధాతువులు గల దీని శిఖరాలు ఆకాశాన్ని పొడుస్తున్నట్లుగా ఉన్నాయి చూడు. అనేక ధాతువులతో అలంకరించబడ్డ ఈ పర్వత ప్రదేశంలో కొన్ని వెండిలా, కొన్ని రక్తంలా, కొన్ని పచ్చని మంజిష్టల్లా, కొన్ని ఇంద్రనీల మాణిక్యాల్లా, కొన్ని పుష్యరాగాల్లా, కొన్ని స్ఫటికాల్లా, కొన్ని మొగలి పొలలా, కొన్ని నక్షత్రాల్లా, కొన్ని పాదరసంలా మెరిసిపోతున్నాయి. ఈ చిత్రకూట పర్వతం మీద అనేక విధాలైన మృగాలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు క్రూరత్వాన్ని వదిలి నివసిస్తున్నాయి. ఎన్నో పక్షి సమూహాలు కూడా దీని మీద ఉన్నాయి. పూలతో, పళ్లతో నిండిన, అధికమైన నీడని ఇచ్చే మామిడి, నేరేడు, వేగిస, లొద్దుగు, మోరటి, పనస, చండ్ర, ఊడుగు, తినిసం, మారేడు, తుమ్మికి చెట్లు, వెదుళ్లు, గుమ్ముడు, వేప, ఉలిమిరి, ఇప్ప, బొట్టుగు, రేగి, ఉసిరి, పేము, ఏరు మద్ది, దానిమ్మ చెట్లు, ఇంకా అలాంటి అనేకమైన చెట్లు ఈ పర్వతం మీద అంతటా వ్యాపించి ఉన్నాయి. వీటితో ఈ పర్వతం చాలా అందంగా ఉండి చూసేవారికి రోమాంచం కలిగిస్తోంది. ఉత్తమమైన మనసు కలవారైన ఈ కినె్నరులు పర్వత చరియల మీద జంటలుగా విహరిస్తున్నారు చూడు. విద్యాధరులు, వారి స్ర్తిలు విహరించే మనోహర ప్రదేశాలని, చెట్ల కొమ్మలకి తగిలించిన వారి కత్తులని, శ్రేష్ఠమైన వారి దుస్తులని చూడు. ఈ పర్వతం మీద కొన్ని చోట్ల నీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల భూమిని ఛేదించుకుని నీరు పైకి వస్తోంది. అందువల్ల ఈ పర్వతం మదోదకం స్రవిస్తున్న ఏనుగులా కళకళలాడుతోంది. గుహల్లోని గాలి అనేక రకాల పూల వాసనలతో ముక్కుకి తృప్తి కలిగేలా వీస్తోంది. దీనివల్ల ఆనందం కలగని వారెవరైనా ఉంటారా? ఎవరూ నిందించని ఓ సీతా! నీతోను, లక్ష్మణుడితోను కలిసి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నివసించినా నాకు బాధ కలగదు. అనేక పూలు, పళ్లు, వివిధ రకాల పక్షులు, విచిత్రమైన శిఖరాలు గల రమ్యమైన ఈ పర్వతం మీద నాకు చాలా ఇష్టం కలుగుతోంది. ఈ వనవాసం చేయడం వల్ల తండ్రి రుణం తీర్చడం, భరతుడికి సంతోషం కలిగించడం అనే రెండు ఫలాలు నాకు దొరికాయి. సీతా! నాతో కలిసి నివసించే నువ్వు మనసుకి, మాటకి, శరీరానికి అనుకూలమైన అనేక వస్తువులని చూస్తూ ఈ చిత్రకూట పర్వతం మీద ఆనందంగా ఉండగలుగుతున్నావా? రాజుకి మరణానంతరం ఉత్తమ జన్మ లభించడానికి ఈ వనవాసమే అమృతం వంటిదని నా ముత్తాతలైన ప్రాచీన రాజర్షులు చెప్పారు. ఓ సీతా! నేను నీతోను, లక్ష్మణుడితోను కలిసి ఇక్కడ విహరిస్తూ ఉత్తమమైన నియమాలతో సత్పురుషుల మార్గంలో సంచరిస్తూ కులాన్ని, ధర్మాలని వృద్ధి పొందిస్తూ ఆనందాన్ని పొందగలను.

(అయోధ్య కాండ 94వ సర్గ)

ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓ సారి రామాయణంలోని తను చెప్పిన కాండలని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో 5 తప్పులు చెప్పాను. క్షంతవ్యుణ్ణి. అవి చెప్తాను వినండి.’

మీరా తప్పులని కనుక్కోగలరా?
*
1.భరద్వాజుడు అగ్నిహోత్రం చేశాడు కాని సంధ్యావందనం కాదు. హరిదాసు ఇది తప్పుగా చెప్పాడు.
2.భరద్వాజాశ్రమం నించి రాముడి దగ్గరికి మూడున్నర యోజనాల దూరమే. హరిదాసు తప్పుగా ముప్పై మూడున్నర యోజనాలని చెప్పాడు.
3.భరతుడ్ని భరద్వాజుడు అతని తల్లుల్లో ఎవరు ఎవరో చెప్పమని అడిగాకే భరతుడు ఆ వివరాలు చెప్పాడు. భరద్వాజుడు ప్రశ్నించాడని హరిదాసు చెప్పలేదు.
4.చిత్రకూట పర్వతానికి ఉత్తర భాగంలో మందాకినీ నది ఉంది. హరిదాసు తప్పుగా పశ్చిమంలో ఉందని చెప్పాడు.
5.వనం మధ్యలో పూలు రాలిన ‘కర్ణికార’ చెట్టు కొమ్మలా కాంతిహీనమై కౌసల్య ఎడమ వైపున్నది సుమిత్ర అని భరతుడు చెప్పాడు. హరిదాసు కర్ణికార చెట్టు పేరుని చెప్పడం విస్మరించాడు.
6.రాముడు అడవికి వెళ్లడం వల్ల దేవతలకి, దానవులకి, పరిశుద్ధ మనసు గల ఋషులకి మంచే కలగబోతోంది అని భరద్వాజుడు భరతుడితో చెప్పాడు. దానవులకి అన్నది హరిదాసు చెప్పలేదు.
7.భరద్వాజాశ్రమం నించి భరతుడు పల్లకీ ఎక్కి వెళ్లాడు. కాని హరిదాసు తప్పుగా రథం ఎక్కి వెళ్లాడని చెప్పాడు.
*
మీకో ప్రశ్న
కినె్నరలు ఏ రూపంలో ఉంటారు?

*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
చిత్రకూటం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
*
-మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉంది.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి