S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..93 మీరే డిటెక్టివ్

ధర్మవేతె్తైన భరతుడు భరద్వాజుడి ఆశ్రమాన్ని కోసు దూరం నించే చూసి, సైన్యాన్ని అక్కడే నిలిపి, ఆయుధాలని, పరివారాన్ని విడిచి, వశిష్టుడు ముందు నడవగా మంత్రులతో కలిసి కాలినడకన అక్కడికి నడిచాడు. చాలా దూరంలో భరద్వాజుడు కనపడగానే మంత్రులను ఉండమని భరతుడు వశిష్ఠుడి వెనక తనొక్కడే నడిచాడు. వశిష్టుడిని చూడగానే మహాతపశ్శాలైన భరద్వాజుడు అర్ఘ్యం తీసుకురమ్మని శిష్యులకి చెప్పి, ఆసనం మీంచి లేచాడు. మహాతేజశ్శాలైన భరతుడు వశిష్ఠుడితో కలిసి ఆయనకి నమస్కరించాడు. అతను దశరథుడి కొడుకని భరద్వాజుడికి వశిష్ఠుడు చెప్పాడు. ధర్మాలు తెలిసిన ఆయన ఆ ఇద్దరికీ క్రమానుసారంగా అర్ఘ్యం, పాద్యం, పళ్లని ఇచ్చి ప్రశ్నించాడు.
‘మీ కులంలోని అంతా క్షేమంగా ఉన్నారా? మీ తండ్రి దశరథుడు క్షేమమా? అయోధ్యా నగరం, సైన్యం, ధనాగారం, మీ మిత్రులు, మంత్రులు అంతా కుశలమా?’
‘నీ ఒంటి, అగ్నులకి, వృక్షాలకి, శిష్యులకి, మృగ పక్షులకి ఎలాంటి బాధలూ లేవు కదా?’ వశిష్ఠుడు, భరతుడు ఆయన్ని అడిగారు.
భరద్వాజుడు ‘ఇక్కడ మేం అన్ని విధాలా క్షేమంగా ఉన్నాం’ అని చెప్పి, రాముడి మీద అభిమానంతో భరతుడ్ని అడిగాడు.
‘రాజ్యాన్ని పాలించాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ విషయమంతా పూర్తిగా చెప్పు. నా మనసులో అనుమానం కలిగింది. శత్రుసంహారకుడు, ఆనందాన్ని పెంచేవాడు, కౌసల్య కొడుకైన రాముడ్ని అతని తండ్రి పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో నివసించమని ఆజ్ఞాపిస్తే రాముడు భార్యా సోదరులతో అరణ్యానికి వెళ్లిపోయాడు. అలాంటి పాపం లేని రాముడు విషయంలో, అతని తమ్ముడి విషయంలో ఎలాంటి ఆటంకాలు లేని రాజ్యాన్ని అనుభవించాలనే కోరికతో పాపపు పని చేయటానికి నువ్వు ప్రయత్నించడం లేదు కదా?’
భరతుడు దుఃఖంతో, కన్నీళ్లతో తడబడే మాటలతో చెప్పాడు.
‘పూజ్యుడివైన నువ్వు కూడా నా గురించి ఇలా భావించినట్లైతే నన్ను చంపేసినట్లే. నా వల్ల ఏ దోషమూ లేదు. నా గురించి నువ్వు ఇలా మాట్లాడకూడదు. నేను లేని సమయంలో నా తల్లి చెప్పిన మాటలన్నీ నాకు ఇష్టం కాదు. వాటికి నేను సంతోషించలేను. ఒప్పుకోను. నేను ఇప్పుడు పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడి పాదాలకి నమస్కరించడానికి, అతన్ని అనుగ్రహింప చేసుకుని మళ్లీ అయోధ్యకి తీసుకువెళ్లడానికి వచ్చాను. ఓ మహామునీ! నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానని తెలుసు కాబట్టి నన్ను అనుగ్రహించు. మహారాజైన రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పు.’
వశిష్ఠుడు మొదలైన ఋత్విక్కులు కూడా ప్రార్థించాక భరద్వాజుడు ప్రసన్నుడై భరతుడితో చెప్పాడు.
‘పురుషోత్తముడైన ఓ భరతా! గురువుల విషయంలో సత్‌ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, సాధువులని అనుసరించి ఉండటం అనేవి రఘువంశంలో పుట్టిన నీకు తగిన గుణాలు. నీ మనసులోని భావం నాకు తెలుసు. ఐనా దాన్ని నిర్ధారించుకోవడానికి, నీకు కీర్తిని పెంచడానికి నిన్నిలా ప్రశ్నించాను. ధర్మం పాటించే రాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. నీ అన్న రాముడు చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్నాడు. నువ్వు రేపు అక్కడికి వెళ్లచ్చు. మంత్రులతో కలిసి ఈ రోజు ఇక్కడే ఉండు. బుద్ధిమంతుడవైన నువ్వు నా ఈ కోరికని తీర్చు.’
బుద్ధిమంతుడైన భరతుడు అందుకు ఒప్పుకుని ఆ రాత్రి ఆశ్రమంలో ఉండటానికి నిశ్చయించుకున్నాడు. (అయోధ్యకాండ 90వ సర్గ)
ఆశ్రమంలో నివసించడానికి ఒప్పుకున్న భరతుడితో భరద్వాజుడు చెప్పాడు.
‘నా ఆతిథ్యాన్ని స్వీకరించు.’
‘నువ్వు నాకు పాద్యం, అర్ఘ్యం, అడవిలో లభించేవి ఇచ్చేవు కదా?’
‘నువ్వు సంతృప్తి కలవాడివని తెలుసు. నీకు ఏం ఇచ్చినా దాంతో తృప్తిపడతావు. నీ సేనకి భోజనం ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాను. ఏ విధంగా చేస్తే నీకు ఆనందం కలుగుతుందో అలా చేసి సత్కరించడానికి నువ్వు తగినవాడివి. నీ సైన్యాన్ని దూరంగా ఉంచి వచ్చావేమిటి? సైన్యంతో కలిసి ఎందుకు రాలేదు?’ భరద్వాజుడు చిన్నగా నవ్వి అడిగాడు.
భరతుడు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు.
‘ఓ పూజ్యుడా! నేను నీకు భయపడి నా సేనని ఇక్కడికి తీసుకురాలేదు. రాజు కాని, రాజపుత్రులు కాని సదా దేశంలో ప్రయత్నపూర్వకంగా మునులకి దూరంగా సంచరించాలి. ఉత్తమమైన గుర్రాలు, మనుషులు, మదించిన ఏనుగులు విశాలమైన భూమిని ఆక్రమిస్తూ నా వెనక వస్తున్నాయి. ఆ సైన్యం నీ ఆశ్రమంలోని చెట్లని, నీటిని, భూమిని, పర్ణశాలని పాడు చేస్తుందనే భయంతో నేను ఒక్కడ్నే వచ్చాను.’
మహర్షి ఆజ్ఞతో భరతుడు సైన్యాన్ని రప్పించాడు. తర్వాత భరద్వాజుడు అగ్నిగృహంలోకి వెళ్లి ఆచమనం చేసి, నీళ్లతో అవయవాలని తుడుచుకున్నాడు. ఆతిథ్యం ఏర్పాటు చేయమని భరద్వాజుడు అనేక మందిని ఆజ్ఞాపించాడు.
‘ఆతిథ్యం కోసం ఇల్లు మొదలైనవి నిర్మించడానికి అగ్నిని ఆజ్ఞాపిస్తున్నాను. అతను వచ్చి తగిన ఏర్పాట్లు చేయుగాక! దేవేంద్రుడు మొదలైన లోకపాలకులు నలుగురినీ ఆహ్వానిస్తున్నాను. కాబట్టి వాళ్లు వచ్చి తగిన ఏర్పాట్లు చేయుదురుగాక! భూమి మీద, ఆకాశంలో, తూర్పున, పడమరలో ప్రవహించే నదులన్నీ కలిసి ఇప్పుడు నాలుగు వైపుల నించీ వచ్చుగాక! కొన్ని నదులు మైరేయం అనే మద్యాన్ని, కొన్ని నదులు బాగా తయారుచేయబడ్డ కల్లుని, మరి కొన్ని నదులు చెరకు రసంలా మధురమైన చల్లటి నీటిని స్రవించుగాక! దేవగంధర్వులైన విశ్వావసు, హాహా హూహూలని, ఇంకా దేవజాతికి, గంధర్వ జాతికి చెందిన అప్సరసలని నాలుగు వైపుల నించీ ఆహ్వానిస్తున్నాను. ఘృతాచి, విశ్వాచి, మిత్రకేశిని, అలంబుస, నాగదంత, హేమ, రంభ అనే అప్సరస స్ర్తిలని పర్వతాల మీద ఉండే హిమ అనే అప్సరసని ఆహ్వానిస్తున్నాను. దేవేంద్రుడిని, బ్రహ్మని సేవించే స్ర్తిలని, ఆహ్వానిస్తున్నాను. వాళ్లు తమతమ పరికరాలని తీసుకురావాలి. ఎల్లప్పుడూ బట్టలు, ఆభరణాలు అనే ఆకులతోను, ఉత్తమ స్ర్తిలు అనే ఫలాలతోనూ విరాజిల్లే ఉత్తర కురుదేశంలోని కుబేరుడి దివ్యవనం ఇక్కడికి వచ్చుగాక! భగవంతుడైన చంద్రుడు నా కోసం ఇక్కడ ఉత్తమమైన అన్నం, అనేకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు చేయుగాక! చంద్రుడు అప్పుడే చెట్ల నించి రాలి తాజాగా ఉన్న వివిధ పూలమాలలని, సుర లాంటి ద్రవాలని, అనేక విధాలైన మాంసాలని ఇచ్చుగాక!’
సాటిలేని తేజస్సు, తపస్సు గల భరద్వాజుడు ఏకాగ్ర మనసుతో శిక్షణతో చెప్పిన స్వరాలని పాటిస్తూ చెప్పాడు.
భరద్వాజుడు తూర్పు వైపు తిరిగి చేతులు జోడించి నమస్కరిస్తూ మనసులో ఇలా ధ్యానం చేస్తూండగానే ఆ దేవతలంతా ఒక్కొక్కరుగా అక్కడికి వచ్చారు. మలయా, దద్దుర పర్వతాలనించి వచ్చే గాలి శరీరాలకి చల్లగా తాకి హాయిని కలిగిస్తూ, చెమటలని తొలగించసాగింది. దివ్యమైన మేఘాలు వచ్చి పూల వర్షాన్ని కురిపించాయి. దివ్యమైన దుందుభుల ధ్వని అన్ని దిక్కులా వినిపించింది. అప్పుడు సుఖకరమైన గాలులు వీస్తూండగా అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు, గంధర్వులు గానం చేస్తూండగా వీణాధ్వనులు అంతటా వ్యాపించాయి. లయతో కూడుకుని మృదువుగా, సమంగా ఉన్న ఆ శబ్దాన్ని భూమ్యాకాశాల్లోని ప్రాణులన్నీ విన్నాయి. మనుషుల చెవులకి సుఖకరమైన ఆ దివ్యధ్వని ఆగాక భరతుడి సైన్యం విశ్వకర్మ చేసిన నిర్మాణాన్ని చూసింది. (అయోధ్యకాండ 91వ సర్గ - 28వ శ్లోకం దాకా)
ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధురాలు వణుకుతూ లేచి హరిదాసుతో చెప్పింది.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు హనుమంతుడే ఆ కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఆరు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి’
ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
*
1.రాముడు పడుకుంది ఇంగుదీ వృక్షం కింద. కేవలం వృక్షమనే హరిదాసు చెప్పాడు.
2.అలాంటి రాముడే నేల మీద పడుకోవాల్సి వచ్చిందంటే, ఏ దేవతైనా కాలం కంటే కొంచెం కూడా అధికమైన బలం కలది కాదని తెలుస్తోంది -అన్న భరతుడి కర్మసిద్ధాంత మాటలని హరిదాసు చెప్పలేదు.
3.పక్క మీద అక్కడక్కడా బంగారు పొడులు అంటుకుని ఉన్నాయి కాబట్టి సీత అలంకారాలతోనే పడుకుందని అనిపిస్తోంది - అని భరతుడు చెప్పిన మాటలని కూడా హరిదాసు చెప్పలేదు.
4.సీత పడుకున్న పక్క మీది ఆమె చెవి నించి రాలిన ఓ దిద్దుని భరతుడు చూశాడు అని హరిదాసు చెప్పడం తప్పు. వాల్మీకి దీన్ని రాయలేదు.
5.మర్నాడు ఉదయమే లేచిన సుమంత్రుడు శతృఘు్నడితో బోయరాజుని తీసుకుని రమ్మని చెప్పాడు అని హరిదాసు తప్పుగా చెప్పాడు. నిజానికి ఆ మాటలని భరతుడు శతృఘు్నడితో చెప్పాడు.
6.నావల్లోని కొన్ని స్ర్తిలకి ప్రత్యేకించబడ్డాయి. ఇది హరిదాసు చెప్పలేదు.
7.గంగానదిని కొందరు కుండల సహాయంతో తేలుతూ దాటారు. మరి కొందరు చేతులతో ఈదుతూ దాటారు. ఇది హరిదాసు చెప్పలేదు.
*
మీకో ప్రశ్న:
========
మలయ పర్వతాలు ప్రస్తుతం
ఎక్కడున్నాయని భావిస్తున్నారు?
*

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
====================
సీత తల్లి పేరేమిటి?.. సునయన

-మల్లాది వెంకట కృష్ణమూర్తి