S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనగనగా...

మా అమ్మకి ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లకి అన్నదమ్ములు లేరు. అందుకని మా అమ్మ వాళ్ల తండ్రి మా తాత మాతోనే ఉండేవాడు. ఆయన వ్యవసాయదారుడు. అందుకని మా ఇంట్లో కూడా వ్యవసాయపు పనులు అజమాయిషీ చేసేవాడు. కోళ్లను గంపలో కమ్మడం, బర్రెకు గడ్డి వేయడం, పాలు పితకడం లాంటి పనులు చేసేవాడు. రాత్రిపూట నులక మంచం మీద కూర్చొని మాకు కథలు చెప్పేవాడు. మేం పడుకునే ముందు తప్పక ఆయన దగ్గరకు వెళ్లి కథలు చెప్పించుకునేవాళ్లం.
ప్రతిరోజు కొత్త కథ చెప్పేవాడు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథ చెప్పేవాడు. రాజులు, రాణులు, రాకుమారులు, మాయలు మంత్రాలు, నక్క, తోడేలు మోసాలు, కొంగ, బాతు, రాక్షసులు ఒకటేమిటి ఎన్నో కథలు, ఎన్నో విషయాలు. ఆకాశం, బాదంచెట్టు, సూర్యుడు, చంద్రుడు ఒకటేమిటి ఆ కథల్లో ఎన్నో సంగతులు. పేదరాసి పెద్దమ్మ దగ్గర నుంచి మర్యాద రామన్న వరకు ఆ కథల్లో కన్పించేవారు.
కాలక్రమంలో మా పాప, బాబు కథలు వినడం మొదలుపెట్టారు. వాళ్లకి మా అమ్మ కథలు చెప్పేది. నేనూ చెప్పేవాడిని. ఆ కథల్లో వాళ్లు లీనమై పోయేవాళ్లు. కథల్లోని పాత్రలు బాధలో వుంటే వాళ్లు బాధలో వుండేవాళ్లు. పాత్రలు సంతోషంగా ఉంటే వాళ్లు సంతోషంగా ఎగిరి గంతేసేవాళ్లు. వాళ్లు పెద్దవాళ్లైపోయారు. ఒకరు అమెరికాలో మరొకరు యూనివర్సిటీలో.
కథలు చెప్పే పనిలేకుండా పోయింది. ఆ మధ్యన మా అక్కా వాళ్లింటికి వెళ్లాను. బయట వర్షం పడుతోంది. ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. హాలంతా నిశ్శబ్దం. మా అక్కయ్య మనుమలు, మనవరాండ్రు అంతా హాల్లో వున్నారు. ఓ మనవడు ఐ పాడ్‌లో చూస్తున్నాడు. మరొకడు స్మార్ట్ ఫోన్‌లో ఆటలు ఆడుతున్నాడు. మనువరాలు ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. మా మేనల్లుడు ఏదో పత్రిక చదువుకుంటూ కన్పించాడు.
మా చిన్ననాటి కాలానికి ఇప్పటికి ఎంత మార్పు. ఇలాంటి సమయంలో మా ఇల్లు ఇల్లంతా దద్దరిల్లిపోయేది. ముచ్చట్లు, కథలతో ఊగిపోయేది. ఏ కథ చెప్పాలా అని ఆలోచనల్లో వుండేవాళ్లు పెద్దవాళ్లు.
చెప్పడానికి కొన్ని వందల కథలు నా దగ్గర ఉన్నాయి. కాని నన్ను కథ చెప్పమని అడిగే పిల్లలు అక్కడ కన్పించలేదు. మా అక్క పరిస్థితి అదే.
ఇప్పటి పిల్లలు హోంవర్క్‌తోనే ఈ ఆధునిక యుగంలో ఇంట్లోకి వచ్చిన కొత్త పరికరాలతోనే కార్టూన్ సీరియళ్లతోనో కాలం గడుపుతున్నారు.
ఎంతలో ఎంత మార్పు. ఈ సాంకేతిక యుగం పిల్లల బాల్యాన్ని ఎలా మింగేసింది.
ఓ కవి అన్నట్టు-
అనగనగా... ఓ కల వుండేది
ఏ పీడకల దాన్ని కాటేసిందో
ఏమో...
కంప్యూటరే కలగంటుంది నేడు.
అనగనగా...
ఓ కథ ఉంది
వినే నాథుడే లేడు.