S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలోచనతో ఆగదు

అథాతో ఆత్మజిజ్ఞాస అంటున్నది మన పద్ధతి. పరబ్రహ్మంతో పనిలేదు. ముందు మన గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సర్వేభద్రాణి పశ్యంతు అన్న మాట ప్రకారం అందరూ హాయిగా ఉండగలుగుతారు. ఇంతకూ కథం ఇదం ఆత్మా? ఈ నేనంటే ఎవరు? ఈ మనిషి అంటే ఎవరు? ఈ మనిషికి గుర్తింపులు ఏమయినా ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు ముందుకు సాగాలి.
మనిషి సరదాగా బతుకుతాడు అనుకుందాం. అందులో నాకు ఒక చిత్రమయిన లక్షణం కనిపించింది. సరదా పేరున లేక పరదా పేరున చేయవలసింది ఏదో చేసి, సారీ, చీర కాదు, క్షమాపణ చెప్పడం ఒక్క మనిషికి మాత్రమే చేతనయింది. అదొక సరదా. అసలు సిసలయిన కుళ్లు సరదా.
ఇక కొంచెం ముందరకి ఆలోచిస్తే, మిగిలిన జంతువులకన్నా మనం విడిగా ఎలా ఉండగలుగుతున్నాం అన్న ప్రశ్న పుడుతుంది. కం బలవంతం న బాధతే శీతలం అని ప్రశ్న. ఎట్టి బలవంతుని చలి బాధపెట్టదు అని అర్థం. కం బలవంతం న బాధతే శీతలం అని జవాబు. అంటే గొంగడి గలవానిని చలి బాధపెట్టదు అని జవాబు. ఇదే పద్ధతిలో ప్రశ్న పుట్టింది అన్నాము కదా! ప్రశ్న అడగడం ఒక్క మనిషికి తప్ప మరో జీవికి చేతకాదు.
కనిపించిన ప్రతి విషయాన్ని ప్రశ్నార్థకంగా తరచి చూడడం ఒక్క మనిషికే చెల్లింది. ప్రపంచంలోని అన్ని విషయాలను అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం ఒక్క మనిషి మాత్రమే చేశాడు. అంతటితో ఆగలేదు. అర్థమయిన అంశాల మధ్యన లంకెలు చూడాలి. లెక్కలు వేయాలి. వర్గీకరించాలి. శాస్త్రాలు పుట్టించాలి. కొల్లేటి చాంతాడులాంటి వరుస. బహుశా దీనే్నకదా సైన్స్ అంటారు. మనిషి స్వతహాగా సైంటిఫిక్ రకం. తెలుసుకోవాలి అనుకునే రకం.
మా తమ్ముడు కనీసం ఒక వంద గోళీకాయలను పగలగొట్టాడు. వాటిల్లో ఉండే పువ్వు సంగతి తేల్చుకోవాలన్నది వాడి ధనం మూలంప్రయత్నం. తమ్ముడు ఈ పని చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే చేశాడు. తరచిచూచే, వెతికి చూచే లక్షణం మనిషికి వయసుతో పనిలేకుండా వస్తుంది అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. అట్లా తెలుసుకున్న అనుభవాలతోనే, గోళీలు పగలగొట్టడం కాదు, బుర్ర చించుకోవడంతో తెలుసుకున్న అంశాలతోనే తెలివి పెరిగింది అనుకుంటాడు మనిషి. అర్థమయిన అంశాలలో కొన్ని కొత్త అర్థాలు తోస్తాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు చేసినా అవే ఫలితాలు వస్తాయి అని అర్థమవుతుంది. కనుక ఆయా పదార్థాలు, వస్తువుల లక్షణాలు తెలిసిన భావన కలుగుతుంది. అనుభవాలను పోగువేసి, ఈ ప్రపంచం తను అనుకున్న పద్ధతిలో నడుస్తుంది అన్న భావనతో మనిషి ముందుకు కదులుతాడు. నిన్న తెల్లవారింది కనుక రేపు కూడా తెల్లవారుతుంది. వానకాలం వచ్చింది కనుక మళ్లీ రాక తప్పదు. అది అనుభవ పాఠం. ఇటువంటి ఆలోచనలే సైన్స్‌కు పునాది వేశాయి. కాలం సంగతి తెలిసింది. క్యాలెండర్‌లు తెలిశాయి. కాస్మాలజీ నుంచి మొదలు కాకరకాయ రుచి దాకా ఎనె్నన్నో తెలిశాయి. మాట వరసకు కాదుకానీ, ప్రతి దానికి కొలతలు కూడా తెలిశాయి.
ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే మాట. సైన్స్ అన్నది అర్థంకాని బ్రహ్మపదార్థం కాదు. చుట్టు కనిపిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అందులోని లోతులను అందుకోవడానికి సాయం చేసిన సమాచారమే సైన్స్. ఈ సంగతి చెప్పడానికి ప్రత్యేకంగా ఎవరూ అవసరం లేదు. సైన్స్ అన్న పద్ధతి ఒక్క మనుషులకు మాత్రమే అవసరం అంటే చాలా తప్పు. మనుగడ కొనసాగించడానికి ప్రాణులన్నీ సైంటిఫిక్ పద్ధతిలోనే బతకవలసి ఉంటుంది. ఎంత తెలివితక్కువదయినా ప్రతి జంతువు, ప్రతి ప్రాణి ఒక అవగాహనతోనే ముందుకు సాగుతుంది. జీవులంటేనే సైంటిఫిక్‌గా సాగాలి అన్న నియమం ఒకటి ఉన్నట్టుంది. చిలుక మాట్లాడుతుంది. ఎలుక తప్పించుకుంటుంది. ఏనుగు స్టూల్ మీద ఎక్కి కూచుంటుంది. ఎన్ని ఉదాహరణలయినా చెప్పవచ్చు. అన్నింటిలోనూ విశే్లషణ, విచక్షణ, అనుభవం లాంటివన్నీ ఉంటాయి. కనుకనే బతుకులు కొనసాగుతాయి. కోతి చేసేవి మనకు కోతిచేష్టలు. దానికి మాత్రం అది జీవితానుభవం. తిండి సంపాదించుకోవడంలో, దొరికినది తినడంలో కోతి కూడా ఒక పద్ధతిని పాటిస్తుంది. అది మనకు చిత్రంగా తోస్తే తప్పు మనది కాని, కోతిది కాదు.
మనిషికి సైన్స్ మరీ తలకు ఎక్కింది. కనుకనే బతుకు నుంచి దాన్ని విడదీసి ప్రత్యేకంగా గుడికట్టి, పద్ధతులు పెట్టి చూడడం అనే దరిద్రం పద్ధతి మొదలయింది. లేదంటే ఉన్నదంతా సైన్స్. బతుకంతా సైన్స్. మిగతా జంతువులన్నింటికన్నా మనిషికి చేతనయిన సైన్స్ మరింత లోతుగా ఉంది. ఈ రకంగా మనం మిగతా జంతువుల నుంచి దూరంగా నిలబడ్డాము. ఎంత దూరంగా?
అర్థం అయింది కదూ! అంత దూరంగా. ప్రశ్న అడిగేటంత దూరంగా. ప్రశ్న అడగడం మనిషి ప్రత్యేకత. మన ప్రత్యేకత. ఈ ప్రశ్న అడగడం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నో జరిగాయి. ఇక మీద కూడా జరుగుతాయి. ఒకానొక పరిశోధనలో కొన్ని చింపాంజీలను అంతే ఆసక్తిగా పాల్గొనడానికి ముందుకు వచ్చిన కొందరు పిల్లవాళ్లను ఒకచోట చేర్చారు. వాళ్లకు ఇంగ్లీష్ ఎల్ ఆకారంలో ఉండే ఒక దిమ్మెను ఇచ్చారు. దాన్ని పడిపోకుండా నిలువుగా నిలబెట్టాలి. అది పరీక్ష! చిన్నపిల్లలు, చింపాంజీలు కొంచెం ప్రయత్నం తరువాత సులభంగానే విజయం సాధించినట్టు వేరుగా చెప్పనవసరం లేదు. పరిశోధన అంటే, అంతటితో ముగియదు కదా! ముగియకూడదు కదా! కనుక మన వాళ్లు మధ్యలో కొన్ని దిమ్మెలను మార్చేశారు. వాటిలో కనిపించకుండా ఏవో బరువులు ఏర్పాటు చేశారు. ఎంత చేసినా అవి నిటారుగా నిలబడడం లేదు. పట్టువదలని విక్రమార్కుడిలాగ చింపాంజీలు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అలుపు లేకుండా ముందుకు సాగుతున్నాయి. కానీ చిన్నపిల్లలయినా ఆ పిల్లలు మాత్రం కొంతకాలానికి ప్రయత్నం ఆపేశారు. దిమ్మెను అటుఇటూ తిప్పి చూశారు. దాని అడుగున తడిమి చూచారు. పైకెత్తి ఆడించి చూచారు. అందులో ఏదో ఉంది అన్న అనుమానం వాళ్ల మనసుల్లో కదిలింది. అదేదో తెలుసుకుంటే తప్ప నిలువుగా నిలబెట్టడం వీలుకాదని వాళ్లకు తెలిసిపోయింది. చింపాంజీలు, చిన్నపిల్లల మధ్యన తేడా కూడా తెలిసిపోయింది. సహజంగా అన్ని జంతువులకు వైజ్ఞానిక ధోరణి ఉందీ అనుకుందాము. కానీ మనిషికి మరింత ఎక్కువగా ఉందని తరువాత తెలిసింది.
కనిపించినది అంతా సత్యం కాదు. కనిపించనిది కూడా ఏదో ఉండవచ్చు అంటుంది అనుభవం. సైన్స్ కూడా అదే మాట అంటుంది. కంటి ముందు వివరంగా కనిపించని విషయాలను తరచి చూడడం మనిషికిగల లక్షణాలలో ముఖ్యమైనది. మిగతా జంతువులకు అది అంతగా తోచకపోవచ్చు. కోతిచేష్టలు అనుకోవచ్చు గానీ, కొన్ని పరిశోధనలు కోతిచేష్టల లాగే ఉంటాయి. చింపాంజీలు కోతులు కావని మనవి. అవి మనకి దగ్గరి చుట్టాలు. పెద్దరాయి పెట్టి కొడితే కాయ సులభంగా పగులుతుందని చింపాంజీలు సులభంగానే నేర్చుకుంటాయి. అయితే బరువు గురించిన వివరాలు మాత్రం వాటి తలకు ఎక్కవు. ఉదాహరణకు రెండు వస్తువులు ఉన్నాయి. వాటిని పైనుంచి కిందకు వేశారు. ఒకటి ధడాలుమంటూ పడింది. మరొకటి పెద్ద గోల చేయకుండా పడింది. పిల్లలకయితే ధడాలుమంటూ పడింది. బరువయిన వస్తువని తెలిసిపోతుంది. చింపాంజీలకు ఆ సంగతి తెలియలేదు. తెలిస్తే కాయ పగలగొట్టడానికి అటువంటి వస్తువు బాగా పనికివస్తుందని కూడా అవి తెలుసుకో గలుగుతాయి. కానీ వాటికి తేడా తెలియదు.
ఒకచోటి అనుభవాన్ని మరొక చోట వాడుకోగలగడం మనిషికి గల ప్రత్యేకత. చింపాంజీలకు ఈ సంగతి తలకు ఎక్కదు. కనుకనే మనిషి వాటి మీద అధికారం చేయగలిగాడు. ధడాలున పడిన వస్తువు నీటిలో వేస్తే మునుగుతుందని పిల్లలకు కూడా అర్థమవుతుంది. చప్పుడు చేయకుండా పడిన వస్తువు తేలే అవకాశం ఉందని సులభంగానే తెలుస్తుంది. ఈ రకమయిన ఆలోచనా ధోరణి మనకు మరింత ముందుకు సాగి రకరకాలుగా సాయం చేస్తుంది. చివరికి మాటకారితనంలో కూడా మరొక చో అనుభవం బయటపడుతూ ఉంటుంది. ఒక పని చేసినందుకు వచ్చిన ఫలితం, ఆ పని మరొకచోట చేసినప్పుడు కూడా వస్తుంది, అన్నది సూత్రం. దీనే్న అనుభవం అంటారని నేను అనుకుంటాను.
ఈ రకంగా ముందుకు వెళితే మనిషి తీరు, మాట తీరు, అన్నవి వరుసబెట్టి ఏర్పడుతూ పోతాయి. అనుభవం పెరిగిన కొద్దీ ఆ తీరు మారుతుంది. ఫలితాలు మరింత అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన ఏప్‌లలో కూడా ఇంతటి పరిణతి కనిపించలేదని పరిశోధకులు గట్టిగా గమనించారు. కనుక మిగతా జీవులకన్నా, దగ్గరి చుట్టాలకన్నా, అంటే ఏప్‌లకన్నా మనిషిలోని వైజ్ఞానికత మరింత ముందుకు సాగిందని మనం అర్థం చేసుకోవచ్చు.

-కె.బి.గోపాలం