S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..88

మీకో ప్రశ్న
భరతుడు అంటే అర్థం ఏమిటి?

పధ్నాలుగో రోజున రాజుని చేసే అధికారం గల మంత్రులు, కైకేయి మొదలైన వారు కలిసి భరతుడి దగ్గరికి వెళ్లి చెప్పారు.
‘మనందరికీ అధిక పూజ్యుడైన దశరథుడి పెద్ద కొడుకు రాముడ్ని, మహాబలవంతుడైన లక్ష్మణుడ్ని ప్రవాసానికి పంపేసి తను స్వర్గస్థుడయ్యాడు. కీర్తివంతుడైన ఓ రాజకుమారా! నువ్వు ఇప్పుడు మాకు రాజవ్వాలి. రాజులేని ఈ రాజ్య ప్రజలు దేవుడి దయవల్ల ఒకరినొకరు బాధించడం లాంటి నేరాలని చేయడం లేదు. నువ్వు ఆలస్యం చేస్తే అవి ఆరంభమవచ్చు. భరతా! నీ వారంతా అభిషేక సంబారాలు సిద్ధం చేసుకుని నీ కోసం వేచి ఉన్నారు. నీకు వంశపారంపర్యంగా వచ్చే స్థిరమైన ఈ రాజ్యాన్ని స్వీకరించి, రాజ్యాభిషిక్తుడివై మమ్మల్ని పాలించు’
నియమాలని పాటించే భరతుడు ఆ అభిషేకానికి సంబంధించిన సమస్త వస్తువులకి ప్రదక్షిణ నమస్కారాలు చేసాక వారందరికీ జవాబు చెప్పాడు.
‘అన్నీ తెలిసిన మీరు నాతో ఇలా చెప్పడం భావ్యం కాదు. మా వంశంలో ఎప్పుడూ పెద్ద కొడుకే రాజవడం ఆచారం. మా సోదరుల్లో పెద్దవాడైన రాముడు రాజవుతాడు. నాలుగు విధాలైన బలాలు గల మహాసైన్యాన్ని సమకూర్చండి. సంస్కరించిన ఈ అభిషేక సంబారాలన్నీ ఎదుట ఉంచుకుని నేను నా పెద్దన్న రాముడిని తిరిగి తీసుకు రావడానికి అడవికి వెళ్తాను. పురుష శ్రేష్ఠుడైన రాముడికి అక్కడే రాజ్యాభిషేకం చేసి, అతన్ని ముందుంచుకుని యజ్ఞం నించి అగ్నిని తీసుకువచ్చినట్లుగా రాముడ్ని తీసుకు వస్తాను. నా తల్లి అనే పేరు పెట్టుకున్న ఆమె కోరిన కోరిక తీరేట్లు చేయను. నేనే దుర్గమమైన అడవుల్లో నివసిస్తాను. రాముడు రాజు అవుతాడు. శిల్పులు ఎత్తుపల్లాలున్న ప్రదేశాలని సమంగా ఉండేట్లు చేసి దారిని చేయాలి. ప్రవేశించడానికి శక్యం కాని ప్రదేశాల్లో సంచరించగలిగే రక్షకుడు మార్గంలో మన వెంట రావాలి.’
రాముడి విషయంలో ఇలా మాట్లాడిన భరతుడితో ప్రజలంతా మధురమైన ఈ మాటలని చెప్పారు.
‘పెద్దవాడైన రాజకుమారుడికి రాజ్యం ఇవ్వాలని కోరుతూ ఇలా మాట్లాడే నిన్ను లక్ష్మి ఆశ్రయించుగాక!’
భరతుడు పలికిన మాటలు తమ చెవులతో ప్రత్యక్షంగా విన్నాక కలిగిన ఆనందంతో పూజ్యులైన జనాలకి కన్నీటి బిందువులు కారాయి. మంత్రులు, పరిషత్తు జనం అతని మాటలకి సంతోషించి ‘ఓ పురుషోత్తమా! నీ ఆజ్ఞ ప్రకారం భక్తులైన జనులని, శిల్పులని దారిని నిర్మించమని ఆదేశించాం’ అని చెప్పారు. (అయోధ్య కాండ 79వ సర్గ)

ఆయా ప్రదేశాల స్వరూప స్వనావాలు తెలిసిన వాళ్లు, దారాలు పట్టుకుని కొలతలు వేసేవాళ్లు, తమ తమ పనులని శ్రద్ధగా చేసేవాళ్లు, నేలని తవ్వేవాళ్లు, యంత్రాలని ఉపయోగించే వాళ్లు, కూలివాళ్లు, నిపుణులైన శిల్పులు, యంత్రాలని చక్కగా ఉపయోగించే వాళ్లు, వడ్రంగులు, దారిని నిర్మించేవాళ్లు, చెట్లని నరికేవాళ్లు, బావులని తవ్వేవాళ్లు, సున్నం వేసేవాళ్లు, వెదురు పని చేసేవాళ్లు, సమర్థులైన పర్యవేక్షకులు ముందు బయలుదేరారు. సంతోషంతో నడిచే ఆ జనసమూహం పర్వదినంలో గొప్ప వేగంతో పొంగిన సముద్రంలా ఉంది.
దారులు వేయడంలో నేర్పరులంతా అనేక రకాల సాధనాలని తీసుకుని ఓ గుంపుగా ముందు బయలుదేరారు. తీగలని, పొదలని, చిన్న, పెద్ద రాళ్లని, అనేక రకాల చెట్లని పడగొట్టి వాళ్లు దారిని చేశారు. కొందరు చెట్లు లేని చోట్ల చెట్లని నాటారు. కొందరు ఆయా ప్రదేశాల్లో గొడ్డళ్లతో, ఉలులు, రంపాలతో ఛేదించారు. బాగా బలం గల కొందరు దృఢంగా ఉన్న గడ్డిని పెరికివేశారు. అక్కడక్కడా ఉన్న నడవడానికి కుదరని ప్రదేశాలని చదును చేశారు. మరి కొందరు పల్లాలని సమం చేశారు. కొందరు కంచెలు వేశారు. కొందరు పొడి చేయాల్సినవి పొడి చేస్తే, ఇంకొందరు బద్దలు కొట్టాల్సిన వాటిని బద్దలు కొట్టారు. కొద్ది సమయంలోనే అనేక రకాలైన ఆకారాలు ఎక్కువ నీళ్లు గల, సముద్రమంత పెద్దవైన అనేక కాలువలని నిర్మించారు. నీళ్లు లభించని ప్రదేశాల్లో అనేక రకాల బావులని తవ్వించి వాటికి పళ్లాలు కట్టారు. సేన నడిచే దారిలో సున్నం వేసి చదును చేశారు.
పక్కనే ఉన్న చెట్లన్నీ పుష్పించి ఉన్నాయి. పక్షులు మదించి కూస్తున్నాయి. దారంతా జెండాలు కట్టి అలంకరించి, మంచి గంధం కలిపిన నీళ్లతో దారంతా తడిపారు. అనేక పూలు రాలిపడి ఉన్నాయి. ఇలా దేవతలు నడిచే దారిలా ఉన్న ఆ సేనా మార్గం కళకళలాడింది. ఆయా పనులు బాగా తెలిసిన వాళ్లు భరతుడి ఆజ్ఞ ప్రకారం తమ కింద పనిచేసే వాళ్లందర్నీ ఆయా పనులు చేయడానికి పురమాయించి మధురమైన పళ్లు, అధికంగా లభించే ప్రదేశాల్లో భరతుడికి విడిదిని, ఇతర ఇళ్లని అందంగా నిర్మించారు. భరతుడి సైన్య శిబిరాల కోసం జ్యోతిష్యులు మంచి నక్షత్రాల్లో ముహూర్తాలు పెట్టారు. అక్కడ ఇసుక కుప్పలు, పరిఖలు ఉన్నాయి. ఇంద్రకీల పర్వతంలా ఎత్తుగా ఉన్న వాటి దగ్గర ఆలయాలు, చుట్టూ ప్రాకారాలు, అందమైన చిన్న దారులు, విశాలమైన దారులు నిర్మించారు. అక్కడ నిర్మించిన, ఎత్తుగా ఉన్న మంచి ఇళ్ల శిఖరాలు ఆకాశంలోకి ఎగిరి పోతున్నట్లుగా ఉన్నాయి. అలంకారం కోసం అంతటా కట్టిన జండాలు ఎగురుతున్నాయి. ఇలా ఆ శిబిరాలు దేవేంద్రుడి నగరాల్లా ఉన్నాయి. రెండు వైపులా అనేక చెట్లతో నిండిన అరణ్యాలు, చల్లటి నిర్మలమైన నీళ్లు, అనేక గొప్ప చేపలు గల ఓ నది వరకు ఆ శిబిరాలు వ్యాపించి ఉన్నాయి. గొప్ప శిల్పులు క్రమంగా నిర్మించిన ఆ అందమైన రాజమార్గం రాత్రి చంద్రుడు, నక్షత్ర గణాలతో నిర్మలమైన ఆకాశం ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తోంది. (అయోధ్య కాండ 80వ సర్గ)
మాటల్లో నేర్పరులైన వందిమాగధులంతా ఆనందకరమైన తెల్లవారుఝామున మంగళవాద్యాలతో, స్తోత్రాలతో భరతుడ్ని స్తుతించారు. బంగారు దండంతో యమదుందుభిని మోగించారు. వందల కొద్దీ శంఖాలని పూరించారు. వివిధ స్వరాలు గల వాద్యాలని వాయించారు. ఆకాశమంతా నిండుకున్నట్లున్న ఆ ధ్వని శోకంతో బాధపడే భరతుడికి ఇంకా అధికమైన దుఃఖం కలిగించి బాధించింది. భరతుడు మేలుకుని శతృఘు్నడితో చెప్పాడు.
‘శతృఘ్నా! చూడు. కైకేయి వల్ల లోకానికి ఎంత గొప్ప అపకారం జరిగింది? దశరథ మహారాజు ఈ దుఃఖాలన్నింటినీ నాకు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ధర్మరక్షకుడు, మహాత్ముడైన దశరథ మహారాజుకి ధర్మబద్ధంగా సంక్రమించిన ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు చుక్కాని లేని పడవ నీటిలో తిరిగినట్లు తిరుగుతోంది. మనందరికీ గొప్ప రక్షకుడైన రాముడ్ని కూడా ధర్మహీనురాలైన నా తల్లి స్వయంగా అడవికి పంపేసింది.’
ఇలా ఏడస్తూ స్పృహ తప్పిన భరతుడ్ని చూసి స్ర్తిలంతా బిగ్గరగా ఏడ్చారు. భరతుడు ఇలా ఏడుస్తూంటే, రాజధర్మాలు తెలిసిన, గొప్ప కీర్తిగల వశిష్ఠుడు దశరథుడి సభాభవనానికి వచ్చాడు. బంగారం పూత పూసి, అందంగా, వివిధ రత్నాలతో అలంకరించబడి దేవసభ సుధర్మలా ఉన్న ఆ సభలోకి ధర్మాత్ముడైన వశిష్ఠుడు పరివారంతో కలిసి ప్రవేశించాడు. అన్ని వేదాలు తెలిసిన వశిష్ఠుడు సుఖకరమైన వస్త్రం కప్పిన బంగారు పీఠం మీద కూర్చుని దూతలతో ఇలా చెప్పాడు.
‘మీరు ఏ మాత్రం కంగారు పడకుండా బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, మంత్రులని, గణాధ్యక్షులని వెంటనే తీసుకురండి. మాకు వారితో తొందర పని ఉంది. రాజసేవకులని, శతృఘు్నడ్ని, కీర్తివంతుడైన భరతుడ్ని, యుధాజిత్తుని, సుమంత్రుడ్ని, రాజహితులు అందర్నీ తీసుకురండి.’
వశిష్ఠుడి ఆజ్ఞ ప్రకారం ఆహ్వానించబడ్డ వారంతా రధాలు, గుర్రాలు, ఏనుగులు ఎక్కి వస్తూండగా కోలాహల శబ్దం పుట్టింది. మంత్రులు మొదలైన వారు దేవతలు దేవేంద్రుడ్ని ఎలా అభినందించేవారో, సభలోకి వచ్చే భరతుడ్ని అలా అభినందించారు. దశరథ కుమారుడి చేత శోభితమైన ఆ సభ అడుగున చేపలు, పాములు, మణులు, శంఖాలు, ఇసుక ఉన్న నిశ్చలమైన నీరుగల మడుగులా, పూర్వం దశరథుడు ఉన్నప్పుడు ఎలా కళకళలాడేదో అలా కళకళలాడింది. (అయోధ్య కాండ 81వ సర్గ)
ఆశే్లష హరికథని విని బయటకి వస్తూండగా ఆయన చెప్పిన కథలో ఐదు తప్పులు ఉన్నాయి అని కొందరు అనుకుంటూ వెళ్లడం విన్నాడు. అది నిజం కూడా.
మీరు ఆ ఐదు తప్పులని కనుక్కోగలిగారా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
-------------------------------
ఇక్ష్వాకు వంశానికి గల మరో పేరు ఏమిటి?
ఇక్ష్వాకు వంశానికి రఘువంశం, సూర్య వంశం అనే మరో రెండు పేర్లున్నాయి.

1.అంత్యకాలంలో కిందపడ్డ యయాతిని అని వాల్మీకి రాసాడు. హరిదాసు తప్పుగా మాండవ్యుడు అని చెప్పాడు.
2.మంథరని వాల్మీకి చేసిన వర్ణన, ‘విచిత్రమైన వడ్డాణాలు, అనేక మంచి అలంకారాలు గల ఆమె తాళ్లతో కట్టిన ఆడకోతిలా ఉంది’ అని హరిదాసు చెప్పలేదు.
3.హరిదాసు మూడు సర్గలని చెప్పానని చెప్పడం తప్పు. రెండు సర్గలనే చెప్పాడు. అవి 77, 78
4.క్రౌంచపక్షిలా అని వాల్మీకి రాసాడు. కాని హరిదాసు తప్పుగా మయూర పక్షిలా అని చెప్పాడు.
5.ఆ వైష్ణవుడు ఐదు తప్పులని చెప్పడం కూడా తప్పు. ఉన్నవి కేవలం నాలుగు తప్పులే.