S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమతో కూడిన హత్య

ఎథెల్ ఆ ఉదయం దినపత్రికని తెరవగానే మూడో కాలంలో ఆ వార్త కనిపించింది.
హత్యకి కారణం అనే్వషణ
‘దీనికి కారణం మీకు ఎప్పటికైనా నేను చెప్తే తెలుస్తుందా?’ ఎథెల్ ఆ వార్తని చదవగానే మనసులో అనుకుని చదవడం కొనసాగించింది.
‘క్రితం రాత్రి క్రీడాశిక్షణ ఇచ్చే ఓ యువకుడు శిక్షణ ముగించాక ఇంటికి నడిచి వెళ్తూంటే షెరిడన్ ఎవెన్యూలో కాల్చి చంపబడ్డాడు. హతుడు అలెన్ (22) జేబుల్లోని పర్స్, చేతికున్న గడియారం దొంగిలించబడలేదు కాబట్టి హత్యకి దొంగతనం కారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. .32 కేలిబర్ రివాల్వర్ నించి పేల్చిన గుండు దిగిన మరుక్షణం అలెన్ మరణించాడని పోలీసు డాక్టర్ చెప్పాడు. ప్రాథమిక విచారణలో అలెన్ గత రాత్రి పది గంటలకి సిటీబస్ ఎక్కి ఎప్పుడూ దిగే షెరిడన్ ఎవెన్యూలో దిగి ఇంటికి నడిచి వెళ్తూండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఈ కేసు విచారణ చేపట్టిన డిటెక్టివ్ లెఫ్టినెంట్ థామస్, అలెన్‌కి విరోధులు ఎవరూ లేరని, ఇటీవల స్టేట్ యూనివర్సిటీ నించి డిగ్రీ పుచ్చుకుని, మాస్టర్స్ డిగ్రీ చేసే ఉద్దేశంలో ఉన్నాడని చెప్పాడు. అలెన్ తల్లిదండ్రులు హంతకులకి చెందిన ఒక్క ఆధారాన్ని కూడా అందించలేక పోయారు.’
దాన్ని చదివే ఎథెల్ తన భర్త వంట గదిలోకి వచ్చే అలికిడి వినలేదు. లేచి అతనికి కాఫీ చేయడానికి స్టవ్ మీద నీళ్లని ఉంచింది.
ఆఫీస్ నించి వచ్చిన జార్జ్ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ ఈవెనింగ్ ఎడిషన్‌ని అందుకుని, సరాసరి క్రీడా పేజీని తెరిచాడు.
తన ఇరవై ఎనిమిదో ఏట జార్జ్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు అతనిలో శృంగార సమర్థత ఎంత ఉందో, ఇరవై ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంది. కాని అది తనలో తగ్గింది అని ఇటీవల అతన్ని చూసినప్పుడల్లా ఎథెల్‌కి అనిపిస్తోంది. అతన్ని చూసి ఆమెకి సానుభూతి, జాలి కలిగాయి. కాని సంబాళించుకుని ‘మనసు కాదు. ఈ విషయంలో బుర్ర పాలించాలి’ అనుకుంది. కాఫీ కప్పుని ఇస్తూ అడిగింది.
‘హత్యా వార్త చదివావా జార్జ్?’
అతను జవాబు చెప్పలేదు. క్రీడా పేజీలోంచి తల ఎత్తి కనీసం భార్య వైపు చూడలేదు.
‘అలెన్ అనే మంచివాడ్ని చంపేశారు’
‘ఏమిటి? ఏమన్నావు?’ జార్జ్ తలెత్తి చూస్తూ అడిగాడు.
‘నీకు అలెన్ అనే మనిషి తెలుసా? ఈ ఊళ్లో నీకు క్రీడా శిక్షణ ఇచ్చే చాలామందితో పరిచయం కదా?’
‘అలెన్? ఉహు’
‘నువ్వసలు నేను చెప్పేది వినడం మానేసావు’ ఎథెల్ నిష్ఠూరంగా చెప్పింది.
‘అంటే మన పెళ్లి విడాకుల దశకి చేరుకుంది’ అతను కఠినంగా చూస్తూ చెప్పాడు.
‘మీకు విడాకులు కావాలని నాకు బాగా అర్థమైంది జార్జ్. నాకు పదేపదే అది గుర్తు చేయక్కర్లేదు’ ఎథెల్ మళ్లీ నిష్ఠూరంగా చెప్పింది.
‘అలాంటప్పుడు గౌరవంగా నువ్వు నా జీవితంలోంచి తప్పుకోవచ్చుగా?’
‘మన మరణం మనల్ని వేరు చేసే దాకా నీతో కలిసి జీవిస్తానని నేను మన పెళ్లిలో చేసిన వాగ్దానానికే కట్టుబడి ఉంటానని కూడా చెప్పాగా?’
జార్జ్ పళ్లు పటపట కొరికాడు. దినపత్రికని నేల మీదకి విసిరికొట్టి అరిచాడు.
‘నేను బయట డిన్నర్ చేస్తాను’
అతను లేచి వెళ్లాక ఇంటి తలుపు గట్టిగా మూసుకున్న చప్పుడు వినిపించింది. ఆమె చిన్నగా నిట్టూర్చింది. రాత్రికి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. పేటీ వాడే చవక పెర్‌ఫ్యూమ్, ఆల్కహాల్ వాసనలతో అని ఆమెకి తెలుసు.
ఎథెల్ గత రోజు, గత వారం, గత నెల, గత సంవత్సరం, నిజానికి పెళ్లైనప్పటి నించి చేసే పనినే రొటీన్‌గా చేసింది. ఇంటిని దులిపి ఊడ్చి, శుభ్రం చేసి నేలని తుడిచింది. అకస్మాత్తుగా ఆమెకి గతంలోలా తను ఇంటి పని చేసుకుంటూ కూనిరాగం తీయడం లేదని స్ఫురించడంతో కళ్లు తడయ్యాయి.
‘స్టవ్! సారీ. నిన్ను జార్జ్ కోసం ఉపయోగించనందుకు’ కాఫీ తాగుతూ చెప్పింది.
‘ఓ కప్పు, నాకు సేవ చేస్తున్నందుకు థాంక్స్’ కాఫీ కప్పుతో చెప్పింది.
‘టీవీ ఈ హృదయం లేని ప్రపంచానికి చెందిన వార్తలేమైనా ఉన్నాయా?’ అడిగింది.
టీవీని ఆన్ చేసి సోఫాలో దాని ముందు కూర్చుంది.
వార్తల్లో అలెన్ హత్య చేయబడ్డ ప్రదేశాన్ని చూపిస్తూంటే అటు, ఇటు చెట్లు గల అది ఎంతో ప్రశాంతంగా కనిపించింది. తర్వాత తన పేరు, లెఫ్టినెంట్ హైమ్‌గా పేర్కొన్న ఒకతను విలేకరులకి చెప్పే సమాధానాలని విన్నది.
‘హత్యకి కారణం కనుక్కోగలిగారా?’ ఒకరు అడిగారు.
‘ఇంకా లేదు. అది కనుక్కో గలిగితే హంతకుడ్ని కూడా కనుక్కో గలిగినట్లే’ హైమ్ జవాబు చెప్పాడు.
‘ఓ టీ.వీ ఈ పిచ్చి ప్రపంచంలో లోతైన, గాడమైన, రహస్యమైన, సున్నిత మనస్కురాలికే అది తెలుసు అని అతనికి చెప్పు’ ఆమె ఆ యంత్రానికి చెప్పింది.
తన భర్త పేటీ ఏం చేస్తున్నారో అనుకోగానే కారిన కన్నీటిని చొక్కా చేతి మడతలతో తుడుచుకుని లేచి టి.వి. ఆఫ్ చేసింది. తన మనసులో ముద్రించుకుపోయిన ఓ నంబర్ని డయల్ చేసింది. నగరంలోని చాలా దూరంలో ఓ ఫోన్ మోగింది.
‘హలో. పేటీ హియర్’ ఓ ఆడకంఠం వినిపించింది.
ఆ కంఠం వినగానే ఎథెల్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించింది.
‘మిస్ పేటీ. నేను జార్జ్ స్నేహితురాలిని. మీకో చెడ్డ వార్త చెప్పాలని ఫోన్ చేసాను. ఓ పెద్ద ప్రమాదం జరిగింది’
తక్షణం దీర్ఘ శ్వాస తీసుకున్న శబ్దం వినిపించింది.
‘జార్జ్.. జార్జ్.. అతనికి ఏం కాలేదుగా?’
‘ఇప్పుడే అంబులెన్స్‌లో అతన్ని సిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అతను మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాడు. మీకు ఫోన్ చేయమని నన్ను కోరాడు’
‘ఏం జరిగింది?’
‘రోడ్ దాటుతూంటే ఓ కారొచ్చి గుద్దింది. మీరు హాస్పిటల్‌కి వెళ్లండి’
‘్థంక్స్. ఇప్పుడే వెళ్తున్నాను’
ఎథెల్ నవ్వుతూ రిసీవర్ని క్రెడిల్ మీద ఉంచింది. కాని తక్షణం ఆమె మొహంలో మళ్లీ క్రోధం అలుముకుంది. ఇంకో నంబర్ని తిప్పింది. రిసీవర్‌కి చేతి రుమాలుని అడ్డు పెట్టి, రెండు బొటన వేళ్లతో ముక్కుని కొద్దిగా అదిమిపట్టి చెప్పింది.
‘నేను పేటీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ మేనేజర్ని. ఆమె కింద పడటంతో తలకి పెద్ద దెబ్బ తగిలింది. డాక్టర్ వస్తున్నారు. మీకు ఫోన్ చేయమని నన్ను కోరింది’
అవతల నించి నివ్వెరపాటు వల్ల కలిగిన వౌనం తర్వాత జార్జ్ అడిగాడు.
‘డాక్టర్ వచ్చేలోగా ఆమెకి ఏం కాకుండా చూడు. వచ్చేస్తున్నాను’
ఎథెల్ మూడో ఫోన్‌కాల్ చేసి ఓ టేక్సీని పిలిచింది. ఆమె అనేక సంవత్సరాలుగా ఎరగని శక్తితో వంట గదిలోని వేరుశెనగపప్పు సీసాని తీసి, అందులో దాచిన తాళం చెవులని తీసింది. అవి జార్జ్ ఉపయోగించే తాళం చెవుల డూప్లికేట్లు. క్రితం శనివారం అతను టివి.లో బేస్‌బాల్ ఆటని చూస్తూంటే ఆమె అతని పర్స్, తాళం చెవులు, చిల్లర ఉన్న ట్రేలోంచి తాళం చెవులని తీసుకుని సమీపంలోని షాపింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి వాటిని డూప్లికేట్లని చేయించింది. వాటిలో ఏది పేటీ అపార్ట్‌మెంట్‌దో తెలీక అన్నిటికీ డూప్లికేట్ చేయించింది. వాటిని జార్జ్ ఎన్నడూ తీయని వేరుశెనగ పప్పు సీసాలో దాచింది.
డోర్ బెల్ మోగింది. టేక్సీ డ్రైవర్ చాలా త్వరగా వచ్చాడనుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది. బయట యూనిఫాంలోని వ్యక్తిని చూసి చెప్పింది.
‘టి.వి.లో చూసిన లెఫ్టినెంట్ హైమ్ మీరు’
‘అవును. ఇది జార్జ్ ఇల్లా?’
‘అవును. ఏం పని మీద వచ్చారు?’
‘మీరు ఆయన భార్య అనుకుంటాను?’ ఆమె వంక నిశితంగా చూస్తూ అడిగాడు.
‘అవును’
‘మీ వారికో .32 కేలిబర్ రివాల్వర్ ఉందా?’
‘దయచేసి లోపలకి రండి మిస్టర్ హైమ్. ఇరుగు పొరుగుకి మీ రాక తెలీడం నాకు ఇష్టం లేదు’ పక్కకి తప్పుకుని చెప్పింది.
అతను లోపలకి వచ్చి టోపీని తీసాడు. ఆమె తలుపు మూసి చెప్పింది.
‘ఈ ఇంట్లోకి జార్జ్ తప్ప ఇంత దాకా ఎవరూ రాలేదు. టీ తాగుతారా?’
‘నో. థాంక్స్’
‘మీరు దేని గురించి వచ్చారో చెప్తారా?’
‘తప్పకుండా. ఆధారాలు లేని కేసుల్లా కనిపించినా ఒకోసారి చిన్న పగులు మొత్తాన్ని బయటపెడుతుంది. నిన్న రాత్రి షెరిడన్ ఎవెన్యూలో కాల్చి చంపబడ్డ అలెన్ కేస్ అలాంటిదే అనుకున్నాను. కాని చిన్న పగులు.. ఓ ఇంటి కిటికీలోంచి ఓ యువతికి రివాల్వర్ పేలిన శబ్దం వినిపించి, తన ఇంటి లాన్లోకి పరిగెత్తుకు వెళ్లింది’
‘హంతకుడ్ని చూసిందా?’
‘చూసింది. నీడలాంటి ఆకృతి. కారుని కూడా. హంతకుడు ఆ కార్లోకి ఎక్కడం చూసింది. ఆ కారు ఆమె ఇంటి ముందు నించి వెళ్తూంటే లైసెన్స్ నంబర్లోని కొంత భాగానే్న చూడగలిగింది’
‘దానికి, జార్జ్‌కి ఏమిటి సంబంధం?’ ఎథెల్ చిన్నగా తల పంకించి అడిగింది.
‘ఆమె నంబర్ ప్లేట్లోని ఈ రాష్ట్రంలో అద్దెకి ఇచ్చే కార్లకి మాత్రమే ఉండే భాగాన్ని చూసింది. ఆ తర్వాత అంతా రొటీన్ పరిశోధనే. కార్లు అద్దెకి ఇచ్చే కంపెనీకి వెళ్లి రాత్రి ఆ సమయంలో ఆ రోజు ఏ కారు ఎవరికి అద్దెకి ఇచ్చారో అడ్రస్‌లు తీసుకుని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఇక్కడికి వచ్చాను’
‘ఓ! ఆ సమయంలో జార్జ్ ఇంట్లో లేడని గుర్తు’
‘అలెన్ పారిపోయే లేదా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. అతను తన వెనక అడుగుల చప్పుడు విని, వెనక్కి తిరిగి ఓ నిరపాయకరమైన మధ్య వయస్కురాలిని చూసాడు’
ఎథెల్ చిన్నగా నిట్టూర్చి చెప్పింది.
‘జార్జ్ దగ్గర ఆ రివాల్వర్ చాలా కాలంగా ఉంది. దాని గురించి మర్చిపోయినట్లున్నాడు. దాన్ని పడక గదిలో ఉంచాడు. నేను నా కోట్‌ని, టోపీని, ఆ రివాల్వర్‌ని తీసుకుని బయటికి వెళ్తూండగా మీరు వచ్చారు. నా పథకం ప్రకారం నేను నా భర్త ప్రియురాలు పేటీ అపార్ట్‌మెంట్‌కి వెల్లి అక్కడ ఉన్న నా భర్తని చంపదలచుకున్నాను. పేటీ తన అపార్ట్‌మెంట్‌కి తిరిగి వచ్చాక చచ్చిన జార్జ్‌ని చూడాలన్నది నా కోరిక.’
‘కాని మీరు అలెన్ని ఎందుకు చంపారు? అతను మీకు పూర్తిగా అపరిచితుడు కదా? మీరా రివాల్వర్ తీసుకుని, కారుని అద్దెకి తీసుకుని అక్కడ తచ్చాడుతూ మీకు తారసపడ్డ మొదటి వ్యక్తిని దేనికి చంపారు?’ హైమ్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘మీరు ఇది కనుక్కోగలిగే తెలివి గలవాళ్లు అనుకున్నాను. పహిల్వాన్ శిక్షణ పొందుతాడు. సైనికుడూ శిక్షణ పొందుతాడు. ప్రతీ వారు తాము చేసే పనిని సక్రమంగా చేయడానికి శిక్షణ పొందుతారు.’
దాని అర్థం గ్రహించిన హైమ్ మొహంలో భయం, ఆశ్చర్యం తొంగిచూసాయి.
చివరికి తను చెప్పేది అర్థం చేసుకునే మిత్రుడు లభించినట్లుగా అతని చేతి మీద ఆప్యాయంగా తట్టి ఎథెల్ చెప్పింది.
‘ట్రయల్ వేసాను. ఓ హత్య చేసాక నేను ఎలా స్పందిస్తానో నాకు తెలీదు. ముందు సాధన లేకుండా నేను జార్జ్‌ని చంపలేనని అనుకున్నాను. జార్జ్ మొదటి గుండుకి మరణించకపోతే నేను ఇంకోసారి కాల్చగలనో లేదో అనే అనుమానం నాలో ఉంది. ఎందుకంటే అతను చాలా కాలంగా నా భర్త. అతని మీద నాకున్న ప్రేమ చావలేదు. ఒకే గుండుతో బాధపడకుండా తక్షణం అతను మరణించాలని, అతన్ని ప్రేమతో హత్య చేయాలని ప్రాక్టీస్‌గా అలెన్‌ని కాల్చాను’ ఎథెల్ నిస్పృహగా వివరించింది.
*
(టాల్‌మేజ్ పోవెల్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి