S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..86

మీకో ప్రశ్న
-----------
సరయు నదికి గల మరో పేరు ఏమిటి?

భరతుడు తన పెత్తల్లి కౌసల్యకి చెప్పడం ఇలా కొనసాగించాడు.
‘అన్నగారు అడవికి వెళ్లాలని కోరుకున్న వాడు ఇప్పుడే, వెంటనే సర్పురుషులకి లభించే లోకాల నించి, కీర్తి నించి, వారు ఆచరించే కర్మ నించి భ్రష్టుడు అవుగాక! దీర్ఘబాహువు, విశాలమైన వక్షస్థలం గల అన్నగారు అడవికి వెళ్లాలని కోరుకున్న వాడికి తల్లికి సేవ చేయడం మాని, అనర్థకరమైన పనులని చేసే వాడికి కలిగే పాపం కలుగుగాక. అన్నగారు ఎవరి అనుమతితో అడవికి వెళ్లాడో అతను అధిక సంతానంతో, దరిద్రంతో, జ్వర రోగాలతో సదా బాధపడుగాక. రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే ఎంతటి పాపం చేసిన వాడికి ఇందాక చెప్పిన బాధలన్నీ వస్తాయో అవన్నీ నాకు కలుగుగాక.
‘రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే క్రూరుడై, చాడీలు చెప్తూ, అపవిత్రుడై, అధర్మపరుడై, నిత్యం రాజుకి ఎక్కడ పట్టుబడతామో అని భయపడుతూ, అందర్నీ మోసగిస్తూ జీవించే వాడికి ఎంతటి పాపం వస్తుందో నాకూ అలాంటి పాపం కలుగుగాక. రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే ధర్మం మీద ఆసక్తిలేక, ధర్మపత్నిని విడిచి పరభార్యలతో సంగమించిన మూఢాత్ముడికి ఎంతటి పాపం వస్తుందో అంత పాపం నాకు కలుగుగాక. రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే సంతానం లేని బ్రాహ్మణుడికి ఎంతటి పాపం ఉంటుందో (ఎంత పాపం చేస్తే బ్రాహ్మణుడికి పిల్లలు కలగరో) అంత పాపం నాకు కలుగు గాక. రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే తాగే నీటిని పాడు చేసిన వాడికి, ఇతరులకి విషం ఇచ్చిన వాడికి ఎంతటి పాపం వస్తుందో అది నాకు కలుగుగాక. రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే ఎంతటి పాపం చేసిన వాడికి ఇందాక చెప్పిన బాధలన్నీ వస్తాయో అవన్నీ నా ఒక్కడికే కలుగుగాక. రాముడు అడవికి వెళ్లడానికి నేను కారణమైతే దుష్టమైన ఇంద్రియాలు కలవాడై, బ్రాహ్మణుడి కోసం సిద్ధం చేసిన పూజకి విఘాతం కలిగించే వాడికి ఎంతటి పాపం వస్తుందో అని నాకు కలుగుగాక.’
భర్తకి, కొడుక్కి దూరమైన కౌసల్యని ఇలా ఓదారుస్తూ భరతుడు విచారంతో నేల మీద పడ్డాడు. ఇలా కష్టమైన ఒట్లు పెడుతూ, దుఃఖంతో స్పృహ తప్పి నేల మీద పడ్డ భరతుడితో కౌసల్య చెప్పింది.
‘కుమారా! నువీ విధంగా ఒట్లు పెడుతూ నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తున్నావు. దీనివల్ల నా విచారం ఇంకా పెరుగుతోంది. అదృష్టవశాత్తు నీ మనసు ధర్మమార్గం నించి చలించలేదు. సత్యంగా ప్రవర్తించే నువ్వు లక్ష్మణుడితో కలిసి సత్పురుషుల లోకాన్ని చేరుతావు.’
రాముడి మీద అత్యంత ప్రేమగల ఆ భరతుడితో ఈ మాటలు చెప్పి కౌసల్య అతన్ని ఒళ్లో కూర్చోపెట్టుకుని, కౌగలించుకుని చాలా దుఃఖిస్తూ ఏడిచింది. ఏడిచే భరతుడి మనసు విచారంతో నలిగిపోయింది. బాగా విలపిస్తూ స్పృహ తప్పి నేలమీద పడి మాటిమాటికీ వేడిగా నిట్టూర్చే భరతుడికి ఆ రాత్రి దుఃఖంతో గడిచింది. (అయోధ్యకాండ 75వ సర్గ, 47వ శ్లోకం నించి చివరి దాకా)
ఇలా దుఃఖంతో ముణిగిన కైకేయి కొడుకు భరతుడితో, మాటల్లో నేర్పుగల, మంచి మాటలు మాట్లాడే వశిష్ఠ మహర్షి చెప్పాడు.
‘గొప్ప కీర్తిగల రాజకుమారా! నీకు మంగళం అవుగాక. విచారించకు. రాజుకి ఉత్తమమైన ఉత్తరకర్మ చేయాల్సిన సమయం ఇది. దాన్ని చెయ్యి.’
ధర్మవేతె్తైన భరతుడు వశిష్ఠుడి మాటలు విని, ధైర్యం కూడగట్టుకుని ప్రేత కర్మలన్నీ చేసాడు. దశరథుడి కళేబరాన్ని నూనె తొట్టిలోంచి బయటకి తీసి నేలమీద ఉంచారు. పచ్చటి మొహం గల ఆయన నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. ఆయన్ని అనేక రత్నాలతో అలంకరించిన మంచి పడక మీద పడుకోబెట్టారు. దశరథుడ్ని చూసి భరతుడు దుఃఖంతో విలపించాడు.
‘మహారాజా! ప్రవాసం నించి నేను తిరిగి రాకుండా ధర్మజ్ఞుడైన రాముడ్ని, మహాబలశాలైన లక్ష్మణుడ్ని దూరంగా ఏం అనుకుని పంపావు? శ్రమ పడకుండా పనులు చేసేవాడు, పురుషుల్లో ఉత్తముడైన రాముడు దగ్గర లేని, దుఃఖార్తుడినైన నన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు? నాన్నా! నువ్వు స్వర్గానికి వెళ్లిపోయావు. రాముడు అరణ్యానికి వెళ్లాడు. ఇప్పుడు అయోధ్యా నగర యోగక్షేమాలు ఎవరు చూస్తారు? రాజా! నువ్వు లేని ఈ భూమి విధవై, కాంతి హీనంగా ఉంది. నాకు ఈ నగరం చంద్రుడు లేని రాత్రిలా కనిపిస్తోంది.’
దీనమైన మనసుతో ఇలా విలపించే భరతుడితో విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
‘మహాబాహు! ఇంక ఆలస్యం చేయకు. తొందరపాటు లేకుండా ఈ రాజుకి జరపాల్సిన ప్రేత కార్యాలన్నీ జరుపు’
‘అలాగే చేస్తాను’ అని చెప్పి భరతుడు వశిష్ఠుడి మాటని గౌరవిస్తూ వివిధ పనులని చేయడానికి ఋత్విక్కులని, పురోహితులని, ఆచార్యులని తొందరపెట్టాడు. అగ్నిగృహం నించి బయటకి తెచ్చిన దశరథుడి అగ్నులని ఋత్విక్కులు, పురోహితులు శాస్త్ర ప్రకారం గ్రహించారు. తర్వాత సేవకులు అశృవులు నిండిన కంఠాలతో దుఃఖిస్తూ మరణించిన రాజుని చిన్న పల్లకి మీద మోసుకుని వెళ్లారు. పల్లకి ముందు ప్రజలు వెండి, బంగారం, అనేక విధాలైన బట్టలు చల్లుతూ నడిచారు. మరి కొందరు చందనం, అగరు, గుగ్గిలం, పద్మకం, దేవదారు, సరళమనే వృక్షాల కర్రలని, ఇంకా అనేక సుగంధ ద్రవ్యాలని చల్లారు. తర్వాత ఋత్విక్కులు రాజు కళేబరాన్ని చితి మధ్యలో పడుకోబెట్టి, అతని అగ్నిలో హోమాలు, జపాలు చేశారు. సామగానం చేసే వారు యథాశాస్త్రంగా చేశారు. వృద్ధులు వెంట రాగా రాజు భార్యమంతా తమతమ అర్హతల ప్రకారం పల్లకీలు, ఇతర వాహనాలని ఎక్కి నగరం నించి బయలుదేరి వచ్చారు.
అప్పుడు ఋత్విక్కులు, శోకంతో పీడించబడే కౌసల్య మొదలైన స్ర్తిలు మండే చితి చుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు. ఆ సమయంలో అతి దీనంగా దుఃఖంతో ఏడ్చే వేల కొద్దీ స్ర్తిల రోదన క్రౌంచ పక్షుల ధ్వనిలా వినిపించింది. తట్టుకోలేక ఆ స్ర్తిలు మాటిమాటికీ ఏడుస్తూ సరయూ నదీ తీరంలో వాహనాలని దిగారు. ఆ రాజస్ర్తిలు, మంత్రులు, పురోహితులు మొదలైన వారు భరతుడితో పాటు తాము కూడా రాజుకి జలతర్పణాలని ఇచ్చి నీళ్లు నిండిన కళ్లతో నగరంలోకి ప్రవేశించి నేల మీద పడుకుంటూ పది రోజులు అతి కష్టంగా గడిపారు. (అయోధ్య కాండ 76వ సర్గ)
ఆశే్లషకి హరిదాసు చెప్పిన తప్పులని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయింది. కారణం అతను హరికథకి వచ్చే ముందే 75, 76 సర్గలని చదివి రావడంతో అవి తెలిసాయి.
మీరా తప్పులని కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
=======================
శతృఘు్నడి భార్య పేరు ఏమిటి? శృతకీర్తి

1. భరతుడు తల్లి మీద అరవడం విన్న కౌసల్య అతని కంఠధ్వనిని గుర్తించి సుమిత్రతో అది చెప్పింది. అంతే కాని హరిదాసు చెప్పినట్లుగా భటుడు భరతుడి రాక గురించి కౌసల్యకి చెప్పలేదు.
2. దారిలో దుఃఖంతో, స్పృహ తప్పి, నేల మీద పడి ఉన్న పూజ్యురాలు, మంచి మనసుగల కౌసల్యని భరత, శతృఘు్నలు చూసి అని వాల్మీకి చెప్పాడు. కాని 3వారి ఇంట్లో2 అని హరిదాసు చెప్పడం నిజం కాదు.
3. అన్నగారు అరణ్యానికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, తనకి ఎలాంటి పాపాలు అంటుతాయో భరతుడు కౌసల్యతో చెప్తూ చెప్పిన ఈ కింది వాటిని హరిదాసు చెప్పలేదు.
అ. ప్రజల నించి వారి ఆదాయంలోంచి ఆరోవంతు పన్నుగా స్వీకరిస్తున్నా, వారిని రక్షించని రాజుకి ఎలాంటి పాపం కలుగుతుందో అది కలుగుతుంది.
ఆ. మిత్రుడికి గొప్ప ద్రోహం చేసిన పాపం కలుగుతుంది.
ఇ. తన భార్యతో సంతానం కలగని, పూర్ణాయుష్షు లేకుండా దుఃఖించే వాడికి కలిగే పాపం కలుగుతుంది.
*

-మల్లాది వెంకట కృష్ణమూర్తి