బాల్యంలోనే ‘పెట్టుబడి’
Published Saturday, 16 June 2018‘క్రెడిట్ కార్డే కదా? కొనడానికి ఇబ్బందేమిటి?’ఈ మాట చాలా మందే విని ఉంటారు. డబ్బుకు సంబంధించి ఏ మాత్రం అవగాహన లేక పోవడం వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి. పిల్లలే కాదు చాలా మంది పెద్దలది కూడా ఇదే పరిస్థితి. ఒక వస్తువు ధర విన్నాక కొనడానికి ఆలోచించే వాళ్లు కూడా క్రెడిట్ కార్డుపై తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు. ఒక వస్తువును నగదు చెల్లించి కొనేప్పుడు అనేక కోణాల్లో ఆలోచించే వాళ్లు వాయిదాలపై కానీ, క్రెడిట్ కార్డుపై కానీ కొనేప్పుడు పెద్దగా ఆలోచించరు. నగదు అంటే ఎంత చెల్లిస్తున్నాం, మన వద్ద ఎంత ఉంది. ఈ నెలలో మన అవసరాలు ఏమిటి? మన వద్ద ఉన్న డబ్బుతో ఆ అవసరాలు తీరుతాయా? ఈ వస్తువు ఇప్పుడు కొనాల్సిన అవసరం ఉందా? అనే అనేక ప్రశ్నలకు మనకు మనం సమాధానాలు చెప్పుకున్న తరువాతనే అవసరం అనుకుంటేనే ఆ వస్తువును కొంటాం. అదే క్రెడిట్ కార్డుపై కానీ ఇఎంఐపై కానీ అయితే ఇంతగా ఆలోచన ఉండదు. డబ్బులేమీ ఇవ్వడం లేదు కదా? తరువాత చూసుకోవచ్చులే అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన వ్యాపారులకు కొంగుబంగారంగా మారితే, వినియోగదారులను మాత్రం అప్పుల్లో ముంచెత్తుతాయి.
కార్డు చెల్లించినా, ఇఎంఐపై నైనా డబ్బు చెల్లించాల్సిందే. రేపు సంపాదించే డబ్బును ముందుగానే ఖర్చు చేయడమే క్రెడిట్‌కార్డు. ఇఎంఐలపై కొనుగోలు చేయడం. చాలా మంది మధ్యతరగతి కుటుంబాలను ఇవి అప్పుల్లో ముంచెత్తుతున్నాయి. డబ్బుపై సరైన అవగాహన ఉన్నవారు నగదులోనైనా క్రెడిట్‌కార్డుపైనైనా ఒకే రకంగా ఆలోచించి వ్యయం చేయగలరు.
పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బుపై అవగాహన కలిగిస్తే ఇలాంటి ఆలోచనలు రావు. నగదు, క్రెడిట్‌కార్డు, వడ్డి, చెక్కు, డిడి అంటే ఏమిటి? బ్యాంకులు ఎలా పని చేస్తాయి. స్టాక్ మార్కెట్, పెట్టుబడులు, వంటి అంశాలపై పిల్లలకు సాధ్యమైనంత చిన్న వయసు నుంచే అవగాహన కలిగేట్టు చేయాలి. పెద్దయ్యాక ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినంత పాకెట్ మనీ ఇచ్చి ముద్దు చేయడం కన్నా చిన్నప్పటి నుంచే ఇనె్వస్ట్‌మెంట్ అలవాటు చేస్తే, వారికి ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవగాహన వస్తుంది. పిల్లలకు నెలకు వెయ్యి రూపాయల పాకెట్ మనీ ఇవ్వడం కన్నా , నెలకు ఐదువందల రూపాయలను కూడా మ్యూచువల్ ఫండ్‌లో ఇనె్వస్ట్ చేయడం నేర్పిస్తే వారికి అది జీవితమంతా ఉపయోగపడుతుంది.
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా ప్రపంచంలోనే సంపన్నుడిగా అనేక సంవత్సరాల నుంచి రికార్డు సృష్టించిన వారెన్ బఫెట్ తన 11ఏళ్ల వయసులోనే ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించారు. దానికి ఆయన చెప్పిన మాట 11ఏళ్ల వయసు నుంచి ఇనె్వస్ట్‌మెంట్ మొదలు పెట్టినా అప్పటికే చాలా ఆలస్యం చేశాననిపిస్తోంది అన్నారు. డబ్బు సంపాదించిన సంపన్నులు అంటే పాత సినిమాల్లో, కథల్లో చూపించినట్టు విలనే్లమీ కాదు. డబ్బు సంపాదించడం నేరమేమీ కాదు. చట్టబద్ధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకు డబ్బు సంపాదించండి. తన మరణం తరువాత 99శాతం డబ్బును చారిటీకి చెందే విధంగా బఫెట్ వీలునామా రాశారు. డబ్బు సంపాదించడమే కాదు. దాన్ని దాతృత్వానికి వినియోగించడంలోనూ తనది ప్రపంచంలో టాప్ స్థానం అని ఆయన నిరూపించుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుతో ఇనె్వస్ట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టిన బఫెట్ 14 ఏళ్ల వయసులో ఇంటింటికి న్యూస్ పేపర్ వేయడం ద్వారా సంపాదించిన డబ్బును ఇనె్వస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి పొదుపు, పెట్టుబడి అనేది వారికి అలవాటైతే వారి జీవితం క్రమశిక్షణతో సాగుతుందని, జీవితంపై సరైన అవగాహన ఉంటుందని బఫెట్ అంటారు. ఇలా అలవాటైన వారు డబ్బును వృథాగా ఖర్చు చేయరు. జీవితానికి ఏది ముఖ్యమో ఆ దిశగానే ఆలోచనలు ఉంటాయి.
బఫెట్‌కు సొంతంగా ప్రైవేటు జెట్ కంపెనీ ఉంది. ఇది ప్రపంచంలో కెల్లా పెద్దది. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ప్రైవేటు జెట్‌లో ప్రయాణించరు. డబ్బు గురించి సరైన అవగాహన లేని వారికి బఫెట్‌ది పిసినారి తనం అనిపించవచ్చు కానీ చిన్నప్పటి నుంచే ఇనె్వస్ట్‌మెంట్ అలవాటు కావడం వల్ల ఆయనకు అబ్బిన లక్షణమిది. అవసరం లేని ఖర్చు పెట్టవద్దు అనేది ఆయన చెప్పే మాట. సంపాదించడానికి ప్రాధాన్యత ఇచ్చే ఆయన 99శాతం సంపాదన విరాళం ఇచ్చారంటే ఆయనలోని మానవత్వం తెలుస్తోంది. అంత డబ్బున్న వ్యక్తి సమయం చిక్కితే ప్రపంచ దేశాలు తిరుగుతారేమో అనిపించవచ్చు. కానీ ఆయన మాత్రం సమయం దొరికితే పాప్‌కార్న్ తింట్లూ ఇంట్లో టీవి చూడడం ఆసక్తి అంటారు. సంపాదనలో ప్రపంచంలో టాప్ అయినా జీవించే తీరు మాత్రం కామన్ మెన్‌లా ఉంటుంది. పిల్లలకు సాధ్యమైనంత చిన్న వయసులోనే ఇనె్వస్ట్‌మెంట్‌ను అలవాటు చేయాలి అంటారు ఆయన. పిల్లలు ఖర్చు పెట్టడం చూసి మురిసిపోవడం కాదు. చిన్న వయసులోనే వారికి ఇనె్వస్ట్‌మెంట్‌పై అవగాహన కలిగిస్తే వారి భవిష్యత్తు జీవితానికి ఢోకా ఉండదు. 44బిలియన్ అమెరికా డాలర్ల ఆస్తితో ప్రస్తుతం ఆయన ప్రపంచంలోని సంపన్నుల్లో మూడవ స్థానంలో ఉన్నారు.
తన మరణాంతరం 99శాతం ఆస్థిని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు దాతృత్వ కార్యక్రమాలకు ఇస్తున్నట్టు వీలునామా రాసిన బఫెట్ మహా సంపన్నులు తమ ఆస్థిలో కనీసం సగం అయినా దాతృత్వానికి కేటాయించాలని అంటారు. డబ్బుపై అవగాహన ఉన్నవారే డబ్బుకు విలువ ఇస్తారు. అలాంటివారికి సంపాదించే అవకాశాలు వస్తాయి.
ఎంతో మంది సంపన్నుల కుటుంబాలు తమ పిల్లలకు డబ్బు గురించి సరైన అవగాహన కలిగించకుండా డబ్బు అప్పగిస్తే దుర్యోధనుడికి దృతరాష్ట్రుడు రాజ్యాన్ని అప్పగించినట్టుగా ఉంటుంది.