S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కెరీర్ ఎంపికే కీలకం

టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి.. ఎంసెట్, నీట్, జేఈఈ ఎంట్రన్స్‌ల హడావుడి ముగిసింది.. పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు యూనివర్సిటీలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి.. వృత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు పోటీ పరీక్షలు జరుగుతున్నాయి.. హైస్కూల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి యూనివర్సిటీకి ఎదిగే విద్యార్థులు తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకొనే తరుణం ఇదే.. ‘ఏదో ఒక కోర్సు’ అనే అలసత్వ ధోరణితో కాకుండా, పకడ్బందీగా ‘ప్లాన్’ చేసుకుంటే ‘సక్సెస్‌ఫుల్ కెరీర్’ సాధ్యమే.. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోకుంటే అవస్థలు తప్పవు..
‘్ఫలితాలు’ వచ్చాక అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. విద్యార్థులకు, టీచర్లకు కాదు- నిజంగా తల్లిదండ్రులకు ఇది పరీక్షా సమయం. కెరీర్ ఎంపికలో పిల్లల ఆలోచనలు, ఆకాంక్షలకు పేరెంట్స్ ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల్లోని ఆసక్తి, ప్రతిభ, సామర్ధ్యం గుర్తించి అందుకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ‘కెరీర్’పై నెలకొనే అయోమయం, గందరగోళం నుంచి పిల్లలను బయటపడేసే బాధ్యత అమ్మానాన్నలదే. తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దడం కన్నా పిల్లల మనోభావాలను, ఆలోచనలను పేరెంట్స్ గౌరవించాల్సిందే. పిల్లలపై ప్రేమానురాగాలు ఉండొచ్చు కానీ, ఆసక్తి లేని కోర్సుల్లో వారిని చేర్పించి సమస్యలు కోరి తెచ్చుకోవడం విజ్ఞత కాదు. సున్నితమైన టీనేజీ పిల్లల మనస్తత్వాన్ని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకొంటే ఎలాంటి సమస్యలూ తలెత్తవు.
ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కొంత స్పష్టతతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కానీ, సరైన ర్యాంకు దక్కని పిల్లలతోనే అసలు సమస్య. ఇలాంటి వారిలో అంతులేని అయోమయం, అనిశ్చితి నెలకొంటాయి. వేసవి సెలవుల కోలాహలం ముగిసి, కొత్త విద్యాసంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ విద్యార్థుల్లో, పేరెంట్స్‌లో సందిగ్ధత తొలగిపోవాలి. కొత్త కోర్సుల్లో ప్రవేశానికి సన్నద్ధమవుతున్న సమయంలో విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను, శక్తిసామర్థ్యం అంచనా వేసుకొని, వాస్తవ దృక్పథంతో కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి. కెరీర్‌పై నిర్ణయం సముచితంగా, సరళంగా ఉండాలంటే విద్యార్థులకు తల్లిదండ్రుల, అధ్యాపకుల గైడెన్స్ అవసరం. విలువైన సమయం, ధనం ఖర్చు చేశాక- ఆ కోర్సు తనకు నచ్చలేదంటే సమస్యలు అనివార్యం. అడ్మిషన్ పొందాక- మరో కోర్సులోకి మారాలన్న ఆలోచన వచ్చిందంటే ‘కెరీర్’పై తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే! అందుకే కెరీర్‌పై తుది నిర్ణయం తీసుకునేముందు క్షుణ్ణంగా ఆలోచించడం అన్ని విధాలా ఉత్తమం.
వేలంవెర్రి వద్దు..
కెరీర్ ఎంపికలో విద్యార్థి ఆసక్తి, అభిరుచి, సామర్ధ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నా, కొందరు తల్లిదండ్రులు తమ మాటే నెగ్గాలన్న ధోరణి చూపుతుంటారు. తమ పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్‌లో చేర్పించాలన్న ఆలోచన చాలామంది పేరెంట్స్‌లో ఉండడం సహజమే. అయితే- ఆ కోర్సులకు తగ్గ ఆసక్తి, నైపుణ్యం తమ పిల్లల్లో ఉన్నాయో లేదో అన్న విషయాన్ని ముందుకు తెలుసుకుని అడుగేయడం మంచిది. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలను ఇష్టం లేని కోర్సుల్లో చేర్పిస్తే వృథాప్రయాసే! ఒక విద్యార్థికి ఫలానా రంగంపై ఆసక్తి ఉంటే ఆ దిశగానే కేరీర్‌ను ఎంపిక చేసుకునేలా పేరెంట్స్ నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు మ్యాథ్స్‌పై పట్టులేని కుర్రాడిని- బలవంతంగా ఇంజనీరింగ్‌లో చేర్పిస్తే నిరాశే మిగులుతుంది. ఏదైనా కోర్సును ఎంచుకుంటే విద్యార్థి ఇష్టాయిష్టాలతో పాటు కెరీర్ పరంగా ఆ కోర్సుకు ఉన్న ఉద్యోగావకాశాలేమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు కొనసాగాల్సిన కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు ఆషామాషీ నిర్ణయాలు సరికాదు. విద్యార్థి తనకు సరిపోయే సురక్షితమైన కెరీర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఆసక్తి లేని కోర్సులో చేరితే, ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆ సబ్జెక్టుల్లో నెగ్గుకురావడం కష్టమన్న విషయాన్ని పేరెంట్స్ గ్రహించాలి. కెరీర్ ఎంపికలో ఆసక్తి, సామర్ధ్యం, సమగ్ర అధ్యయనం, సరైన అవగాహన, అనుభవజ్ఞుల సలహాలు ఎంతో అవసరం.
అబ్బాయైతే ఇంజినీర్.. అమ్మాయైతే డాక్టర్
మన సమాజంలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఉన్న ‘క్రేజ్’ ఇంతాఅంతా కాదు. అబ్బాయైతే ఇంజినీర్ అని, అమ్మాయైతే డాక్టర్ అని తల్లిదండ్రులు ఆదినుంచీ ఆరాటపడుతుంటారు. ఆ ఆరాటాన్ని గమనించే నేడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యను వ్యాపారమయం చేసిన పరిస్థితి నెలకొంది. ఐఐటీలు, ‘నిట్’లు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో తమ పిల్లలు ఇంజినీరింగ్ చదవాలని చాలామంది పేరెంట్స్ తపన పడుతుంటారు. ఇందుకోసం వారు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. ఈ నేపథ్యంలోనే అయిదో తరగతి ప్యాసైన దగ్గర నుంచి ‘ఐఐటీ ఫౌండేషన్’ అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంత ఖర్చుచేసి ‘్ఫండేషన్’ కోర్సుల్లో చేర్పించినా జేఈఈలో, ఎంసెట్‌లో సరైన ర్యాంకురాని వారు ఎందరో ఉంటారు.
క్రికెట్ తప్ప మరేవీ ఆటలు కానట్టు.. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్పితే మిగతా కోర్సులేవీ మంచి చదువులు కావన్న ధోరణి సమాజంలో ప్రబలిపోయింది. ఇతర కోర్సుల్లో చేరేవారిని సగటు విద్యార్థులుగా,
తెలివితేటలు లేనివారిగా పరిగణించడం పరిపాటైంది. ఇంజినీరింగ్ చదివితే విదేశాల్లో భారీ ప్యాకేజీలపై జీతభత్యాలుంటాయన్న భావన పెరిగిపోయింది. ‘సాఫ్ట్‌వేర్ బూమ్’, ఐఐటీల్లో క్యాంపస్ సెలక్షన్స్, బహుళజాతి కంపెనీల్లో భారీ వేతన ప్యాకేజీలు వంటివి ఇంజినీరింగ్ విద్యకు ‘డిమాండ్’ను అనూహ్యంగా పెంచాయి. అయితే- ఇంజినీరింగ్ చదివిన వారికి కూడా అవకాశాలు తగ్గిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. బీటెక్, ఎంటెక్‌లు చేసిన వారు బ్యాంకు ఉద్యోగాలకు, ఇతర నౌకరీలకు సిద్ధపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఏటా సుమారు 15 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టాలతో బయటకు వస్తుంటే- వీరిలో కేవలం మూడు లక్షల మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. 80 శాతం మందికి తక్షణ ఉపాధి గగన కుసుమమే. అమెరికాలో ఏటా కేవలం 90వేల మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తుండగా, మన దేశంలో ఏడాదికి 15లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు! దీంతో ఇంజినీరింగ్ చదివినప్పటికీ ఇతరత్రా కోర్సులను, పోటీ పరీక్షలను ఆశ్రయించక తప్పడం లేదు. కొందరు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు. మామూలు డిగ్రీతో లభించే ఉద్యోగాలకు సైతం ఇంజినీరింగ్ పట్ట్భద్రులూ పోటీ పడుతున్నారు. ‘ఇంజినీరింగ్’పై ఇపుడిప్పుడే భ్రమలు తొలగిపోవడంతో వేల సంఖ్యలో సీట్లు భర్తీకాని పరిస్థితి కనిపిస్తోంది.
ఆర్థికంగా భారమైనప్పటికీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజినీరింగ్‌లో చేరాలని తపన పడుతుంటారు. ఇంజినీరింగ్ చదవకుంటే సమాజంలో విలువుండదనే ధోరణి ప్రబలడానికి అనేక కారణాలున్నాయి. తప్పంతా తల్లిదండ్రులదే అని తీర్మానించలేం. వాణిజ్య సంస్కృతిని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న విస్తృత ప్రచారం ఈ పరిస్థితికి కారణం. ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తి చేశామని చాలామంది విద్యార్థులు సంతృప్తి పడుతున్నా, కెరీర్ పరంగా వారు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్ పట్ట్భద్రుల్లో ఇరవై శాతం మందికి కూడా నైపుణ్యాలు, ఆంగ్లభాషపై పట్టు, ప్రపంచ జ్ఞానం లేకపోవడం నేటి విద్యా ప్రమాణాల తీరుకు నిదర్శనం. ‘పట్టా’ పొందినా సబ్జెక్టుపై ‘పట్టు’ లేనందున లక్షలాది మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ‘జాబ్ మార్కెట్’లో నైపుణ్యాలను ప్రదర్శించలేకపోతున్నారు. అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో చదివిన వారు తప్ప సాదాసీదా ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఐఐటి ఫౌండేషన్’ అంటూ ఊహల పల్లకి ఎక్కేముందు- పిల్లల ఆసక్తి, ఉద్యోగావకాశాలు వంటి విషయాలపై దృష్టి సారించి ఇంజినీరింగ్ వైపు దృష్టి సారించడం ఉత్తమం.
భవిష్యత్ దిక్సూచి- ‘ఇంటర్’
మన విద్యావ్యవస్థలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుతో మొదలయ్యే కళాశాల దశ విద్యార్థి భావి జీవితానికి అత్యంత కీలకం. పాఠశాల దశకు పూర్తి భిన్నమైన ఇంటర్మీడియట్‌లో వివిధ కోర్సులు, గ్రూపులు ఉంటాయి. తన ఆసక్తి, ఆకాంక్షలకు అనుగుణంగా ఒక స్పష్టమైన నిర్ణయంతో ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు ప్రవేశం పొందాలి. ఉన్నత చదువులు, మంచి కెరీర్‌కు ఇక్కడే బీజం పడుతుంది. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్సు వంటి సబ్జెక్టులను ఎంపిక చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టుల్లోనే ఉన్నత చదువులకు, మేలైన కెరీర్‌కు బాటలు వేసుకోవాలి. కళాశాల స్థాయిలోనే కేరీర్‌కు సరైన వ్యూహం అవసరం. ఆసక్తి, అభిరుచి, నైపుణ్యాలతో పాటు భవిష్యత్‌లో అవకాశాలు, లక్ష్యసాధన, ఉపాధి, పరిశోధన వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఇంటర్‌లో ఆప్షన్ల ఎంపికపైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు, పరిశోధన, ఇతర కోర్సులకు ‘ప్లానింగ్’ ఇంటర్మీడియట్ దశలోనే అని విద్యార్థులు గ్రహించాలి. ఇంటర్‌లో ముందుచూపు ఉంటేనే భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఇంజినీరింగ్‌కు దీటుగా..
ఐఐటీలో సీటు, ఐటి కంపెనీలో ఉద్యోగం రానంత మాత్రాన నిరాశ చెందనక్కరలేదు, అంతటితో జీవితం అయిపోలేదు. ఇంజినీరింగ్‌కు ప్రత్యామ్నాయ కోర్సులు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా ఎన్నో నూతన సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. సైన్సు, టెక్నాలజీ రంగాలు అనూహ్య వేగంతో పురోగమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్స్, ఆటోమేషన్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి వినూత్న ఆవిష్కరణలు ఉపాధి రంగంలో విస్తృత అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నాయి. ప్రస్తుత డీజిటల్ యుగంలో డేటా అనెలిటిక్స్ రంగంలో ఉపాధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. డేటా సైంటిస్ట్, బిగ్ డేటా ఇంజనీర్స్, డేటాబేస్ మేనేజర్స్, డేటాబేస్ ఆర్కిటెక్చెర్స్, డెవలపర్స్ వంటి ఉద్యోగాలకు నానాటికీ డిమాండ్ పెరుగుతోంది. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ విస్తృతమవుతున్న తరుణంలో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల అవసరం ఎంతో వుంది. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోనూ నిపుణుల అవసరం వుంది. క్లౌడ్ కంప్యూటింగ్‌తోపాటు డిజైనింగ్ స్కిల్స్ కూడా అవసరమని ప్రముఖ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ మేనేజర్, వెబ్ డెవలపర్స్, డేటా అనెలిస్ట్స్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు విస్తరించడంతో సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తిచేసేవారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంటర్మీడియెట్‌లో ఎంపిసి గ్రూపుతో ఉత్తీర్ణులైనవారు ఇంజనీరింగ్‌లో సీటు రాకున్నా ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, బీఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు, హోటల్ మేనేజ్‌మెంట్, సోషల్ సైనె్సస్ వంటి కోర్సులపై దృష్టి సారిస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఫ్యాషన్ రంగం సమ్మోహనం
ఫ్యాషన్ రంగంలో మానవ వనరులకు అవకాశాలు విస్తృతం కావడంతో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)’తోపాటు అనేక యూనివర్సిటీలు, ప్రైవేటు సంస్థలు ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో వివిధ అంశాలకు సంబంధించి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి. ‘నిఫ్ట్’లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులున్నాయి. ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, నిట్‌వియర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ వంటి డిప్లొమా కోర్సులున్నాయి.
హోటల్ మేనేజ్‌మెంట్
దేశంలో ఆతిథ్య రంగం పుంజుకోవడంతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ’ పర్యవేక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలోను, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోను వివిధ స్థాయిల్లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు నడుస్తున్నాయి. బిఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తిచేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి.
ట్రిపుల్ ఐటీలు..
ఐఐటీలు, ‘నిట్’ల మాదిరి ఇపుడు ఇంజనీరింగ్ చదివేందుకు ట్రిపుల్ ఐటీలపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారికి ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సులకు అవకాశం కల్పిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలు అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉత్తమ ప్రమాణాలతో ఉన్నందున క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు కూడా అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వుంది. ఇందులో మొత్తం సీట్ల సంఖ్య వెయ్యి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయల్లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లున్నాయి. వీటిల్లో ఒక్కదానిలో వెయ్యిమంది చొప్పున ఏటా 4వేల మందికి ఇంటెగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లోని మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు, 15 శాతం ఓపెన్ కాటగిరీ కింద వుంటాయి.
చార్టెర్డ్ అకౌంటెన్సీ
ఇంటర్మీడియట్‌లో ఎంఇసి, సిఇసి, ఎంపిసి గ్రూపుల్లో ఉత్తీర్ణులైనవారు చార్టెర్డ్ అకౌంటెన్సీ (సిఏ)పై దృష్టి సారిస్తే భారీ జీతభత్యాలతోపాటు హోదా, గుర్తింపు కూడా లభిస్తాయి. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సిఏ ఫౌండేషన్ పరీక్షకు హాజరై, ఆ తరువాత సిఏ ఇంటర్ పరీక్ష రాయాల్సి వుంటుంది. డిగ్రీ, పీజీ అర్హతలను వారు ఫౌండేషన్ పరీక్ష రాయకుండా నేరుగా సిఏ ఇంటర్‌లోకి ప్రవేశించే అవకాశం వుంది. సిఏ ఫౌండేషన్‌లో నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే సిఏ ఇంటర్‌కి అర్హత సాధించినట్లే. సిఏ ఇంటర్ పూర్తిచేసినవారు రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ పొందాక సిఏ ఫైనల్ రాసేందుకు అర్హత సాధిస్తారు. సిఏ కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు కోర్సుల్లో టాక్స్ కనె్సల్టెంట్స్‌గా, ఆడిటర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో మేనేజింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ డైరెక్టర్, చీఫ్ ఎకౌంటెంట్, సిఇఓ వంటి కీలక స్థానాలను పొందవచ్చు.
మెడిసిన్‌లో సీటు రాకున్నా...
ఎవరైనా కుర్రాడు ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నాడని తెలియగానే వెంటనే ‘మెడిసిన్ చదవాలనుకుంటున్నావా?’ అని అడిగేస్తాం. డాక్టర్ కావడానికి తప్ప ఆ గ్రూపు తీసుకోవడం వృథా అనే అపోహ చాలామందిలో ఉంది. కేవలం డాక్టర్ చదువే కాదు.. ఇంకా ఎన్నో రకాల కోర్సులను అందిస్తుందీ బైపీసీ గ్రూపు. అలాంటి మంచి గ్రూపును తీసుకుని, వేగంగా ఉద్యోగంలో స్థిరపడే ఆ బంగారు కోర్సులు ఏమిటో తెలుసుకుందాం.
బీఎస్సీ అగ్రికల్చర్
వైద్యేతర కోర్సుల తరువాత మంచి డిమాండ్ ఉన్న కోర్సుల్లో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటిది. ఈ కోర్సులో పరిశోధనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంసెట్ ద్వారా ఈ కోర్సులో చేరవచ్చు. ఈ డిగ్రీ పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రిక్రెడిట్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, సాయిల్ అసిస్టెంట్, క్వాలిటీ చెక్ ఆఫీసర్, విత్తన అభివృద్ధి సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
బీఎస్సీ హార్టికల్చర్ కూడా మంచి కోర్సే. ఇందులో మొక్కల పెంపకం, గార్డెనింగ్ సైన్స్, మొక్కలపై రీసెర్చ్ వంటివి ఉంటాయి. ఎంసెట్ ద్వారా ఈ కోర్సులోకి ప్రవేశాన్ని పొందచ్చు. ప్రభుత్వ వ్యవసాయ, అటవీ శాఖల్లో ఉద్యోగాలు వస్తాయి.
ఫార్మసీ
ఎంసెట్ ద్వారా ఇందులో ప్రవేశానికి అర్హత సాధించవచ్చు. ఔషధ రంగంలో రీసెర్చ్, స్వయం ఉపాధి, కార్పొరేట్ ఉద్యోగాలను కోరుకునేవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్, పేషెంట్ కౌనె్సలింగ్, ప్రొడక్షన్, క్వాలిటీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వంటి ఉద్యోగాలను ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా పొందవచ్చు.
ఫోరెన్సిక్ సైన్స్
నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి నేరస్థులను కోర్టుకు అప్పగించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. బైపీసీ పూర్తిచేసినవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్, సీబీఐ, సీఐడీ సంస్థల్లో న్యాయ, చట్ట సంబంధ సంస్థల్లో ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.
బయో టెక్నాలజీ
ఇంటర్ తర్వాత నేరుగా బీఎస్సీ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులను ఎంచుకోవచ్చు. బయోటెక్నాలజీలో డిగ్రీ,పీజీ చేసినవారికి మనదేశంలో, విదేశాల్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ఫుడ్ టెక్నాలజీ
ఇంటర్ తర్వాత బీఎస్‌సీ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరవచ్చు. ఎంసెట్ ద్వారా ఈ కోర్సుల్లోకి అడుగు పెట్టవచ్చు. అలాగే బీఎస్‌సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే కోర్సు కూడా ఉంది. ఈ కోర్సు కాలవ్యవధి మూడు సంవత్సరాలు.
బైపీసీ పూర్తిచేసినవారికి ఇంకా బీఎస్సీ నర్సింగ్, హోం సైన్స్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, జువాలజీ, బాటనీ, హోటల్ మేనేజ్‌మెంట్, పారా మెడికల్ కోర్సులు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇంకా బీఎస్సీ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోర్సులు కూడా చేయవచ్చు.

కామర్స్‌లో అవకాశాలు..
కామర్స్‌లో డిగ్రీ చేస్తే చాలా ఉద్యోగావకాశాలు ఉంటాయి. పీజీపై ఆసక్తి లేకపోయినా ఇతర మార్గాల్లో ఉన్నత విద్యావకాశాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
బ్యాంకింగ్
కామర్స్ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లో బ్యాంకింగ్ ముఖ్యమైనది. ఈ ఉద్యోగాలకు మిగతా డిగ్రీల వారికంటే కామర్స్ వారికి ఇది అదనపు ప్రయోజనం. మర్చంట్ బ్యాంకింగ్, ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో ఉద్యోగాలకు అవకాశం బాగా ఉంటుంది.
ఆడిటింగ్
చాలా సంస్థలు ఆడిట్ వర్క్‌కు, సీనియర్ ఆడిటర్లకు సహాయం కోసం కామర్స్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటాయి.
కంప్యూటర్ అప్లికేషన్స్
కామర్స్ గ్రాడ్యుయేట్లు బిజినెస్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లలో మంచి కెరీర్‌ను తీర్చిదిద్దుకోవచ్చు.
కన్సల్టింగ్
కామర్స్ గ్రాడ్యుయేట్ చేసి కొంత అనుభవం ఉన్నవారు కన్సల్టింగ్‌లో చాలా అవకాశాలను పొందవచ్చు. ఆడిటింగ్, ఇన్‌కమ్‌టాక్స్, సర్వీస్ టాక్స్, జీఎస్‌టీ మొదలైన అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం సాధిస్తే వారికి గొప్ప భవిష్యత్తు ఉంటుంది. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు చేసినవారికి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కన్సల్టింగ్ చేసుకోవచ్చు. ఇవేకాకుండా స్టాక్ బ్రోకింగ్, చార్ట్‌ర్డ్ ఫైనాన్షియల్ అనాలసిస్, కామర్స్ టీచింగ్ మొదలైన అవకాశాలెన్నో..
మేనేజ్‌మెంట్
కామర్స్ చదివినవారికి మేనేజ్‌మెంట్ కోర్సు చాలా తేలిక. ఇదే కాకుండా మార్కెటింగ్ ఆపరేషన్స్, హెచ్.ఆర్., ఐటీ మొదలైన స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు.
సీఎంఏ
సీఏ కోర్సు తర్వాత విద్యార్థులు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ వైపు విశేషంగా ఆకర్షితులు అవుతున్నారు. ఇంటర్ తర్వాత సీఎంఏ చదవడం మొదలుపెట్టినవారైతే రెండున్నర సంవత్సరాల్లో సీఎంఏ పూర్తిచేయవచ్చు. ఇది చదివితే మేనేజ్‌మెంట్ కోర్సులను అందించే సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్‌గా ఉద్యోగాలు వస్తాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో సీఎంఏలు, చీఫ్ ఇంటర్నల్ ఆడిట్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ వంటి కీలక ఉద్యోగాలను చేపట్టవచ్చు.
కంపెనీ సెక్రటరీ
ఈ కోర్సును ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు స్థాయిల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇది చదివిన వారు బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్‌కి సలహా ఇవ్వడం, కంపెనీ ముఖ్య కార్యదర్శిగా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లుగా, బ్యాంకు మేనేజర్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి హోదాల్లో భారీ జీతభత్యాలను పొందవచ్చు.
*
దిశానిర్దేశం ఏదీ?
మన దేశ జనాభాలో 54 శాతంగా ఉన్న యువతకు విద్య, ఉపాధి రంగాల్లో సరైన దిశానిర్దేశం లభించడం లేదన్నది కఠోర వాస్తవం. చదువు పూర్తయ్యాక ఏదో ఒక రంగాన్ని ఉపాధి కోసం ఎంచుకోవాల్సి ఉన్నా, అందుకు తగినంతగా అవకాశాలు లేవు. యువత ఆలోచనలు, ఆకాంక్షల మేరకు చేయూత అందించడం అసాధ్యంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలో సుమారు 18 కోట్ల మంది నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారు. ఏటేటా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. ప్రపంచం మొత్తమీద భారత్‌లోనే అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులున్నారు. విద్యావంతులైన నిరుద్యోగుల్లో అధికశాతం మంది ఏదో ఒక రంగంలో స్థిరపడాలని ఆశిస్తున్నా వారి ఆశలు ఫలించడం లేదు. ఉన్నత విద్య పూర్తిచేసిన వారిలో 16 శాతం మందికి మాత్రమే వెంటనే ఉపాధి లభిస్తోంది. మిగతావారంతా జీవనోపాధి కోసం అనే్వషించాల్సి వస్తోంది. ఈ దుస్థితికి యువతలో వృత్తి నైపుణ్యాలు లేకపోవడమే కారణం. సాంకేతిక నైపుణ్యం, నవీన ఆవిష్కరణలు, సృజన వైపు యువతను నడిపించడం ఎంతో అవసరమని ఉపాధిరంగ నిపుణులు విశే్లషిస్తున్నారు. ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు, ఉద్యోగ సృష్టికర్తలుగా యువత ఎదగాలంటే అందుకు ‘అంకుర విధానం’ ఎంతగానో దోహదపడుతుందని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలహరణం చేసే బదులు యువత ‘అంకుర పరిశ్రమల’వైపు దృష్టి సారించాల్సి ఉంది. వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలు, సంకల్ప బలం, నిరంతర కృషి ఉంటే యువత సొంతంగా అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ఏర్పాటు చేసుకుని మరికొంత మందికి ఉపాధి చూపే అవకాశం ఉంది. ఇది కార్యరూపం దాల్చాలంటే అంకుర సంస్థల ఏర్పాటుకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేయాలి. ఐటీ, వ్యవసాయం, ఆరోగ్యం, ఆతిథ్యం, నీటి వినియోగం వంటి అనేక రంగాల్లో అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే యువత స్వయం ప్రతిభతో ఎదిగే అవకాశం ఉంది. దేశంలోని ఐఐటిలు, ఐఐఎంలు వంటి జాతీయ విద్యాసంస్థలు అంకుర సంస్థలపై యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాయి. సంప్రదాయ కోర్సులకు బదులు ‘అంకుర సంస్థల’పై యువతీ యువకులు ఆసక్తి పెంచుకునేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరం.

-రచన