S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

వాల్మీకి అసమాన
కవితా చాతురి వర్ణనాతీతం
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ-6
లక్ష్మణుడు రాముడితో అరణ్యాలకు వెళ్లి ముందర తల్లికి నమస్కారం చేసినప్పుడు, సుమిత్రా దేవి కుమారుడికి చేసిన బోధనను తెలియజేసే శ్లోకానికి పండితులు అనేక అర్థాలను చెప్పారు. అందులో సార్వజనీన సమ్మతమైనవి - ప్రధానమైనవి మూడర్థాలు. సంగ్రహంగా అవి:
మొదటిది: ‘ఇదివరకు నీవు రాముడికి కుడిచేతిలా, వెలుపల ప్రాణంలా వుండేవాడివి. ఆ భక్తితోనే ఇప్పుడు ఆయన వెంట అడవులకు పోతున్నావు. ఇదివరకు రాముడు మహారాజ కుమారుడు. పట్టణంలో అనేక భోగాలను అనుభవిస్తుండేవాడు. నువ్వూ అలానే సుఖానికి హాని లేకుండా అన్నను కొలుస్తుండేవాడివి. ఇక మీద అలా కాదు. చేయబోయేది సకల దుఃఖ నిలయ కాననవాసం. అది కూడా ఒక రోజు కాదు. 14 సంవత్సరాలు. పరివారంతో కాదు - ఒంటరిగా. నువ్వే పరిచారకుడవు. అలాంటి కష్టకాలంలో నీకు విసుగు కలగవచ్చు. జ్ఞాత వెంట నేనెందుకు కష్టాల పాలు కావాలని అనుకుంటావేమో. అలా భావించవద్దు. అడవిలో వున్నా, పట్టణంలో వున్నా, ధనికుడైనా, దరిద్రుడైనా తండ్రి ఎలా పూజనీయుడో, పితృసమానుడైన రాముడలానే, తండ్రి మీద ఎలాంటి గౌరవం వుంచాలో అలాంటిదే శ్రీరాముడి మీదుంచు. అలానే, నా మీద నీకెలాంటి గౌరవం వుందో అలాంటిదే సీత మీదుంచు. అడవిని దుఃఖాలయంగా భావించవద్దు. సుఖమైన అయోధ్యగా భావించు. సుఖదుఃఖాలు మనఃకల్పితాలు. నీ మనస్సు నీ వశంలో వుంటే ఎక్కడున్నా నీకు సుఖదుఃఖాలు సమానమే.’
రెండోది: అదే ‘రాముడ యెరుంగుమీ దశరథుడు నిజము’ అన్న సుమిత్ర మాటలకు మరో అర్థం రాముడు అడవులకు పోయిన తర్వాత ఆయన తండ్రి జీవించడని - అది నిజమని. ‘నీ తండ్రి ఎప్పుడు మరణించునో అప్పుడు నా గతేంటి? ఇక్కడే మో కైక ప్రభుత్వం. ఆమెకు నా మీద ద్వేషమన్న సంగతి నీకు తెలిసిందే. నీ తండ్రి లేకుండా, రాముడు లేకుండా, నువ్వూ లేకుండా నన్ను కైక ఇక్కడ వుండనిస్తుందా? కాబట్టి నేను పుట్టిల్లు చేరాల్సినదానే్న. అక్కడ నాకు ప్రతిష్టేముంటుంది? దశరథుడి భార్య అన్న గౌరవం నశించింది. అక్కడి వారు మన రాజు కూతురు పుట్టింటికి వచ్చిందని నన్ను - నా తండ్రిని చులకనగా అంటారు. అలాంటప్పుడు అయోధ్య గతి ఏమందువా? అయోధ్యే అడవి కాగలదు.’
మూడోది: ‘కుమారా - నేనెందుకు జ్ఞాతైన రాముడి వెంట అడవికి పోయి ప్రాణాపాయానికి లోనుకావాలనీ, ననె్నవ్వరు పొమ్మన్నారనీ, నాకై నేను చెట్టు కొట్టి మీద వేసుకొనడమెందుకనీ, నేను పోతే కలిగే లాభమేమిటనీ, పోకపోతే నష్టమేంటనీ సందేహిస్తున్నావేమో! అలాంటి ఆలోచనలు చేయవద్దు. లక్ష్మీనారాయణులుండే స్థలమే వైకుంఠం. అడవియే వైకుంఠం. అలాంటి ఏకాంత సేవ దొరకడం దుర్లభం. కాబట్టి - నాయనా, తదేక ధ్యానంతో భగవత్ సేవను అరణ్యంలో చేసుకో’ అని బోధించెను.
ఇలా నానార్థాల పద్యాలను అన్వయించేందుకు ఆంధ్ర వ్యాకరణ సూత్రాలను సమయోచితంగా అనుసంధానం చేసుకోవాలి.
అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత, శ్రీరాముడు ప్రియా వియోగానికి దుఃఖిస్తూ, అడవిలో జనులెవ్వరూ వుండకపోవడంతో, కళ్లకు కనిపించే పక్షి- వృక్ష - మృగాలను సంబోధించుకుంటూ పోతూ పోతూ, రావణుడు జటాయువుతో యుద్ధం చేసిన స్థలానికి సమీపంలో వున్న ప్రస్రవణగిరిని చూస్తాడు. చూసి ‘ఓ పర్వత రాజా! నా వల్ల ఒంటరిగా, రమ్యమైన ప్రదేశంలో విడువబడిన సర్వాంగ సుందరైన సీత నీ చేత చూడబడెనా’ అన్న ప్రశ్న వేసిన శ్లోకం (పద్యం) చక్కటి చిత్రాలంకారం. వృక్షాలకు - నదులకు వలె కాకుండా, కొండలకు ప్రతిధ్వని ఇచ్చే గుణం ఉంది. దీన్ని మనస్సులో పెట్టుకున్న కవి ఈ శ్లోకాన్ని (పద్యాన్ని) రచించారు. ప్రతిధ్వనిలో మనం అన్న మాటలే మనకు తిరిగి వినపడ్తాయి. ‘నీవు చూశావా?’ అంటే ‘నీవు చూశావా?’ అని ప్రతిధ్వని వస్తుంది. అలా వినబడిందని రాస్తే సారస్యం లేదనుకున్న వాల్మీకి ప్రతిధ్వనిగా వినపడిన శ్లోకాన్ని ‘ఓ రాజశ్రేష్ఠుడా! రమ్య వనదేశమందు నీ చేత ఒంటరిగా విడువబడిన సర్వాంగ సుందరి నా చేత చూడబడె’ అని అర్థం వచ్చేట్లు రాశారు. ఇలా ప్రశ్న - జవాబు ఒక్క వాక్యంగానే వుంటే చిత్రాలంకారం అవుతుంది. ఇంత దీర్ఘంగా ఊహించి రాసిన కవి ఇంతవరకూ ఒక్క వాల్మీకే. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు.
వాల్మీకి రామాయణంలోని పాత్రలు - పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్తవృత్తి గుణాలను తెలియజేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. దశరథుడి మృతి గురించి కైక భరతుడికి చెప్తూ ‘ఎల్ల భూతములకు నెయ్యదిగతి నీదు తండ్రి యట్టి గతికి దనయ యరిగె’ అని అంటుంది. తానేదో ఘనకార్యం సాధించినట్లు కైక చెప్పిన పద్ధతిలో, ‘తన భర్త చావు గురించి, తన కుమారుడితో ఏ తల్లైనా చెప్తుందా? ఇదే వాల్మీకిలోని ప్రత్యేకత. ఇదే వార్తను భరతుడు శ్రీరాముడితో మరోలా చెప్తాడు. ‘నిను దలంచియ యేడ్చుచున్.. నీదు దర్శన కాంక్షియై.. జనకుడక్కట యస్తమించెను జాల నినె్న స్మరించుచున్’ అని దీనోక్తిగా అంటాడు. వినాశ కాలానికి నోటి నుంచి విపరీత వాక్యాలే వస్తాయి. శుభ వాక్యాలు, అశుభ వాక్యాలుగా అవుతాయి.
మరో సందర్భంలో, మొట్టమొదట వానరుల మీదకు యుద్ధానికి పొమ్మని ధూమ్రాక్షుడుని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఆజ్ఞాపిస్తూ ‘నీవు వధార్థమై మదవనేచర యుక్తుడు రాముమీదికిన్’ అంటాడు. రావణుడి కోరిక రామాదులను చంపటానికే అయినా, ‘నువ్వు చావడానికి’ అన్న విపరీతార్థం వచ్చింది ఆయన మాటల్లో. శ్రీరామచంద్రుడు ఎలా ‘ఆత్మవంతుడో’ అలానే కుంభకర్ణుడు ‘వపుష్మంతుడు’. అతడిది సహజ శక్తి. వరబలం కాదు. కేవలం దేహం మీదే దృష్టి నిలిపేవాడి కుండే పెద్ద దేహముందతడికి. బలం, తాగుబోతు దనం, నిద్దురబోతుదనం, తిండిబోతుదనం లాంటి గుణాలన్నీ పరిపక్వ దవకొచ్చి వాడిలో నిలిచాయి. ఇలాంటి వాడు, తను రాముడి మీదకు యుద్ధానికి పోతానని రావణుడితో అంటాడు. ఆయన చెప్పిన మాటల్లోనూ విపరీతార్థం స్పష్టంగా స్ఫురిస్తుంది. ‘... బోదు హతుడుగాగ, రామవిభు డక్షయంబుగ రమణి సీత బొంద గలుగును...’ అని కుంభకర్ణుడితో అనిపించాడు వాల్మీకి.
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా.. 7036558799 - 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12