S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్టీఆర్- మనిషి- దేవుడు

‘సినిమా హీరో అంటే ఇలా ఉండాలి’ అనిపించే శరీర సౌష్టవం ‘నటరత్న’ ఎన్టీఆర్‌ది. అంతేకాదు, ‘జీవితం అంటే ఇలా ఉండాలి’ అని కూడా అనిపిస్తుంది ఆయన జీవితాన్ని చూస్తే. జీవిత చరమాంకంలో ఎన్టీఆర్ ఆవేదనను చూసిన ఆయన ప్రత్యర్థులు సైతం అలాంటి ముగింపు ఎవరికీ ఉండకూడదని బాధపడ్డారు. ఎన్టీఆర్ మరణం తరువాత కూడా రాజకీయంగా ఆయన పేరు ఉపయోగించుకోవడం, దేవుడిలా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల ఆయన చివరి రోజులు ఎలా గడిచాయనే ఆలోచన చాలామందికి రాదు.
ఆత్మ గౌరవానికి ప్రతీకగా సుయోధనుడి పాత్రను తీర్చి దిద్దిన ఎన్టీఆర్ తన జీవిత కాలమంతా అలానే బతికారు. తీవ్రమైన ఆవేదనతో ఆయన చివరి రోజులు గడిచాయి. అంతకన్నా చిత్రం ఏమంటే- 23 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చివరి రోజులు ఎలా గడిచాయో ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పినా కొందరు నమ్మలేని పరిస్థితి. అల్లుడు ఎలా మోసం చేసిందీ, తానెంత మానసిక క్షోభను అనుభవించిందీ స్వయంగా ఎన్టీఆర్ జామాత ‘దశమ గ్రహం’ అనే వీడియో క్యాసెట్ రూపొందించారు. రాజకీయ ప్రత్యర్థులు ఈ వీడియోను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి తీసుకు వస్తే, కొంతమంది ఐటీ యువకులు ఇది మార్ఫింగ్ అని కొట్టిపారేశారు. ఒకవైపు రాజకీయ పక్షం ఎన్టీఆర్‌కు దేవుడిగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరుపుతుంటే ఆయన చివరి రోజులు దయనీయంగా గడిచాయి. మానసిక్ష క్షోభతో మరణించారని చెబితే ఐటీ తరం నమ్మడం కష్టమే.
ఎన్టీఆర్ ఎప్పుడూ తనకు తానే ముఖ్యం అనే ధోరణితో ఉండేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో యువత ఉద్ధృతంగా పాల్గొన్న కాలంలో ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ చేరుకున్నారు.
***
1965లో మద్రాస్‌లోని ఒక స్టూడియోలో ‘వీరాభిమన్యు’ షూటింగ్ జరుగుతుంటే విరామ సమయంలో నటీనటులంతా రాజకీయాలపై మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ వారి మాటలు విని మొహం చిట్లించి- ‘మనకెందుకీ రాజకీయాలు.. మనకేమన్నా కూడు పెడతాయా? మన వృత్తితో కుటుంబాల్ని పోషించుకోవడం మనకు ముఖ్యం’ అని వెళ్లిపోయారట! రాజకీయాలంటే అంతగా చీదరించుకున్న అదే ఎన్టీఆర్ 1982లో ఏకంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు.
1965లో నటుడిగా వెలిగిపోతున్న కాలంలో ఆయనకు సినిమాలే ముఖ్యం. 1982నాటికి 60 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. హీరోగా ఇక అవకాశాలు అంతగా ఉండవు. అప్పటి వరకు తనకున్న ‘ఇమేజ్’ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండు సందర్భాల్లోనూ ఆయన ఆలోచనల్లో- తన భవిష్యత్తే తనకు ముఖ్యం.
ఎన్టీఆర్ కన్నా ముందు ‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తరలి వచ్చి సినిమా స్టూడియో నిర్మిస్తే, ఎన్టీఆర్ వ్యతిరేకించారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాకే తన మకాంను హైదరాబాద్‌కు మార్చారు.
1965 ప్రాంతంలో ఓ పత్రికలో ఎన్టీఆర్ రాసిన ఒక వ్యాసంలో రావణాసురుడిపై తన అభిమానం చాటుకున్నాడు. అప్పటి వరకు పురాణాల్లో విలన్లుగా భావించిన రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఇంద్రజిత్ వంటి పాత్రల్లో జీవించిన ఎన్టీఆర్ వారిని హీరోలుగా చేసి మన హృదయాల్లో నిలిచిపోయేట్టు చేశారు.
అభిమానులు ఆయన్ని శ్రీరాముడు, శ్రీకృష్ణుడుగా భావించి పూజించే వారు. చిత్రంగా- ఆయన మాత్రం పురాణాల్లోని ప్రతినాయకుల పాత్రలను ఇష్టపడ్డారు. బ్రిటీష్ వారి పాలనా కాలంలో జిల్లా కలెక్టర్లు క్లబ్‌లకు ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే వారు. యువత స్వాతంత్య్ర పోరాటం వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్లు యంగ్ మెన్స్ క్లబ్ వంటివి ఏర్పాటు చేసి నాటకాలను ప్రోత్సహించారు. అలాంటి క్లబ్స్‌ను ఎన్టీఆర్, సావిత్రి, అక్కినేని వంటి ఎంతో మంది నటులకు ప్రాణం పోశాయి. తొలి తరం నటులు ఎక్కువ మంది ఇలాంటి క్లబ్‌ల ద్వారా వెలుగులోకి వచ్చిన వారే.
సినిమా రంగంలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ క్రమంగా తనను తాను దైవాంశ సంభూతునిగా భావించే వారు. మిగతా నటులు కూడా ఆయనకు పాదాభివందనం చేసేవారు. తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్‌ను చూసి వస్తేనే చాలా మందికి యాత్ర పరిపూర్ణం అయినట్టు. లక్షలాది మంది అభిమానులు పాదాభివందనం చేసేవారు.
సినిమా శకం ముగింపు దశలో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సైతం ఈ పాదాభివందనం సంస్కృతి యధావిధిగా కొనసాగింది. రాజకీయాల్లో ఈరోజు పాదాభివందనం చేసిన వారే సమయం వస్తే కిందకు తోసేస్తారు. అదే జరిగింది. ‘నా పేరుతో గాడిదను నిలబెట్టినా గెలుస్తుంది’ అని ప్రకటించిన ఎన్టీఆర్ అన్నట్టుగానే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయిలో ఘన విజయం సాధించారు. అంతటి ఘన విజయం సాధించిన ఎన్టీఆర్‌ను స్వయంగా అల్లుడే నాయకత్వం వహించి అధికారం నుంచి దించేశాడు. కనిపిస్తే చాలు తన కాళ్లకు మొక్కి పరవశించే నాయకులు తనను ఎదిరిస్తారని ఎన్టీఆర్ కలలో కూడా ఊహించలేదు.
భక్తులు తిరుగుబాటు చేస్తారని, వెన్నుపోటు పొడుస్తాడని ఏ దేవుడూ ఊహించడు. కలలో కూడా అనుకోడు. ఎన్టీఆర్ కూడా సరిగ్గా అంతే. ఈ అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేక పోయారు. ఎన్టీఆర్ తనను తాను దైవంగా భావించి ఆలానే వ్యవహరించడం వల్ల ఒకటి కాదు రెండు సార్లు ఆయన్ని ఆయన కాళ్లు మొక్కిన వాళ్లే దించేశారు.
తనకు తిండిపెట్టే వారు కూడా లేనందునే లక్ష్మీపార్వతిని చేరదీసినట్టు దీనంగా చెప్పుకున్నారు. బ్యాంకులో పార్టీ పేరు మీద ఉన్న డబ్బును సైతం సీజ్ చేయడాన్ని తట్టుకోలేక పోయారు. చివరకు తన సంతానం కూడా తనకు ద్రోహం చేసిన వారి వైపు నిలవడాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. కొన్ని దశాబ్దాల పాటు తనను తాను దైవంగా భావించిన ఎన్టీఆర్ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆవేదనతో ప్రాణాలు వదిలారు. చివరకు ఎన్టీఆర్ భౌతిక కాయం కోసం కూడా ఒకవైపు రెండవ భార్య వర్గం మరోవైపు మొదటి భార్య సంతానం ఎల్‌బి స్టేడియంలో బాహాబాహికి దిగింది.
ఎన్టీఆర్‌కు చాలామంది పిల్లలు ఉన్నా, వారు ఆయనలా పేరు తెచ్చుకోలేక పోయారు. ఏ రంగంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా మనిషి ఎప్పటికీ భగవంతుడు కాలేడు. ‘నేను భగవంతుడిని కాను, మనిషిని’ అనే ఆలోచన ఉంటే ఎన్టీఆర్ జీవితం ముగింపు దశ అలా ఉండేది కాదేమో! ఈ రోజుల్లో 80 నుంచి 90 ఏళ్ల వయసు వరకు హాయిగా బతికేస్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆసనాలు వేస్తూ ఎంతో ఆరోగ్యంగా కనిపించే ఎన్టీఆర్ మానసిక క్షోభతో 74 ఏళ్లకే మరణించడం విషాదం.

-బి.మురళి