S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గీతార్థము సంగీతానందము

జెండాపై కపిరాజు, ముందు సీత వాజిశ్రేణియున్ బూన్చి
నేదండంబున్ గొని తోలుస్యందనము మీదన్
నారిసారించుచున్, గాండీవంబు ధరించి
ఫల్గుణుడు మూకన్ చెండుచున్నప్పుడు
ఒక్కండును నీమొఱాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్‌॥
పౌరాణిక పద్యనాటకానికి దశ, దిశా నిర్దేశించి తెలుగుభాషలోని తియ్యదనాన్ని, సొగసుల వైభవాన్నీ ఈ నేల నాలుగు చెరగులా వెదజల్లిన గానగంధర్వులను గుర్తుచేసే పద్యమిది.
స్టేజీ ఎక్కి మాట్లాడుతూ, పాత్రలను చూస్తూ ప్రేక్షకులను గమనిస్తూ, శ్రుతి శుద్ధంగా పద్యం విసిరి పాడటం ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. సినిమా డైలాగుల్లా సులువూ కాదు. పండితుల్నీ, పామరుల్నీ అక్షరజ్ఞానం బొత్తిగా లేని జానపదులను కూడా వశపరచుకుని, కాగితం, కలం లేకుండా విన్న పద్యం, విన్నట్లుగా పాడించుకుని వాళ్ళ చేతనే ప్రచారం చేయించుకున్న అలనాటి పౌరాణిక నటనా దురంధరులనూ, గాన గంధర్వులనూ తెలుగుజాతి మరువగలదా? రాత్రనక, పగలనక, విరామం కూడా లేకుండా తిరిగి తిరిగి పద్య వైభవాన్ని చాటిన ఆ మహానటులను ఎలా మర్చిపోతాం?
‘‘అదిగో ద్వారక! ఆలమందలివిగో’’ అనే పద్యం వినబడిందంటే ‘పాండవోద్యోగ విజయాలు’ నాటక ప్రదర్శనకు నాంది అన్నమాట. ఆడుతూ, పాడుతూ అలవోకగా వ్యావహారిక భాషలోని ‘కాకువు’తో తిరుపతి కవులు అలవాటు చేసిపెట్టిన ఈ పద్యాలు తెలుగువారి కీర్తిని హిమాలయ శిఖరాలతో సమానంగా నిలిపాయనటంలో ఏముంది సందేహం? నా చిన్నప్పుడు శ్రీ కృష్ణపాత్రలో అబ్బూరి వరప సాదుగారనే నట చక్రవర్తి కంఠంలో ఒదిగిన పద్యం ఇది. అందమైన గమకాలతో కపిరాజును మోహన రాగంలో ఆవిష్కరించిన మరుక్షణం వన్స్‌మోర్‌లతో ప్రాంగణం దద్దరిల్లిపోయేది.
‘సంతోషంబున సంధి సేతురే’ అంటూ చల్లగా ‘బృందావనిలో’ అందుకోగానే జనం ఒక్కసారిగా చల్లబడిపోయేవారు. ఎదురుగా కూర్చుని దిక్కులు చూసేవాళ్ళు కాదు. వినేవాడిని బట్టే పాట, పద్యానికి ప్రాణం బోసిన, గానగంధర్వులైన నటగాయకులకు నీరాజనాలెత్తిన రోజుల్ని తలచుకుంటే మనసు పులకిస్తుంది. అభిమాన సంఘాలంటూ లేవు. తెలిసినది తక్కువ. తెలుసుకోవలసినది.. అబ్బో! చాలా వుందనుకున్న ఆ నటులూ, ఆ పద్యాలు రసికులైన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయాయి. ఈ తరం ఎరుగరు. మోహనరాగ సంచారం అంటే ఆరోహణ, అవరోహణ క్రమం.. రాగభావాన్ని వ్యక్తపరిచే గమకాలు, సంపూర్ణంగా ఆవిష్కరించగలిగిన గాయకులు, నటులు పుట్టిన గడ్డ మనది.
***
వర్తమానంలోనే బ్రతుకుతూంటాం. కానీ గతాన్ని మరచిపోతే బతుకే లేదు. ఆంజనేయుడు చూడండి. కపిశ్రేష్టుడైన అంజనానందుడు రామాయణ రథసారథియై, భక్తజన హృదయవాసియై నిలిచిపోయాడు. చిత్తం వచ్చినట్లు తిరిగే చిత్తాన్ని అదుపులో వుంచుకున్న వాడివల్లే సకల కార్యాలూ నెరవేరుతాయనుకున్న వానరులు మరో వానరుణ్ణి ఎంపిక చేశారు. ఈ వానర శ్రేష్టుడు వేరు. బుద్ధిమంతులలో శ్రేష్టుడూ, మనస్సు కంటే వేగంగా వెళ్ళేవాడు, నాలుగు వేదాలూ తెలిసినవాడూ, తక్కవ్యాకరణ శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన జితేంద్రియుడైన హనుమంతుణ్ణే లంకానే్వషణకు పంపారు.
వాహినీశ తరణ దశ
వదన సూను తనుహరణుడైన హనుమాన్, భగవద్గీతలోని సారాంశాన్ని కూడా గ్రహించి ఆనందించిన బుద్ధిశాలిగా భావించిన త్యాగరాజు
‘‘గీతార్థము, సంగీతానందము
నీతావున జూడరా? ఓ! మనసా॥
సీతాపతి చరణాబ్ధము నిడుకున్న
వాతాత్మజునికి బాగ తెలుసురా॥
హరిహర భాస్కర కాలాది కర్మములను
మతముల మర్మముల నెరింగిన
హరివర రూపుడు, హరిహయ వినుతుడు
వర త్యాగరాజు వరదుడు సుణిరా’’
అని కీర్తించబడిన ఆ జెండాపై కపిరాజు మొత్తం మహాభారత యుద్ధాన్ని వీక్షించడం ఒక్కటే కాదు. యుద్ధం వద్దంటూ సందిగ్ధంలో పడ్డ అర్జునుడికి కృష్ణపరమాత్మ ప్రబోధించిన ‘‘్భగవద్గీత’’ను విన్న ప్రథమ శ్రోత.
నిర్వీర్యుడై నిస్తేజంతో దిగాలు పడిపోయి తలపట్టుక్కూర్చున్న పార్థుడి హావభావాలనూ, దైన్యస్థితినీ కూడా దగ్గరుండి గమనించినవాడూ రుూ కపిశ్రేష్టుడే. భారతీయ సంగీతంలో హనుమత్సంప్రదాయం, నారదసంప్రదాయమని రెండున్నాయి. ఔత్తరాహికులు (హిందూస్తానీ విద్వాంసులు) హనుమంతుణ్ణీ, దాక్షిణాత్యులు నారద సంప్రదాయాన్ని అనుసరిస్తారు. స్వరార్ణవమర్మాలన్నీ నారదుని వల్ల తెలుసుకున్న త్యాగయ్య వర్ణించిన సంగీత కోవిదుడు హనుమంతుడే. నవవ్యాకరణవేత్త, సూర్యుని శిష్యుడైన హనుమంతుడికి గీతార్థాలు తెలియటంలో విశేషం వుంది. హనుమంతుని కాలంలో గీతార్థాలెక్కడున్నాయి?
ధర్మాలు, అర్థాలు, తత్త్వాలు, మర్మాలు, కర్మలు మొదలైనవైతే వున్నాయి. ఉపనిషత్సారంగా ఉద్భవించినది మాత్రం భగవద్గీత. సంగీతానందం ఎలాగూ హనుమంతుడికి లభించినదే. అదే శ్రీరామ పాద సేవానందం. అర్జునుడికి స్తిమితం లేని దశలో ‘గీతోపసారం’ మనసుకు పట్టే అవకాశం తక్కువనే భావంతో జితేంద్రుడైన హనుమంతుడికి ఆ గీత వినే భాగ్యం కూడా కలిగింది గదాయని త్యాగయ్య ఆనందంతో రాసిన కీర్తన. హనుమంతుడిది రాళ్ళు కరిగించే గానమంటారు. ఒకవైపు గీతార్థాన్ని మరోవైపు సంగీతానందాన్ని అనుభవించిన ‘అతడే ధన్యుడురా!’ అంటూ శ్లాఘించాడు త్యాగయ్య. వెనక చూపు లేకుండా, తన మనస్సు రంజిల్లే విధంగా రామనామ స్మరణ చేసిన వాతాత్ముజుడు శివాంశ ఇంద్రాది దేవతల చేత కొనియాడబడ్డవాడు.
విష్ణు, శివ, సూర్య, కాల, కర్మ మొదలైన ఉపాసనా విధానాల రహస్యాలన్నీ తెలిసిన జ్ఞాని. అన్నీ లయమైపోయే స్థానాన్ని అంటే తావును, బాగా ఎరిగిన బుద్ధిమంతుడు. రాముడైనా, కృష్ణుడైనా.. అవతారాల్లో మార్పేగానీ, అసలు స్వరూపం ఒక్కటేగా! గీతార్థజ్ఞానంతో ఎటువంటి అనుభవం కలుగుతుందో, నాద బ్రహ్మోపాసనతో కూడా అదే అనుభవం సిద్ధిస్తుందని త్యాగరాజు నిర్ణయించారు. ఈ రెండింటికీ మనస్సే సాధనం. ఈ ఆత్మానుభవాన్ని, సంగీతానందాన్ని ఒక్కటిగా భావించిన వారిలో ఆంజనేయుడు ఆది గురువు. అర్జునుడి రథానికి కేతనమై కృష్ణుడుపదేశించిన భగవద్గీతను ధారణ చేసి తానో భాష్యం వ్రాసినట్లు ప్రసిద్ధి.
‘‘ ఏం జరిగిందో అది నీ మంచికే జరిగింది. ఏం జరుగుతుందో అది కూడా నీ మంచికే లాంటి వాన్యౌలతో వున్న మాటలను గీతాసారమన్న బోర్డులు యిళ్ళల్లో తగిలించుకుని తృప్తిపడటం కాదు. అధ్యయన్చరణం కావాలి. గీతార్థం కొంతైనా తెలిస్తే సంస్కారం అబ్బుతుంది. సంస్కారముంటే సమర్పణ భావం దానంతటదే బయలుదేరుతుంది. గిట్టేవరకూ ఏ కోరికలూ పుట్టవు. అంతర్ముఖులై గానం చేయాలనిపిస్తుంది. ఆత్మలో పరమాత్మను దర్శించాలనిపిస్తుంది. మొదటిది లేకపోతే రెండోది దొరకదు. మనలోని రాక్షసులు మాయమయ్యేవరకూ మనకాయనే శరణ్యం. అందుకే గీతార్థము సంగీతానందము రెండూ వాతాత్మజుడికే తెలుసని నిర్థారించారు. మృదువైన మాటలకు మధురమైన నాదాన్ని రాజుస్వామికే యిది సాధ్యం. మొదటిసారి రావణుడు, హనుమంతుణ్ణి చూడగానే, ఆయనలోని దైవశక్తి, భగవదంశ, తేజస్సూ, ఓజస్సూ చూసేసరికి ‘భగవదవతారమేనేమో?’ అన్న భ్రాంతి కలిగిందంటే కారణం రావణాంతఃపురస్ర్తీలను, అప్సరసలను వివిధావస్థలలో చూశినా మనస్సు చలించకుండా వుండటం ఆంజనేయస్వామికే చెల్లింది. ఆయన్ని గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఎన్నైనా చెప్పవచ్చు. ఏమి నేర్చుకుంటామనేది ప్రశ్న.

- మల్లాది సూరిబాబు 90527 65490