S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాటకేది ప్రాణాధారం?

వాస్తవిక జీవితంలో పాట సహజమా? కాదా? అని ప్రశ్నించుకుంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో సహజమే అనిపించే ఘటనలు మనకు తారసపడుతూంటాయి. ఉన్నది లేనట్లూ, లేనిది ఉన్నట్లుగా భ్ర మింపచేసే మాయా ప్రపంచంలో బతికేస్తున్నాం. నిజంగా ఆలోచిస్తే, యింట్లో భార్యాభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ షికారుకెళ్ళే సందర్భాల్లో డ్యూయట్లు పాడుకుంటారా? అటు పదిమందీ, యిటు పదిమందీ ఎగిరి గంతులేస్తూ పార్కుల్లో కేరింతలతో పదిమందీ చూస్తుండగా పాడేస్తూ పరుగులిడతారా?
భార్యాభర్తలిద్దరూ దూరమైతే విషాదగీతాలాలపిస్తారా? అదంతా సినిమా(య)లోకం ఆచరించడానికి ప్ర యత్నం చేస్తే జనం వెర్రిగా చూస్తారు. చూడటానికీ, వినటానికే పరిమితం. కానీ పాట జీవితంలో ఒక భాగం అనటానికి మీకో చిన్న ఉదాహరణ. స్కూళ్ళలో చదువుకునే రోజుల్లో మన పక్కనే కూర్చున్నవారు లేదా ఆ తరగతిలో మనతోబాటు చదివినవారు ఎందరో వుండవచ్చు. కానీ మనకు బాగా గుర్తుండిపోయేది మాత్రం కొందరే. ఆ కొద్దిమందిలోనూ పాటలు పాడేవారిని అస్సలు మరిచిపోలేరు. ఎనే్నళ్ళైనా వాళ్ళే గుర్తుండిపోతారు చూడండి.
యిటీవల కొందరు దివ్యాంగులు, దృష్టిలేనివారు, ప్రీ రికార్డెడ్ ఆర్కెస్ట్రా (కరోకె) రోడ్ల మీద నిలబడి సుస్వరంతో పాడే పాటకు ఎందరు గుమిగూడి నిలబడిపోతారో గమనించారా? జాలిపడతాం. ఏళ్ళ తరబడి గురుముఖంగా నేర్చుకున్నవారు సైతం వారిలో ధైర్యంగా పాడగలరా? అనిపిస్తుంది. ఆగండి! కాస్సేపు నా పాట విని వెళ్ళమన్నట్లు జనమంతా పోగై వింటారు. అలా పాడేవాళ్ళలోని అంకితభావం, వాళ్ళ పాట మీద వాళ్ళకున్న సంపూర్ణ విశ్వాసం, అదే వారికి మిగిలే తృప్తి. 24 గంటలూ రోడ్లమీద వినబడే కారు హారన్ల శబ్దాలు వేరు. మధురంగా వినబడే నాదంలోని ఆకర్షణ వేరు. ఒకటి ధ్వని: ఇంకోటి నాదం. ‘‘సంగీత జ్ఞాన విహీనులకు అసలు మోక్షముంటుందా?’’ అని ధైర్యంగా వేసే ప్రశ్నకు వుందని చెప్పే వాళ్ళింత వరకూ పుట్టలేదు.
ఏ పాటకైనా శ్రుతితోబాటు లయ ప్రధానమని అందరికీ తెలిసినదే. నా చిన్నతనంలో పదిమందీ కలిసి, సాయంత ం పల్లెటూళ్ళలో కొన్నిచోట్ల ఆగుతూ చేతుల్లో చిరతలతో, పంచెకట్టుతో బ్రహ్మాండమైన లయజ్ఞానంతో పాడే పాట వినేవాణ్ణి. మాటలు ఎలా విడగొట్టి పాడేవారో గమనించండి.
గోపాలా కృష్ణుడు... పక్షీ
గోవిందా కృష్ణుడు... పక్షీ
యశోదా కృష్ణుడు... పక్షీ
ముకుందా కృష్ణుడు... పక్షీ
ఒకరి తర్వాత మరొకరు వరసగా ఒకడు గోపాలకృష్ణుడని పాడుతూంటే మిగతావారంతా పక్షీ అంటూ రకరకాల విన్యాసాలతో పాడీ, పాడీ చివరకి ‘‘వాహన మెక్కేనూ...’’ అని ముగించేవారు. పక్షివాహనం కాస్త రెండు ముక్కలై వినబడేది. తాళంలో పాడుతున్నామనే ధ్యాస తప్ప పదభంగవౌతున్న సంగతి వాళ్ళకు తెలిసేది కాదు. జనం కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదనుకోండి. వారి లక్ష్యం ఒక్కటే రక్తిగా పాడేయటమే. ఒకప్పుడు మన యిళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యాల్లోనూ, పెండ్లీ పేరంటాల్లోనూ పాటకే ప్రాధాన్యం. బావమరదళ్ళ పాట, విందుపాట, నలుగు పాట, వియ్యపురాలి పాట, అప్పగింతల పాటలతో మారు మ్రోగిపోయేది. ఆఖరిఘట్టం ‘‘అలకపాన్పు’’. అక్కడ కూడా పాటే. యిప్పుడు ఆ పాటలన్నీ కనుమరుగైపోయాయి. మాటలకే సమయం లేనప్పుడు యింక పాటలెక్కడ? ఆ పాటలు పాడేవారేరి? యితరులు పాడితే వినే చైతన్యం యింకా మిగిలివుంది. సినిమా పాటల వ్యామోహం ముదిరిపోయి పాకానపడితే సంప్ర దాయాన్ని పట్టించుకునేవాళ్ళేరి?
ముతె్తైదువులందరూ కలిసి పాడే ఆ పాటల్లో ఒక్కమాట కూడా గౌరవహీనంగా ఉండేది కాదు. ఎగతాళి హద్దులు మించకుండా కవ్విస్తున్నట్లుగా వుండేవి.
ఒకరినొకరు ఆట పట్టించటమే ధ్యేయంగా పెళ్ళిపాటలు పాడగలిగిన హుందాగా వుండేవా పాటలు. ముతె్తైదువులు, ఏ కొద్దిమందో వుండేవారు.. ఒకరిని విని చూసి నేర్చుకుని పాడేవారు. నలుగురూ పాడితే అపశ్రుతి వుండేది కాదు. వినబుద్ధేశేది. పాట గాయకునికి లొంగి వుండాలంటే ఎంతో సాధన కావాలి.
తెనాలిలో సీతారామగానసభ నడిపి తన యావదాస్తినీ సంగీతాభివృద్ధికోసం ఖర్చుపెట్టిన సంగీతరసికుడొకాయన వుండేవారు. ఆయన పేరు నారుమంచి సుబ్బారావు. ఎంత పెద్ద విద్వాంసులు పాడిన తన హృదయం కరిగించగలవాడే నిజమైన విద్వాంసుడనేవాడు ఆర్ద్రత లేని సంగీతం అసలు సంగీతమే కాదనేవాడు. ఇది సత్యదూరం కాదు. నిజానికి వినేవాడి మనసు రంజిల్లింపచేయటం కత్తిమీద సాములాంటిది. ‘‘సీతావర! సంగీత జ్ఞానము ధాత వ్రా యవలెరా మనసా’’ అంటాడు త్యాగరాజు. బ్రహ్మదేవుడు రాశేదేమిటి? మనిషి చేయగలిగేదేమిటి? అనే ప్రశ్నకు సమాధానం, పైవాడిచ్చేది విభూతి. సంపాదించవలసినది విద్వత్తు. ఎటువంటి సాధన? కోలాహల సప్తస్వరముల గురుతే సాధన. సుందరమైన రూపం, సుమధుర గాత్రం దైవాధీనాలే. కంటికి కనిపించే స్వరాలకూ చెవికి వినిపించే స్వరాలకూ తేడా తెలియాలి.
ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల? భాండశుద్ధిలేని పాకమేల? అన్నట్లుగా బలమైన శరీరం కాదు ఉండవలసిన ముఖ్యలక్షణం. సుస్వరంతో కూడిన శారీరం(కంఠస్వరం) సంగీతారంభం సరళీ స్వరాలతోనే రెండు మూడు కాలాల్లో స్వరాలను అవలీలగా పలికించగల సమర్థతా, స్వరం మీద పట్టుదొరికితేగానీ పాటలమీద దూకేస్తారు చాలామంది.. అంతే సంగతులు. సంగీతంలో వెనకబడ్డానికి వేసే ముందడుగు యిదే ‘‘రజితగిరీశుడు నగజకు తెల్పిన స్వరార్ణవ మర్మాలు నారదుడి ద్వారా అందుకున్న త్యాగయ్య ‘‘నాభిహృత్కంఠరసన నాసాదులలో శోభిల్లే’’ సప్త స్వర సుందరులను స్వాధీనం చేసుకోనున్న ఉపదేశాన్ని అందుకున్నవారు విద్వాంసులౌతారు. మిగిలినవారు కేవలం గాయకులుగా మిగిలిపోతారు.

ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు పి.బి. శ్రీనివాస్ వేలాది పాటలు ఎనె్నన్నో భాషల్లో పాడారు. గాయకుడే కాదు. కేవలం స్వయంకృషితో బహుభాషా రచయితగా సంస్కృతం, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ‘ప్రణవం’ పేరుతో కవితలు రాసిన ప్రజ్ఞాశాలిగా నాకు బహుపరిచయమున్న వ్యక్తి. విచిత్ర వేషధారణ ఆయన ప్రత్యేకత. మహారాజా టోపీ విధిగా వుండేది. మద్రాసు వెళ్ళినప్పుడల్లా ఒక హోటల్‌లో కూర్చుని సంగీత విషయాలు చర్చించుకుంటూ వుండేవాళ్ళం. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ. విద్యార్థుల్లో నిర్దిష్టమైన తాళజ్ఞానం కలిగించటమెలా? అనడిగాను. రెండేసి, లేదా మూడేసి వరుసగా స్వరాలు పాడుతూంటే సహజంగా తాళం ఏర్పడిపోతుంది. దృష్టిపెట్టాలంతే అంటూండేవాడు. సాధారణంగా సినిమా పాటలు పాడే ప్రసిద్ధ గాయకులు సంగీత కచేరీలు కూర్చుని వినటం చాలా అరుదు. పి.బి. శ్రీనివాస్ దీనికి భిన్నం.
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరారగ నుడుగవలయు గదరా సుమతీ॥
యిది కంద పద్యం. ఏ కంద పద్యమైనా రూపక తాళంలో నడుస్తుందన్న సంగతి ‘నోరారా’ అంటే తెలుస్తుంది అనేవాడు చిరునవ్వుతో. పద్యానికో ఛందస్సుంటుంది. అలాగే పాటకు యతి ప్రాసలుంటాయి. ఒక్క పాటకు మాత్రమే కాదు. పద్యానికి ‘లయ’ అంతర్లీనంగా వుంటుంది. ప్రతిమాటకూ ప్రాణముంటుంది. ఒక్కోమాటకు ఎంత నాదాన్ని పూరించి పాడాలో తెలిసి పాడితే అందులోనే అందమైన ‘లయ’ అసియాడుతూ కనిపిస్తుంది అనేవాడు.
సినిమా పాటలు పాడటం యించుమించు విరమించిన తర్వాత ఆయన దృష్టి శుద్ధమైన సంప్రదాయ సంగీతంపైనే వుండేది. ప్రతిరోజూ ఏదో ఓ సంగీత కచేరీకి హాజరౌతూండేవాడు. సంగీతాన్ని ఒక నిర్దిష్టపద్ధతిలో అభ్యసించకపోయినా, కర్ణాటక సంగీతం నేర్చుకునేవారికి విద్వాంసులకోసం ఉపయోగపడేలా 72 మేళకర్తరాగాల్లో ఏయే రాగంలో ఏయే స్వరాలుంటాయో తెలుసుకోవడం కోసం సులభమైన పద్ధతిలో డైమండ్ కీ కనుగొన్న సంగతి కొందరికే తెలుసు. ఆయనకిష్టమైన రాగాలలో ‘సువర్ణాంగి’ ఒకటి. స్వచ్ఛమైన తెలుగు భాషలో పాడుకున్న త్యాగరాజ కీర్తనలు, పాడే ధోరణిని గురించి చెప్పేవాడు. త్యాగరాజు గొప్పతనం ఆయన పల్లవుల్లోనే వుందనీ, భాష తెలియకపోవటం వల్ల సందర్భశుద్ధిగా పాడక, అనవసరమైన చోట్ల పదాలు విరిచేసి పాడేస్తున్నారని బాధపడేవాడు. బంగారం లాంటి మాటలన్నీ అనవసరమైన చోట్ల పదభంగమై అర్థం చెడిపోతుందని చెప్తూ కొన్ని కీర్తనలు పాడి వినిపించేవాడు. హంసనాదం రాగంలో..
బంటు రీతి కొలు / వియ్యవయ్య రామ
అనుపమ గుణాంబుధి / వని నిన్ను నెరనమ్మి
జగదానందకా ఆరక దుడుకుగల ననే్న దొర / కొడుకు బో చురా
ఎందరో మా హానుభావు / లందరికీ వందనములు’’ లాంటి ఎనె్నన్నో కీర్తనలు ఉదహరించి పాడుతూ పదగర్భంలో వుండే మాటలు అర్థం లేకుండా విరిచి పాడితే అన్వయం చెడిపోయి రసాభాస అవుతుందనేవాడు. ఏనాడూ తన సంభాషణలో సినిమా పాటల ప్రసక్తి వుండేది కాదు. నవరసకానడ, వసంత, నీతిమతి, తపస్విని, సువర్ణాంగి, మలమారుతం, సునాదవినోదిని, ధన్యాసి.. మొత్తం రుూ ఎనిమిది రాగాలతో ‘నవనీతసుమసుధ’ అనే కొత్త రాగాన్ని సృష్టించిన మేధావి, నిత్య పరిశోధనాశీలి తాతాచారి అనే ఆలిండియా రేడియోలో విద్యాంసుడు, (శ్రీనివాస్ సోదరుడు) వోలేటి గారికి పరమ సన్నిహితుడు, హితుడు ఆ తాతాచారే. శ్రీనివాస్‌ను నాకు పరిచయం చేశాడు. అందరూ కాకినాడ వాస్తవ్యులే. గాయకుడై ఎంత పేరు తెచ్చుకున్నాడో అంత ఒదిగి వుంటూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కల్గించేది. ఓపిక వున్నా లేకపోయినా, సంగీతంపై వున్న మమకారం, ఆయన్నింట్లో కూర్చోనిచ్చేది కాదు. చాలా సరదాయైన మనిషిని కోల్పోయానన్న బాధ ఎప్పుడూ వుంటుంది నాకు. ఓ రోజు హోటల్‌లో కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నాం.
సినిమా పాటల సాహిత్యం, బాణీలు, సంగీత దర్శకుల ప్రస్తావన వచ్చింది. నాలుగు పల్లవులు పాడారు.
‘‘మానూ మాకునుగాను
రారుూ, రప్పనుగాను
మామూలు మడిసిని నేను’’
‘‘పెళ్ళిచూపులకు వారొచ్చారు...
చూడాలని నే వోరగ చూసా...
వల్లమాలిన సిగ్గొచ్చింది...
కన్నులుదాకా కన్నులు పోక
మగసిరి విడదనే చూశాను తల
దాచుకొనుటకది చాలన్నాను...
ప్రేమించి పెళ్ళిచేసుకో నీ బ్రతుకంత హాయి
నింపుకో ఓ ఓ ఓ ఓ ॥
సాహిత్యం చూడండి. ఎవరికో ఉత్తరం రాశినట్లుగా లేదూ? సినిమా పాటల్లో అదే గమ్మత్తు. సంగీత దర్శకుడి చేతిలో నలిగీ, నలిగీ గాయకుడి కంఠాల్లో ఒదిగి, చివరకు శంఖంలో పోసిన తీర్థమై కూర్చుంటుంది అని ఒక్కసారి నవ్వుతూ లేచాడు శ్రీనివాస్.

- మల్లాది సూరిబాబు 90527 65490