S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవసరానికో మందు

డాక్టర్ హరిత్ పేరు కింద చిన్న అక్షరాలతో రాసింది చదివి పేటన్ నవ్వాడు.
కష్టమైన రోగాలకి మందులు
ఆ బోర్డ్‌ని చూసిన పేటన్ తెలివిగా రాసారు అనుకున్నాడు.
తలుపు తెరచుకుని లోపలికి నడిచాడు. ఆ గది ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. గోడకి ఆనించిన ఓ పాత కుర్చీలో కూర్చున్న తెల్లటికోటులోని నల్లటి వ్యక్తి తన ముందున్న బల్ల మీదకి వంగి ఓ లెడ్జర్లో ఎంట్రీ లని రాస్తూ కనిపించాడు. అతను తలెత్తి పేటన్ వంక చూసి నవ్వాడు.
‘‘ఏం కావాలి?’’ ప్రశ్నించాడు.
‘‘నా పేరు జార్జ్ పేటన్.’’
‘‘పేటన్?’’ అతను తన లెడ్జెర్లో ఏదో రాసి దాన్ని నెమ్మదిగా మూసాడు. అతని కళ్ళు ఆలోచనగా పేటన్ వంక కొన్ని క్షణాలు చూసాయి.
‘‘మీకేం కావాలి?’’ అడిగాడు.
‘‘మేనేజర్ని కలవాలి.’’
‘‘నేనే మేనేజర్ని, క్లర్క్‌ని, మందులు అమ్మేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షాప్‌కి నేనే యజమానిని. మీకేం సేవ చేయగలను?’’ అతను ప్రశ్నించాడు.
ఆ యువకుడి వంక చూసి పేటన్ చెప్పాడు.
‘‘మీరు వయసు మళ్ళినవారు అనుకున్నాను.’’
‘‘సర్. నేను చాలా సంవత్సరాలు మా నాన్న దగ్గర విద్యాభ్యాసం చేసాను. ఆయన పోయాక ఆయనకే తెలీని అనేకం కనుక్కున్నాను. కాబట్టి మీరు నా అనుభవం విషయంలో ఆదుర్దా పడకండి. నిర్భయంగా మీకేం కావాలో చెప్పండి.’’ పెటెన్ చేతిని అందుకుని మృదువుగా కరచాలనం చేస్తూ చెప్పాడు.
పేటన్‌కి ఆ గది గోడలకి సీలింగ్ దాకా ఉన్న షెల్ఫ్‌ల నిండా అనేక మందు సీసాలు కనిపించాయి. అనేక టెస్ట్‌ట్యూబ్‌లు, స్పిరిట్ లేంప్, ఓ మూల చిన్న వాష్ బేసిన్ ఉన్నాయి.
పేటన్ బల్ల ముందున్న కుర్చీని బయటకి లాగి కూర్చున్నాక హరిత్ గొంతు తగ్గించి అడిగాడు.
‘‘కూర్చోండి. నా గురించి మీకు ఎలా తెలుసో దయచేసి చెప్తారా?’’
‘‘ఓ పార్టీలో అనుకుంటా మీ గురించి ఒకరు చెప్పారు.’’
‘‘పేరు గుర్తు లేదా?’’
‘‘లేదు. అది ముఖ్యమా?’’
‘‘కాదు. కానే కాదు. ముఖ్యంగా మీ విషయంలో.’’ అతను మృదువుగా నవ్వుతూ చెప్పాడు.
తర్వాత ముందుకి వంగి అడిగాడు.
‘‘దయచేసి మీ సమస్యేమిటో చెప్తారా?’’
‘‘నేను వచ్చింది అందుకోసం కాదు. ఒకటి కొనడానికి వచ్చాను. దాన్ని మీరు అమ్ముతారని నాకు చెప్పారు. దాన్ని కొనుక్కుని వెళ్ళిపోతాను. అంతే.’’
‘‘నేను స్పెషలిస్ట్‌ని. స్పెషలిస్ట్‌కి అన్ని విషయాలు, నిజాలు తెలియాలి. ఎందుకంటే కేసు, కేసుకీ తేడాలు ఉంటాయి. పరిచయస్థుడి విషయం వేరు. అదే కుటుంబసభ్యులైతే వేరు.’’
‘‘రెండూ.’’ పేటన్ ముభావంగా చెప్పాడు.
‘‘రెండూనా? అంటే?’’ హరిత్ ఆసక్తిగా అడిగాడు.
‘‘అది మీకు అనవసరం.’’ పేటన్ చెప్పే విధానంలో కొంత దురుసుతనం హరిత్‌కి కనిపించింది.
‘‘అది నాకు అనవసరమైతే మీరు ఇక్కడ ఉండేవారు కారు. నేను కోరింది చెప్పకపోతే మీరు బయటకి నడవవచ్చు. నాకు చాలా పనుంది.’’ హరిత్ కూడా అంతే దురుసుగా జవాబు చెప్పాడు.
బల్ల మీది పెన్‌ని అందుకుని మళ్ళీ లెడ్జర్‌ని తెరిచి జాగ్రత్తగా గుండ్రటి చేతిరాతితో దాంట్లో రాసుకోసాగాడు.
పేటన్ మొహం కోపంతో ఎర్రబడింది. చేతివేళ్ళతో బల్లమీద కొద్దిసేపు చిన్న దరువు వేస్తూ, కోపాన్ని అణచుకుని అడిగాడు.
‘‘సరే. మీరేం తెలుసుకోవాలి?’’
‘‘ఏమన్నారు?’’
‘‘ఏం తెలుసుకోవాలి అని అడిగాను. కాని మీరు తెలుసుకున్న తక్షణం ఓ హత్య గురించి తెలిసీ, వౌనంగా ఉన్న నేరంలో చిక్కుకుంటారు అని మర్చిపోకండి.’’
అతను లెడ్జర్ని మూసి నవ్వుతూ చెప్పాడు.
‘‘నేనా అవకాశాన్ని తీసుకుంటాను.’’
‘‘మీ ఖర్మ. మొదటి వ్యక్తి నా భార్య మేరియన్. ఆమె వయసు ఇరవై ఏడు. మాకు పెళ్ళై మూడేళ్ళైంది. నేను ఆమెని కొన్నాను. నా పనులన్నీ డబ్బుతోనే చేస్తాను. ఆమెకి కావాల్సిన ఖరీదైన జీవితాన్ని ఇచ్చి బదులుగా ఆమెని పెళ్ళి చేసుకున్నాను. కాని నా పెట్టుబడికి తగిన ఫలితం రావడం లేదు. నేనేం చెప్తున్నానో అర్థమైందా?’’
ఆ యువకుడు నవ్వుతూ ఏదో గొణిగాడు.
‘‘మంచిది. సరైన ఫలితం రావడం లేదు. కారణం మా మధ్య ఇంకో మగాడు ఉన్నాడు.’’
‘‘ఆ!’’
‘‘ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా?’’ పేటన్ ప్రశ్నించాడు.
‘‘పూర్తిగా.’’
‘‘నేను విషం గురించి ఆలోచించాను. ఏ డాక్టరూ శవపరీక్షలో కనుక్కోలేని విషం గురించి. అప్పుడు మీ గురించి తెలిసింది.’’
హరిత్ కుర్చీలో వెనక్కి వాలి తల వెనక రెండు చేతులూ ఉంచుకుని నవ్వుతూ చెప్పాడు.
‘‘సర్. మీరు డిటెక్టివ్ పుస్తకాలు బాగా చదువుతారని అనుకుంటాను. నిపుణుడైన డాక్టర్ కనుక్కోలేని విషయం అంటూ ఏదీ లేదు. మా నాన్నగారి రోజుల్లో కన్నా ఇప్పుడు నేర పరిశోధన బాగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు హత్యాపరిశోధన కష్టంగా ఉండేది. ఇప్పుడది చాలా తేలికైపోయింది.’’
‘‘కాని నాకు చెప్పినవారు...’’
‘‘...నిజమే చెప్పారు. మీ భార్య.. పేరు మేరియన్ అన్నారా? ఆమెకి ఏ రకం భోజనం ఇష్టం?’’
‘‘అంటే?’’
‘‘చేపలు? కుక్కగొడుగులు?’’
‘‘కుక్క గొడుగులు ఇష్టం. వారానికి కనీసం మూడుసార్లు వాటిని తింటుంది.’’
‘‘ఎక్స్‌లెంట్. మీకు అడ్డొచ్చే ఆ మగాడికీ కుక్కగొడుగులంటే ఇష్టమేనా?’’
‘‘అవును. నిజానికి ఆమెకి అవి అలవాటు చేసింది అతనే. అంతకు మునుపు మేరియన్ వాటిని పెద్దగా తినేది కాదు. ఈ రాత్రికి కూడా అవే. నేను మాత్రం వాటిని ఎన్నడూ ముట్టను.’’
‘‘అది మరీ మంచిది. ఇది చెప్పండి. ఆ పెద్దమనిషి మీ ఇంటికి రాత్రుళ్ళు భోజనానికి వస్తుంటాడా?’’ హరిత్ ప శ్నించాడు.
‘‘వస్తూంటాడు. ప్రతీ రాత్రి సిగ్గు లేకుండా వస్తాడు.’’ పేటన్ కోపంగా చెప్పాడు.
‘‘ఈ రాత్రి కి కూడా వస్తున్నాడా?’’
‘‘అవును.’’
‘‘ఈ రాత్రి కూడా కుక్కగొడుగులు వండుతున్నారా?’’
‘‘అవును.’’
‘‘మంచిది. ఈ రాత్రి మీరు కూడా వాళ్ళిద్దరితో పాటు కుక్కగొడుగులని తినండి. అది మర్చిపోకండి. మన పథకానికి అది చాలా ముఖ్యం.’’
హరిత్ లేచి ఓ షెల్ఫ్ దగ్గరకి వెళ్ళి రెండు సీసాలు తీసుకుని వాటిని పరీక్షించి, తృప్త్తిగా తలపంకించి వచ్చి పేటన్ ఎదురుగా బల్లమీద వాటిని ఉంచి కూర్చున్నాడు. పేటన్ వాటి వంక చూసాడు. రెండింటిలో ద్రవం ఉంది. ఒకటి ఎర్ర రంగుది. మరోటి నీలం రంగుది.
‘‘ఎర్ర సీసాలోని ద్రవంలో మస్కరేన్ ఉంది. మరి కొన్ని పదార్థాలు కూడా. మస్కరేన్ అంటే తెలుసా?’’
‘‘ఊహు.’’
‘‘విషపు కుక్కగొడుగుల నించి తీసిన విషం.’’
‘‘దాని రుచి ఎలా ఉంటుంది?’’ పేటన్ అనుమానంగా అడిగాడు.
‘‘చాలా రుచిగా. మా నాన్న కనిపెట్టిన విషం ఇది. ఉపయోగించడం తేలిక. కుక్కగొడుగు సాస్‌లో దీన్ని కలపండి చాలు. అది మిగిలిన పనిని చేస్తుంది.’’
పేటన్ మొహం కొద్దిగా పాలిపోయింది.
‘‘దీన్ని నేను కూడా తింటే..?’’
ఆ యువకుడు సన్నగా నవ్వి కొనసాగించాడు.
‘‘నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ముగ్గురు కలిసి ఒకే పదార్థం తిని, వారిలో ఇద్దరు మరణించి, ఒకరికి ఏం కాకపోతే పోలీసులు అనుమానిస్తారు. మూడో వ్యక్తికి కూడా అనారోగ్యం కలిగితే అతను మరణించకపోయినా సరే పోలీసులు అతన్ని అనుమానించరు. విషయం ఏమిటంటే అనారోగ్యం కలిగినా మీరు మరణించరు. ఎలా అంటే...’’
అతను నీలం రంగు సీసాని చూపించి చెప్పాడు.
‘‘వారు మరణిస్తారు కాని మిమ్మల్ని చావకుండా కాపాడేది ఇదే.’’
‘‘ఇదేమిటి?’’ పేటన్ దానివంక చూస్తూ ప్రశ్నించాడు.
‘‘విరుగుడు. ఈ విషానికి సరైన విరుగుడు. ఆ విషపు కుక్కగొడుగుల సాస్ తినడానికి మునుపే మీరు దీన్ని తాగాలి. కనీసం ఆరుగంటల ముందు. మీరా విషాన్ని తినేసరికి మీ రక్తంలో ఈ విరుగుడు తాలూకు గుర్తులన్నీ మాయం అవుతాయి. అందుకే ఆరు గంటల ముందు తాగమని చెప్పింది. అందువల్ల మిమ్మల్ని ఎవరూ అనుమానించరు.’’
‘‘గేరంటీగా అలా జరుగుతుందా?’’
‘‘గేరంటీ. రెండూ కలిపి ఐదు వందల డాలర్లు.’’
‘‘ఎంత?’’ పేటన్ అదిరిపడి అడిగాడు.
‘‘చాలా సరసమైన ధర.’’
‘‘ఇది నిలువు దోపిడీ. చాలా ఎక్కువ.’’
‘‘అవును. కాని మీరు రివాల్వర్‌ని ఉపయోగించి చంపచ్చు. ఓ గుండు చవక. కాని మీరే ఆ హత్య చేసారని పోలీసులు అనుమానించకుండా ఉండలేరు.’’
‘‘ఇందులో సాధారణ పంపు నీళ్ళున్నాయేమో? నాకు రూఢిగా తెలియాలి.’’
అతను మృదువుగా నవ్వి చెప్పాడు.
‘‘దానికో పద్ధతి ఉంది.’’
‘‘ఏమిటది?’’
‘‘ఈ ఎర్ర సీసాలోని మందుని వెంటనే తాగి చూడండి. ఆరు గంటల క్రితం మీరీ నీలం రంగు మందుని తాగలేదు కాబట్టి మీకు నిజం తెలుస్తుంది. నా ముందే వెంటనే తాగండి. కాని ముందుగా ఐదు వందల డాలర్లు ఇచ్చాక.’’
‘‘నేనా పనిచేయను. సరే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది వ్యాపార ఒప్పందంతో సమానం. మీకు ఇప్పుడు వంద డాలర్లు చెల్లిస్తాను. మిగిలింది పని తృప్తిగా ముగిసాక. మీరు నన్ను నమ్మచ్చు.’’
ఆ యువకుడు కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు.
‘‘సగం. రెండు వందల ఏభై డాలర్లు.’’
‘‘కాదు. రెండు వందల డాలర్లు.’’ మిగిలిన మూడు వందల డాలర్లు ఇవ్వకూడదని అప్పటికే నిర్ణయించుకున్న పేటన్ చెప్పాడు.
‘‘సరే.’’ ఆ యువకుడు అయిష్టంగా ఒప్పుకున్నాడు.
పేటన్ జేబులోంచి పర్స్ తీసి మూడు వందలు లెక్కపెట్టి ఇచ్చాడు. తర్వాత ఆ రెండు సీసాలు అందుకుని చెప్పాడు.
‘‘డబ్బు సాక్ష్యం చెప్పలేదు.’’
‘‘నిజమే.’’ హరిత్ ఒప్పుకున్నాడు.
ఆ యువకుడు పేటన్‌ని తలుపు దాకా సాగనంపాడు. అతను గుమ్మం దాటాక అడిగాడు.
‘‘మీ పేరు హరితా?’’
‘‘కాదు. ఆయన పోయారు. మా నాన్నగారి మీద గౌరవం కొద్దీ ఆ పేరుతోనే కొనసాగుతున్నాను. నేను కొద్దిగా సెంటిమెంటల్‌ని.’’
‘‘బై.’’ ఇక తను జీవితంలో మళ్ళీ చూడటానికి రాని హరిత్‌తో పేటన్ చెప్పాడు.
‘‘గుడ్ బై మిత్రమా.’’ ఆ యువకుడు చెప్పాడు.
పేటన్ తన కారు వైపు కూనిరాగం తీస్తూ ఆనందంగా నడిచాడు. రెండు హత్యలు. ఒకోటి వంద డాలర్ల చొప్పున. అతను తనని మిగిలిన సొమ్ము కోసం వత్తిడి చేయలేడు. చేస్తే హత్యానేరంలో సహ నేరస్థుడు అవుతాడు. సన్నగా నవ్వుకుంటూ కారెక్కాడు.
తన ఆఫీస్‌కి వెళ్ళి, తలుపు మూసి లోపల గడియ పెట్టాక చేతి గడియారం వంక చూసుకుని నీలం రంగు సీసా మూత తీసి దాన్ని నోట్లో పోసుకుని మింగాడు.
***
పేటన్ వెళ్ళాక ఆ నల్లటి యువకుడు బల్ల ముందు కూర్చున్నాడు. ఇక తను మళ్ళీ పేటన్‌ని చూస్తాడని అతను కూడా అనుకోలేదు. ఆ నీలం రంగు సీసాలోని మందుని మింగాక.. విషాన్ని మింగాక జీవించి ఉన్నా బహుశ అతను మిగిలిన మూడు వందలనీ ఇవ్వడు.
అతను తల విదిల్చి లెడ్జర్‌ని తెరిచి దానిమీదకు వంగి, పెన్ అందుకుని రాసాడు.
సేవకి 500 డాలర్లు.
తర్వాత టెలీఫోన్ ఇండెక్స్ పుస్తకం అందుకుని ఓ నంబర్ వెదికి డయల్ చేసాడు.
‘‘హలో.’’ ఓ ఆడకంఠం వినిపించింది.
‘‘హలో. మిసెస్ మేరియన్ పేటన్?’’ అడిగాడు.
‘‘అవును.’’
‘‘పనైంది. పేటన్ ఇక లేడు.’’ చెప్పి రిసీవర్ పెట్టేసాడు.
తర్వాత రెండు వందల డాలర్లని చూసుకుని ‘బోనస్’ అనుకున్నాడు.

(కర్ట్ హేమ్లిన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి