శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం
Published Saturday, 24 March 2018శ్రీ రామాయణం క్షీరధార. వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే.. కవికులగురువు కాళిదాసు అన్నట్లు. ‘‘చరిత్ర మా రాముడిది. రచన సాక్షాత్తు వాల్మీకులవారిది. గానం చేసినవారు కినె్నరగాత్రులైన కుశలవులు. ఇంతటి మహనీయమైన రామాయణ కావ్యంలో, శ్రోతలను పరవశింపచేయని అంశం అనేదేదీ లేదు.
భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం, శ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి వౌలిక తత్త్వాలు ధర్మ జ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్యవ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని అర్థ ప్రతిపాదిత మహామంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్త్వసారం. స్మరణ పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది.
వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వకాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తిశేషులు వావిలికొలను సుబ్బారావు(వాసుదాసు)గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. రామాయణానికి రచయిత ఒక్కడే. వాల్మీకి మహర్షి తప్ప ఇతరులెవరికీ రామాయణం రచయిత అని చెప్పుకునే హక్కులేదనే అనాలి. వాసుదాసుగారు కూడా వ్యాఖ్యాతననే అంటారు తన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి.
వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి ‘మందర’ మకరందాలనూ, రమారామపారమ్యపీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్త్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లం చేసిన పరమ భాగవతోత్తములు ‘ఆంధ్ర వాల్మీకి’ వాసుదాసస్వామి. ‘రామభక్తి సామ్రాజ్యం యే మానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే’ అన్న త్యాగరాజ స్వామివారి కీర్తనకు సాకార దివ్య స్వరూపులు వాసుదాసస్వామి. ఆంధ్రవాల్మీకి వాసుదాస స్వామి అవతరించి వున్న కాలంలో, వారి దర్శన అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బినవారు, ‘శ్రీ మద్రామాయణం మందరం’ పారాయణ పరులై, తమ పరంపరకు శ్రీ వాసుదాస స్వామి గారి దివ్య స్మృతులను అందించి తరించారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్టమొదలు ఆంధ్రీకరించి, పదేపదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, ‘రామ భక్తి సామ్రాజ్యం’ అంటే, ఆంధ్రదేశమే సుమా, అనిపించిన నిరుపమ రామభక్తులు వాసుదాస స్వామివారు.
ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహామహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తిశేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు(వాసుదాసు)గారు, వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, ‘మందరం’ అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర పాఠకలోకం మందరాన్ని అపారంగా అభిమానించింది ఆదరించింది.
వాసుదాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యధామూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసారమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి, రచించిచారీ గ్రంథాన్ని వాసుదాసుగారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం చేసారు. ఆయన రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవితకాలంలోనే, నాలుగైదుసార్లు ముద్రించబడింది. ఆంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండలో, తన స్వవిషయం గురించి ప్రస్తావిస్తూ వాసుదాసుగారు, సంస్కృత రామాయణాన్ని శ్రీరామచంద్రుడి కుమారులైన కుశలవులు లోకానికి ప్రకటించినట్లే, తనకూ ఆయన కుమారుడిగా, అలాంటి అధికారం వుందని, అయితే సంకల్పించడం మాత్రమే తన వంతని నిర్వహించడం శ్రీరాముడి వంతని, పూర్తిచేయించే భారం ఆయన భుజాలపైనే వేస్తున్నానని, ఆయన వలదన్నా వదలనని చెప్పుకుంటారు.
వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని మిత్రులంటారాయనతో. మూల గ్రంథం రాయడం కంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన మొదట్లో. బాగా ఆలోచించిన తర్వాత, (శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం) ‘మందరం’ పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. ‘మందరం’ అంటే, క్షీరసాగరాన్ని మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనా. కాని, వాసుదాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం, ‘మందరం’ అంటే, మొదట గుర్తుకొచ్చేది, ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, ‘క్షీరవారాసి’గా సంభావించి, దానిని మధించిన తమ ‘మేథ’ అందించిన మకరందాలను మధురిమలను, ముచ్చటగా ‘మందరం’ అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి ‘మందరం’ అని నామకరణం చేయడంలో తను కొంతవరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. ఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.
(ఇంకావుంది)