S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశల ఉగాది

కాలం కాలం కాలం
ఇది మానవుడే నవ భావకుడై
గమనించు యింద్రజాలం
మూడు పొరలుగా ముడుచుకుని
సమ్మోహ రహస్యం దాచుకుని
గతమూ భావీ ఒదిగిన దళమే
వర్తమాన కాలం, శుభ వర్తమాన కాలం...
నిన్న నిరాశకు రేపటి ఆశకు
నిండిన రుచుల కటాహం
బతుకు బాటలో నడిచేవారికి
పన్నిన పద్మవ్యూహం..
గిరులు రేకులై విచ్చుకుని - నవ
కువలయమైతే అవని
జన ప్రాణమకరందం కోరే
మేటి కదా ఈ కాలం- ఎల
దేటి కదా, రుూ కాలం
-వసంత ఋతు వర్ణన చేయని, చేయలేని కవి అంటూ వుండడు.
ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రికార్డైనరుూ ఉగాది గీతాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రాస్తే ప్రఖ్యాత విద్వాంసుడు వోలేటి వెంకటేశ్వర్లు స్వరపరచారు.
మా చేత పాడించారు. నేనూ, పెమ్మరాజు సూర్యారావు, దేవన సుభద్ర, చదలవాడ కుసుమకుమారి ఈ పాటలోని ప్రధాన గాయకులం.
‘మేరీ జాన్ నజర్ కరో అప్‌నీ నషా పేశ్ కరూఁ’ అనే మెహదీ హసన్ ఉర్దూ గజల్ ట్యూన్ యిందులో ప్రతిధ్వనిస్తుంది. ఆ రోజుల్లో అంటే, 1965-78 మధ్య విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఆరుబయట జరిగే కార్యక్రమాల్లో కవి సమ్మేళనాలు ఎంతో ప్రముఖమై ఆకర్షణీయంగా జరుగుతూండేవి. కవిసామ్రాట్ డా.విశ్వనాథ సత్యనారాయణ, డా.దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ, మధురాంతకం రాజారాం, డా.కొలకలూరి ఇనాక్, డా.సి.నారాయణరెడ్డి లాంటి మహాకవులు పాల్గొన్న ఉగాది కవి సమ్మేళనం నాకింకా గుర్తే.
వాచీ షాపు నడిపే ఏలూరులో షరీఫ్ అనే రేడియో అభిమానికి ఒక అందమైన గులాబి తోట వుండేది.
రేడియో కళాకారులన్నా, కార్యక్రమాలన్నా వల్లమాలిన పిచ్చి, అభిమానమూను. మా ఊరి వాడే. తెల్లవారేసరికే బుట్టలకొద్దీ గులాబీలు నింపిన మినీ లారీ ఒకటి రేడియో కేంద్రానికి వచ్చేసేది, ఆ దృశ్యాన్ని రెండేళ్లు చూశాను.
క్రమంగా ఆ వైభోగం కనుమరుగౌతూ గత జ్ఞాపకంలాగే మిగిలిపోయింది.
ఆలిండియా రేడియోలో ప్రత్యక్షంగా కవిశేఖరులను తనివితీరా దర్శించుకున్న ఆబాలగోపాలమూ పెళ్లి వాతావరణాన్ని ఆలిండియా రేడియోలో చూసి గుండె నిండుగా పులకించిపోయి ఇళ్లకు వెళ్లటం నా మనసులో శాశ్వతంగా నిలిచిన అనుభూతి.
‘గత కాలమె మేలు వచ్చుకాలము కంటెన్’
కవి గాయకులకు పరమానందాన్ని కలిగించే ప్రతి వసంతాన్నీ సుసంపన్నం చేసిన ఆకాశవాణిని ఎలా మరిచిపోగలం?
* * *
దేవుడంటే రాముడా, కృష్ణుడా అని దేవులాడకుండా ఒక్కసారి నిలబడి చూస్తే పైన కంటికి కనిపించేది ఒకటి సూర్యబింబం. రెండోది చంద్రబింబం.
దేవుడున్నాడో లేడో చెప్పే ప్రత్యక్ష సాక్షులు. ప్రాణులన్నీ ఐదు తత్త్వాల వల్ల ఉద్భవిస్తాయంటారు. పృథివి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం.. ఈ ఐదూ పంచభూతాలు. వీటికి దైవత్వం లేదని చెప్పేందుకు వీలులేదు. కాలస్వరూపుడు సూర్యుడు. ఉదయం ఒక రూపం, మధ్యాహ్నం మరో రూపం, సాయం సమయాల్లో ఇంకో రూపం. ఈ విశాల సృష్టిలోని చరాచర జీవజాల మంతా ఆయన దృష్టిలో పడవలసినదే. తప్పించుకు తిరిగే వీలు లేదు. ఆరోగ్యమిచ్చేది ఆయనే. సమస్త విశ్వానికీ చైతన్యాన్ని ప్రసాదించి జీవవంతం చేసే లోకాతీత శక్తి సంపన్నుడాయనే. ఏ దేవుణ్ణి కొలిచినా, వేడినా వాళ్లిచ్చేది కాస్తే. కానీ ఈ సూర్య దేవుడు సర్వదేవాత్మకుడు. దేవతలంతా ఈ సూర్యమండలంలోనే వున్నారు. అందుకే సృష్టి, స్థితి, లయాత్మకులై త్రిమూర్తులు, సూర్యరూపంగా, వారి భార్యలు గాయత్రీ రూపంలో సూర్యమండలాన్ని ఆశ్రయించి వున్నాయని గాయత్రీ అష్టోత్తరం చెబుతుంది.
కంటికి కనిపించని కాలం ఆగటం కానీ, సాగటం కానీ కాలస్వరూపుడైన సూర్యుడి రాకపోకల వల్లే. అందుకే సూర్యుడికి మృత్యువు, కాలుడు అని పేర్లు.
సూర్యగమనం వల్లనే మనకు ఋతువులు, సంవత్సరాలు, పక్షాలు, రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి.
వానలు వరదలైనా, వాగులన్నీ వట్టిపోయినా ఆతని ప్రభావమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ విశ్వరంగంలోకి రాకడ, నిలకడ, పోకడలకు అతని దయాధర్మ వీక్షణ కిరణాలే ఆధారం. సృష్టిలోని సకల ప్రాణికోటికీ పరమానందాన్నిచ్చేది.
ఆ ఇద్దరే ఇద్దరు. భక్త వాగ్గేయకారుడైన త్యాగరాజు రచించిన ‘పంచరత్న’ కీర్తనల్లో మొట్టమొదటి కీర్తన ‘జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా. ఆనందమే లక్ష్యంగా, భగవంతుణ్ణి ఆనంద నిలయుడిగానూ, ఆనందమయుడిగానూ కీర్తించాడు.
అన్నగత ప్రాణియైన మానవుడు, తన ప్రాణాన్ని కాస్త కుదుటపరచుకుని కాస్తంత జ్ఞానాన్ని సంపాదించి ఆనంద స్థితికి చేరుకుంటాడు. మనం తినే అన్నం, మనలను నిలబెట్టే ప్రాణం, మనకు ఆలోచన నిచ్చే మనసు, మనస్సు వల్ల తెచ్చుకున్న జ్ఞానం, జ్ఞానం వల్ల కలిగే ఆనందం.
వేద శాస్త్ర పురాణాది విజ్ఞానమంతా ఆనంద స్థితికి చేరుకోగల మార్గానే్న చూపించింది కాబట్టే, ఆ మార్గంలో కవులు, గాయకులు, వేదాంతులు విజ్ఞానులంతా నడిచారు. అందులో మన త్యాగరాజు ముందు వరుసలో కనిపించే వ్యక్తి.
త్యాగరాజ పంచరత్న కీర్తనలు ఎంత ప్రసిద్ధి చెందాయో మీకు తెలుసు. ఆనంద ప్రతిపాదనతో ప్రారంభించిన ‘జగదానంద కారక’లో భగవంతుణ్ణి ఆనందమయుడిగా, ఆనంద నిలయుడిగా కీర్తించాడు. అన్నమయకోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశమనే ఐదు సోపానాల్లో ఈశ్వర తత్త్వం వుందని నిరూపించిన వేదాంతుల మాటలోని సత్యాన్ని గ్రహించిన త్యాగయ్య ‘ఆనందసాగరమీదని దేహం అసలు భూమికే భారమని చెప్పేశాడు. ఈ పంచకోశ వికాసమే ‘ఎందరో మహానుభావులు’ అనే చివరి కీర్తనలో సమన్వయం చేశాడు.
స్వర లయాది రాగములు తెలియువారు భావరాగ లయాది సౌఖ్యముచే చిరాయువు కల్గిన వారినందరినీ నెత్తిన పెట్టుకుని మరీ ఆరాధించాడు.
త్యాగరాజ పంచరత్న కీర్తనలలో పూర్తిగా సంస్కృతంగా రచించబడిన ‘కీర్తన’ ‘జగదానంద’ కీర్తన ఆరంభంలో నాట’ చివర సురటి పాడాలంటారు. నాట’ రాగంలో ఎందరెందరో ఎన్నో కీర్తనలు అందించారు. కానీ ఈ కీర్తనలో ‘రాగం’ యొక్క విస్తృత రూపం మొత్తం అన్ని చరణాల్లోనూ ఆవరించి ఉంటుంది.
దశాబ్దాలుగా సంగీత రసికులకు వీనులవిందై ఆనంద కిరణాలు వెదజల్లే ఈ పంచరత్న కీర్తనలు నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారికి బ్రహ్మానంద ప్రాప్తి కలిగించే అమృతభాండాలు.
భగవంతుడు ఆనంద స్వరూపుడే కాదు భగవంతుడు కాలస్వరూపుడన్న సంగతి మనకు క్షణక్షణమూ ఎరుగ పడుతున్న సంగతి తెలిసీ కూడా ఆకాశానికి నిచ్చెనలు వేయాలనీ, పక్షిలా ఎగరాలనీ, చేపలా ఈదాలనీ సృష్టినే శాసించాలనే వింతవింత కోరికలతో సతమతవౌతుంటాడు మనిషి.
కనిపించనివాడు దేవుడెలా అవుతాడంటాడు ఒకడు. కనిపిస్తే దేవుడెలా అవుతాడని మరొకడూ ఇలా తర్కం, కుతర్కం చేసుకుంటూ పోతే తేలకపోగా ఆధ్యాత్మిక విచికిత్సను పరిష్కరించలేవు.
ఉండేది రాముడో భీముడో, ఎవరినో ఒకరిని పూర్తిగా నమ్మేయాలి.
అప్పుడే దారి తిన్నగా కనిపిస్తుంది. సందేహాలకు తావుండదు. సమస్యలుత్పన్నం కావు. చైతన్యం శిథిలమైన జగతికి శిశిరం. ఆరు రుతువుల సమ్మేళనమే ఆనందమయ జీవితానికి చిహ్నం. భవిష్యత్తు మీద ఆశలు పెంచి కొత్త జీవితానికి మార్గం చూపేదే వసంతం.

- మల్లాది సూరిబాబు 90527 65490